Site icon Sanchika

వెంటాడే జ్ఞాపకాల కవిత ‘అమ్మ కనబడుతూనే ఉంది’

[డాక్టర్ సముద్రాల శ్రీదేవి గారు రచించిన ‘అమ్మ కనబడుతూనే ఉంది’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవయిత్రి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, పఠాన్ చెరువు గ్రామం, సంగారెడ్డి జిల్లా, స్కూల్ అసిస్టెంట్, తెలుగు భాషోపాధ్యాయురాలు, డాక్టర్ సముద్రాల శ్రీదేవి కలం నుండి జాలువారిన ‘అమ్మ కనబడుతూనే ఉంది’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది.

‘అమ్మ కనబడుతూనే ఉంది’ అనే కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ‘అమ్మ కనబడుతూనే ఉంది’ కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. అమ్మ బ్రతికి ఉంటే రోజు కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతూ ఉండేది. కవయిత్రి శ్రీదేవి అమ్మ తేది 19-02-2024 రోజున ఈ లోకాన్ని వీడిపోయింది. తల్లి జ్ఞాపకాలు మరపురాని మధుర స్మృతులు ఆమెను నీడలా వెంటాడుతున్నాయి.

కవయిత్రి శ్రీదేవి అమ్మ స్మృతిలో కవితను రాసారు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మను తలుచుకొని గుండెల్లోంచి తన్నుకు వచ్చే దుఃఖంతో పొర్లి పొర్లి ఏడుస్తుంది. అమ్మ జ్ఞాపకాలలో ఆమె బతుకును సాగిస్తుంది. అమ్మ జ్ఞాపకాలు ఎంతో గొప్పవి, అపురూపమైనవి. మధురమైన అమ్మ జ్ఞాపకాలు ఎన్నటికీ మరిచి పోలేనివి. తనకు ప్రతి క్షణం అమ్మ గుర్తుకు వస్తుంది. ‘అమ్మ కనబడుతూనే ఉంది’ కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా? అయితే ఒక్కసారి మనసు పెట్టి కవయిత్రి శ్రీదేవి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.

‘చిన్నప్పుడు దెబ్బ తగిలి
వెక్కివెక్కి ఏడుస్తుంటే తన
చీర కట్టు కట్టి కొంగుతో తుడిచిన
కన్నీటి చారికలో అమ్మ కనబడుతుంది.’

ఆమెకు చిన్నప్పటి బాల్యంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. చివరి గంట కొట్టగానే పాఠశాల ముగిసినట్లు అందరికీ అర్థమవుతుంది. తర్వాత పాఠశాల నుండి పిల్లలు అందరూ ఎవరి ఇంటికి వారు చేరుకుంటారు. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏదో ఒక టిఫిన్ తయారు చేసి పెట్టేది. ఇరుగు పొరుగు పిల్లలు ఆడుకోవడానికి మా ఇంటికి రాగానే అమ్మ నన్ను వారితో పంపించేది. అనుకోకుండా ఆ రోజు పిల్లలతో కలిసి ఆటలు ఆడుతుండగా తాను కింద పడి కాలికి గాయమైంది. తాను గాయం తగిలి వెక్కివెక్కి ఏడుస్తుంటే చిట్టి తల్లి నీకు ఏమీ కాదు, చిట్టి తల్లి నీకు మందు రాస్తా, మందు రాయగానే గాయమైన చోట చల్లగా ఉంటుంది, తొందరగా నీ గాయం మానిపోతుంది అని అమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలించింది. గాయమైన చోట పసుపు రాసి, నూరిన నల్లాలం ఆకులతో కట్టు కట్టింది. ప్రేమతో తన చీర కొంగుతో తుడిచిన కన్నీటి చారికలో అమ్మ కనబడుతుంది. ఎంతో ఆప్యాయంగా తనకు తగిలిన చిన్న దెబ్బకు కట్టు కట్టి ఓదార్చిన అమ్మ రూపం గుర్తుకు వస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘వండిన అన్నం అప్పుడే వచ్చిన
చుట్టాలకు సరిపోతే అల్లాడే మాకు
అటుకులు నీళ్లతో తడిపి పెట్టిన ఆకలిలో
అమ్మ కనబడుతుంది.’

