[ప్రముఖ కవయిత్రి, కథా రచయిత్రి, జర్నలిస్ట్, డాక్టర్ కొండపల్లి నీహారిణి కలం నుండి జాలువారిన ‘మిగిలిన ప్రశ్నవు’ కవిత పై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]
[dropcap]‘మి[/dropcap]గిలిన ప్రశ్నవు – ఎవరి కోసం ఈ ఎదురీతనో’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. అతని గురించి నీవు మిగిలిన ప్రశ్నవు అంటూనే ఎవరి కోసం ఈ ఎదురీత అని మనలను ఆమె లోకంలోకి తీసుకుపోవడం అబ్బురం కలిగిస్తుంది. జీవితం అనే నావలో అతను అర్థం చేసుకోలేని వ్యామోహంలోకి చేరి మిగిలిన ప్రశ్నలా ఎలా మారాడు? ఎవరి కోసం ఈ ఎదురీత? అని ఆమెలో కలిగిన హృదయ వేదనతో కవిత ఆరంభమవుతుంది. జీవితం సమస్యల నిలయం అంటారు. మనుషుల జీవితాల్లో సమస్యలు గూడు కట్టుకుని ఉంటాయి. ఎదురయ్యే సమస్యలను అధిగమించి ముందుకు సాగితేనే జీవితం సవ్యంగా సాగుతుంది. ఒకే గూటిలో నివసించే రెండు పక్షులు మాత్రం చక్కగా కలిసిమెలిసి ఆనందంగా జీవనం సాగిస్తాయి. ఒకే గూటిలో నివసించే భార్య, భర్త కలిసిమెలిసి అనురాగంతో ఉంటే ఎలాంటి అరమరికలు సమస్యలు వాళ్ల దరి చేరవు. ఆ ఇద్దరు అనురాగం మరిచిపోయి అహంకారంతో తమ మాటే నెగ్గాలని చూస్తే వాళ్ల జీవితాల్లో అన్యోన్యత కరువు అవుతుంది. భర్త, భార్యను విడిచి తాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనాలకు అలవాటు పడితే జీవితం నరకంగా తయారవుతుంది. భార్య, భర్త ఇద్దరు పరస్పర అనురాగంతో కలిసిమెలిసి ఉంటేనే సంసారం సారవంతమైన క్షేత్రంలా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. అతను మిగిలిన ప్రశ్నలా ఎందుకు మిగిలాడు. ఎవరి కోసం ఈ ఎదురీతనో అనే ప్రశ్నలతో మనలను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తుంది.
‘లోకాన్ని దాటి
ప్రతిరోజూ నీదవుతున్నప్పుడు
గాలి సంతకాలు వెనువెంట నీవవుతున్నప్పుడు
జారిపోని కలలా ప్రతి క్షణం
ఎదురొస్తున్న సంగతులే కానుకలు!’
విశాల విశ్వంలో ఒక భాగం లోకం. జీవులు నివసించే ప్రదేశం లోకం అని చెప్పవచ్చు. మనిషి యొక్క జీవితం లోకాన్ని దాటి ముందుకు సాగిపోతున్నది. మనిషి కొనసాగిస్తున్న బ్రతుకు ప్రపంచం ప్రతి రోజు తాను కోరినట్లుగా తనదిగా చలామణి అవుతున్నది. గాలిలో నీవు చేస్తున్న సంతకాలు ఎక్కడా ఆగకుండా నీ పేరుతో ప్రకటించబడి నీవుగా మారుతున్నాయి. జారిపోని కలలా ప్రతి క్షణం ఎదురొస్తున్న సంగతులే కానుకలు. మన తీరని కోరికలు తీర్చుకోవడానికి కలలు ఉపయోగపడతాయి అని సిగ్మండ్ ప్రాయిడ్ భావించే వారన్నది అందరికీ తెలిసిన విషయమే. మనకు నిద్రలో కలలు వస్తాయి. నిద్రలో కలలు నిద్రలోనే జారిపోతాయి. జారిపోని కలలా ప్రతిక్షణం మనకు ఎదురొస్తున్న సంగతులే కానుకలు ఎలా అవుతాయని మనకు అనిపించవచ్చు.
