‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ మలిసంజ కెంజాయ

28
1

[అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన ‘మలిసంజ కెంజాయ’ అనే నవలపై వ్యాసం అందిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]

“ఆరు పదులు దాటిన తర్వాత జీవితం అంటే బంధనాలు వదిలించుకునే వయసు. ఇన్నాళ్లూ చెయ్యని, చెయ్యలేని మంచి పని ఒకటి ఇతరుల కోసం చేస్తూ, ఏదైనా ఒక కీర్తన నేర్చుకుంటూ, అప్పుడప్పుడు నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఒంటరి జీవితాన్ని ప్రశాంతంగా బ్రతుకుతూ, ఈ బతుకు పట్ల మమకారాన్ని మోహాన్ని నెమ్మది నెమ్మదిగా విడిచి పెట్టేయాల్సిన తరుణం..”

విశాల అనే పాత్ర ద్వారా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి చెప్పిన ఈ మాటలే ‘మలిసంజ కెంజాయ’ నవలకి మూల సూత్రాలు.

ఉగాది రోజున పార్వతమ్మ, వసంత పాత్రలతో మొదలైన ఈ నవలని మళ్లీ ఉగాది నాటికి ఈ రెండు పాత్రలతో ముగించారు రచయిత్రి. ఈ మధ్యలో కెంజాయిలో మెరిసే ఎన్నెన్నో పాత్రలు – రామచంద్రం, ప్రమీల, భార్గవి, స్వరూప, జ్యోతి, నిర్మల, సుగుణ, విశాల, మాధవ. నవలా నేపథ్య వేదిక కోనసీమ అందాలు, తెలుగు లోగిళ్ళ చందాలు అయినా, ఇందులో చర్చించబడిన సమస్యలు భారతదేశంలో – ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్న వృద్ధుల గాథలు. వారి శారీరక మానసిక అనారోగ్యాల, కుటుంబ సంబంధాల వ్యథలు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ జీవితపు గూళ్ళు వాళ్లు నిర్మించుకున్నాక, బోసిపోయిన గూటిలోని నిట్టూర్పుల సెగలు. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆశలు, ఆశయాలు, అప్పులు, ఆస్తులు వంటి తాపత్రయాలతో కూడిన పరుగులతో జీవితం గడిచిపోయిన తర్వాత.. ఒక్కసారిగా అన్నీ అయిపోయి, అన్నీ ఆగిపోయిన నిశ్శబ్దం. భరించలేని నిరాసక్తత. ఒకరికి ఒకరుగా మిగిలిపోయిన వృద్ధ దంపతుల మౌన సంభాషణం. ఒకవేళ ఇద్దరిలో ఒకరు శాశ్వతంగా దూరమైపోతే, ఒంటరిగా జంటను వీడి మిగిలిపోయిన ప్రాణి ‘సఫకేషన్’. ఊపిరాడనితనం.

ఇలాంటి తరుణంలోనే మాటల కోసం వెతుకులాట. సానుభూతి కోసం వెంపర్లాట. మనసులో పెల్లుబికే ఆవేదనను సావధానంగా వినే ఒక శ్రోత కోసం ఆరాటం. ఓదార్పునిచ్చే ఒక స్నేహ హస్తం కోసం ఎదురుచూపు. అది తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఒకోసారి కన్నబిడ్డలూ కావచ్చు. వయసుతో సహజంగా వచ్చే అనారోగ్యాల కంటే, పిల్లలు దూరప్రాంతాల్లో ఉండటం కంటే, దగ్గరగా ఉన్నా మానసికంగా ఎన్నో మైళ్ళు దూరంగా ఉన్నట్లు అనిపించడమే భరించలేని బాధ.

