[గులాబీల మల్లారెడ్డి గారి ‘పనిగల్ల ఎద్దు’ కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]
సీనియర్ న్యాయవాది, ప్రముఖ రచయిత, రైతు కవి, జర్నలిస్ట్ అయన గులాబీల మల్లారెడ్డి గారి కలం నుండి జాలువారిన ‘ఎద్దు ఎవుసం సురుకుల వైద్యం’ కవితా సంపుటిలోని ‘పనిగల్ల ఎద్దు’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది.
“ఆ ఎద్దు ఒక యుద్ద వీరునిలా
ఒక బందీ అయిన రాజులా
ఏ తప్పు చేయని యుద్ధ ఖైదీలా
నిటారుగా నిలుచుండి నెమరేస్తుంది
ఆ నెమరులో ఎన్ని ఎన్ని తలపోతలు
ఎన్నెన్ని మధురానుభూతుల మతలబులు
ఆ ఎద్దుకు మనిషికి మల్లె కువ్వారం లేదు”
తెలంగాణ పల్లె భాషలో కువ్వారం పదం అంటే గర్వం. దానిని వాడటం పలుకుబడులు, నుడికారాలు, సామెత లెక్క చక్కగా ఉంది.
ఈనాటి నవీన మానవుడు ఎన్నో ఘోరాలు, ఎన్నో అకృత్యాలు, కక్షలతో కార్పణ్యాలతో ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న జీవాలను హింసకు గురి చేస్తూ చంపుతున్నాడు.
“మనుష్యుల్లా లోలోపల ఇషం లేదు”
లోపలొక మనిషి, బయటొక మనిషి మనం చూస్తూనే ఉన్నాం. విద్వేషం తలకెక్కి మనిషి ఎంతో వికృతంగా ప్రవర్తిస్తుంటాడు.
“ఆ పనిగల్ల ఎద్దుకు పచ్చి గడ్డి వేసినా వేయక పోయినా
పిండి కుడితి గంజి అందినా అందక పోయినా
ఎదురునకలు తెలియవు పని ఎగ్గొట్టడం రాదు
ఆకలితో నకనకలాడినా డొక్క ఈడుసుక పోతున్నా
దుక్కి చేయటం మాత్రం ఆపదు
ఎన్ని గోమారీలు జలగలు పరాన్నభుక్కులై
రక్త మాంసాలు పీల్చినా కిమ్మనదు
అపకారికి సైతం ఉపకారం చేయటమే దాని నైజం”
పిండి కుడితి గంజి అందినా అందకపోయినా పశువులకు కుడితిగోళెం ఉంటుంది. కుడితి గోళెంలో అన్నం వార్చిన గంజి, పిండి, బియ్యం కడిగిన నీళ్లు పసిగడుగులు పోస్తారు. పశువులు ఇష్టంగా తాగుతాయి. పిండి కుడితి గంజి, ఎదురునకలు పదాలు పట్టణ ప్రాంత పిల్లలకు తెలియదు. గ్రామీణ రైతు కుటుంబాల పిల్లలకు కొద్దో గొప్ప తల్లిదండ్రులకు సహకరిస్తారు గనుక వారికి తెలిసి ఉంటుంది. ఆకలితో నకనకలాడినా డొక్కీడుసుకు పోతున్న దుక్కి చేయటం మాత్రం ఆపదు. దుక్కి తెలంగాణ పల్లె పదం. ఎన్ని గొమారీలు జలగలు పరాన్నభుక్కులై రక్త మాంసాలు పీల్చినా కిమ్మనదు. రైతులు పశువులకు స్నానం చేయిస్తున్నప్పుడు శుభ్రంగా గోమారీలు, జలగలు లేకుండా తీసివేసి కడుగుతారు. అపకారికి సైతం ఉపకారం చేయటమే దాని నైజం అని కవి అయిన మల్లారెడ్డి అంటున్నారు. మనం సుమతీ శతకంలో అపకారికి ఉపకారం నెపమెన్నక చేయు వాడు నేర్పరి సుమతీ అని చదువుకున్నాం. మహాత్మా గాంధీ ఒక చెంపను కొడితే ఇంకో చెంపను చూపమన్నాడు. ఇప్పుడు ఎందరు మహాత్ములు ఉన్నారు. ఎవ్వరు కనిపించరు.
“ఆ ఎద్దు నాకిప్పుడు ఒక ఋషిలా మహర్షిలా
ఆకాశమంత ఎత్తులో ధ్రువ నక్షత్రంలా దర్శనమిస్తుంది
చేతులు జోడించి కన్నీరు కార్చడం తప్ప
ఏమీ చేయలేని నికృష్ట దౌర్భాగ్య రైతు నయ్యాను
అయితేనేమి నందీశ్వరుడ్ని చేసి
కొలుస్తున్నాను, తలుస్తున్నాను.”
(సోపతి, నవ తెలంగాణ,12 ఆగస్ట్ 2018).
ఆ ఎద్దు మహాత్ముడు అని తెలియజేస్తున్నారు. ఏసుక్రీస్తు తనను శిలువ వేసిన వాళ్లను వాళ్లకు ఏమీ తెలియదు అన్నాడు. బైబిల్ క్రిస్టియన్లకు ఆరాధ్య గ్రంథంగా నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. ఆ ఎద్దు నాకిప్పుడు ఋషిలా మహర్షిలా ఆకాశం ఎత్తు ధ్రువ నక్షత్రంలా దర్శనమిస్తుంది. చేతులు జోడించి కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని నికృష్ట దౌర్భాగ్య రైతునయ్యాను. మల్లా రెడ్డి బాధతో ఆవేదనతో తెలంగాణలో ప్రతి రైతు ఎదుర్కొంటున్న బాధలను కన్నీటితో అక్షర రూపం ఇచ్చినట్టుగా తోస్తుంది. నిజాయితీ గల కవిగా దర్శనమిస్తాడు.