‘కొండలూ రాళ్ల గుట్టలూ
నీచెవిలో నవ్విన ప్రతిసారీ
పక్కపక్కనే నడిచే మనసులు
నదిపరుగులా నీదైన భావనే
నువ్వు విస్తరించిన కాంతి
మనసు ప్రకాశంలో నిన్ను కళాత్మకంగా దిద్దినట్టు
ఎదిగిన క్షణాలు
ఎదుర్కోలేని క్షణాల పంజరం తలపుల తలుపులను
తీసి నిను పరిపరివిధాల పథికుణ్ని చేస్తుంది’
ప్రకృతిలో భాగమైన కొండలు, రాళ్లు గుట్టలు పరవశించిన క్షణాల తాలూకు అనుభూతులు నిన్ను చూసి నీ చెవిలో నవ్విన ప్రతిసారి ఆహ్లాదపూరితమైన వాతావరణంలో సాగిన ఉద్వేగభరిత క్షణాలను తలుచుకోవడం, పక్క పక్కనే నీ వెంట నడుస్తుంటే మనసు ఒక పరి ఉల్లాసంగా ఉంటుంది. నది ప్రవాహ గతిలో కూడా నీవు ఉన్నావనే తలపులు నిండు హృదయంలో కలిగిన భావనలు నాలో ముప్పిరిగొంటున్నాయి. నీతో కలిసి జీవిస్తుంటే నీవు ఒక కాంతిగా మారి విస్తరించినావు. మనిషి మనస్సు కాంతిపూరితమై కుంచె ద్వారా నిన్ను కళాత్మకంగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. మనిషి మనస్సు తాలూకు అనుభవాలు, అనుభూతులు ఎదిగిన క్షణాల తీరును తెలుపుతున్నాయి. జీవితంలో మనసు కూడా ఎదుర్కోలేని క్షణాలు ఉంటాయి. పంజరంలో బంధించబడిన మనసు తాలూకు తలపుల తలుపులు మూసివేయబడి ఉంటాయి. తలపుల తలుపులు తీసి మనసు ఒకసారి పరిపరి విధాల నడుస్తున్న బాటసారికి గమ్యం ఏమిటో తెలియజేస్తుంది.
‘ఇమిడిపోయిన ఒక రహస్యమేదో
మేధను మధింపుకూ
నడత దిద్దుబాటుకూ
పిడికిట పెట్టే కారణమైనట్టు
ఇప్పుడన్నీ కొత్త పాఠాలే
హృదయ కవాటం విచ్చిన ప్రతిసారి
కలల లాంతరు పట్టుకొని
ఆశల వాకిట నిలబడతావు
తరుణం కనురెప్పల అంచున దాటిన
చంచలత్వమై వెనుదిరిగినప్పుడు
మౌనం నేర్చిన కొత్త భాష్యాల శిల్ప కళ అవుతుంది’
మానవ జీవనంలో కలిగిన మార్పులు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఊహాకు కూడా అందనంత వేగంగా మారిపోతున్నాయి. మారిన కాలమాన పరిస్థితులు, పెరిగిన సాంకేతికత అద్భుతం అని చెప్పవచ్చు. మనిషి మనస్సులో నిబిడీకృతమై ఉన్న రహస్యం ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. మేధస్సును కూడా అంచనా వేయడం అనేది మనిషి ఊహాకు అందని విషయం. మనిషి మనస్సు యొక్క ప్రవర్తన తీరుతెన్నులను కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరము ఆవశ్యకతను తెలియజేస్తున్నది. ఇవన్నీ కొత్త పద్ధతులుగా చెప్పవచ్చు. ఇప్పుడన్నీ విభిన్నమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కాలం మార్పుకు ఆహ్వానం పలికింది. ఇప్పుడు నాగరికత నేర్చిన మనిషికి కొత్త కొత్త పాఠాలు ఎదురవుతున్నాయి. కొత్త