ఒక రోజు తన ఇంటిలో జరిగిన సంఘటన ఇది. మనసులో దాగిన ఆనాటి పాత జ్ఞాపకాన్ని ఎలా మర్చిపోతుంది. అమ్మ పొద్దున లేచి అన్నం కూరలు తయారు చేసి పెట్టింది. ఇక ఆకలితో ఉన్న పిల్లలమైన మాకు అన్నం కూరలు వడ్డిస్తాను అని అమ్మ అనుకునేలోగానే ఇంటికి చుట్టాలు వచ్చారు. అమ్మ చుట్టాలను ఎంతో ప్రేమగా పలకరించింది. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. వండిన అన్నం కూరలు, అప్పుడే వచ్చిన చుట్టాలకు ప్రేమగా వడ్డించింది. అమ్మ ఇంటికి వచ్చిన చుట్టాలను దేవతలుగా భావించింది. చుట్టాల రూపంలో దేవతలే మా ఇంటికి వచ్చి అన్నం తిన్నారు అని సంబరపడి పోయింది. మన హైందవ సమాజం అతిథిని దేవునిగా భావిస్తుంది. వండిన అన్నం చుట్టాలకు సరిపోయింది. ఇంట్లో వాళ్ళు తినడానికి ఇక ఏమీ మిగలలేదు. ఇక పిల్లలు ఒక్కసారిగా ఆకలితో అల్లాడుతుంటే చూసి అమ్మ అటుకులు నీళ్లతో తడిపి పెట్టి ప్రేమగా తినిపించింది. చుట్టాలు వచ్చిన రోజున ఏమీ తినక అమ్మ ఆకలితో ఉంది. కాసిన్ని మంచి నీళ్లు తాగి సరిపెట్టుకుంది. అమ్మకు చుట్టాలు అంటే పరమ ప్రీతి. కడుపులో పుట్టిన పిల్లలమైన మేము అంటే కూడా అమ్మకు ఎంతో ఇష్టం. ఆ రోజు ఏమీ తినక ఆకలితో మంచి నీళ్లు తాగి సరి పెట్టుకున్న అమ్మ సంగతి గుర్తుకు వస్తే కళ్ళనుండి నీళ్లు ధారగా కారుతాయి. అమ్మ గురించి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘నీళ్ల సౌకర్యం లేని గ్రామంలో
అల్లంత దూరాన కాలువ గట్టు నుండి
బిందె మీద బిందె నీళ్లతో, భుజాన
పిండిన బట్టలతో నడయాడే అలసిపోని
అమ్మ శిల్పం కనబడుతుంది.’

ఒకప్పుడు అమ్మ నివసిస్తున్న గ్రామానికి కనీస అవసరాలు అయిన నీటి సౌకర్యం లేదు. గ్రామస్తులందరూ ఒక కిలోమీటర్ దూరంలో గల కాలువ గట్టును చేరి స్నానాదికాలు పూర్తి చేసుకుని బట్టలు పిండుకుని త్రాగు నీరు బిందెలో నింపుకొని నడుస్తూనే ఇంటికి వచ్చేవారు. అమ్మ కూడా ఊరి వాళ్ళందరితో పాటు కాలువ గట్టుకు వెళ్ళేది. అక్కడ స్నానం చేసి బట్టలు పిండుకుని భుజాన వేసుకుని బిందె మీద బిందెను మోస్తూ ఇంటికి వచ్చేది. బిందెలు మోస్తూ కిలోమీటర్ దూరం నడిచినప్పటికీ అమ్మ ఉల్లాసంగా ఉండేది. ఎలాంటి అలసట కనిపించని అమ్మ యొక్క శిల్పం లాంటి రూపం కనబడుతుంది అని వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.