ఈ నవలలో ప్రధానంగా రచయిత్రి చెప్పింది జీవన సంధ్య లోని ఒంటరి చక్రవాక విషాద రాగం. అసలే భర్త చనిపోయిన బాధలో ఉండి, బిడ్డలు ‘న్యాయం’గా కోరుకునే ‘స్పేస్’ని అర్థం చేసుకోలేక, అనుబంధాలు దూరమై, ఆత్మీయత కోసం ఎదురుచూసే తల్లుల దుఃఖం. ఒక పలకరింపు కోసం, ఒక ఓదార్పు కోసం భారంగా రోజులు వెళ్ళదీయటం, వదిలించుకోలేని పాశంతో అల్లాడటం చదువుతున్నప్పుడు – ఇందులోని పాత్రలతో, సంఘటనలతో ఆరు పదులు దాటిన వయసు వారు ఏదో ఒక సందర్భంలో తమను తాము దర్శించుకుంటారు.

ఇంటింటి కథలే ఈ నవలలో రచయిత్రి గౌరీలక్ష్మి చెప్తారు. ఊహాజనిత పాత్రలు, సన్నివేశాలు ఎక్కడా కనపడవు. కోడళ్ళ ప్రవర్తనలోని లోపాల్ని నలుగురికి చెప్పుకోవచ్చు. కానీ కూతుళ్ల ప్రవర్తన, పైకి కనిపించే వేధింపులు, కనిపించని సాధింపులు ఎలా చెప్పుకోగలరు! మనసు చివుక్కునేలా ఉండే వారి ప్రవర్తన, ‘మా అమ్మే కదా’ అని చులకనగా, తీసిపారేసినట్లు, చనువుగా, కొద్దిగా ఎదిరించినట్లు, విసుగ్గా అనే మాటలను బయటి వారికి ఎలా చెప్పుకోగలరు! లో లోపల ఎలా భరించగలరు!

“చిన్నప్పటినుండి నువ్వు చెప్పినట్లే విన్నాం కదా. మా పెళ్లిళ్లు అయి మాకు పిల్లలు పుట్టాక కూడా ఇంకా నీ మాటే చెల్లాలంటే ఎలా” అని విసుక్కునే పిల్లల్ని విస్తుబోయి చూడటం తప్ప ఏమి చేయలేని ‘సీ’నియర్ సిటిజన్స్. కొందరు కొడుకులు ఏదో బాధ్యతగా ‘దగ్గర’ ఉంచుకొంటారు కానీ అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తారు. కోడళ్ళు వంటలు చేసి టేబుల్ మీద పెడతారు కానీ మాట్లాడారు. ఒకవేళ మాట్లాడినా అవి పుల్లవిరుపు విసుర్లు. అలాంటి వాళ్ళ దగ్గర ‘పడి ఉండటం’ కంటే తమదైన సొంత గూటిలో పడి ఉండటం మేలు అనుకుంటారు చాలామంది.

ఎనభై ఏళ్ల పార్వతమ్మ అలాంటి ఆత్మాభిమాన మనస్తత్వం గల మహిళ. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, వాళ్లకి పిల్లలు, వారి పిల్లలు ఉన్నా, వసంత వెంకట్రావుల ఇంటిలో ఒక పోర్షన్‌లో తన బ్రతుకు తను బ్రతుకుతూ ఉంటుంది. వసంత, వెంకట్రావు లకు ఒక కొడుకు కూతురు ఉన్నా వాళ్లూ తమ ఇంటిలో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటారు. వసంత కూతురు నిర్మలకి అమ్మలో ఎప్పుడూ ఒక ‘టీచర్’ కనబడుతూ ఉంటుంది చిన్నప్పటినుంచి. చదువు, క్రమశిక్షణ అంటూ ఉండే తల్లి పట్ల ఒక నిరసన, విముఖత పెంచుకుంది. దానికి తోడు ఒక కలవారింటికి కోడలుగా వెళ్లడంతో ఈ మధ్యతరగతి తల్లి పై ఏదో పైచేయి సాధించానన్న తృప్తితో ఏది తోస్తే అది విసురుగా మాట్లాడుతుంది. విదిలింపుగా ప్రవర్తిస్తుంది. ఆస్తి కలవారైనా నిర్మల అత్తగారు చాలా మర్యాదగా, సంస్కారవంతంగా వియ్యపురాలితో గౌరవంగా మాట్లాడుతారు. వసంత తన కూతురి ప్రవర్తనతో ఎన్నోసార్లు చిన్నబుచ్చుకొని భర్తకు చెప్పినా, కొడుకుకి చెప్పినా వాళ్లు అర్థం చేసుకున్నట్టు లేదు. అమ్మే కదా అని దబాయించి విదిలింపుగా మాట్లాడటం, ఆమె సేవలు పొందటం తన హక్కు అన్నట్లు ప్రవర్తించడం సహించలేకపోతుంది వసంత. ఈ నిర్మల గురించి చెప్తే కొందరు నమ్మరేమో కానీ అలాంటి కూతుర్లు చాలామంది ఉంటారన్నది సత్యం.

