బడి, బాల్యం, సోపతుల తలపోత – ‘మధురానుభూతుల జడి మన బాల్యపు బంగారు బడి..’ కవిత

0
2

[కవి, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ – రచించిన ‘మధురాను భూతుల జడి మన బాల్యపు బంగారు బడి..’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]‘మ[/dropcap]ధురానుభూతుల జడి మన బాల్యపు బంగారు బడి’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది.శ్యామ్ ప్రసాద్ చిన్న తనంలోని మధురమైన అనుభూతులను, బాల్యంలో బంగారు బడిలో గడిపిన తీపి కబుర్లను కవితా రూపంలో పంచుకోవడం అద్భుతం అని చెప్పవచ్చు. బాల్యం ముచ్చట్లు గుర్తుకు వస్తే ఎవరైన సంతోష సాగరంలో తేలియాడుతారు.

‘ఎంత ఎత్తుకు ఎదిగినా
ఎనలేని ఆనందాల తునకలు
ఎద నిండా ముప్పిరిగొంటూనే ఉంటాయి.’

మనిషి జీవితంలో ఎంతో ఎత్తయిన ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికి అతనిలో చెప్పలేనన్ని ఆనందాలు హృదయంలో నిండి సంతోషాలను కలిగిస్తాయి.

‘మరపురాని ఎన్నో ఎన్నెన్నో
మధురానుభూతుల ఉత్సాహతరంగాలు
ఉవ్వెత్తున ఎగిసిన తన్వయత్వపు అంచున
చేరుకుంటూనే ఉంటాయి.’

మరపురాని స్మృతుల తాలూకు జ్ఞాపకాలు లెక్కించడానికి కూడా సాధ్యం కాని ఆకాశంలోని చుక్కల వలె జీవితాన పెన వేసుకుంటాయి. పారే నది ఒడ్డున సాగే నీటి ప్రవాహం యొక్క గల గలల వలె మధురానుభూతులు ఉవ్వెత్తున ఎగసిన ఉత్సాహ తరంగాల వలె ఏదో తెలియని తన్మయత్వంతో మనస్సు తేలియాడుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘నాన్నంటే బడి
బడి అంటే నాన్న
నాన్న రజని శ్రీ గారితో ఆ బడిలో
నాకున్న అనుభవాల పాఠాలు
నాకు జన్మ జన్మలకు సరిపడా జ్ఞానపీఠాలు
నన్నెంతో ఎత్తుకు నిలబెడుతూనే ఉంటాయి..’

నాన్నంటే బడి. బడి అంటే నాన్న ఎలా అవుతాడు? అనే సందేహాలు మనలో పొడచూపుతాయి. నాన్న పేరు చెప్పగానే పాఠశాల. పాఠశాల అంటే ఉపాధ్యాయుడుగా పని చేసిన శ్యామ్ ప్రసాద్ నాన్న అని అర్థం అవుతున్నది. శ్యామ్ ప్రసాద్ నాన్న ఉపాధ్యాయుడిగా పని చేసిన హుస్నాబాద్ బడిలో తనకు ఎదురైన అనుభవాల పాఠాలను గుర్తు చేస్తున్నాడు. హుస్నాబాద్ బడిలో చదువుకునే రోజుల్లోనే ఏర్పడిన జ్ఞాపకాలు శ్యామ్ ప్రసాద్ తనకు జన్మజన్మలకు సరిపడా తనలో జ్ఞాన కాంతులు వెలిగించాయి అని చెప్పడం చక్కగా ఉంది. హుస్నాబాద్ బడిలో విద్య నేర్చిన శ్యామ్ ప్రసాద్ బడిని గూర్చి చెబుతూ ఈ బడిలో విద్య నేర్వడం వల్లనే నేను ఎంతో ఎత్తుకు ఎదిగిన శిఖరంలా జీవితంలో నిలబడగలుగుతున్నాను అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.