పాఠాల నుండి మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. మనిషి అణుకువతో మేధస్సును సరియైన బాటలో పయనింపజేయాలి. కాలంతో పాటు మనిషి ప్రవర్తనను కూడా సరిచేసుకుని ముందుకు సాగాలి. మనిషిలో కలిగిన మార్పులకు శ్రీకారం చుట్టేలా అతని హృదయ కవాటం పువ్వులా మారి ప్రేరణ కలిగిస్తుంది. పరిసరాలను ప్రకాశవంతం చేయడానికి ఉపయోగించే మంట లేదా కాంతిని రక్షించడానికి చేయబడిన పారదర్శక పదార్థం లాంతరు అని చెప్పవచ్చు. లాంతరు ఒక రకమైన ఉపకరణం. నూనె పోసిన వత్తులతో వెలుగుతుంది. చీకటిలో వెలుతురు కోసం కిరోసిన్ ద్వారా ఉపయోగించేది. మనిషికి కలలు ఉంటే సరిపోదు. మనిషి సాధించాల్సిన కలలు కోరికలు పూర్తి చేయడానికి నిర్విరామ కృషి ఉండాలి. మనిషి కలలు ప్రకాశించే దీపం పట్టుకొని కోరికల ద్వారం వద్ద నిలిచాడు. ఎంత కాలం మనిషి అలా ఎదురుచూస్తూ నిలబడతాడు. కలల లాంతరు అంటూ పద చిత్రాలు ఉపయోగించారు. సమయం కూడా చంచలత్వమై వెనుతిరగడం ఉండదు. సమయం కూడా మనలను సంక్షోభానికి గురి చేస్తే మౌనాన్ని ఆశ్రయించి అవసరం మేరకే మాట్లాడితే మౌనం నేర్చిన కొత్త భాష్యాలు కల శిల్పకళ అవుతుంది. మానవ జీవనానికి చెరిగిపోని కల అవుతుంది. మనిషి యొక్క జీవితానికి సార్థకత చేకూరుతుంది.
‘మనసునీ బుద్ధినీ దాటి
వయసు పరిధి దాటి
గతం నుంచి
గతి నుంచి
ఆగని ఈ పయనానికి
ఆగిపోయిన ఆ చైతన్యానికి
అనాది సంబంధమే
నీదైన అయోమయంలో
వెలుగు దొరకని ఏకాంతంలో
అలల ధాటికి తెగిన పడవలా
ఆలోచనల వ్యూహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
దాటవేతలు
దరిచేరే ప్రయత్నాలుగా అవసరాలవుతుంటాయి’
జీవితంలో మనిషి యొక్క మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనిషి యొక్క మనసు ఎప్పుడు అస్థిరంగా ఉంటుంది. మనిషి బుద్ధి కూడా ఎప్పుడు స్థిరంగా ఉండక చంచలత్వంతో కూడి ఉంటుంది. మనసును బుద్ధిని దాటి ప్రవర్తించడం మనం ఎరిగినదే. వయసు పరిధిని దాటి మనిషి వయసు శిశువు దశలో ఒకలాగా, చిన్నతనంలో ఒకలాగా, కౌమారంలో ఒకలాగా, యువతగా వయసులో ఉన్నప్పుడు ఒకలాగా, పెరిగి పెద్దయి వృద్ధాప్యం చేరుకున్న దశలో ఒకలాగా వయస్సు పరిధిని దాటి మనిషి ప్రవర్తిస్తుంటాడు. జరిగిపోయిన దానిని గతం అంటారు. గతం నుంచి కూడా మనిషి నేర్చుకోవలసినది ఉంటుంది అని తెలియజేస్తున్నారు. గతి నుంచి కూడా మనిషి నేర్చుకోవాలి. గతి వేగం ఆంగ్లంలో speed అని అర్థం. తప్పకుండా జరగబోవు సంఘటనను గతిగా చెప్పవచ్చు. మన విధిని ఎవ్వరు మార్చలేరు. ఆగని ఈ పయనానికి స్వాగతం పలకాలి. మనిషి జీవితం