Site icon Sanchika

జీవన తాత్వికతను చాటిన ‘దింపుడు కళ్ళం’ కవిత

[శ్రీ అన్నవరం దేవేందర్ గారి ‘దింపుడు కళ్ళం’ కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ‘దింపుడు కళ్ళం’ కవిత ఏమిటని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. దింపుడు కళ్ళం ఏమిటని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దింపుడు కళ్ళం అనేది మరణ సమయంలో నిర్వహించే అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం. ఈనాటి తరం పిల్లలకు దింపుడు కళ్లం అంటే ఏమిటో తెలవదు. అంతిమ యాత్ర జరుగుతున్నప్పుడు చనిపోయిన వారి మీద మమకారంతో శవాన్ని ఒక ప్రదేశంలో పాడెను కిందకు దింపి శవం చెవిలో మూడుసార్లు వాళ్ల పేర్లు పెట్టి పిలుస్తారు. చనిపోయారు అనుకున్న వ్యక్తిని అప్పటికప్పుడు దహనం చెయ్యరు. ఖననం చెయ్యరు. ఒకవేళ ఆ వ్యక్తిలో ప్రాణం ఉంటే లేవటానికి తగినన్ని అవకాశాలు కల్పిస్తారు. వ్యక్తి చనిపోయారు అని తెలిసిన తర్వాత  బంధువులు, తెలిసిన వాళ్ళు రావడానికి కనీసం ఒకరోజు పడుతుంది. ఒకవేళ నిజంగా చనిపోకపోతే ఆ వ్యక్తి లేచే అవకాశముంది. అక్కడకు వచ్చిన బంధువుల ఏడుపులతో ఒకవేళ గాఢ నిద్రలో కోమా లాంటి స్థితిలో ఉన్న వ్యక్తి లేవటానికి అవకాశం ఉంటుంది. స్మశానానికి తీసుకు వెళ్లే ముందు చనిపోయిన వ్యక్తిని స్నానం చేయించి, బట్టలు మార్చి కొత్త బట్టలు కట్టి తీసుకువెళ్తారు.ఇక్కడ కూడా ఆ వ్యక్తి  లేవటానికి అవకాశం ఉంది. స్మశానానికి వెళ్లే ముందు చావు డప్పులతో తీసుకువెళ్తారు. ఆ చావు డప్పుల శబ్దాలకు కూడా ఆ వ్యక్తి లేచే అవకాశం ఉంది. చివరకు దహనం చేసే ముందు మరియు ఖననం చేసే ముందు శవాన్ని పాడెపై నుంచి కిందకు దించి కుటుంబ సభ్యులకు చివరి చూపు చూసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ ప్రదేశాన్ని దింపుడు కళ్ళం అంటారు. అక్కడ కూడా చనిపోయిన మనిషి పేరు మూడుసార్లు గట్టిగా చెవిలో పిలుస్తారు. ఎందుకంటే ఒక చివరి ఆశ, ఆ వ్యక్తిలో ప్రాణం ఉందేమో అనే ఆశ, కళ్ళు తెరుస్తారేమో అనే ఆశ, ఆ తర్వాత స్మశానంలో చితి పై పేర్చిన కట్టెలపై శవాన్ని ఉంచుతారు. చనిపోయిన వారి తాలుకు బంధువు కుండలో నీళ్లు పట్టుకుని చితి చుట్టూ ఒక ప్రదక్షణ చేయగానే కాటికాపరి కుండకు ఒక రంధ్రం చేస్తాడు. చితి చుట్టు రెండో ప్రదక్షిణ పూర్తి కాగానే కాటికాపరి కుండకు రెండో రంధ్రం చేస్తాడు. చితి చుట్టు మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే కాటికాపరి కుండకు మూడో రంధ్రం చేస్తాడు. కాటి కాపరి కుండను పగుల గొడతాడు. చనిపోయిన వారి తాలూకు బంధువు చితికి నిప్పు అంటిస్తాడు. చనిపోయిన వారి తాలూకు బంధువులు, ఆప్తులు, ఆత్మీయులు అందరూ చితి వద్ద నుండి దూరంగా వెళ్లిపోతారు. చితి పైన ఆ శవం నుంచి మంటలు జ్వాలలుగా ఎగసిపడతాయి. చివరికి చనిపోయిన వ్యక్తి పిడికెడు బూడిదగా మారిపోతాడు.

