Site icon Sanchika

జ్ఞాపకాలలో తండ్రిని సజీవంగా నిలిపే ప్రయత్నం – ‘మా బాపు ఎర్రోజు పాపయ్య’ కవిత

[ప్రముఖ కవి, ప్రిన్సిపల్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నిర్మల్, ఎర్రోజు వెంకటేశ్వర్లు కలం నుండి జాలువారిన ‘బ్లాక్ బోర్డు’ కవితా సంపుటి లోని ‘మా బాపు ఎర్రోజు పాపయ్య’ కవితపై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు నరేంద్ర సందినేని.]

[dropcap]‘మా[/dropcap] బాపు ఎర్రోజు పాపయ్య కవిత ఏమిటి?’ అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ఈ కవిత వెంకటేశ్వర్లు తండ్రి పాపయ్య స్మృతిలో రాయబడింది. మనం భూమి మీదకు రావడానికి ప్రత్యక్ష కారకులు తల్లిదండ్రులు అని చెప్పడంలో సందేహం లేదు. తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలు అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అని మన సంస్కృతి చెపుతుంది. ప్రత్యక్ష దైవాల్లో ఒకరైన తండ్రి పాపయ్య స్వర్గస్థులయ్యారు. తండ్రి అంటే వెంకటేశ్వర్లకు ప్రాణం. తండ్రి స్మృతిలో కవితను రాయడం చాలా సంతోషంగా ఉంది. సాహిత్యంలో అమ్మ గురించి రాసిన కవితలు, గేయాలు, పద్య కావ్యాలు ఎక్కువగా ఉన్నాయి. నాన్న గురించి ఇప్పుడిప్పుడే కొందరు కవులు కవితలు రాస్తున్నారు. అమ్మ ప్రేమ మధురం అని అందరికీ తెలుసు. నాన్న ప్రేమను గుండెల్లో దాచుకుని గంభీరంగా ఉంటారు. అమ్మలాగే పిల్లల పట్ల నాన్నకు కూడా ప్రేమ ఉంటుంది. అమ్మలాగే నాన్న హృదయంలో పిల్లల పట్ల ప్రేమ పొంగి పొరలుతుంది. వెంకటేశ్వర్లు నాన్న పట్ల గల ప్రేమను భావాల్లో వ్యక్తపరిచి మనకు కవిత రూపంలో అందించారు.

నాన్న జీవితంలో కుటుంబం కొరకు సమాజం కొరకు ఎంతో బాధ్యతగా మెదలడం మన అందరికీ తెలుసు. వెంకటేశ్వర్లు నాన్న లేని లోటును తలుచుకొని బాగా తపించి నాన్న పై రాసిన కవితలో నాన్నను చూసుకున్న తీరు అద్భుతం. వెంకటేశ్వర్లు బాపు పాపయ్య ఎంత బాధ్యతగా మెదిలాడో కవిత చదువుతుంటే మన కళ్ళలో అశ్రుధారలు దొరలుతాయి. ఇవాళ ఈ కలియుగంలో అమ్మానాన్నలను ప్రేమించే వాళ్ళు అరుదుగా ఉంటారు. నాన్న పట్ల గల ప్రేమను నాన్న జీవితంలోని ఘట్టాలను కవితలో అద్భుతంగా వ్యక్తం చేశారు. కవితలోని భావాలు అక్కడక్కడ వచనంలా అగుపిస్తాయి. వెంకటేశ్వర్లు నాన్న గురించి రాయడం మీద శ్రద్ధ పెట్టినట్లుగా భావాల పైన కొంత దృష్టి పెట్టినట్లయితే కవితను ఇంకా బాగా తీర్చిదిద్దడం జరిగి ఉండేది. వెంకటేశ్వర్లు బాపు పట్ల గల అవ్యాజమైన ప్రేమకు కవిత లోని భావాలు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆనాటి తండ్రులు ఎంతో బాధ్యతగా ఎంతో మెలకువగా ఉండి కుటుంబాన్ని కాపాడుకున్నారు. ఎంతో విలువలతో బతికారు. బాపు పాపయ్య కృషిని వెంకటేశ్వర్లు సరిగ్గా అర్థం చేసుకున్నారు. బాపు లేకపోయినప్పటికి బాపు ఉన్నట్లుగా కవితలోని భావాలు పలికించిన తీరు అపూర్వం అని చెప్పవచ్చు. వెంకటేశ్వర్లు బాపు పాపయ్యను కవితలో సజీవం చేశారు. కవిత గుండెలకు హత్తుకునేలా ఉంది. అమ్మ ఆకాశం అయితే నాన్న భూమి. ఆకాశం, భూమి ఒక్కటై మనకు తల్లిదండ్రుల రూపంలో అగుపిస్తారు.