ఆగదు. జీవితం అనే నావలో మనిషి పయనం కొనసాగుతూనే ఉంటుంది. ఆగిపోయిన ఆ చైతన్యానికి దారులు ఉండవు. చైతన్యం అంటే కదలిక, మార్పు అని చెప్పవచ్చు. మనిషిలో జాగృతి అయ్యే భావన చైతన్యం. ఒక చక్కటి కార్యక్రమం పూర్తి చేస్తే మనిషిలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. వివేకం కలిగి ఉండుట చైతన్యం. మనలో చైతన్యం ఎందుకు ఆగిపోయింది. ఆగిపోయిన ఆ చైతన్యానికి అనాది సంబంధమే eternal relationship ను తెలియజేస్తుంది. తనదైన అయోమయంలో కూడా మనిషి కూరుకుపోతున్నాడు. అయోమయం ఆంగ్లంలో confuse అని అర్థం. జవాబుదారీగా లేని దానితో వ్యవహరించడంలోని అసమర్థతను అయోమయంగా చెప్పవచ్చు. మనిషికి ఒకానొక సమయంలో అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. ఏ నిర్ణయం తీసుకోలేక అయోమయంలో పడిపోతాడు. అయ్యో! అయ్యవారు ఇలా అయ్యారు అనే సందిగ్ధత మనిషిలో నెలకొంటుంది. మనిషి మనసులో ఒకరకమైన ఆందోళనకు గురి చేసే నీదైన అయోమయం నెలకొంటుంది అని తెలియజేస్తున్నారు. వెలుగు దొరకని ఏకాంతంలో మనిషి కొట్టుకుపోతాడు. వెలుగు దొరకని ఏకాంతానికి ఆంగ్లంలో Solitude without light అని అర్థం. మనిషికి జీవితంలో ఒక్కోసారి వెలుగు దొరకని ఏకాంత పరిస్థితి ఎదురవుతుంది. మనిషికి అంతా శూన్యంగా చీకటిలో ఉన్నట్టుగా భావన కలుగుతుంది. మనిషి జీవితం సముద్రంలో అలల దాటికి తెగిన పడవలా మునిగిపోతుంది. మనిషి జీవితంలో అలాంటి దైన్య స్థితిని కూడా ఎదుర్కొంటాడు. మనిషి మనసులో ఆలోచనల వ్యూహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే దాటవేతలు దరి చేరే ప్రయత్నాలుగా అవసరాలవుతుంటాయి. మనిషి మనసులో ఆలోచనల వ్యూహాలు నిరంతరం కొనసాగుతుంటాయి. ఆలోచనలు మనుషుల సామర్థ్యాన్ని అడ్డుకునే మరో ముఖ్యమైన విషయం భావోద్వేగం అని చెప్పవచ్చు. మనిషి అత్యాశ లేదా భయం వంటి కోరికలకు బానిస కావచ్చు. భావోద్వేగాలు హేతుబద్ధమైన ఆలోచనలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మనిషి ఏదైనా పని చేయడానికి వ్యూహం ముఖ్యం. ఎందుకంటే లక్ష్యాలను సాధించడానికి అందుబాటులో ఉన్న వనరులు సాధారణంగా పరిమితంగా ఉంటాయి. మనిషిలో సాగుతున్న నిరంతర ఆలోచనలు వాటికి అడ్డుకట్ట వేసే దాటవేతలు దరిచేరే ప్రయత్నాలుగా అవసరాలుగా మారుతుంటాయి.
‘వదిలి వచ్చిన అబద్ధాలు
వదలలేని మమకారాలు
కల్లోల లోయలో పడవేస్తుంటే
అనుకూలతల తెడ్డు కోసమే నీదైన తపన అనుకున్నప్పుడు
కడలి నీకనుపాప లోతులలో
నిత్య సమరపు నీటి బింబమై కనిపిస్తుంది
ఎవరికోసం ఈ ఎదురీతనో..!!?’