ప్రేమించి, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న కూతురు చాలా సంవత్సరాలకి పిల్లాడిని ఎత్తుకొని కనిపించినప్పుడు ఆ తండ్రి రామచంద్రం ఆనందించినా, ఆమె పుట్టింటికి రాకపోకలు సాగిస్తూ, ‘చెల్లికి కట్నం ఇచ్చి పెళ్లి చేశారుగా. మరి నాకేం ఇస్తారు’ అని అడిగినప్పుడు అవాక్కవడం నమ్మలేని నిజమే.

మన చేతుల్లో పెరిగిన మన పిల్లే మనల్ని అర్థం చేసుకోకపోతే వేరే ఇంటి నుండి వచ్చిన కోడలేం అర్థం చేసుకుంటుంది!

ఎవరి ఉద్యోగాలు వారివి, ఎవరి సంపాదన వారివి అయిపోయాక, బాల్యంలో అన్నదమ్ములు తమపై చూపిన ప్రేమానురాగాలు ఇప్పుడు లేవేమిటి! ఎక్కడుంది లోపం! అని బాధపడే అక్కాచెల్లెళ్ల ఆవేదనకి జవాబు దొరకదేమో! స్వరూప, జ్యోతి లదే కాదు ఈ బాధ, చాలామంది అక్కచెల్లెళ్లది.

కోడళ్ళ తీరు గురించి చెప్తూ – “ఈ కోడళ్ళకి ‘మనమెప్పుడూ ముసలోళ్ళం అవ్వం. మాకు శక్తి ఉంది’ అని విర్రవీగుతారు. మాలాంటి వయసు ఒకరోజు ఆళ్ళకీ వత్తదండి. అప్పుడు మేము ఉండమనుకోండి” అని ఒక చదువు రాని పనిమనిషి ఆక్రోశం. అవును. అత్తలు మామలు ముసలోళ్లు, బరువుచేటు అనుకొనే కోడళ్ళకీ రేపటి రోజున మనమూ ముసలోళ్ళం అవుతాం అన్న ఇంగిత జ్ఞానం ఉండదేమో!

ఆ మధ్య ఎవరో ఒక పెద్దాయన అన్నారు – “అమ్మా నాన్న నా దగ్గర ఉండటం కాదండీ, నేనే వారి దగ్గర ఉంటాను భార్యా పిల్లలతో!” అర్థం ఒకటే కావచ్చు, కానీ ఎంత బాగుంది అలా చెప్పడం!

విశాల మాధవల కథ కూడా నిజ జీవితానికి దర్పణం వంటిదే. కాలేజీలో కళ్ళతోనే ప్రేమని వ్యక్తం చేసుకుని, గత్యంతరం లేని కుటుంబ ఒత్తిడుల వల్ల వేరే వేరే పెళ్లిళ్లు చేసుకొని, ముప్పై అయిదేళ్ళ తర్వాత కలుసుకున్నారు విశాల మాధవ. ఇద్దరూ జంటను కోల్పోయిన వారే. తన మనసులోని ప్రేమని ఇన్నాళ్ళకైనా వెల్లడించిన మాధవ ‘సహజీవనం’ అన్న ప్రపోజల్ చేస్తే నిదానంగానే అయినా, నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది విశాల – “భర్తనీ పిల్లల్ని చూసుకుంటూ ముప్పై అయిదేళ్లు గడిపేసాను. ఇప్పుడిప్పుడే ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను. కొత్తగా బంధాలు బాధ్యతలు తగిలించుకోలేను. కొత్త బంధానికి న్యాయం చేయలేను”. ఒక రకంగా ఇది మంచి నిర్ణయం అని చెప్పవచ్చు.