‘తీగెకు ప్రాణమయ్యే పందిరిగుంజ

హటాత్తుగా కూలినట్లు

మా బాపు తల్లిదండ్రుల్ని బాల్యం లోనే

అమాంతం మింగేసింది విధి’

తీగెకు ప్రాణం పందిరిగుంజ. పందిరిగుంజ కూలిపోతే పందిరి తన ఉనికిని కోల్పోతుంది. పల్లెలో ప్రతి ఇంటి ముందర పందిరి ఉంటుంది. పందిరి ఒక వేడుకగా చెప్పవచ్చు. పందిరి కింద మంచం వేసుకొని కూర్చొని ముచ్చట్లలో పడి ఒక రకమైన తన్మయత్వంకు లోనవుతారు. పందిరిగుంజకు మల్లె తీగ ఉంటే పందిరి నిండా పరుచుకుంటుంది. మల్లె పూలు సువాసనలు వెదజల్లుతాయి. పందిరిగుంజ హఠాత్తుగా కోల్పోతే పందిరి ఉండదు. పందిరిని ఆధారం చేసుకుని ఎదిగిన మల్లెతీగకు ఆధారం లేక కింద పడిపోతుంది. పాపయ్య తీగకు ప్రాణమైన పందిరిగుంజలాంటి తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయాడు. పాపయ్య తల్లిదండ్రులు లేకుండా పెద్దనాన్న ఇంటిలో పెరిగాడు. పాపయ్య ఎన్ని కష్టాలు, బాధలు అనుభవించాడో చెప్పనలివి కాదు. తండ్రి యొక్క చిన్నతనంను కవితలో వ్యక్తం చేయడం చక్కగా ఉంది.

‘ఐనా బతుకు బండి నీడ్చుకొస్తున్న బాపుకు

సర్కారు డాక్టర్ల నిర్లక్ష్యపు తాటిపండు పడి

ఓ కన్ను చిట్లిపోయింది’

బతుకు అంటే జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన. బతుకు కొరకు జరిగే పోరాటంలో జీవితం మరియు ఆశ ఉంది. బండి సవ్యంగా ప్రయాణించాలంటే బండికి గల రెండు చక్రాలు సవ్యంగా సాగితేనే బండి నడుస్తుంది. అలాగే బతుకు బండి కూడా సక్రమంగా సాగడానికి రెండు చక్రాలు లాగే రెండు కళ్ళు కూడా అవసరం. పేదరికంలో బతుకు బండి సాగిస్తున్న బాపుకు కన్నుకు సంబంధించిన వ్యాధి సోకింది. ఆ రోజుల్లో పేద వాళ్లకు ప్రభుత్వ దావఖానాలే దిక్కు. ప్రభుత్వ వైద్యులు సరిగా పనిచేసేవారు కాదు. పేషెంట్లను సరిగా శ్రద్ధగా చూసే ఓపిక వారిలో ఉండేది కాదు. ఈ రోజుల్లో కూడా పేదరికంలో గడుపుతున్న వాళ్లకు ప్రభుత్వ ఆసుపత్రులే శరణ్యం. డాక్టర్ల నిర్లక్ష్యపు తాటిపండు పడి ఓ కన్ను చిట్లిపోయింది. ఒక కన్ను లేకపోయినప్పటికి పాపయ్య ధైర్యంతో జీవితాన్ని గుండె దిటవుగా చేసుకొని గడిపాడు.