అబద్ధాలతో మనిషి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అబద్ధాలు వదిలి వేస్తే మహదానందంగా మనిషి జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య మమకారాలు ఉంటాయి. వదలలేని మమకారాల మాయలో చిక్కుకుని కొట్టుకుపోతుంటే మనిషి జీవితం అంధకార బంధురంగా తయారవుతుంది. మనిషి విడవలేని బంధాల కోసం అనుకూలతల నావ నడపడానికి తెడ్డు సహకారంతో ముందుకు సాగాలి. బంధాలు నిలుపుకోవాలి అనే నీదైన తపన అనుకున్నప్పుడు సముద్రం కూడా నీ కళ్ళలోని కనుపాప లోతులలో ప్రతి రోజు అలజడులు కొనసాగుతూ నీటి బింబమై కనిపిస్తుంది అనే సజీవ సత్యాలు తెలియ జేయడం ఎవరి కోసం ఈ ఎదురీతనో అని ప్రశ్నించడం మనలను ఆలోచింపజేస్తుంది. పచ్చ పచ్చని ప్రకృతి మాత ఒడిలో ఈ భూమండలం మీద మనిషిగా మనుగడ సాగించడమే గొప్ప అని చెప్పవచ్చు. అటువంటి అరుదైన మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆలోచించకుండా అంతులేని ఆశలలో పడి కొట్టుకుంటున్న విధానాన్ని వ్యంగ్యంగా చురకలు వేసిన కవిత ఇది. అవసరాలను బట్టి అభిప్రాయాలను మార్చుకొనే మనుషులు ఎలా ఉంటారో చెప్పేటప్పుడు అబద్ధాలు ఆడడం, మమకారాలు వీడకపోవడం వంటి గుణాలను ఎత్తిచూపుతారు ఈ కవితలో కవయిత్రి. బతుకు పోరాటమైనప్పుడల్లా తనకు అనుకూలమైనట్టు మాట్లాడేవాళ్లు ఎందుకు ఎవరికోసం ఎన్ని తీర్లుగా జీవిస్తారని ప్రశ్న వేస్తున్నారు ఈ కవితలో కవయిత్రి. కొండలూ రాళ్లు గుట్టలూ నీ చెవిలో నవ్విన ప్రతిసారీ అంటూ కొత్త ఊహకు ప్రాణం పోసిన కవిత. కలల లాంతరు, తరుణం కనురెప్పల అంచున వంటి పద చిత్రాలు వేసి కవిత్వానికి ఒక శిల్ప సౌందర్యం తెచ్చిన కవిత. కవయిత్రి నీహారిణి చక్కటి కవిత అందించారు. కవయిత్రి నీహారిణి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
నీహారిణి 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు చిన్న పెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. 8వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చిన్న పెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ పింగిళి కళాశాల, వడ్డేపల్లి, హనుమకొండలో చదివారు. బి.ఎ. తెలుగు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ప్రభుత్వ పింగిళి కళాశాల, వడ్డేపల్లి, హనుమకొండలో చదివారు. బి.ఎ. ఫైనల్ ఇయర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, బర్కత్‌పుర, హైదరాబాదులో చదివారు. ఎం.ఏ. తెలుగు 1988 -1989 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం, దూరవిద్య, హన్మకొండలో చదివారు. 1990 – 1991 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ, వరంగల్‌లో పండిట్ ట్రైనింగ్ పొందారు. ఎం.ఏ. తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రాచ్య కళాశాల, నల్లకుంట, హైదరాబాదులో చదివారు. ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో ‘ఒద్ది రాజు సోదరుల జీవితం – సాహిత్యం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 2016 సంవత్సరంలో పిహెచ్.డి. పట్టా అందుకున్నారు. 1988 సంవత్సరం నుండి 2012 సంవత్సరం వరకు తెలుగు టీచర్‌గా పని చేశారు. తరువాతి కాలంలో టీచర్ ఉద్యోగం నుండి స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు. 1987 సంవత్సరం నుండి సాహిత్య సృజన చేయడం ఆరంభమైంది.
నీహారిణి గారి సంపాదకీయంలో ముద్రించిన పుస్తకాలు – 1) నా ప్రజా జీవితం -2007. 2) చిత్ర శిల్పకళా రామణీయకం – 2009. 3) చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర – 2009.
తెలుగు అకాడమీ ప్రచురించిన జీవిత చరిత్రలు: 3. అవి – 1) పెండ్యాల రాఘవరావు జీవిత ప్రస్థానం – తెలుగు అకాడమీ – 2014. 2) ఒద్ధి రాజు సోదరులు – జీవిత చరిత్ర -తెలుగు అకాడమీ – 2017. 3) కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర – తెలుగు అకాడమీ – 2017.
నీహారిణి గారు ముద్రించిన కవితా సంపుటాలు 4. అవి 1) అర్ర తలుపులు కవితా సంపుటి -2011. 2) నిర్నద్ర గానం కవితా సంపుటి – 2012. 3)ఎనిమిదో అడుగు కవితా సంపుటి – 2018. 4) కాల ప్రభంజనం – కవితా సంపుటి 2021.