‘వెంట నడుస్తుంటే వెంటాడుతున్న జ్ఞాపకాలు’

చనిపోయిన వ్యక్తి శవాన్ని పాడె మీద నలుగురు వ్యక్తులు మోస్తారు. బంధువులు ఒకరి తర్వాత ఒకరు పాడెను మోస్తారు. చావు డప్పులతో ఊరు ఊరంతా అంతిమ యాత్రలో పాల్గొంటారు. అంతిమ యాత్రలో పాల్గొంటే పుణ్యం వస్తుంది అనే ఒక నమ్మకం జనాల్లో ఉంది. చనిపోయిన వ్యక్తి యొక్క జీవిత అనుభవాల గురించి మాట్లాడుకుంటారు. బతికుండగా ఆమె ఏమి కార్యాలు చేసింది, ఆమె ఎట్లా బతికింది, ఆమె కుటుంబం గడపడం కొరకు ఎంత అరిగోస పడ్డది, ఆమె కుటుంబాన్ని ఎట్లా కాపాడింది, ఆమె ఊరి అందరిలో తలలో నాలికలా ఎట్లా మెదిలింది – ఒక్కొక్కరు ఆమెతో గడిపిన తమ తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఆ రోజుల్లో ఆమెతో గడిపిన తీపి జ్ఞాపకాలు ఒక్కొక్కరి అనుభవాలు చెప్పుకుంటూ తీరని ఆవేదనతో ఏడుస్తారు. ఏడుస్తే చనిపోయిన వ్యక్తి వస్తాడా? చనిపోయిన వ్యక్తి రాడు అని అందరికీ తెలుసు. అయినా అందరు ఒక రకమైన దుఃఖసాగరంలో మునిగి తేలుతారు. నిర్వేదాన్ని చూస్తే వింతగా అనిపిస్తుంది.

‘మనసంతా మెలిపెడుతున్న అనుబంధాలు’

జీవించి ఉన్న రోజుల్లో ఆమె ఎలా బతుకు గడిపింది. ఆమె కుటుంబంతో మరియు సమాజంతో ఎంత ప్రేమగా మెదిలింది. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసి పోవడం, కలసి ఉండడం, కలిసి భోజనం చేయడం, ఒకరిపై ఒకరు ప్రేమచూపించడం, స్పృశించడం, చేతులు కలపడం, కళ్ళలోకి సూటిగా చూడగలగడం, కలిసి సమయాన్ని గడపడం, వీటిని అనుబంధం అంటారు. బంధువులందరిలో బంధం ఉంది. కాని అనుబంధం ఉంది అని చెప్పేవాళ్లు అరుదుగా ఉంటారు. సమాజంలో కాని ఇంటిలో కాని అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కాని అనుబంధాలు కనుమరుగు అయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా ఎవరి ప్రపంచంలో వారు  జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం. పరస్పరం ఆప్యాయతలతో అనురాగంతో కలిసి మెలిసి ఉందాం. సమాజంలో బంధాలు, అనుబంధాలు అత్యంత కీలకమైనవి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క, చెల్లెలు, తాతలు, ముత్తవ్వలు, రకరకాలైన బంధుత్వాలు శాశ్వత బంధాలుగా కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటూ వస్తున్నాయి. మానవుడు తల్లి, తండ్రి ఇతర కుటుంబ సభ్యుల రక్షణ, పోషణ అనే ముఖ్య అంశాల పైన తన జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. పుట్టిన ప్రతి వ్యక్తి కుటుంబంలో సభ్యుడు. ఇలా బంధుత్వ సమూహంలో సభ్యత్వం పుట్టుకతోనే ప్రాప్తిస్తుంది. మానవ సమాజంలో ఉన్న నీతి నియమాలు, రీతి రివాజులు, వ్యవస్థల సంబంధాలు, శాశ్వతమైన అనుబంధాలను బంధుత్వం అందిస్తుంది.

‘దారి పొడుగునా దుక్క ధారలు’

పల్లెల్లో స్మశాన వాటికలు ఊరి బయట ఉంటాయి. చనిపోయిన వ్యక్తి యొక్క అంతిమ యాత్ర కొనసాగుతూ ఉంటుంది. అంతిమ యాత్రలో గ్రామ గ్రామమంతా పాల్గొంటారు. అంతిమ యాత్రలో పాల్గొన్న కుటుంబ సభ్యులతో పాటు  బంధువులు మరియు ఇరుగుపొరుగు గ్రామస్తులంతా దారి పొడుగునా ఆమెను గురించి దుఃఖిస్తుంటారు.