‘నాన్న అన్న మాటైనా
నాకాయన చదువుల గురువు
విద్యతో పాటు వినయాలు నేర్పే మేరువు
అందరూ బాగుండాలి
అందులో నేనుండాలనుకునే
మంచితనపు జలపాతాలు
ఆయన హృది నుండి అనునిత్యం
జాలువారుతూనే ఉంటాయి..’

నాన్న నన్ను వేలు పట్టి నడిపించి విద్య అనే వరాన్ని ప్రసాదించి చదువుల ఒడిలోకి చేర్చిన గురువు. విద్యతో పాటు వినయాలు నేర్పించిన మేరు పర్వతం నాన్న. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనుకునే శ్యామ్ ప్రసాద్ నాన్న హృదయం ఉన్న మనిషి. శ్యామ్ ప్రసాద్ నాన్న అనునిత్యం మంచితనం యొక్క విలువలను పంచుతారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘మంచి పాఠాలు చెప్పే గురువుగా
ప్రతి విద్యార్థి మదిలో ఆయనో కంఠహారం
తన సహ గురువులకు ఆయన సహవాసం
సదా సహోదరునిలా
ఆత్మీయ గంధాలు కురిపిస్తూనే ఉంటాయి.’

శ్యామ్ ప్రసాద్ నాన్న బడిలో పాఠాలు నేర్పించే సారు అనే పేరును సంపాదించుకున్నారు. ఆ బడిలో చదివిన ప్రతి విద్యార్థి సారు చెప్పిన పాఠాలు విని అతనిని తమ మనస్సులో కంఠహారంగా భావిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ నాన్నకు సహ ఉపాధ్యాయుల మధ్యగల స్నేహం ఎల్లప్పుడు ఆత్మీయతతో కూడిన సోదర భావ సువాసనల జల్లులను కురిపిస్తూనే ఉంటాయి అని చెప్పిన భావం అర్థవంతంగా ఉంది.

‘అందుగల డిందు లేరనే
అభినయాల సారం వెలకట్ట లేనిది
నాట్యంలో నటన రచనా రంగాల్లో
సాటి లేని ఆయన ప్రతిభ
చూసే ప్రతి కనులకు నిత్య కళ్యాణం
పచ్చ తోరణాలుగా అందరి మదిలో
ఇప్పటికీ సజీవంగా పరవశింప చేస్తూనే ఉంటాయి..’

అందు గల డిందు లేడు అని ఎవరిని అంటారు? పరమేశ్వరుడు అన్నింటా వ్యాపించి ఉన్నాడు అని చెబుతారు. శ్యామ్ ప్రసాద్ నాన్న అందు గల డిందు లేడనే రీతిలో ఆయన గజ్జె కట్టి నాట్యం చేసిన కళాకారుడిగా అందించిన విశిష్ట సేవలు అమూల్యం అని చెప్పవచ్చు. శ్యామ్ ప్రసాద్ నాన్న నాట్యంలో చూపిన సాటిలేని ప్రతిభ చూసే ప్రతి వ్యక్తికి కనువిందు చేస్తుంది. ఆయన చూపిన నాట్య ప్రతిభ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా అందరి హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా పరవశం కలిగిస్తూ రంజింప చేస్తూనే ఉంటుంది అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.

‘బడి గోడలపై బాల్యపు చిత్రాలను
దోస్తులు కొండూరు శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్,
రాంప్రసాద్, విద్యాసాగర్, అన్నవరం
రామేశ్వర్ కిషోర్ లతో కలిసి
గీసుకున్న ఆ అపురూప ఘట్టాలు
విడదీయలేని బంధాలుగా నిజం జీవితపు
జ్ఞాపకాల దొంతరలలలో హమేషా
తచ్చాడుతూనే ఉంటాయి..’