చిన్నప్పుడు నుంచి చురుగ్గా ఉండి తమకు అన్నీ చేసి పెట్టిన అమ్మ ఎప్పటికీ అలానే ‘బానే’ ఉంటుంది అనుకుంటారు కానీ పెద్ద వయసు వచ్చేసిందని, తమ అవసరం కోరుకునే వయసదని ఊహించలేరు. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి, టెస్టులు చేయించి, మందులు కొనేసి, ఇచ్చేసి, ఇక బాధ్యత తీరిపోయినట్టు భావిస్తారు. ఆ మందుల కన్నా కన్నబిడ్డల సామీప్యం, మాటలు, స్పర్శ ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని పెద్దల మనసులోని భావాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. వీరు నోరు విడిచి చెప్పలేరు. ఏదో తెలియని మంచు తెరలు! అనారోగ్యం గురించి చెప్పిందే చెప్తుంటే చాదస్తం అని కొట్టి పారేస్తారు కానీ నిజమని గుర్తించేసరికి ‘అంతా అయిపోతుంది’. అయితే, పరీక్ష ఫెయిల్ అయిన, ప్రేమ ఫెయిల్ అయిన యువత ఆత్మహత్య చేసుకోవడం చూస్తాం కానీ, ఒక మూలన ఉన్న ముసలమ్మ ఆత్మహత్య చేసుకోవడం చూస్తామా! ఎంతో జీవితాన్ని చూసినవారు, జీవిత తత్వాన్ని తెలుసుకున్న వారు.

‘వెంకటలక్ష్మి పెద్దల ఆశ్రమం’ని వెంకటేశ్వరరావు గారు నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు 30 మంది అక్కడ ఆనందంగా ఆరోగ్యంగా కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. వచ్చి మీద పడే వృద్ధాప్యం కాదనలేని సత్యం. కానీ తన కన్నకొడుకు భార్య మాటను కాదనలేక “నువ్వు ఈ ఇంట్లోనే ఉండమ్మా. అన్నీ నేను చూసుకుంటాను” అని వెళ్ళిపోతాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్న దుర్గమ్మ ఆ ఇంటికి తాళం వేసి, పక్కింట్లో ఇచ్చి వెంకటలక్ష్మి ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఓపిగ్గా అన్ని పనులు చేస్తుంది. స్నేహంగా అందరితో మాట్లాడుతుంది. కానీ ఎన్నిసార్లు వచ్చినా కొడుకు మొహం చూడదు. మనసు విరిగిపోయింది, వాడి దగ్గరకు వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని ధీమాగా, కచ్చితంగా చెప్తుంది. ఈ పరిస్థితిని ఎందరో ఎదుర్కొంటారు. కానీ దుర్గమ్మలా ఎందరు గట్టిగా నిలబడగలరు!

ఆశ్రమానికి వచ్చిన ప్రవచనకర్త రామ్మారుతి గారి పలుకులు ‘మలిసంజ కెంజాయ’లో గుర్తుపెట్టుకోవాలి – “నలుగురితో ఉండటం ఆనందం, ఏకాంతంగా ఉండటం బ్రహ్మానందం. ఏకాంతం దొరకటమే అదృష్టం అనుకోవాలి. చాలామంది ఒంటరిగా ఉంటూ నా అని తమ మీద తామే జాలి పడుతూ ఉంటారు. ఒంటరితనాన్ని అందమైన ఏకాంతంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంది. మనలోకి మనం వెళ్లడానికి అది మంచి అవకాశం అదొక అభ్యాసం, సాధన. సమస్యలు పూర్తికావడం అంటూ ఉండవు, మళ్లీ కొత్తవి వస్తూ ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూ పోవటమే మనం మార్గం తప్ప కృంగిపోయి ఆరోగ్యం పాడు చేసుకోవటం కాదు. తెలివైన వాళ్లు పరిస్థితి ఎలా ఉన్నా ఆనందంగా ఉంటారు”.