‘నాన్న చేసే వైద్యం కోసమని
మందులను రాత్రంతా నూరుతూ
మేలుకొని శ్రమించే మానవ సేవలో
అమ్మ కనబడుతుంది.’

ఆ రోజుల్లో పల్లెల్లో ఎలాంటి వైద్య సౌకర్యాలు లభించేవి కాదు. ఆ రోజుల్లో నాన్న ఉపాధ్యాయ వృత్తితో పాటు ఆర్.ఎం.పి.డాక్టర్‌గా వైద్య సేవలు అందించే వాడు. ముప్పై గ్రామాల ప్రజలు వైద్యం కోసం నాన్న వద్దకు వచ్చే వారు. నాన్న చేసే వైద్యం కోసం అమ్మ రాత్రంతా మేలుకొని మందులు నూరుతూ శ్రమించేది. డాక్టర్‌గా నాన్న రోగులకు మందులు ఇవ్వడంలో అమ్మ సహకరించేది. పల్లెలోని రోగులకు మానవ సేవలు అందిస్తూ గడిపే అమ్మ జీవితం కళ్ళ ముందు కనబడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘పూటకూళ్ళ లాంటి ఇల్లు అయిన
మా ఇంటిలో పొద్దున్నుంచి వండి వార్చిన
గంజి మెతుకులు, విదిల్చిన చెమట చుక్కల్లో
అమ్మ కనబడుతుంది.’

పూర్వము తీర్థయాత్రల కోసం మనుషులు దూర ప్రయాణాలు చేసేవారు. విశ్రాంతి తీసుకోవడానికి ఆ రోజుల్లో గ్రామాల్లో హోటల్స్ ఉండేవి కావు. గ్రామాల్లో కొన్ని మధ్య తరగతి కుటుంబాల వారు బ్రతుకుతెరువు కోసం పూటకూళ్ళ ఇల్లు నడిపేవారు. గ్రామాల మీదుగా నడిచి వెళ్లే యాత్రికులు భోజన సమయానికి పూటకూళ్ల ఇళ్లకు చేరుకునేవారు. పూటకూళ్ళ ఇళ్ళ వారు ఎంత మంది భోజనం కొరకు వచ్చినారో, వారి సంఖ్యను చూసుకొని వారికి భోజనాలు తయారు చేసేవారు. భోజనానికి వచ్చిన వారు కాళ్లు చేతులు కడుక్కొని రాగానే వారికి భోజనాలు వడ్డించేవారు. ఇందుకు ప్రతిఫలంగా కొంత సొమ్మును పుచ్చుకునేవారు. ఇంకా కొన్ని ఇళ్లలో రాత్రులు బస చేయడానికి సౌకర్యాలు ఉండేవి. ఆమె తన ఇంటి గురించి చెబుతూ పూటకూళ్ళ ఇంటి వలె మా ఇల్లు ఉండేది. డాక్టర్‌గా నాన్న వైద్యం చేస్తున్న రోజుల్లో ముప్పై గ్రామాల ప్రజలు వైద్యం కోసం మా ఇంటికి వచ్చే వారు. రోగులకు, వారి వెంట వచ్చిన వారికి అమ్మ వంట చేసి పెట్టేది. మా ఇంటి వంటశాలలో అమ్మ వంట చేస్తూ ఉండేది. వంట కాగానే రోగులకు వారి వెంట వచ్చిన వారికి అమ్మ భోజనాలు వడ్డించేది. వండి వార్చిన వంటలతో రోగులు, వారి తాలూకు బంధువులతో మా ఇల్లు కళకళలాడేది. వంటశాలలో అమ్మ వంట కోసం పడ్డ శ్రమలోని చెమట చుక్కల్లో కనబడేది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘బాల్య వివాహంలో, బతుకు
చితుకుల్ని పేర్చి కొవ్వొత్తి నీడలలో
ఇతరులకు వెలుగు నింపిన
అమ్మ జాడ కనబడుతుంది.’