దారి పొడుగునా దుఃఖ దారలు స్రవిస్తున్నాయి అని చెప్పడం కవి దేవేందర్ భావన చక్కగా ఉంది.

‘అంతిమయాత్ర పొడుగుతా ఆవేదనలు’

అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి  కళ్ళలో  కన్నీరు, వెళ్లేటప్పుడు మన వెంట ఏమీ రాదు. బంధాలు, బంధువులు అందరు స్మశానం వరకే వస్తారు. ఏడుపులు, రోదనలు. కనిపించని దూర తీరాలకు మనిషి పోతాడని తెలిసిన, తెలుసుకున్న మనుషులందరు, మనిషి పార్థివ శరీరం మాయమవ్వగానే అంతిమయాత్ర మొదలు తుది వరకు ఉన్న అనుకున్న ఆలోచనలు ఒక్కసారిగా కనుమరుగైపోయి, మనిషిలో ఉన్న అసలైన కోరికలు, ఆశలు, నాది అనే ఆలోచనలు, నాకు మాత్రమే సొంతం అనే అహంభావం తళుక్కుమంటుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న వాళ్లు మనసులో కలిగే బాధను ఆవేదనగా వెళ్లబుచ్చుతుంటారు. ఆ మనిషి తమ పట్ల ఎట్లా కరుణతో  వ్యవహరించింది. ఎంత మంచిది. ఇక ఆమె లేదు. ఇక ఆమె రాదు అనే ఆవేదనతో అందరు ఒకే భావనతో ఆమె గురించిన ధ్యాసలో పడిపోవడం జరుగుతుంది.

‘మల్లవ్వా.. మల్లవ్వా.. ఓ మల్లవ్వా

కండ్ల నిండుగ దుక్కం పారంగ

ఆమెకు తప్ప అందరికీ వినిపిస్తుంది

ఇతడు చనిపోయిన మల్లవ్వకు సంబంధించిన వ్యక్తి అని అర్థమవుతుంది. మల్లవ్వ అని మూడుసార్లు ప్రేమతో కళ్ళలో నీళ్లు నింపుకొని కన్నీళ్ల ప్రవాహంతో ఎంతో ఆర్తిగా ఆమెను పిలుస్తున్నాడు. కాని శవంగా మారిన ఆమెకు మాత్రం అతని పిలుపులు వినిపించడం లేదు. అక్కడ అంతిమయాత్రలో పాల్గొన్న వారందరికీ అతని ఏడుపు, దుఃఖం వినిపిస్తున్నది. ఎంతో బాధతో అతడు రోదిస్తున్నప్పటికి అతని బాధ ఆవేదన దుఃఖం ఆమెకు మాత్రం వినిపించే అవకాశం లేదు.

‘అమ్మా.. అమ్మా.. అమ్మ

ఓ అమ్మ.. ఓ అనవే తల్లీ

ఏడుపులో కలిసిపోయిన కొడుకు పిలుపు

అమ్మా అని మూడుసార్లు పిలిచాడు. ఓ అనవే తల్లి అని తీరని ఆవేదనతో ఏడుస్తున్నాడు. ఏడుపులో కలిసిపోయిన కొడుకు పిలుపు చనిపోయిన ఆమెకు వినిపించలేదు. చనిపోయిన ఆమె ఈ లోకంలో లేదు అని అర్థమవుతుంది.

‘అమ్మా నేను లచ్చన్ననే

ఒక్క సారన్న మాట్లాడవే అమ్మా..

తల్లిని పట్టుకొని తల్లడిల్లిండు

‘ఆమె ఆకాశం దిక్కు కండ్లు మూసుకొని

ప్రశాంతం గా పడుకున్నట్లుంది

అతడు తన తల్లితో నేను లచ్చన్ననే అని చెప్తున్నాడు. ఒక్కసారన్న మాట్లాడవే అమ్మ అని రోదిస్తున్నాడు. తల్లిని పట్టుకుని గుండె బాదుకున్నాడు. కళ్ళెదురుగా ఉన్న తల్లి దూరం అయిపోతుంటే కంటనీరు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత ఆవరించింది. హృదయ విదారకంగా ఏడ్చినాడు. చనిపోయిన వ్యక్తి శవం మాత్రం ఏం చేస్తుంది? అంతకుమించి ఆమె ఈ లోకంలో లేదు. ఆమె ఆకాశంలోకి చూస్తూ ప్రశాంతంగా నిద్రపోతుంది అనే వాస్తవాన్ని తెలియజేసిన తీరు చక్కగా ఉంది.

