[గుడిపల్లి నిరంజన్ గారు రచించిన ‘నలిపెడుతున్న భావమేదో..!’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]
[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, నాగర్ కర్నూల్ జిల్లా లింగసానిపల్లి గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుడిపల్లి నిరంజన్ కలం నుండి జాలువారిన ‘నలిపెడుతున్న భావమేదో..!’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. ‘నలిపెడుతున్న భావమేదో’ కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ‘నలిపెడుతున్న భావమేదో’ అంటూ కవి నిరంజన్ మనలను ఆలోచనా తరంగాల్లో తేలియాడ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కవిత కవి నిరంజన్ గుండె లోతుల్లో నుండి వచ్చిన భావాలుగా తోస్తోంది. వేదన నుండే కవిత్వం పుడుతుంది అంటారు. ఒక్క సారిగా ఉబికి వచ్చే జలపాతంలా మనసును కలచి వేస్తున్న బాధ నుండి భావం జనించింది. కవి నిరంజన్ హృదయంలో రగిలిన వేదనలకు అక్షర రూపం దాల్చిన కవిత ఇది. ‘నలిపెడుతున్న భావమేదో’ కవితను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? ఒక్కసారి మనసు పెట్టి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
‘ఏమీ తోచని స్థితి
ఎప్పుడో ఒకసారి
అందరికి వస్తుంది.’
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమీ తోచని స్థితిని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటాడు. అట్టి సంకట సమయంలో ఏం చేయాలో తోచని స్థితిని అయోమయ స్థితి అని చెప్పవచ్చు. ఎవరికైనా సమస్యల వలయంలో పీకల దాకా కూరుకుపోయి ఉంటే దిక్కు తోచదు. ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థ వారిని వెంటాడుతుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యల చిక్కుల నుండి ఎలా బయటపడాలి అనే అయోమయం వారిలో నెలకొంటుంది. బుద్ధి జీవులైన మనుషులకు మాత్రమే సమస్యలు వస్తాయి. మానులకు సమస్యలు వస్తాయా? సమస్య ఎందుకో మనిషిని నలిపెడుతుంది, భయపెడుతుంది. మనిషిని సమస్య ఎంతో వేదనకు గురిచేస్తుంది. వేధిస్తున్న సమస్య నుండి బయటపడడం ఎలాగో మనిషికి తెలియని స్థితి ఏర్పడుతుంది. సమస్య వెంటాడుతుంటే ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ ఎదురవుతుంది అంటూ సమస్యలను గూర్చి కవి నిరంజన్ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
‘అమ్మ పోయినప్పుడో’
మన సమాజంలో స్త్రీని తల్లి, జనని, అమ్మ అని అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. కన్న తల్లి కడుపులో నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ప్రేమమూర్తి. బిడ్డకు పాలు తాగించి, ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది. కన్న తల్లిని మించిన ప్రేమమూర్తి, ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో కెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు. అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. అకస్మాత్తుగా అమ్మ ఈ లోకాన్ని వీడిపోతే పిల్లలకు ఆ కుటుంబానికి ఎంతో బాధ కలుగుతుంది. ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోతుంది. అమ్మ లేని ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వేదన నుండి ఎవరు బయటపడ వేయలేరు. అమ్మ లేని ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాదు. అమ్మా నాన్నలు రెండు కన్నులు అంటారు. ఒక కన్ను అయిన అమ్మ లేని ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంటుంది. అమ్మ లేని ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలోకి చేరి విలవిలలాడుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘నాన్న ఊపిరి ఆగినప్పుడో’
కుటుంబంలోని సంతానానికి కారకులు తల్లిదండ్రులు. వీరిలో పురుషున్ని తండ్రి, అయ్య లేదా నాన్న అని అంటారు. రెండో కన్ను అయిన నాన్న అనుకోకుండా అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోతే ఆ ఇంటి కుటుంబ సభ్యుల మనుగడ కష్టమవుతుంది. నాన్న లేని ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోతుంది. నాన్న లేని ఆ కుటుంబంలో దిక్కుతోచని స్థితి వెంటాడుతుంది, వేధిస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
‘మనసు వెన్ను విరిగినప్పుడో’
మనలో కలిగే భావోద్వేగాలు,అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరంగం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. మనసు అంటే అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు, ఆలోచనలు, విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపం మనసు అని చెప్పవచ్చు. ఒక్కొక్క సారి మనస్సు బాధకు గురి అయ్యి సంఘర్షణలను ఎదుర్కొంటుంది. మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక మనిషి తనలో తను మథన పడి పోతుంటాడు. మనిషి మనస్సు వెన్ను విరిగినప్పుడు బాధ, దుఃఖంతో విలవిలలాడి పోతుంటాడు.
