[శ్రీ దుర్గమ్ భైతి గారి ‘కట్టు బానిస’ అనే కవితను విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, ప్రభుత్వ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు, దుర్గమ్ భైతి కలం నుండి జాలువారిన ‘కట్టు బానిస’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది.
‘కట్టు బానిస’ కవితలోని భావాలు నా మనసును ఆలోచింపజేసాయి. బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి. దశాబ్దాల పాటు నిజాం పాలనలో అణిచివేతకు గురైన బలహీన కులాల వారిని యజమానులు వెట్టి చాకిరి చేయించుకునే వారు. వారిని బానిసలుగా చూసేవారు. వారి వద్ద పని చేసే వారు ‘అయ్యా బాంచన్ (బానిసను) మీ కాల్మొక్త’ అని వేడుకొనేవారు. కట్టు బానిసత్వం విధానాలతో భూస్వాములు, పెత్తందారులు మానవ హక్కులకు విఘాతం కలుగజేసే వారు. మానవులను కట్టు బానిసలుగా చేసుకొని తరతరాలుగా వారి స్వాతంత్ర్యాన్ని హరించేవారు. The right against exploitation దోపిడిని నివారించే హక్కు రాజ్యాంగంలో కల్పించబడింది. అప్పు తీర్చలేక ఉచిత శ్రమకు కట్టుబడడం, వెట్టి చాకిరీ చేయడం మన దేశంలో కొనసాగుతున్నాయి. భారతదేశంలో వెట్టిచాకిరీపై చట్టబద్ధమైన నిషేధం ఉన్నప్పటికీ ఇప్పటికీ అది కొనసాగుతుంది. పిల్లలు, మహిళలు, ప్రత్యేకించి దళితులు వెట్టిచాకిరీకి బలవుతున్నారు. క్వారీల్లోను, కార్ఖానాల్లోను, బియ్యం మిల్లుల్లోను, ఇటుక బట్టీల్లోను వెట్టి సమస్య తీవ్రంగా ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ పెద్దలే తమ పిల్లలను బలవంతంగా పనుల్లోకి పంపుతున్న పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. అమాయకులైన చిన్నారులు పలు రకాలుగా దోపిడీలకు, వేధింపులకు గురవుతున్నారు. వెట్టి కార్మికులకు స్వేచ్ఛ అనేది ఉండదు. యజమాని కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. యజమాని చెప్పిన పని చేయకపోతే కొన్ని సందర్భాల్లో వారిని గదిలో పెట్టి బంధించడం జరుగుతుంది. గ్రామాల్లో బానిసత్వం ఎక్కువగా ఉంది. అప్పు తీర్చకపోతే పిల్లల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న సంఘటనలు ఇప్పటికీ గ్రామాల్లో మనకు కనబడుతాయి. ‘కట్టు బానిస’ కవిత గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? దుర్గమ్ భైతి కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.
‘తొలి సూరు మగ బిడ్డ పుట్టగానే
కోటి నోములు ఫలించాయని
బాలింత తల్లి మురిసిపోతుంది.’
తొలి సూరు అనగా స్త్రీకి మొదటి సారిగా కలిగిన కాన్పు. నోము అనగా సంకల్పం. ఇది చేయవలెను అని అనుకొనుట. వ్రతాలు, నోములు ఆచరించడం ద్వారా కోరిన కోరికలు సిద్ధిస్తాయి అని జనాలు నమ్ముతారు. నోములలో నిగూఢమైయున్న మొదటి ధర్మం వితరణం. వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, దాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడం. మనసుని కేవలం భగవంతునిపైనే లగ్నం చేసి స్వామిని పూజించుట మరియు ధ్యానము చేయుట నోము. నోము దేవతలను ఆరాధించడానికి చేసే ఆచారం. నోము నోచి దేవుని ఆశీస్సులు పొందడం, దేవుని ఆశీర్వాదం కోసం కృతజ్ఞతలు తెలియజేయడం, ఆపద సమయంలో దేవుని సహాయం కోరడం, ఏదైనా తప్పు జరిగితే క్షమాపణలు కోరడం మొదలైన వివిధ ప్రయోజనాల కోసం నోములు నిర్వహిస్తారు. బాలింత అనగా అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి. సంతానం కలగాలని కోరుకుంటూ తల్లిదండ్రులు నోములు, వ్రతాలు నోచుకుంటారు. మొదటి సంతానం మగ పిల్లవాడు పుట్టగానే తాము నోచిన కోటి నోములు ఫలించాయని సంబరాలు జరుపుకుంటారు. మగ పిల్లవాడికి జన్మనిచ్చిన తల్లి సంతోషంతో మురిసిపోతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘పిల్లోడు పెద్దోడై చేతికందోస్తాడని
తండ్రి ఖుషీగా దావత్ లిస్తాడు.’