‘కోల మొహం నున్నటి గుండు నుదుట బొట్టు

ఒక కన్ను,కువ్వారం లేని నవ్వు’

బాపు పాపయ్య ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నాడు. కోల మొహం కలిగిన బాపుకు నున్నటి గుండు ఉండేది. బాపు నుదుట బొట్టు పెట్టుకునే వాడు. నుదుట బొట్టు పెట్టుకున్న వారిని చూసినప్పుడు ఎదుటివారిలో వారికి తెలియకుండానే పవిత్ర భావనలు కలుగుతాయి. బొట్టును రెండు కనుబొమ్మల మధ్య పెట్టడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మన శరీరం మొత్తం కనుబొమ్మల మధ్య విద్యుత్ శక్తి తరంగాల రూపంలో కేంద్రీకృతమై నిబిడీకృతమై ఉంటుంది. పూర్వకాలం నుండి బొట్టును పెట్టుకునే ఆచారం కొనసాగుతున్నది. బాపు ఒక కన్నుతోనే జీవితం గడిపాడు. కువ్వారం లేని నవ్వు పాపయ్య ముఖంలో మెరుస్తూ ఉండేది. కువ్వారం అంటే కపటం లేకుండా ఉండటం. ఇవాళ మనకు కపటం గల వ్యక్తులు అడుగడుగునా తారసపడుతుంటారు. కపటం లేని వారిని గోమాతతో పోల్చవచ్చు. పాపయ్య కపటంలేని నిష్కల్మషమైన వ్యక్తి అని తెలుస్తుంది. కపటం లేని వాళ్లు అరుదుగా ఉంటారు. కపటం లేని వారిని చూస్తే మనలో ప్రశాంతత నెలకొంటుంది.

‘ఉంగరం వేలికి ప్రతి ఉగాది నాడు

చేసి పెట్టుకునే రాగి ఉంగరం

కాలికి వెండి బేడి’

ఉంగరం వేలికి ప్రతి ఉగాది రోజున పాపయ్య కొత్త రాగి ఉంగరం తయారుచేసి పెట్టుకునేవాడు మరియు కాలికి వెండిబేడి ధరించేవాడు. పల్లెల్లో మగవారు తమ కాలికి వెండిబేడి ధరించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. చాలామంది చేతులకు రాగి ఉంగరం ధరిస్తారు. కొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి ఉంగరం ధరిస్తారు. చాలా కోప స్వభావం ఉన్నవారు రాగి ఉంగరాన్ని ధరిస్తే క్రోధం అదుపులో ఉంటుందని వేద శాస్త్రంలో చెప్పబడింది. రాగి ఉంగరం ధరించడం వల్ల చెడు ప్రభావం తగ్గుతుంది. రాగి ఉంగరం వ్యక్తి లోని చెడుచింతలను తొలగించి సానుకూల అనుభూతిని కలిగిస్తుందని చెబుతారు. రాగి ఉంగరం ధరించడం మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. రాగి లోహం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో శక్తిని పెంచుతుంది. రాగి ఉంగరం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో రక్తప్రసరణకు ఎంతో మేలు కలిగిస్తుంది.

రాగి ఉంగరం వ్యాధి నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రాగి ఉంగరం శరీరంలోని మలినాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రాగి ఉంగరం ధరించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రాగి ఉంగరం శరీరంలోని రక్తపోటును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. రాగి ఉంగరం గుండె ఆరోగ్యానికి మరియు గుండెకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వెండి బేడి ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతారు.

‘కుట్టించి తొడుక్కున్న నూలు బనీన్ కు

ముందట పెద్ద జేబు

సింగులతో కట్టిన దొడ్డు దోతి

మెడల పెద్ద సెల్లా..

ఇదీ మా నాన్న బోలా రూపం..’