చూడడానికి చిన్న సమస్యగా ఉన్నా, వినడానికి సిల్లీగా అనిపించినా – వైద్యరంగం అభివృద్ధి చెందడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల గతంలో కంటే ఆయుః ప్రమాణం పెరిగింది. వృద్ధుల సంఖ్య పెరిగింది. వారి సమస్యలూ పెరిగాయి. వారు లోలోపల బాధ పడతారే తప్ప బైటకు వెల్లడించరు.

అంతా యువతరం తప్పేనని పిల్లలే దుర్మార్గంగా ఆలోచిస్తారని ప్రవర్తిస్తారని అనుకోకూడదు. పెద్దల చాదస్తం కూడా ఒక్కోసారి భరించలేనిది. అందుకే అరవై ఏళ్లు దాటాక మన ప్రవర్తన పరిణతి చెందిందిగా ఉండాలి. ఊసుపోని కబుర్లు మనం చెప్పకూడదు. మన చుట్టుపక్కల ఎవరూ చెప్పకుండా కూడా చూసుకోవాలి. ఇంకా ముఖ్యమైన సంగతి ఆత్మస్తుతి, పరనిందా మానేయాలి. ‘నేను, నేను’ అన్న అహంకారం తప్పించుకోవాలి. నేను ఇంత, నేను అంతా అన్న వివరాలు మర్చిపోవాలి. అసలు 60 ఏళ్లు దాటాక ఎంతో జీవితాన్ని చూసాం కదా అన్న నిదానం రావాలి. అంటే మనం తగ్గాలి. మనకన్నా చిన్నవాళ్లు కుప్పి గంతులు వేస్తుంటారు. చూడాలి. గింజుకోకూడదు. ఓర్చుకోవాలి. కొన్నాళ్ళు పోయాక, కాస్త వయసు పెరిగాక వాళ్లు తెలుసుకుంటారు. అంతవరకు మన ఓపిక పట్టాలి తప్ప వాళ్లతో తలపెడితే నష్టపోయేది మనమే.

ప్రవచన కర్త రామ్మారుతి చేత చెప్పిస్తారు రచయిత్రి. – ఈ జీవితం అంటే ఒక ఆట. అప్పుడప్పుడు ఎవరో ఒకరు అవుట్ అయ్యి మన మధ్య నుంచి మాయం అవుతూ ఉంటారు. కానీ ఆట ఆగదు. ఆడాల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో పడాలి. జగమంతా ప్రేమమయం అని నమ్మాలి. 70 ఏళ్ళు దాటాక మౌనాన్ని ఆశ్రయించి లోపలి వెలుగు కోసం ప్రయత్నించాలి.

‘వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్’ అనే మాస పత్రిక వయోవృద్ధుల గుండె చప్పుడు. శ్రీ సుధామ గారు మూడు సంవత్సరాల పాటు ‘సీ’నియర్ కబుర్లు కాలమ్‌లో వయో పౌరులకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించారు.

“‘సీ’నియర్ అంటే దగ్గరగా చూడమని. ఏదయినా సమీపం నుండి దగ్గర గా పరిణతితో పరిశీలించినప్పుడే ఆ విషయపు లోతుపాతులు బాగా తెలుస్తాయి. జీవితాన్ని అలా దగ్గరగా చూసి అనుభవం గడించినవారు కనుకనే సీనియర్ సిటిజన్స్ అయ్యారు.. ఈ వయసు వచ్చాక మొహమాటం అనేది అనవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ – ఒత్తిడిని నిర్వహించుకునే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అదనపు బాధ్యతలు వంటి వాటికి ఒప్పుకోకండి ఇంట్లో వారికైనా కాదు కుదరదు అని కచ్చితంగా చెప్పండి. ఆందోళన కలిగించే వాటిని మిమ్మల్ని సతాయించే వాటిని మీలోనే మనుచుకోవడం మంచిది కాదు. మీ మనోభావాలను వెల్లడించడానికి సంకోచించకండి. వృద్ధాప్యం ఒక భిన్నమైన జీవనదశ. ఆ దశలో జీవితాన్ని ఏ బాదరాబందీలు లేకుండా స్థిమితంగా ప్రశాంతంగా గడపాలి. శారీరక ఆరోగ్యం కొంత మీ చేతుల్లో లేకపోవచ్చు కానీ మీ మానసిక ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నది లేనిపోని మమకారాలు ఆందోళనలను పడకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రశాంతత కోసమే ప్రయత్నించాలి. చిరాకుతో కోపంతో కాక సంయమనంగా వ్యవహరించగలగాలి. వృద్ధాప్యం అనేది జీవిత సహజ పరిణామం. క్రమాగత దశకు సంతోషంగా ఆహ్వానించాలే కానీ అదేదో జీవితం లోని ఆపత్తుగా తలవడం తగని పని” అంటారు.