‘అనర్థాలు ఎదురు పడ్డప్పుడో’
అప్పుడప్పుడు అనర్ధాలు మనిషికి జీవితంలో ఎదురవుతాయి. మనిషి వ్యసనాలకు బానిస అయినప్పుడు అనర్థాలు జరుగుతాయి. మనిషి మెదడుకు వ్యసనాల వల్ల జరిగే అనర్థాల గురించి సంకేతాలు అందుతాయి. అలాంటి సంఘర్షణ సమయంలోనే మనిషి జాగరూకతతో మెదిలితే అనర్థాన్ని అరికట్టవచ్చు. ఒత్తిడి పెరిగితే మనిషికి మద్యపానం, ధూమపానం అలవాటు అవుతాయి. ఈ వ్యసనాల వల్ల అనర్థాలు జరుగుతాయి. మద్యపానం, ధూమపానం వ్యసనాలకు మనిషి బానిసగా మారితే ఆపదలు వెంటాడుతాయి. వారు కలలు కన్న అందమైన ప్రపంచం ఒక్క క్షణంలో కుప్ప కూలవచ్చు. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆకాంక్ష, చాలా అమూల్యమైనదిగా ఉండొచ్చు. ప్రేమ, ఆప్యాయతలు పొందడమే జీవిత ధ్యేయమై ఉండొచ్చు. వ్యక్తులు అత్యంత ప్రాణంగా భావించిన ఆ కలలు భగ్నమైనప్పుడు లేదా జీవితంలో అనుహ్యామైన సంఘటనలు జరిగినప్పుడు వాని నుంచి కోలుకోలేక విపరీతమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఆపద అంటే అనుకోకుండా జరిగే విపత్తు. అనుకోకుండా సంభవించే కష్టం. ఉన్నట్టుండి జరిగే ప్రమాదంగాని అనుకోకుండా మరణం సంభవించడంగాని ఆపద అని భావించవచ్చు. ఒక్కసారిగా అనర్థాలకు చేరువ అయితే ఆ కుటుంబంలో దిక్కు తోచని స్థితి ఎదురవుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘అపార్థాలతో స్నేహం కూలినప్పుడో..’
అపార్థాలు అనేవి సర్వసాధారణం. అపార్థాలతో బంధాలు బీటలు వారుతాయి. అపార్థాల వల్ల స్నేహితులతో వాదనలకు, సంఘర్షణకు దారితీస్తుంది. వారి ప్రతి చర్యలను, తమ ఆలోచనలకు ముడి పెట్టితే వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అపార్థాలు చాలా స్వల్పమైనవిగా ఉంటాయి. సులభంగా సరి చేసుకోగలిగేవిగా ఉంటాయి. స్నేహితుల మధ్య తప్పుడు అభిప్రాయాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. వ్యక్తి ఆలోచనలను ఉద్దేశాలను, చేతలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అపార్థాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతరులను అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. తప్పుడు సమాచారాలకు, పుకార్లకు తోడు మనం అన్న మాటలు చేసిన పనులకు ఆపాదించబడిన అర్థాలు కొన్నిసార్లు అసలు ఉద్దేశానికి భిన్నంగా ఉండడం, మనల్ని ఆశ్చర్య పరచనక్కర లేదు. ఇతరులు మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వారు బాధపడడం సహజం. తనను అపార్థం చేసు కోవడానికి కారణం ఏమీ లేదని అతనికి కోపం కూడా రావచ్చు. అతని మనసును తీవ్రంగా గాయపరచవచ్చు.ఇతరుల విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమైతే ప్రాణ స్నేహితులు కూడా వారికి దూరం అవుతారు. అపార్థాలతో స్నేహం భగ్నమైనప్పుడు మనస్పూర్తిగా క్షమాపణ చెప్పి అపార్థాలను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘దారి తప్పినప్పుడో..’