శ్యామ్ ప్రసాద్ చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో హుస్నాబాద్ లోని బడి గోడలపై బాల్యపు చిత్రాలు స్నేహితులు కొండూరి శ్రీనివాస్, కొత్తపల్లి అశోక్, రాంప్రసాద్, విద్యాసాగర్, అన్నవరం రామేశ్వర్, కిషోర్ లతో కలిసి గోడలపై గీసిన చిత్రాలు ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించాయి. శ్యామ్ ప్రసాద్ స్నేహితులతో కలిసి గీసిన చిత్రాలు వారి మధ్య విడదీయలేని గాఢమైన అనుబంధాలుగా కొనసాగినాయి. వాస్తవంగా శ్యామ్ ప్రసాద్ జీవితాన వెలసిన స్నేహమనే చెలిమి జ్ఞాపకాల దొంతరలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.

‘మనసైన సోపతులు
శ్రీకాంత్ శేఖర్‌లు
కానరాని లోకాలకు కనుమరుగై
కన్నీటితో గుండెలు పిండేస్తున్న
కనుల లోగిలిలో కలకాలం
మీతో మేమున్నామనే వారి
జ్ఞాపకాల సందళ్లు సవ్వళ్ళు చేస్తూ
కదలాడుతూనే ఉంటాయి..’

శ్యామ్ ప్రసాద్ మనస్సుకు నచ్చిన ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు శ్రీకాంత్ శేఖర్‌లు భువి నుండి దివికి చేరినారు. శ్యామ్ ప్రసాద్ స్నేహితులు కానరాని లోకాలకు చేరి కనుమరుగై గుండెలను పిండేస్తున్నారు. శ్రీకాంత్, శేఖర్‌లు కళ్ళల్లో మెరుస్తూ కలకాలం మీతో మేమిద్దరం కలిసి ఉన్నాం అని చెప్పే జ్ఞాపకాల సందడులు సవ్వడులు చేస్తూ గుండె లోతుల్లో కదలాడుతూనే ఉంటాయి అని చెప్పడం శ్యామ్ ప్రసాద్‍కు స్నేహితుల పట్ల గల అపారమైన ప్రేమ, అభిమానములను భావాల రూపంలో వ్యక్తం చేయడం అతని అసాధారణమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.

‘ఇష్టాల లోగిలిలో
ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించేలా
ఆసక్తిగా పాఠాలు అవలీలగా
ఆలకింపజేసే ఆనందరావు సార్ వెంకట్ రెడ్డి సార్
రాజయ్య సర్ విశ్వనాథం సార్
ఆంజనేయులు మాష్టార్ల సేవా నిరతి
అనుక్షణం గగన వీధిలో
తిప్పుతూనే ఉంటాయి..’

ఇష్టమైన లోగిలి అంటే ఏమిటి? కుటుంబంలో అమ్మానాన్నలు కుటుంబ సభ్యులు అందరు ఒక్క చోట ఇంటి వాకిలిలో చేరి ఆనందాలలో పాలుపంచుకుంటారు. చదువుకునే పిల్లలందరికీ ఇష్టమైన లోగిలి బడి అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇష్టమైన లోగిలిలో కుటుంబంలో ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించేది అమ్మ అని చెప్పవచ్చు. శ్యామ్ ప్రసాద్‌కు ఇష్టమైన లోగిలి అంటే అమ్మానాన్న లాంటి గురువులు ఆప్యాయంగా విద్యార్థులకు గోరుముద్దలు తినిపించేలా ఆసక్తిగా అవలీలగా పాఠాలు వీనుల విందుగా బోధించే ఆనందరావు సార్, వెంకటరెడ్డి సార్, రాజయ్య సర్, ఆంజనేయులు మాష్టార్లు విద్యార్థులకు అందించిన సేవానిరతి కొనియాడతగినది అనే గొప్ప సందేశాన్ని కవితలో వ్యక్తం చేయడం కవి యొక్క ప్రతిభను తెలియజేస్తుంది.