‘అత్తమ్మా.. అత్తమ్మా.. ఓ అత్తమ్మ

ఒక్క సారి ఓ అనవే అత్తమ్మా

దిక్కులు దనించేలా పెడ బొబ్బల పిలుపు

అంతిమయాత్రలో పాల్గొన్న కోడలు అత్తమ్మ అని ప్రేమతో మూడుసార్లు దుఃఖంతో పిలిచింది. ఒక్కసారి ఓ అనవే అత్తమ్మా అంటూ నాలుగు దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దద్దరిల్లేలా ఉన్న తన  పెడబొబ్బల ధ్వనులకు ఆమె లేస్తుందేమోనని ఆమెకు ఆశగా ఉంది. ఆమె అత్తమ్మకు వినిపించదనే సంగతి ఆమెకు తెలియదని తోస్తోంది.

‘కోడలు రొంబొచ్చ కొట్టుకొని రోదించిన

మల్లవ్వ మారు మాట్లాడ కుంటున్నది

కోడలు వేదనతో రొంబొచ్చ కొట్టుకొని రోదించింది. అత్తమ్మను ఆ పరిస్థితుల్లో చూడలేక ఏడుస్తున్నది. బొచ్చ గుద్దుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. బతికుంటే అత్తమ్మ మాట్లాడుతూ ఉండేది. కుటుంబానికి ఆసరాగా ఉండేది. అత్తమ్మ ఈ లోకంలో లేదు కనుక కోడలు పిల్చిన పలుకలేదు అని అర్థమవుతున్నది.

‘నానీ నానీ అని మనవరాల్ల ఏడుపులు’

మనవరాల్లు నానమ్మ దగ్గర ఆప్యాయతతో మెదిలిన వారు. దుఃఖంతో ఆ పిల్లలు ఏడుస్తున్నారు. నిజంగా ఆ పిల్లలకు నానమ్మ చనిపోయిందనే విషయం తెలియదు. తెలిసినా ఆ మనవరాళ్ళకు అర్థం చేసుకునే వయసు కాదు.

‘అక్క అక్క అని చెల్లెండ్లు తమ్ముల్ల దుక్కం’

అక్క అక్క అని చెల్లెండ్లు, తమ్ముళ్లు అక్కను తలుచుకొని దుఃఖిస్తున్నారు. వాళ్ల దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. చనిపోయిన వ్యక్తితో పేరుకుపోయిన బంధాన్ని తలుచుకొని ఏడుస్తున్నారు. అక్క లేదు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘చుట్టూరా బాధల కండ్ల బలగం’

చనిపోయిన వ్యక్తి శవం చుట్టూరా అంతిమ యాత్రలో పాల్గొన్న బంధువులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బలగం అందరిలో దుఃఖం గూడు కట్టుకొని ఉంది.

‘తాను మాట్లాడాలనుకున్నప్పుడు

ఎవలూ కనబడలే

మల్లవ్వ బతికున్నప్పుడు ముసలితనంలో ఎవ్వరు కనబడలేదు అంటున్నారు. నిజమే. మనిషి జీవితంలో వేగం పెరిగింది. ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎవరికి వారే ఒంటరిగా ఉంటున్నారు. ఆమె మనను కన్నతల్లి, ముసలితనంలో ఉంది. ఆమె బాగోగులు చూసుకోవాలి. ఆమె తిన్నదా? పన్నదా? ఆమె ఏం చేస్తుంది అని చూసేవాళ్ళు, పలకరించేవాళ్లు, ఎవ్వరు ఉండరు. కానీ చనిపోయిన తర్వాత అందరు వచ్చి మాట్లాడుతున్నారు. మల్లవ్వలో జీవం లేదు. మల్లవ్వ పట్ల ఎంతో ఆప్యాయత కురిపిస్తున్నారు. ఇది నిజమైన ఆప్యాయత అవునా? కలవరం కలిగిస్తుంది. బతికున్నప్పుడు తను మాట్లాడాలనుకున్నా ఎవ్వరు కనబడలేదు అనే వాస్తవాన్ని సమాజం యొక్క స్వరూపాన్ని, జీవన తాత్వికతను బయటపెడుతున్నారు. ఆమె చావులో అందరూ పాల్గొంటున్నారు. అందరు  ప్రేమతో  సంభాషిస్తున్నారు, బతికున్నప్పుడు ఎవ్వరు కనపడలేదు అనే వాస్తవాన్ని కవి దేవేందర్ వ్యక్తపరిచిన తీరు చక్కగా ఉంది.