ఆనాడు తండ్రి పాపయ్య బతికి ఉన్నప్పుడు సాధారణమైన బట్టలు ధరించేవాడు. ఎంతో సాధారణమైన జీవితం గడిపాడు. ఆ కాలంలో రెడీమేడ్ బనీన్లు పల్లెల్లోకి ఇంకా ప్రవేశించలేదు. పాపయ్య తెల్లబట్ట కొనుక్కొని మేర వాళ్ళతో కుట్టించి తొడుక్కున్న బనీనుకు ముందట పెద్ద జేబు ఉండేది. దొడ్డు దోతి కట్టుకునేవాడు, మెడలో పెద్ద సెల్లా వేసుకునేవాడు. మా నాన్న యొక్క రూపం ఇలా ఉండేది అని గుర్తు చేస్తున్నాడు. పల్లెల్లో పేదరికంతో గడుపుతున్న జనాలు, తెల్ల బట్టతో కుట్టించుకున్న బనీన్‌కు ముందట పెద్ద జేబు, దొడ్డు దోతి, మెడలో పెద్ద తువ్వాల, నెత్తిన రుమాలు ధరించేవారు. మారిన సామాజిక పరిస్థితులు వల్ల పల్లెల్లో నివసించేవారిలో వస్త్రధారణలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రెడీమేడ్ బనీన్లు మరియు లుంగీలు కడుతున్నారు.

‘సన్నపు పని వచ్చినా చూపు చాలక

వెండి కడియాలు బేడి మట్టెలు ముక్కు పుల్లలు..

ఎల్లమ్మ జాతరకు కండ్లు తాయెత్తులు..

పీరీల పండుగప్పుడు పీరీలకు ప్రాణం పోస్తూ..

దొడ్డు పని చేసుకుంటూ

కుటుంబాన్ని భుజాన మోశాడు’

విశ్వకర్మలు అంటే పంచ కులాలు అంటారు. అందులో నగలు చేసేవారిని అవుసుల వాళ్లు అంటారు. పాపయ్య నగలు చేసే పనిలో నిపుణుడు. నగలు చేయాలంటే చూపు సరిగా ఉండాలి. మనిషి రెండు కళ్ళు ఉంటేనే సరిగా చూడగలుగుతాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఒక కన్ను చిట్లిపోయింది. కుల వృత్తి నగలు చేసే పని. అందుకే నగల పని చేసే వృత్తి ధర్మంను కొనసాగించాడు. ఒక కన్నుతోని సన్నపు బంగారు పనులు చేయడం సాధ్యం కాదు. అందుకే పాపయ్య దొడ్డు పనులైన వెండి కడియాలు, బేడి మట్టెలు, ముక్కు పుల్లలు, ఎల్లమ్మ తల్లి జాతరకు కండ్లు తాయెత్తులు కోరిన వారికి తయారుచేసి ఇచ్చేవాడు. పీరీల పండుగప్పుడు పీరీలకు అవసరమైన వాటిని తయారు చేస్తూ పీరీలకు ప్రాణం పోసేవాడు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఒక కన్ను లేకున్నప్పటికీ మిగతా దొడ్డు పనులు చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని మోసాడు.

‘కోరికల నోరు గట్టిగా కుట్టి

కష్టాల కుంపట్లో సొక్కపు వెండిలా మెరిశాడు’

మానవుని కోర్కెలు అనంతం. కోరికలే దుఃఖానికి మూలం అన్నాడు బుద్ధుడు. అలాంటి కోరికలను తన తండ్రి అదుపులో పెట్టుకున్నాడు. మానవ జీవితంలో కష్టాలు అనేకం ఎదురవుతుంటాయి. పాపయ్య కష్టాల కుంపటిలో తనను తాను కాల్చుకుంటూ బతుకును సాగించి సొక్కపు వెండిలా మెరిశాడు.

‘చెప్పలేదంటనకపొయ్యేరు..

ఏ కులమని నను వివరమడిగితే..

బ్రహ్మంగారి సిద్ధయ్యగారి.. పాటలు పద్యాలే

చుట్టుపక్కల వాళ్లకు సుప్రభాత గీతాలయ్యేవి’

చెప్పలేదంటనకపొయ్యేరు జనులారా మీరు, ఏ కులమని నను వివరమడిగితే ఏమని తెలుపుదు లోకులకు పలుగాకులకు అనే బ్రహ్మంగారి, సిద్దయ్య గారి పాటలు పద్యాలతో పాపయ్య చక్కటి కంఠంతో శ్రావ్యంగా పాడుతుండేవారు. చుట్టుపక్కల వాళ్లకు పల్లెలోని జనాలకు పాపయ్య పాటలు పద్యాలు మేలుకొలుపులు అయ్యేవి. పల్లెలో కోడికూతతో జనాలు లేస్తారు. కాని ఆ పల్లెలో పాపయ్య పాటలు పద్యాలతో జనాలను లేపే సంస్కారం అలవర్చుకున్నాడు.