బాల్య వివాహం అనగా యుక్త వయసు రాక మునుపు బాల్య దశలో చేసే వివాహం. పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి, ఇరవై ఒకటి సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహంగా చెప్పవచ్చు. ఊహ తెలియని వయసులోనే అమ్మ పెళ్లి జరిగింది. ఆ కాలంలో బాల్య వివాహాలు జరిగేవి. అమ్మ బాల్య వివాహం చేసుకున్నప్పటికీ కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో బతుకును చక్కగా కొనసాగించింది. అమ్మ కొవ్వొత్తిలా కరుగుతూ తన కుటుంబానికి మరియు ఇతరుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన త్యాగమూర్తి. అమ్మ యొక్క చిరునామా కొవ్వొత్తి నీడలలో కనబడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘వడ్లు దంచి, మిరప కారం కొట్టి
పప్పు తిరగలిలో విసిరి నలిగిన
భుజాల, బలహీనతలో అమ్మ
మమకారం కనబడుతుంది.’

ఆ కాలంలో ఆ ఊరికి వడ్లను దంచే గిర్నీలు ఇంకా రాలేదు. పల్లెలో జనాలు వడ్లను రోటిలో పోసి రోకలితో దంచేవారు. అమ్మ రోటిలో వడ్లను పోసి రోకలితో దంచేది. రోటిలో మిరపకాయలు వేసి రోకలితో దంచి కారం కొట్టేది. అమ్మ విసుర్రవుతుతో పప్పు విసిరేది. వడ్లు దంచి బియ్యం తీసిన, మిరప కాయలు కొట్టి కారం తీసిన, విసుర్రవుతుతో పెసర, కంది దినుసులు విసిరి పప్పు తయారు చేసి అలసిన భుజాల బలహీనతలో అమ్మ మమకారం కనబడుతుంది. ఆ కాలంలో కుటుంబం కొరకు అమ్మ ఎంతో శ్రమించేది. కష్టం చేసి చేసి రెక్కలు ముక్కలు చేసుకుని భుజాల బలహీనతలో కూడా అమ్మ చూపిన మమకారం కనబడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘పరాయి పిల్లలను సైతం బాల్యో
పచారంతో పెంచి పెద్ద చేసి
మాతృమూర్తిగా ప్రేమను పంచి ఇచ్చిన
అమ్మతనంలో అమ్మ కనబడుతుంది.’

అమ్మ పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ ఎంతో తీయనైనది. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుంది.

ఆకలేసినా, ఆనందం కలిగినా, దిగులు కలిగినా, దుఃఖం ముంచుకొచ్చినా, పిల్లలకు గుర్తు కొచ్చే పదం అమ్మ. తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు నింపడం కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. పది మంది అధ్యాపకుల కంటే ఒక ఆచార్యుడు మిన్న. నూరుగురు ఆచార్యుల కంటే తండ్రి మిన్న. అటువంటి వెయ్యి మంది తండ్రుల కంటే ఒక తల్లి మిన్న. కాబట్టి తల్లిని ప్రథమ గురువు అన్నారు. అందరికంటే మిన్నగా గౌరవించదగినది తల్లియే. అమ్మ పరాయి పిల్లలను సవతి తల్లి పిల్లలను కూడా తన పిల్లల వలె ప్రేమ ఆప్యాయతలతో పెంచి పెద్ద చేసింది. వారికి విద్యను వినయాన్ని అందించి యుక్త వయసు రాగానే పెళ్లిళ్లు చేసింది. స్వంత తల్లి వలె ప్రేమను పంచి ఇచ్చింది. అమ్మతనం ద్వారా తన పిల్లలను తన సవతి పిల్లలను సమానంగా ప్రేమతో చూసిన మాతృమూర్తి. అమ్మతనంలో అమ్మ కనబడుతుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘దానధర్మాలలో, కారుణ్య పుణ్యంలో
అమ్మ ఇంకా బ్రతికే ఉంది.’