మనిషి మనసు బాగా లేనప్పుడు తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియక దారి తప్పి పోతాడు. మనిషి దారి తప్పినప్పుడు దిక్కు తోచని స్థితి ఏర్పడుతుంది అని వ్యక్తికరించిన భావం చక్కగా ఉంది.
‘ఎప్పుడో ఒకప్పుడు
ఊపిరాడని స్థితి
అందరికి వస్తుంది’
అకస్మాత్తుగా అమ్మ ఈ లోకాన్ని వీడిపోయినప్పుడు, ప్రమాదవశాత్తు నాన్న ఊపిరి ఆగిపోయినప్పుడు, మనిషి మనసు ఒక్కసారిగా వెన్ను విరిగినప్పుడు, మనిషి మద్యపానం, ధూమపానం వల్ల అనర్థాలు ఎదురైనప్పుడు, స్నేహితుడు ఎందుకో తప్పుగా అర్థం చేసుకుని అపార్థాలతో స్నేహం కూలినప్పుడు, మనిషి మనస్సు బాగా లేక దారి తప్పినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మనుషులైన వారికి భయంకరమైన సమస్యల వల్ల ఊపిరి పీల్చుకోలేని స్థితి వస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘పూర్వ జ్ఞాపకాలు రోదించినప్పుడో’
ఎందుకో ఒక్కసారిగా పూర్వ జ్ఞాపకాలను తలుచుకొని దుఃఖంతో ఏడుస్తారు. జరిగి పోయిన కాలం నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి రావు. కాబట్టి జీవితంలో గడిచిన ప్రతి క్షణం మధురమైనది. గడిచిపోయిన ప్రతి క్షణం గురించి ఆలోచిస్తూ ఉంటే అందులో ఎన్నో ఆనందకరమైన క్షణాలు జ్ఞాపకానికి వస్తాయి. వ్యక్తులు చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునేటప్పుడు స్నేహితులతో ఎన్నో ఆటలు ఆడి ఉంటారు. ఎన్నో పాటలు పాడి ఉంటారు. అలాగే తమకు నచ్చిన స్నేహితులతో కలిసి తిరిగిన ప్రదేశాలు, పాఠశాలలో ఉపాధ్యాయుల చేత తిన్న దెబ్బలు, అలాగే స్నేహితులతో ఏర్పడిన గొడవలు, ఏడ్పులు, కొట్లాటలు, కేరింతలు జ్ఞాపకాలలో పదిల పరిచి ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆటలు, పాటలు, చిలిపి పనులు, కష్టం, సుఖం, ఇలా ఏదైనా కానీ, అన్నింట్లో మన వెన్నంటి ఉండేది, మనకు తోడుగా నిలిచేది, ఒక్క స్నేహితుడు మాత్రమే. అందరి కన్న తమ జీవితంలో చెరగని ముద్ర వేసిన స్నేహితులు వారికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనివి. మరపురానివి.కొన్ని సమయాల్లో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పాత జ్ఞాపకాలు మీరు మళ్ళీ మళ్ళీ చదవాలనుకునే చక్కని పుస్తకాల వంటివి. గడిచిపోయిన పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు రోదిస్తారు అని చెప్పిన భావం చక్కగా ఉంది.