‘చెప్పుల్లేకుండానే మడికట్ల నుంచి

ముళ్ల తొవ్వలకెల్లి పల్లేరు మీద బండి నడకలా

పల్లెలన్ని తిరిగే వాడు

కట్లె సంచి పట్టుకొని పని కోసం

పాదంలో ముళ్ళు గుచ్చని జాగే లేదు పాపం

నేల మీద నడిచీ నడిచీ పాదాలే పాదుకలయ్యాయి

సుత్తె పట్టీ పట్టీ కాయల గాయాలయ్యాయి.’

పొలాలు కోసిన తర్వాత ఏర్పడిన కొయ్యల మధ్య నుంచి నడవాలి. అవి ఖచ్చితంగా నడిచే బాటలు కావు. అయినప్పటికీ దగ్గర దారి కోసం మళ్ళ మీదుగా సాగిపోతారు. మడికట్ల బాట మీదుగా నడవడం అంత సౌకర్యంగా ఉండదు. అయినప్పటికీ ఆ బాట వెంట నడక సాగుతుండగా ముళ్లు పల్లేరు కాయల గుచ్చి పాదాలకు గాయాలవుతాయి. ముళ్ళ తొవ్వల కెల్లి పల్లేరుల మీద బండి నడక సాగినా బండికి ఏమీ కాదు. అట్లాంటి ముళ్ళ బాటలో పాపయ్య చెప్పుల్లేకుండా నడుస్తు పల్లెలన్ని తిరిగేవాడు. నగలు చేసే అవుసులవాళ్లు తమ పనిముట్లు కట్లె సంచిలో పెట్టుకుంటారు. పాపయ్య కట్లె సంచి వెంట ఉంచుకొని నగల పని కొరకు చెప్పుల్లేకుండా పల్లెలు తిరగడం జరుగుతుండేది. పని కోసం తిరుగుతుండగా పాదం నిండా ముళ్ళు గుచ్చేవి. అయినా నడకను కొనసాగించేవారు. పాదుకలు అంటే చెప్పులు అని చెప్పవచ్చు. పాపయ్య కాళ్లు అరిగే వరకు నడవగా పాదాలు చెప్పులు అయ్యాయి. నగల పని చేసే వారి దగ్గర సుత్తి ఉంటుంది. ఒక నగను చేయడానికి ఎన్నోసార్లు సుత్తితో కొడతారు. సుత్తి కొట్టి అతని చేతులు కాయలు కాచాయి మరియు గాయాలయ్యాయి. సాన పెడితేనే బంగారం, వెండి మెరుస్తుంది. తండ్రి పాపయ్య నగల పని చేయడం వల్ల చేతులు కాయలు కాచాయి. గాయాలు అయ్యాయి అని కవి వెంకటేశ్వర్లు ఆవేదన చెందుతున్నాడు.

‘గొంగడి భుజానేసుకొని కట్టె కందెన అగ్గిపెట్టెతో

వరికుప్పకు జవాన్ లా కావలికాసేవాడు ఒకప్పుడు’