మనం చేసే పని ధర్మం. ఒకరికి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఆర్థిక సహాయం దానం. ఈ రెండు కలిపి దానధర్మాలు అంటారు. ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం. దానం చేసే వ్యక్తిని దాత అంటారు. దానం ధనం రూపంలో కాని, వస్తు రూపంలో కాని, సేవా రూపంలో కాని ఉంటుంది. ఆకలిగా ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు అంటారు. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అంటారు. కరువు కాటకాలు కలిగిన సమయంలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. అమ్మ పేదలు ఇంటికి వస్తే ప్రేమగా వారి అవసరాలు తెలుసుకొని దానం చేసేది. ఆకలితో ఇంటికి వచ్చిన వారికి ప్రేమగా అన్నం పెట్టేది. గ్రామంలో ఇప్పటికీ అమ్మ పేరు చెబితే పుణ్యాత్మురాలు, దేవత అని అంటారు. అంత మంచి అమ్మ మన పల్లెలో ఇక దొరకదు. ఆత్మ గల అమ్మ అని గుర్తు చేస్తారు. ఇప్పటికి గ్రామంలో తనను అమ్మ కూతురు గానే గుర్తిస్తారు. మా అమ్మ వచ్చిందని ప్రేమతో పలకరిస్తారు. ఆప్యాయంగా తనను దగ్గరకు తీసుకుంటారు. అమ్మను కాలం తీసుకు పోయింది. అమ్మ ఆ పల్లె హృదయాలలో ఒక జ్యోతిలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అమ్మ కూతురిగా గుర్తించడం తనకు చాలా సంతోషంగా ఉంటుంది. చేసిన మంచి పనుల వల్ల గ్రామస్థుల హృదయాల్లో అమ్మ ఇంకా బ్రతికే ఉంది అని వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.

‘ఆయుష్యును మాకు పోసి
జన్మను ఉషస్సు చేసి
మౌన తపస్సులోకి వెళ్ళిన
అమ్మ వర్చస్సు ఇంకా
కనబడుతూనే ఉంది.’

ఒక వ్యక్తి జీవించి ఉన్న సంవత్సరాల సంఖ్యను వివరించడానికి వయస్సు అనే పదాన్ని ఉపయోగిస్తారు. అమ్మ తన ఆయుష్యును మాకు పోసింది. అమ్మ తనను నూరేళ్లు జీవించమని ఆశీర్వదించింది. అమ్మ తన జన్మను కాంతివంతం చేసి సార్థకం చేసుకుంది. అమ్మ ఈ లోకాన్ని వీడి మౌన తపస్సులోకి వెళ్ళిపోయింది. అందమైన అమ్మ ముఖం ఇంకా నా కళ్ళల్లో ప్రతిపలిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నింటిలో తనకు అమ్మ రూపం కనబడుతుంది. అమ్మ ఒక వెలుగు. అమ్మ కాంతి రేఖలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అమ్మ ఆ గ్రామస్థుల కళ్ళలో, హృదయాలలో ఎప్పటికీ కనబడుతూనే ఉంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.


సముద్రాల శ్రీదేవి పఠాన్‌చెరువు గ్రామం, సంగారెడ్డి జిల్లా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, స్కూల్ అసిస్టెంట్, తెలుగు టీచర్‌గా పని చేస్తున్నారు. వీరి తల్లి సముద్రాల విమలా దేవి, తండ్రి వెంకటాచార్యులు.