ఇప్పుడున్న సంక్షుభిత సమాజంలో వ్యవసాయం లక్కీ దువాలా తయారైంది. ప్రకృతి కన్నెర్ర చేసి శ్రీకాకుళంలో తీత్లీ లాంటి తుఫాన్లు, పత్తి రైతుల ఆత్మహత్యలు, వర్షాలు లేక నీళ్లు లేక కరువులు కాటకాలతో పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పట్నంలకు వలసలు కొనసాగుతున్నాయి. ఒంగోలు గిత్తలు కరువవుతున్నాయి. విదేశాల్లో వాటిని చక్కగా పెంచుతున్నారు. నా చిన్నతనంలో ఏ ఇంట చూసిన పాడి పశువులు ఉండేవి. ప్రతి రైతు ఇంట పాలు పెరుగు సమృద్ధిగా లభ్యమయ్యేవి. ఎవరైనా లేని వాళ్ళు పాలు పెరుగు అడిగితే ఉచితంగానే ఇచ్చేవారు. ఇప్పుడు పల్లెల్లో కూడ పాల ప్యాకెట్‌లు కొంటున్నారు. ఎంత విచిత్రం. వ్యవసాయం చేస్తే రైతుకు ఏమీ మిగలడం లేదు. పశువులకు కూడా మేత లభ్యం కావడం లేదు. ప్రాణంగా పెంచిన పశువులను వారసంతలో అమ్ముతున్నారు. దళారులు పశువులను కొని కబేళాలకు తరలిస్తున్నారు. లక్షలు కోట్లు ఆర్జిస్తున్నారు. రైతులు ఉపాధి కోసం ఊరుని విడిచి పట్టణాల బాట పడుతున్నారు.
ఆ ఎద్దులను తమ పిల్లలుగా చక్కగా సాకుతారు. ప్రాణంగా చూసుకుంటారు. సంపన్న వర్గాలకు చెందిన వారు తమ తోటలకు, పెరండ్లకు, చేనులకి, చెల్కలకి, కంచెలు వేసి ఇనుప తీగెలు చుడుతున్నారు. కంచెలు దూకి దొంగలు మరియు అడవి జంతువులు తోట లోకి రాకుండా కంచెలకు కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారు. ఎద్దులు, బర్లు, ఆవులు, పశువులు మేత కొరకు వెళ్లి కంచెను దాటటానికి ప్రయత్నిస్తున్నాయి. నోరు లేని జీవాలు కరెంట్ షాక్ తగిలి అక్కడే ప్రాణాలు వదులుతున్నాయి. తీవ్రమైన గాలి వానలకు కరెంట్ తీగెలు కింద పడి పోతున్నాయి. పశువులు మేత కొరకు వెళ్లి కరెంట్ తీగలు తాకి షాక్‌కి గురియై చనిపోతున్నాయి. హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల్లో చాయ పోసి అమ్ముతున్నారు. పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు ఆహారం అని భావించి పశువులు నమిలి మింగుతున్నాయి. పశువులు వ్యాధుల బారినపడి చనిపోతున్నాయి. ప్లాస్టిక్ భూతం పల్లెకు విస్తరించింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వల్ల బర్రెలు, ఆవులు మరియు ఎద్దులు చనిపోతే రైతులు మరియు రైతు కుటుంబాలు దీనంగా, దిగులుగా ఏడుస్తున్నాయి. రైతుకు సంబందించిన పశు సంపదను కాపాడాలి. అయితేనేమి నందీశ్వరుడ్ని చేసి కొలుస్తున్నాను, తలుస్తున్నాను అని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు వ్యవసాయిక విప్లవం దిశగా పాలకులు సంస్కరణలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైతు దేశానికి వెన్నెముక, జై కిసాన్, నినాదాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోతున్నాయి. రైతుల జీవితాల్లో వెలుగులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల గురించి ఎన్నెన్నో విషయాలు మల్లారెడ్డి ‘పనిగల్ల ఎద్దు’ కవిత ద్వారా మనకు అందించారు. రైతు పండించిన పంటకు గిట్టబాటు ధర ఉండదు. మధ్య దళారీలు కోట్లకు పడగ లెత్తుతున్నారు. ఈ అవ్యవస్థ మారాలి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తారు. ప్రజలకి తాగించి, తినిపించి, ప్రలోభాలకు గురి చేసి ఓట్లను దండుకుంటారు. మళ్లీ 5 సంవత్సరాల వరకు రాజకీయ నాయకులు కనిపించకుండా పోతారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా రైతు జీవితంలో వెలుగులు కాన రావడం లేదు. మొక్కుబడి రైతు బంధు పథకాలు కాదు. నిర్మాణాత్మక కృషి జరిగి రైతు జీవితాల్లో మార్పు జరిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. పైపై మెరుగులతో రైతుబంధు పథకాలతో రైతు జీవితాల్లో మార్పు రాదు. అన్యాయమైపోతున్న రైతులను, రైతు కుటుంబాలను ఒడ్డుకు చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఆశావహ దృక్పథంతో రైతు జీవితంలో వెలుగులు నిండాలని కోరుకుందాం. మల్లారెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.