‘ఇపుడు అందరు చెవిలో పిలుస్తున్న

తాను పర లోకంలో..

దింపుడు కళ్ళం వేడుకలో పాల్గొని అందరు చెవిలో పేరు పెట్టి పిలుస్తున్నారు. తాను పర లోకంలో ఉంది. చనిపోయిన వ్యక్తి పట్ల జరుగుతున్న తతంగాన్ని, జీవన వాస్తవాన్ని లోకం యొక్క నైజాన్ని కవి దేవేందర్ ఎండగడుతున్నారు.

‘దింపుడు కళ్ళం ఆశా తెగిపోయింది’

దింపుడు కళ్ళంలో పాల్గొని ఆమె చెవిలో పిలిస్తే పలుకుతుందనే ఒక ఆశ ఉంది. కాని ఆ ఆశ నుండి దూరంగా ఆమె జీవం పరలోకం లోకి చేరింది. అలాంటి ఆశ వ్యర్థమైన ప్రయాస అని తెలియజేస్తున్నారు. తెగిన  బంధం లాగానే దింపుడు కళ్ళంలో బతికి వస్తుందనే ఆశ తెగిపోయింది అనే నిజాన్ని గుర్తు చేయడం చక్కగా ఉంది.

‘డప్పు చప్పుల్ల మధ్యన దిగులు మేఘాలు’

శుభకార్యాల్లో డప్పులు మోగుతుంటాయి, అశుభకార్యాల్లో డప్పులు మోగుతుంటాయి. చావు డప్పులు వింటే ఎవరో పోయారు అనే బాధ కలుగుతుంది. డప్పు చప్పుల్ల మధ్యన దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. దిగులు మేఘాలు ఏం చేస్తాయి? దుఃఖపు వానను కురిపిస్తాయి. అంతిమయాత్రలో దుఃఖపు వాన కురుస్తుంది అని తెలియజేస్తున్న భావం చక్కగా ఉంది.

‘కన్నీళ్ల నయనాలతో కడసారి చూపులు’

అంతిమయాత్రలో పాల్గొన్న వాళ్లు కళ్ళలో కన్నీళ్లు నింపుకొని చివరి చూపులు చూస్తున్నారు. ఇక ఆమె కనిపించదు. కనిపించకుండా అందరాని లోకాలకు ఆమె వెళ్లిపోయింది.

‘ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టె పేరుస్తున్నారు’

అంతిమయాత్రలో పాల్గొన్న వాళ్లు ఒక్కొక్కరు చితి మీదకు ఒక్కొక్క కట్టె తెచ్చి పేరుస్తున్నారు.

‘కనపడని లోకాలకు ఆమె అగ్గిలో వెళ్లిపోయింది’

పాడె మోస్తున్న ఆ నలుగురు  ఆమె శవాన్ని చితి మీదకు చేర్చారు. ఆమె బంధువు ఆమె చితికి నిప్పు అంటించారు. మంటలు ఎగసిపడుతున్నాయి. ఆమె కనబడని లోకాలకు ఆగ్గిలో వెళ్లిపోయింది. కాలిన శవం ఎక్కడికి చేరుతుంది? అగ్ని జ్వాలల్లోకి చేరి ఆమె చివరికి పిడికెడు బూడిదగా మారిపోతుంది. ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్న బంధువులు, అందరు తమ తమ నెలవులకు పయనమయ్యారు.

అన్నవరం దేవేందర్ చావులో భాగమైన దింపుడు కళ్లం కవితలో వ్యక్తపరిచిన భావాలు చక్కగా ఉన్నాయి. సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ కవిత. దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version