అనువాదం: కాల ప్రభంజనం కవితాసంపుటిని ‘Tempest of Time’ అనే పేరుతో ప్రముఖ కవి ఎలనాగ ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ పుస్తకం ముద్రణ 2022.
నీహారిణి గారు ముద్రించిన పరిశోధనా గ్రంథం – 1) తెలంగాణ వేగుచుక్కలు ఒద్దిరాజు సోదరులు -700 పేజీలు.
నీహారిణి గారు ముద్రించిన కథా సంపుటాలు : 1) రాచిప్ప – కథాసంపుటి 2019. 2)ఘర్షణ – కథాసంపుటి 2023.
నీహారిణి గారు ముద్రించిన సాహిత్య విమర్శ వ్యాస సంపుటాలు : 1) వ్యాసహారిక – 2011. 2) సృజన రంజని -2018. 3) యాత్రాచరిత్ర – అమెరికాలో ఆరు నెలలు -2012.
~
నీహారిణి మయూఖ, తరుణి అనే రెండు అంతర్జాల పత్రికల వ్యవస్థాపకులు, సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. మయూఖ ద్వైమాసిక పత్రికని 2021 లోనూ, తరుణి వార పత్రికను 2022 లోనూ ప్రారంభించారు.
నీహారిణి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా వచ్చిన పురస్కారాల వివరాలు : –
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం – 2021. తేది 30-08 -2023 రోజున పురస్కారం ఇచ్చి సత్కరించారు.
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారిచే కీర్తి పురస్కారం – 2014.
- లయన్స్ క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం -2012.
- మానసా ఆర్ట్స్ వారి ప్రతిభా పురస్కారం – 2012.
- ధర్మకేతనం సాహిత్య పీఠం పురస్కారం – 2013.
- సోమ సీతారాములు గారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం – 2014.
- దాస్యం వెంకటస్వామి స్మారక పురస్కారం – 2014.
- సాహితీ కిరణం ముట్నూరి కమలమ్మ స్మారక పురస్కారం -2014.
- తెలంగాణ సొరస్వత పరిషత్ శ్రీ రాజ్య లక్ష్మమ్మ స్మారక పురస్కారం .
- ‘షి’ అవార్డు కడప కవితా సాహిత్య కళా సంస్థ వారి బహుమతి.
- చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర రచనకు ద్వానా శాస్త్రి గారి పురస్కారం
- ఎన్.వి. నరసింహారెడ్డి గారు ప్రధానం చేసిన “కళాశ్రీ’ బిరుదు 2014.
- అమెరికాలో మహిళా దినోత్సవం సందర్భంగా WATS వారి ఉత్తమ మహిళ అవార్డు – 2022.
- ఆకెళ్ళ ఫౌండేషన్ వారి Inspiring woman గా WOMEN ICON అవార్డు -2018.
నీహారిణి గారి వివాహము 1982 సంవత్సరంలో కొండపల్లి వేణుగోపాలరావుతో జరిగింది. శ్రీ వేణుగోపాలరావు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.
- ప్రథమ సంతానం దీప్తి. భర్త పవన్. దీప్తి, పవన్‌లు సాప్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో పని చేస్తున్నారు. దీప్తి, పవన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 1) సాన్వి 2) అర్జున్.
- ద్వితీయ సంతానం భార్గవ. భార్య వైష్ణవి. భార్గవ, వైష్ణవి దంపతులు ఇద్దరు సాప్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో పని చేస్తున్నారు. భార్గవ, వైష్ణవి దంపతులకు ఇద్దరు సంతానం. 1) కేయూర 2) మయూర. తల్లి వైష్ణవి, కూతుళ్లు కేయూర, మయూర కూచిపూడి నృత్య కళాకారులు. తల్లి వైష్ణవి నాట్యం నేర్పించే అధ్యాపికగా ఉండి పిల్లలను కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.
నీహారిణి కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు మనుమలు, మనుమరాళ్ళు అమెరికాలో నివసిస్తున్నారు. నీహారిణి నిత్యం పుస్తకం పఠనం, సాహిత్య రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్‌గా మయూఖ, తరుణి పత్రికల ద్వారా కవులకు, రచయితలకు మార్గదర్శకులుగా నిలిచి ప్రోత్సాహం అందిస్తున్నారు. పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజ వికాసానికి కృషి చేస్తున్నారు.