‘అలుపెరుగక ఆనాడు
గురువులు నాటిన పునాది బీజాలు
ఈనాడు మొక్కలై వృక్షాలై వటవృక్షాలై
దేశోన్నతికి పాటుపడే
యువ కిశోరాలుగా
మయూఖాలై మెరుపులు చిందించడం
మన బాల్యపు బడి ఘన సందడి
కీర్తి కిరీటమే కదా..’

కుటుంబంలో అమ్మానాన్నలు పిల్లల అభివృద్ధి కొరకు ఎలా శ్రమిస్తారో, అలాగే ఉపాధ్యాయులు కూడా చదువుకునే పిల్లలకు విద్య నేర్పించుట కొరకు అహర్నిశలు కృషి చేస్తారు. తల్లిదండ్రుల వలెనే ఉపాధ్యాయులు చదువు నేర్చుకునే పిల్లల ఆశయాలు సాధించుటకు అలుపెరుగక కృషి చేసిన ఫలితంగా ఉపాధ్యాయులు నాటిన పునాది బీజాలు పడ్డాయి. ఆనాటి విద్యార్థులు మొక్కల స్థాయి నుంచి వృక్షాలుగా వట వృక్షాలుగా ఎదిగినారు. ఆనాటి పిల్లలు యువ కిశోరాలుగా ఎదిగి వెలుగులు పంచుతున్నారు. ఆనాటి విద్యార్థులు పెరిగి మయూఖాలై మెరుపులు చిందించడం అనేది మన బాల్యపు బడి ఘన సందడి అందించిన కీర్తి కిరీటం అని చెప్పిన భావం అద్భుతం అని చెప్పవచ్చు.

‘నిత్య వసంతాల మన బడిని
సంతసాల సంబరాల
వజ్రోత్సవాల్లో మునిగి తేలుద్దాం రండి
ఆశల పల్లకిపై ఊరేగించి
మరెన్నో యువ కెరటాలను
భావితరానికి అందిద్దాం రండి..’

వసంతంలో చెట్ల నుంచి కొమ్మలు, కొమ్మల చివరల నుంచి లేలేత మొగ్గలై తాజా పువ్వులుగా వికసిస్తాయి. వసంతంలో చెట్లు మరియు పొదలపై తాజా ఆకుపచ్చ మరియు కొత్త ఆకులు కనిపిస్తాయి .వసంతంలో గడ్డి ప్రతిరోజు పచ్చగా మరింత పచ్చగా మారుతుంది. వసంతంలో ప్రకృతి కాంత తన సుదీర్ఘ శీతాకాలపు నిద్ర నుండి మేల్కొంటుంది. ఎటు చూసినా పచ్చదనం వెల్లివిరుస్తుంది. బడి ఎప్పుడు నిత్య నూతనంగా ఉండి చదువుకునే పిల్లలకు విద్యను నేర్పిస్తూ కాంతులు విరజిమ్ముతూ అలరారుతూ ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ విద్యనేర్పిన 75 సంవత్సరాల నిత్య వసంతాల మన బడిని సంతోషాలు సంబరాలు పూయిస్తూ వజ్రోత్సవ వేడుకల్లో మునిగితేలుదాం రండి అని స్నేహితులను అందరిని ఆనందంతో ఆహ్వానిస్తున్నారు. విద్యను నేర్పిస్తున్న మన బడిని పల్లకిపై ఊరేగించి మరెందరో యువ కెరటాలైన విద్యార్థులను భావితరానికి అందిద్దాం రండి అని స్వాగతం పలకడం శ్యామ్ ప్రసాద్‌కు విద్య నేర్పిన బడి పట్ల గల ప్రేమను తెలియజేస్తున్నది.

‘చిలిపి చిలిపి అల్లర్లు
అలవోక అలకలు
చిరు చిరు దండనలు
చిన్నబోయిన ముఖాలు
కష్టసుఖాలు ఎరుగక
మన బాల్యాన్ని తన ఒడిలో మోసి
మన బడి గుడిని మెరిపించి
మురిపిద్దాం రండి..’