వీరి తండ్రి వెంకటాచార్యులు కవి. కవయిత్రి శ్రీదేవి కథలు, కవితలు,పద్యాలు, వ్యాసాలు, నవల కూడా రాశారు. వీరి తండ్రి కవి కావడం చేత చిన్నప్పటి నుండి ఉగ్గు పాలతో రంగరించిన తెలుగు నుడికారాన్ని స్వంతం చేసుకున్నారు. వీరు సముద్రాల ఫౌండేషన్ స్థాపించి కవులను, కళాకారులను సన్మానిస్తున్నారు. వీరు సాహితీ విజయం పేరుతో వాట్సప్ గ్రూప్ అడ్మిన్ మరియు సాహితీ సముద్రం పేరుతో ఫేస్ బుక్‌ను నడిపించి కవులను ప్రోత్సహిస్తున్నారు. సముద్రాల శ్రీదేవి పేరుతో యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరు రచించిన కవితలు, పద్యాలు, వ్యాసాలు, గజల్స్ వివిధ పత్రికలలో ప్రచురింపబడినాయి. వీరు మహిళా సాహితీ శిరోరత్న, కవి చక్ర,కవి భూషణ, సహస్ర కవి మిత్ర, గాన కోకిల అను బిరుదులను అందుకున్నారు. వీరు 12 గజల్స్‌ను రచించి తానే పాడినారు.

కవయిత్రి శ్రీదేవి వెలువరించిన పుస్తకాల వివరాలు:

1) అమ్మ శతకం – 2022. 2) బతుకమ్మ శతకం – 2022. 3) శ్రీదేవి శతకం – 2022. 4) దేవి మాట శతకం 1 – 2022. 5) దేవి మాట శతకం 2 – 2022. 6)దేవి మాట శతకం 3 – 2022. 7) నాన్న శతకం – 2023. 8) ధరణి శతకం – 2023. 9) ఆచార్య దేవో భవ శతకం -2023. 10) నీతి శతకం – 2024. 11) నీటి శతకం – 2024. 11) అర్ణవ వర్ణం కవితా సంపుటి – 2017. 12) వెన్నెల్లో అక్షరాలు కవితా సంపుటి – 2022. 13) కవిత్వం కురిసిన వేళ కవితా సంపుటి – 2022. 14) మృగ నయని గజల్స్ – 2022. 15) హృదయ విలాసం గజల్స్ – 2022. 16) సౌందర్య రాగం గజల్స్ – 2022. 17) సౌవర్ణిక గజల్స్ – 2022. 18) సౌహార్దిక గజల్స్ – 2023. 19) శ్రీదేవి కథలు 1 – 2022. 20) శ్రీదేవి కథలు 2 – 2022. 21) శ్రీదేవి కథలు 3 – 2022. 22) శ్రీదేవి కథలు 4 – 2024. 23) శ్రీదేవి కథలు 5 – 2024. 24) శతమానం భవతి నవల -2022. ఆంధ్రప్రభ దినపత్రికలో సీరియల్ గా వచ్చింది.

కవయిత్రి శ్రీదేవి చేసిన సాహితీ సేవలకు గుర్తింపుగా పొందిన అవార్డులు.

  1. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్, సెప్టెంబర్ 5, 2022.
  2. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్,స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ –
  3. కవితా సంపుటి అర్ణవ వర్ణం కు ప్రతిష్ఠాత్మకమైన గిడుగు రామమూర్తి పంతులు అవార్డు
  4. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, 2022.
  5. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, 2022.
  6. మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డ్, 2023.
  7. ఎక్స్ట్రార్డినరీ రికార్డ్, 2019.
  8. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అవార్డ్ , 2021.
  9. ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్,2021.
  10. ఇండియన్ ఫ్రైడ్ సెలబ్రిటీ ఫెసిలిటేషన్ ,2018.
  11. డాక్టర్ సి. నారాయణ రెడ్డి పురస్కారం
  12. గురు బ్రహ్మ పురస్కారం
  13. అలిశెట్టి ప్రభాకర్ గారి సాహితీ పురస్కారం
  14. సేవా భూషణ్ అవార్డ్ 2020
  15. డైనమిక్ లేడీ లెజెండరీ అవార్డ్ -2021.
Exit mobile version