తండ్రి తన కుటుంబంలో మగ పిల్లవాడు కలిగినాడు అని ఒక రకమైన గొప్ప అనుభూతితో మరియు ఆనందంతో తబ్బిబ్బు అవుతాడు. అట్టి మగ పిల్లవాడు పెరిగి పెద్ద వాడుగా ఎదిగి కుటుంబానికి కొండంత అండగా ఉంటాడని, తనకు వ్యవసాయ పనుల్లో చేతికి అంది వచ్చి చేదోడు వాదోడుగా ఉంటాడని తండ్రి ఆశించడం సహజం అనిపిస్తుంది. తండ్రి కొడుకు పుట్టగానే ఏదో తెలియని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. తండ్రి కొడుకు పుట్టిన ఆనందంలో గ్రామస్థులు అందరిని పిలిచి విందులు, వినోదాలు, వేడుకలు ఏర్పాటు చేస్తాడు అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
‘తొట్టెలో ముసి ముసిగా నవ్వుతూ
కేరింతలు కొట్టే పసి గుడ్డుకు తెల్వదు
తొక్కుడు బండకు పునాది రాయినని
తోబుట్టువులు పుట్టేంత వరకే తన
సంబరాలని బుజ్జిగాడికేమి తెలుసు.’
పసి పిల్లలను తొట్టెలో పడకోబెట్టుతారు. పిల్లవాడు ఆనందంతో కేరింతలు కొడతాడు. పిల్లవాడు అమ్మ ఒడిలో చేరి కేరింతలు కొట్టడం చూడ చక్కగా మనోహరంగా ఉంటుంది. తొట్టెలో ముసి ముసి నవ్వులు రువ్వుతూ కేరింతల సందడి చేస్తున్న పసి పిల్లవాడికి తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. తొక్కుడు బండ ఇంటి ముందు ద్వారం దగ్గర ఉంటుంది. తొక్కుడు బండ మీద అడుగు వేసిన తర్వాతనే ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. తొక్కుడు బండను అందరు తొక్కుతూ నడుస్తారు. తొక్కుడు బండను ఎందరు తొక్కినప్పటికి ఓర్పుతో, సహనంతో ఉంటుంది అని చెబుతారు. మొదట పుట్టిన పిల్లవాడు తొక్కుడు బండకు పునాది రాయి అని అంటున్నాడు. మొదట పుట్టిన వ్యక్తి ఎంత ఒత్తిడి ఉన్న తొక్కుడు బండవలె సహనంతో కష్ట పడతాడు.ఎన్ని కష్టాలు ఎదురైనా ఓపికతో భరిస్తాడు.మొదట పుట్టిన వాడు తొక్కుడు బండతో సమానం అంటారు. మొదట పుట్టిన వాడు కాబట్టి అతను కుటుంబం యొక్క, తల్లిదండ్రుల, తమ్ముళ్ళ, చెల్లెళ్ళ బాధ్యతను చేపట్టి కష్టాలకోర్చి సహనంతో అన్ని భరిస్తాడు. మొదటి పిల్లవాడు పుట్టగానే సంబరాలు ఉత్సాహంతో జరుపుకున్నారు. కాని తోబుట్టువులు పుట్టిన తర్వాత తనకు సంబరాలు ఉండవని బుజ్జిగాడికి ఏమి తెలుసు? అని ప్రశ్నిస్తున్న తీరు అద్భుతంగా ఉంది.
‘ఇంటికి పెద్దోడినని పసి వయసులోనే
పని మనిషి ముసుగు వేసి బంధిస్తారు.’
పెంపుడు జంతువులను మరియు జంతు ప్రదర్శనశాలలో పులులు, సింహాలను ప్రమాదకరమైనవి కాబట్టి బోనులో తాళాలు వేసి బంధిస్తారు. న్యాయస్థానాలు ఘోరమైన నేరాలు చేసిన మనుషులకు శిక్ష విధించి జైలులో బంధిస్తారు. జైలులో కూడా నేరస్థులను బంధించడం ఒక విధమైన బోనులో వేసి బంధించడం లాంటిది అని చెప్పవచ్చు. లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే తెర ఒక రకంగా ముసుగు వంటిదే. కుటుంబంలో ఇంటికి పెద్ద కుమారుడిగా జన్మించిన వారిని తండ్రి చిన్నతనంలోనే పనులు చేయడానికి పని మనిషి అనే పేరు మీద ముసుగు తొడిగి బంధిస్తాడు అనేది వాస్తవం.