పొలం కోసిన తర్వాత వరికుప్ప దగ్గర పాపయ్య కావలి కాసే వాడు. పొలం కావలి కాచే వాళ్ళ చేతిలో కట్టె, కందెన, అగ్గిపెట్టె, ఉంటుంది. రాత్రిపూట వెలుతురు కొరకు కందెన దీపంను అగ్గిపెట్టెతో వెలిగించేవారు. కరెంటు వచ్చిన తర్వాత కందెన దీపం అవసరం లేకుండా పోయింది. అగ్గిపెట్టెకు బదులుగా లైటర్ వాడకంలోకి వచ్చింది. ఆ రోజుల్లో కరెంటు లేదు. ప్రతి ఇంటిలో కందెన దీపం, అగ్గిపెట్టె ఉండేవి. వరికుప్పను కావలి కాయడం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రైతు ఆరుగాలం కష్టించి పంట పండిస్తాడు. పొలం కోసిన తర్వాత ఆ పంటను ఇంటికి చేర్చే వరకు రైతులంతా పొలం వద్దనే కావలి ఉంటారు. రైతు వరికుప్ప దగ్గర లేకుంటే దొంగలు పండించిన పంటను ఎత్తుకుపోతారు. అందువల్ల రైతులు పొలాలు కోసిన తరవాత తమ కల్లాలలో జవాన్‌లా వరికుప్ప వద్ద కావలి ఉంటారనే సంగతి ఈ కాలపు పిల్లలకు తెలియదు. జవాన్ దేశ సరిహద్దుల వద్ద కావలి ఉంటాడు. పాపయ్య పండించిన పంటను ఇంటికి చేర్చేవరకు జవాన్ అవుతారు అనే నిజాన్ని వ్యక్తం చేశారు.

‘పంచాంగం చెప్తూ ఊరికి నాలుకయ్యేవాడు’

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం – ఈ ఐదు భాగాల కలయికే పంచాంగం అంటారు. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. చాంద్రమాన పంచాంగం చంద్రుని సంచరణతో అనుసంధానమైనది. సూర్యమాన పంచాంగం సూర్యుని సంచరణతో అనుసంధానమైనది. పల్లెలో జనాలందరికి ఉగాది పండుగ వచ్చిందంటే ఆ సంవత్సరం తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆ ఊరిలో పాపయ్య పంతులు పంచాంగం చదివి చక్కగా చెపుతాడనే పేరు ఉండేది. ఆ ఊరి వాళ్లంతా వచ్చి పాపయ్య పంతులు వద్ద పంచాంగం చెప్పించుకునే వారు. పంచాంగం చెబుతూ ఊరి వాళ్లందరికి ఆత్మీయుడు అయ్యాడు.

‘నాడే పండుగకు మట్టి గణపతుల్ని

అందంగా తయారు చేసి పంచిన మా నాన్న

పర్యావరణ హితైషే కదా!’

పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే గణపతికి తొలి పూజ చేయాలి. మట్టి వినాయకులను పూజ గదిలో మరియు మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయాలి. వినాయక చవితి రోజు నుండి గణపతి నవరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక భావనతో మెలగుతారు. గణపతి పండుగకు మట్టి గణపతులు తయారుచేసి పాపయ్య గ్రామస్థులందరికీ ఉచితంగా పంచేవాడు. పాపయ్య మట్టి గణపతులు ఇవ్వడం వల్ల పల్లెలో పర్యావరణం కాపాడబడింది.

‘దీపావళి పండుగకు సుందరంగ

పొప్పెల్లు వేసే చిత్రకారుడు

దీవిలె కథలు.. చెప్పే బహుజన పురోహితుడు’

దీపావళి పండుగకు పూజ చేసే ముందు పూజ గదిని సుందరంగా అలంకరిస్తారు. పూజ గదిని అలంకరిస్తూ పొప్పెళ్లు వేసే చిత్రకారుడు పాపయ్య. దీపావళి పండుగ యొక్క విశిష్టతను తెలుపుతూ కథలు చెప్పే సబ్బండ వర్ణాల వారి పూజ చేసే పూజారి పాపయ్య అని చెప్తున్నాడు.

‘అనుమాండ్ల గుడికాడో, గద్దెల మీదో రాత్రి పూట

వాడ కట్టోళ్ళంతా కలిసి కథలు, శాస్త్రాలు..

చెప్పించుకునేటోళ్లు ఉచితంగా

బాల నాగమ్మ కథ.. పురాణ కథలు.. హాస్య కథలు..