హుస్నాబాద్ బడిలో చదువుకున్న విద్యార్థులమైన మనం చిన్నతనంలో చిలిపి చిలిపి అల్లర్లలో పాల్గొన్నాము. పాఠశాలలో చదువుకున్న స్నేహితుల మధ్య పొరపొచ్చాలు అలకలకు కొదువ లేదు. విద్యార్థులు తెలిసి తెలియని బాల్యంలో అమాయకత్వంతో ఏదైనా తప్పుడు పనికి పాల్పడినట్లయితే ఉపాధ్యాయులు బెత్తముతో చిరు చిరు దండనలతో శిక్షించే వారు. విద్యార్థులు చిన్నపోయిన ముఖాలతో దిగులుతో గడిపిన రోజులు ఉన్నాయి. బడిలో చదువుకునే విద్యార్థుల బాల్యాన్ని అందమైన బడి తన ఒడిలో మోస్తుంది. పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అందరు అన్నదమ్ముల వలె అనుబంధంతో కలిసిమెలిసి ఉండడం ఆనందానికి మూలం అంటారు. విద్య నేర్పిన మన బడిని విద్యార్థులమైన మనం కాంతివంతం చేసి సంతోషాలతో మురిపిద్దాం రండి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘అందరం చేయి చేయి కలుపుదాం
స్నేహాల ఒడిలో ఒక్కటై
మధురానుభూతుల జడిలో తడుస్తూ
మన బంగారు బడి ముంగిట
పది కాలాలపాటు గుర్తుండే
ఆత్మీయ తివాచీ పరుద్దాం
భావితరాలకు పూర్తి ఆదర్శమవుదాం..!!’

హుస్నాబాద్ పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరం చేయి చేయి కలుపుదాం. స్నేహాల ఒడిలో ఒక్కటైన విద్యార్థులం అందరం మధురానుభూతుల జడిలో తడుస్తూ ఆనందాలను పంచుకుందాం. విద్య నేర్చుకున్న బంగారు బడి ముంగిట పది కాలాల పాటు గుర్తుండే రీతిలో తివాచీ పరిచి ఆత్మీయ అనుభూతులను కలబోసుకుందాం. భావి తరాలకు హుస్నాబాద్ బడి పిల్లలుగా విద్యార్థి లోకానికే కాదు అందరికీ ఆదర్శంగా నిలుస్తాం అని చెప్పిన తీరు చక్కగా ఉంది. కవి శ్యామ్ ప్రసాద్ చక్కటి కవిత రాసి హుస్నాబాద్ పాఠశాల 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తోటి విద్యార్థులతో కలిసి హుస్నాబాద్ పాఠశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలను అక్షరాలతో ప్రాణం పోసి కవితకు రూపం ఇచ్చి సజీవం చేసిన శ్యామ్ ప్రసాద్‌ను అభినందిస్తున్నాను. కవి శ్యామ్ ప్రసాద్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ 14-11-1970 తేదిన హుస్నాబాద్ గ్రామం సిద్దిపేట జిల్లాలో సామాన్యమైన పద్మశాలి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యవతి, రాజేశం. తండ్రి రాజేశం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రాజేశం ‘రజని శ్రీ’ అనే కలం పేరుతో రచనలు చేశారు. నాట్యాచార్యుడిగా గొప్ప పేరు సంపాదించారు. శ్యామ్ ప్రసాద్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్ గ్రామంలో చదివారు. హుస్నాబాద్‍ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో ఎం.ఏ. తెలుగు చదివారు. శ్యామ్ ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ II A సర్వీసెస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. డిప్యూటీ తహసిల్దారుగా ఉద్యోగం తేదీ 31-07-1995 రోజున గంభీరావుపేట మండలంలో నియమింపబడ్డారు. శ్యామ్ ప్రసాద్ వివిధ హోదాలలో పనిచేస్తూ ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here