తండ్రి తనతో పాటుగా పెద్ద కుమారుని పని మనిషి వలె భావించడం, పనులు చేయించడం జరుగుతున్నది. తండ్రి తనతో పాటు చిన్న పిల్లవాడు అయిన పెద్ద కుమారుడిని పని మనిషి వలె పనులు చేయించ కూడదు అని తెలిసినప్పటికీ వేరే పని మనిషిని పెట్టుకునే స్తోమత లేక, పని మనిషికి జీతం ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి తన పెద్ద కుమారునికి ఎలాంటి జీతభత్యం చెల్లించవలసిన అవసరం ఉండదు. పెద్ద కుమారుడితో ఉచితంగా పని చేయించుకోవచ్చు అనే ఉద్దేశ్యముతో తన వెంట పనులకు తీసుకు వెళ్ళుతున్నాడు. తండ్రి తన పెద్ద కుమారుడిని పని మనిషి ముసుగు వేసి బంధిస్తాడు అని చెప్పిన తీరు బాగుంది. లోకంలో జరుగుతున్న వాస్తవ స్థితి తండ్రి కుమారుని పట్ల చూపిస్తున్న ధోరణి మనకు అవగతమవుతున్నది. సమాజంలో తండ్రి పెద్ద కుమారున్ని పని మనిషి ముసుగు వేసి బంధించడం అనేది అందరు ఎరిగినదే.
‘ముందు పుట్టిన పాపానికి త్యాగాన్ని
నూరి పోసి తక్కెడ బతుకును చేస్తారు.’
పాపం సాధారణంగా చర్యలుగా పరిగణిస్థారు. అనైతికంగా, స్వార్థపూరితంగా, అవమానకరంగా, హానికరంగా లేదా పరాయీకరణగా పరిగణించబడే ఏదైనా ఆలోచన, పదం లేదా చర్య పాపం అని పిలవబడుతుంది. త్యాగం అనగా దేవతా పూజలో తనకు చెందిన ఆస్తులను లేదా జంతువులను ఇవ్వడం. భగవద్గీతలో త్యాగం అనేది ఒకరి కర్మల ఫలాన్ని విడిచి పెట్టడాన్ని సూచిస్తుంది. త్యాగం అనేది నిర్మోహమాటంగా వదులుకోవడం. ప్రియమైన వారి కోసం త్యాగం చేయడం, తప్పనిసరిగా ఎవరైనా వారి సొంత కోరికతో మరియు బయట శక్తి ద్వారా ఎటువంటి బలవంతం లేకుండా చేసే పని త్యాగం. త్యాగానికి చోదక శక్తి ప్రేమ లేదా భక్తి. ప్రేమ అనేది బంధుత్వంతో ముడివడి ఉంటుంది. త్యాగం ప్రియమైన వారి కోసం ఖరీదైన దాన్ని వదులుకోవడం. తల్లిదండ్రుల తొలి సంతానం కావడం వల్ల కుటుంబ భారం అతనిపై పడుతుంది. అతనికి తల్లిదండ్రులు కుటుంబం కొరకు కష్టపడాలి. నీవు కష్టపడితేనే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు జీవితంలో బాగుపడతారు. నీవు కుటుంబాన్ని ఆదుకోవాలి అని నీతిని బోధిస్తారు. కుటుంబ శ్రేయస్సు కొరకు పాటుపడడం త్యాగం అంటారు. త్యాగం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తారు. అతని బ్రతుకు తరాజు వలె ఊగిసలాడుతుంది అని కవిత ద్వారా తెలియజేస్తున్నారు
‘తమ్ముళ్ళు,చెల్లెళ్ళు తల్లి చాటు బిడ్డలై
అమ్మ ఒడిలో హాయిగా ఆటలాడుతుంటే
తాను అయ్య నీడన బాధ్యతలు చేపట్టీ
కోపమొచ్చిన అయ్య కొరుకుడు మాటలు పడేది తనే
చిన్నోళ్ళ ఆకతాయి అల్లరి పనులకు
అమ్మతో ఓర్పుగా మాటలు పడేదీ తనే
వయసుకు మించిన బరువులు మోస్తూ
కుటుంబానికి కట్టు బానిసై చాకిరీ చేసినా
కనీస విలువ లేని కరివేపాకు లాంటోడు
అమ్మ ప్రేమకు నోచుకోని అభాగ్యుడు.’
కుటుంబంలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తల్లి చాటు బిడ్డలుగా అమ్మ ఒడిలో చేరి ఆటలు ఆడుతూ హాయిగా ఆనందంగా బాల్యాన్ని గడుపుతున్నారు. తాను మాత్రం కుటుంబంలో పెద్ద వాడైనప్పటికీ అమ్మ చాటున చేరి తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వలె హాయిగా ఆనందంగా ఆటలు ఆడుకోవాలని మనసులో తనకు కూడా కోరిక ఉంటుంది. కుటుంబంలో పెద్దవాడు అయినందున తాను బాల్యాన్ని కోల్పోతున్నాడు. తాను కుటుంబంలో పెద్దవాడు అయినందుకు అయ్య వెంట వ్యవసాయ పనులకు వెళ్ళుతూ కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడు. తండ్రి అలసిపోయి కోపం వచ్చినప్పుడు పెద్ద వాడు అయిన తననే తిట్టడం, చేయని తప్పులకు మాటలు అనడం కూడా తననే అని చెబుతున్నాడు. కుటుంబంలో చిన్నవాళ్లు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చేసే ఆకతాయి అల్లరి పనులకు వారిని ఏమీ అనరు. కుటుంబంలో పెద్దవాడిని అయినందున చేయని తప్పుకు అమ్మతో మాటలు పడేది కూడా తానే. కుటుంబానికి పెద్దవాడిని అయినందుకు వయసుకు మించిన బరువులు మోస్తూ కుటుంబం కొరకు పాటుపడుతున్నది తానే మరియు కట్టు బానిసలా చాకిరీ చేస్తున్నది కూడా తానే అయినప్పటికీ కుటుంబంలో కనీస విలువ లేని కూరలో వేసిన కరివేపాకులా తనను భావిస్తారు. కుటుంబంలో పెద్దవాడిని అయినందుకు అమ్మ ప్రేమకు నోచుకోని దురదృష్టవంతుడిని అని బాధపడుతున్నాడు.
‘నాన్నలా కుటుంబానికి నడత నేర్పినా
అవసరాలు తీరాక అయిన వారి కుతంత్ర
అవకాశవాదానికి బలైన అమాయక జీవి.’
నాన్న అంటే స్వార్థం లేని అభిమానం. నాన్న అంటే ఆవేశం లేని ఆలోచన. నాన్న అంటే నమ్మకంతో కూడిన బాధ్యత. నాన్న అంటే ముందు చూపు నేర్పిన మనీషి. నాన్నంటే నిజ జీవితాన్ని నేర్పిన గురువు. నాన్న అంటే దశ దిశ చూపిన మార్గదర్శి. కుటుంబంలో సంతానానికి కారకులు తల్లిదండ్రులు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రిదే అని భావిస్తారు. పిల్లలు చిన్న వయస్సులో తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలకు నిలయాలు. ఆ కుటుంబాలకు లేమి అనే పదానికి తావు ఉండేది కాదు. కష్టసుఖాలను పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటు ఉండేది కాదు. నడత అనగా నడవడి ప్రవర్తన. మంచి అలవాట్లు కలిగి ఉండుట. ఆచరించే విధానం నడత. కుతంత్రం అనగా ముందుగా వ్యూహరచనతో చేసే మోసం, పన్నాగం. మంచి చెడు జ్ఞానం లేని వాడు అమాయకుడు. లోకజ్ఞానం గురించి ఏమీ తెలియనివాడు అమాయకుడు. నాన్న తర్వాత కుటుంబంలో పెద్ద కుమారుడు నాన్న లాంటివాడిగా భావిస్తారు. నాన్న లాగే కుటుంబానికి పెద్ద కుమారుడు మంచి అలవాట్లతో పెరిగినాడు. కుటుంబంలోని వారికి మంచి నడవడిని నేర్పినాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమ అవసరాలు తీరిపోయినాక అన్న తమ కుటుంబానికి చేసిన మేలును మరిచిపోయినారు. కుటుంబ సభ్యుల అవకాశవాదానికి ఇంటికి పెద్దవాడు అమాయకంగా బలి అయిపోవడం విషాదంగా తోస్తుంది.
‘తిన్నరేవు కలవని తోబుట్టు రాబందుల
పాదాలకు అణుగుతున్న తొక్కుడు బండ.’
ఆకలి ఉన్న వాడికి అన్నం పెడితే అన్నం తిని చల్లగా ఉండు అని దీవిస్తారు. కుటుంబం కొరకు అహోరాత్రులు తండ్రి వెనుక తండ్రి వలె శ్రమించి తమ్ముళ్ళను, చెల్లెళ్ళను వాళ్ళ జీవితాలను చక్కదిద్దినాడు. తిన్న రేవు తలవని తోబుట్టువు రాబందుల పాదాలకు అణుగుతున్న తొక్కుడు బండ కింద కుటుంబానికి పెద్దవాడు అయిన అతడు నలిగిపోవడం బాధను కలిగిస్తుంది. కుటుంబానికి పెద్ద కుమారుడు ధారవోసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. అతడు ఎంతో కష్టపడి శ్రమించినా అతని శ్రమను ఎవరు గుర్తించడం లేదు. కుటుంబం కొరకు శ్రమించిన పెద్ద కుమారుని బ్రతుకు ‘కట్టు బానిస’ బతుకుగా సమాజంలో మారడం తీవ్రమైన విషాదంగా తోస్తోంది.
‘కట్టు బానిస’ కవితను రాసిన దుర్గమ్ భైతిని అభినందిస్తున్నాను. మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.