ఉత్కంఠ కలిగిస్తూ సీరియల్స్‌లా చెప్పే

కథల ఊటబాయి’

అనుమాండ్ల గుడి వద్ద మరియు గద్దెల మీద రాత్రిపూట పల్లెవాళ్లు అందరు కలిసి కోరితే కథలు, శాస్త్రాలు పాపయ్య ఉచితంగా చెప్పేవాడు. బాలనాగమ్మ కథ, పురాణ కథలు, హాస్య కథలు అందరిలో ఉత్సాహం కలిగేటట్లు చక్కగా విప్పిచెప్పేవుడు. ఊట బాయిలో నీరు ఎప్పుడు ఊరుతునే ఉంటుంది. పల్లె వాళ్లకు కథలు చెబుతూ పాపయ్య కథల ఊట బాయి అని పేరు తెచ్చుకున్నాడు.

‘మా కడుపు నింపడం కోసం

తన కడుపు మాడ్చుకున్నాడు’

పాపయ్య అనవరతం శ్రమించాడు. కష్టించి పనిచేసి వచ్చిన సొమ్ముతో కుటుంబ సభ్యుల కడుపు నింపాడు. పాపయ్య తన వాళ్ల సుఖం కోరుకున్నాడు, తన కడుపు మాడ్చుకున్నాడు అనే వాస్తవాన్ని కవి వెంకటేశ్వర్లు చక్కగా వ్యక్తీకరించారు.

‘మద్యం, మగువ, పైసలున్నోల్లతోని సోపతి

అగ్గిల చెయ్యి పెట్టినట్టని బోధ చేసిండు

కాలేజిలో చేరేటప్పుడు’

మద్యం అలవాటుగా మొదలయి చివరికి వ్యసనంగా మారుతుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి పతనం కొనసాగుతుంది. మద్యంతో, మగువతో, ధనికులతో స్నేహం అగ్గిలో చెయ్యి పెట్టినట్టని తండ్రి పాపయ్య అపుడే కాలేజ్‌లో చదవడానికి అడుగు పెడుతున్న కుమారుడు వెంకటేశ్వర్లుకు లోకం అంటే ఏమిటో తెలియని వయసు కదా! అందుకే జీవిత సత్యం బోధ చేసిండు. పాపయ్య చేసిన బోధ చక్కగా ఉంది. అందరికీ ఆచరణీయం.

‘కానీ

నా రెక్కల కష్టం అనుభవించకుండానే

సగం కాలి ఆరిన కొర్రాయిలా అస్తమించాడు

రోగాల నులకతాళ్ళతో సావాసం చేస్తూ’.

తండ్రి పాపయ్య నా రెక్కల కష్టం అనుభవించలేదు. సగం కాలి ఆరిన కొర్రాయి అంటే పూర్తిగా కాలకుండానే ఆరిపోయినటు వంటిది. అలాగే తండ్రి పాపయ్య సగం కాలి ఆరిన కొర్రాయిలా కాలకుండానే రోగాలతో నులకతాళ్ళ మంచంలో పడుకొని అస్తమించాడు అని ఆవేదన చెందుతున్నాడు. అర్ధాంతరంగా తండ్రి అనారోగ్యం బారిన పడి వెళ్లిపోవడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. వేదన నుండి కవిత ప్రాణం పోసుకుంటుంది అంటారు. వెంకటేశ్వర్లు వేదనకు రూపమిచ్చి కవితకు ప్రాణం పోశాడు. వెంకటేశ్వర్లు తండ్రి స్మృతి కవిత చక్కగా ఉంది. మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


ఎర్రోజు వెంకటేశ్వర్లు తేది 30-06-1969 రోజున సామాన్య స్వర్ణకార కుటుంబంలో జన్మించారు. కందికట్కూరు గ్రామం, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. తల్లిదండ్రులు రామవ్వ, పాపయ్య. తండ్రి పాపయ్య కందికట్కూర్ గ్రామంలో స్వర్ణకార వృత్తి చేపట్టినారు. తాత ముకుందాచారి, నాయనమ్మ రత్నమ్మ. తాత ముకుందాచారి కందికట్కూర్ గ్రామంలో స్వర్ణకార వృత్తిలో కొనసాగినారు. ఎర్రోజు పాపయ్య, రామవ్వ దంపతులకు నలుగురు సంతానం.