పిల్లల కొరకు పీడియాట్రిక్స్ విభాగం ఎలా ఉందో, ‘రెండో బాల్యం’ లోని వృద్ధులకు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య విభాగం ‘జిరియాట్రిక్స్’ ప్రాచుర్యం లోకి వస్తోంది. సెప్టెంబర్ 10న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో బి. నర్సన్ ‘జేరియాట్రిషియన్స్’ గురించి బాగా వివరించారు. ఒక్కోవ్యాధికి ఒక్కో విభాగపు డాక్టర్ దగ్గరికి వెళ్లే బదులు ఈ కోర్స్ చేసిన డాక్టర్ ఉంటే, అన్ని రుగ్మతలకు ఒకే డాక్టర్ దగ్గరికి వెళితే సరిపోతుంది. ఒక మందుకి ఇంకొక మందుకి పడక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం తక్కువవుతుంది. వృద్ధుల వైద్యం పట్ల, ఆ పేషంట్ పట్ల అతనికి అవగాహన ఉంటుంది న్యూజిలాండ్‌లో చాలా డిమాండ్, గౌరవం ఉన్న కోర్స్ ఇది. (అక్కడ చదివి వచ్చి హైదరాబాద్‌లో అపోలో లో ఒక డాక్టర్ చాలా బిజీగా ఉన్నాడు.) ఎంబిబిఎస్‌లో ఇది ఒక సబ్జెక్టుగా ఉంచాలని సీనియర్ సిటిజన్స్ మన ప్రభుత్వాన్ని కోరితే ఉపయోగకరంగా ఉంటుంది.

సీనియర్ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి నాలుగు కథా సంపుటాలు, నాలుగు నవలలు, మూడు కవిత్వ సంపుటాలు, రెండు కాలమ్స్ సంపుటాలు వెలువరించారు. పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఏ. చదివి, పబ్లిక్ రిలేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన గౌరీలక్ష్మి ఎ.పి.ఐ.ఐ.సి.లో జనరల్ మేనేజర్‌గా పనిచేసి, పదవీవిరమణ పొందారు.

చెరగని చిరునవ్వుతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, స్నేహ సౌరభాలు వెదజల్లుతూ, సున్నిత మనస్తత్వం గల గౌరీలక్ష్మి వయోవృద్ధుల మనసు పొరల్లోకి తొంగి చూసి ఇలాంటి నవల రాయడం చాలా సహజం. చదివినదీ, చేసిన ఉద్యోగమూ పౌర సంబంధాలు కనుక సున్నితమైన మానవ సంబంధాలు పట్ల ఆమెకు సంపూర్ణ అవగాహన ఉంది. సమాజాన్ని పరిశీలించే నేర్పు ఉంది. ఈ నవలలో తను చెప్పదలుచుకున్న పాయింట్‌ను దాటి ఎటూ వెళ్ళకుండా, తను ఏకాగ్రతతో ఉండి, పాఠకులనూ ఆలోచింపజేసారు.

వయోవృద్ధుల శారీరక మానసిక సమస్యలు గురించి పత్రికలు, సమావేశాలు అరాకొరా ఉన్నా, నేటి కాలంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లే – సమాజంలో, కుటుంబంలో వారి పట్ల సరియైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి, మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన వంతుగా ఈ మంచి సీరియల్ రాసిన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారిని అభినందించాలి. అక్రమ, సక్రమ ప్రేమలు, సంబంధాలు కథల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మేలిమి బంగారం లాంటి సీరియల్స్‌ని ప్రచురిస్తున్న ‘సంచిక’ సంపాదకులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here