ప్రథమ సంతానం: లొంకోజు రత్నమ్మ, భర్త శంకరయ్య. శంకరయ్య పశుసంవర్ధక శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తేది 27 – 10 – 2017 రోజున అనారోగ్యంతో మృతి చెందినారు.

ద్వితీయ సంతానం: ముకుందాచారి, భార్య సరోజన. ముకుందాచారి స్వర్ణకార వృత్తి పనులు చేస్తూ కందికట్కూరు గ్రామంలో నివసిస్తున్నారు.

తృతీయ సంతానం: కృష్ణమాచారి, భార్య సుజాత. కృష్ణమాచారి స్వర్ణకార వృత్తి పనులు చేస్తూ కందికట్కూరు గ్రామంలో నివసించారు. తేది 05-06-2021 రోజున అనారోగ్యంతో ఈ లోకంను వీడిపోయారు.

చతుర్ధ సంతానం: వెంకటేశ్వర్లు భార్య జ్యోతిర్మయి. వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో పనిచేస్తున్నారు.

వెంకటేశ్వర్లు 1 వ తరగతి నుండి 5 వ తరగతి 1975 – 1980 సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాల కందికట్కూర్ గ్రామంలో చదివారు. 6 వ తరగతి నుండి 10 వ తరగతి 1980 – 1985 సంవత్సరం వరకు శ్రీ రాజ రాజేశ్వర సంస్కృత పాఠశాల, వేములవాడలో చదివారు. ఇంటర్మీడియట్ 1985 – 1987 సంవత్సరం వరకు శ్రీ రాజ రాజేశ్వర సంస్కృత కళాశాల, వేములవాడ, అదే కళాశాలలో డిగ్రీ 1987 – 1990 సంవత్సరం వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. ఎం.ఏ. తెలుగు 1990 – 1992 సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లో చదివారు. సదానంద్ శారద కథలు – పరిశీలన పై ఎం.ఫిల్. 1992 – 1993 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివారు. బీఈడీ 1995 సంవత్సరంలో రాష్ట్రీయ విద్యాపీఠం తిరుపతిలో చదివారు. ఎం.ఏ. సంస్కృతం 1994 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా చదివి ఉత్తీర్ణులయ్యారు. తేది 21- 09-1995 రోజున సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఆసిఫాబాద్‌లో టి.జి.టి. తెలుగు టీచర్‌గా అపాయింట్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నప్పటినుంచి విద్యార్థులకు కవిత, కథా రచనపై ఆసక్తి కలిగించారు.

ఎర్రోజు వెంకటేశ్వర్లు ముద్రిత రచనలు. 1) బ్లాక్ బోర్డు వచన కవితా సంపుటి (2020) 2) యెర్రోజు పసిడి పలుకు (2022).

తిప్పర్తి భాస్కరాచారి, విశాలాంధ్ర దంపతుల కూతురు జ్యోతిర్మయితో వెంకటేశ్వర్ల వివాహము 17-11-1997 రోజున కరీంనగర్‌లో జరిగింది.

వెంకటేశ్వర్లు జ్యోతిర్మయి దంపతులకు ఇద్దరు సంతానం.

ప్రథమ సంతానం: కత్రోజు ప్రణవి, భర్త రోహిత్, రోహిత్ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నారు.

ద్వితీయ సంతానం: శివ సాయి ప్రద్యుమ్న యు.ఎస్.ఎ.లో ఎం.ఎస్.విద్యను అభ్యసిస్తున్నారు.

వెంకటేశ్వర్లు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనాథ శరణాలయాలకు మరియు వృద్ధాశ్రమాలకు తోచిన సహాయం చేస్తుంటారు. వెంకటేశ్వర్లు తాను విద్యనభ్యసించిన శ్రీ రాజరాజేశ్వర సంస్కృత విద్యాలయం, వేములవాడ వారికి స్మార్ట్ టీవీని బహుకరించి కృతజ్ఞతను చాటుకున్నారు. వెంకటేశ్వర్లు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో 2013లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. వెంకటేశ్వర్లు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తీరిక సమయంలో సాహిత్య వ్యాసంగం కొనసాగిస్తున్నారు.

Exit mobile version