‘కయ్యాలు కురిసినప్పుడో’
కయ్యం అంటే ఏమిటి? కయ్యాలు ఎందుకు కురుస్తాయి? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వ్యక్తి ఘర్షణ ధోరణిలో ఇంకొక వ్యక్తితో ప్రవర్తిస్తున్నాడు కయ్యం అనవచ్చు. కయ్యానికి కాలు దువ్వుతాడు అని కయ్యానికి పాల్పడ్డ మనిషి గురించి చెబుతారు. కయ్యం అంటే ఘర్షణ పడడం. మాటా మాట పెరిగి కొట్లాట ఏర్పడి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అభిప్రాయ బేధాలతో ఘర్షణ చెలరేగి చివరికి వ్యక్తులు పరస్పరం దూరమవుతారు. కయ్యాల వల్ల దిక్కుతోచని స్థితి ఏర్పడి దిగులు పడుతుంటారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘గింజలు మొలవనప్పుడో’
గింజలు అంటే విత్తనాలు. నాసి రకం విత్తనాలు, మంచి విత్తనాలు అని రెండు రకాలు ఉంటాయి. దళారులు గ్రామాల్లో తిరుగుతూ రైతులను నమ్మించి నకిలీ విత్తనాలు అంట గడుతుంటారు. దుకాణాలల్లో వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలు అమ్ముతుంటారు. సత్తువ లేని విత్తనాలు అమ్మి రైతులను ముంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విత్తి అవి సరిగా మొలకెత్తక పంట దిగుబడి సరిగా లేక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్ముతున్న దళారులను, దుకాణాదారులను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. నకిలీ విత్తనాల వల్ల రైతులు దిక్కు తోచని వారై అయి బాధపడుతుంటారు. రైతుల బాధను చెప్పడానికి వీలు లేదు అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.
‘కోసిన పంట తుఫానులో కొట్టుకుపోయినప్పుడో’
సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల తుఫానులు వస్తుంటాయి. వాతావరణ ప్రభావం వల్ల తుఫాను ఏర్పడి అది సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. బంగాళాఖాతం, అరేబియా మహసముద్రంలో ఏర్పడే అల్పపీడనం క్రమేణా వాయుగుండంగా మారి తుఫాను రూపం దాల్చుతుంది. తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు పడుతుంటాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. విపరీతమైన గాలులు వీచడంతో కట్టడాలు నేలమట్టం అవుతుంటాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుఫాను తాకిడికి కొట్టుకుపోగానే రైతు దిక్కుతోచని స్థితికి చేరుకొని దుఃఖించడం జరుగుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘ఆత్మకు నచ్చిన వాళ్ళు వెనక్కి గుంజినప్పుడో’
బతుకు తెరువు కొరకు ఒక కొత్త పనిని ప్రారంభించి ముందుకు సాగుతుంటే ఆత్మీయులు ఆటంకాలు కల్పించి వేదనకు గురి చేస్తే చెప్పరాని దిగులు కలుగుతుంది అని చెప్పిన భావం చక్కగా ఉంది.
‘అప్పుడే సొప్ప బెండులా
అల్కగా బరువు తగ్గి పోతాం
ఈనె పుల్లలా సన్నగా మారుతాం’
అష్ట కష్టాలు ఎదుర్కొన్న మనిషి అప్పుడే మొక్క జొన్న చేనులో కోసిన చొప్ప బెండులా తేలికగా బరువు తగ్గిపోతాడు. ఈ కష్టాల వల్ల కన్నీళ్లతో బాధలలో మునిగిన మనిషి ఎండిన ఈనె పుల్లలా సన్నగా మారుతాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
‘ఒక్కోసారి మనసు లోపల
కసిబిసితో నలిపెడుతున్న భావమేదో
బయటకి ఉసులుతుంది
అప్పుడే ఏమీ తోచని స్థితి
వేడి శ్వాసల రూపంలో బయటకు వస్తుంది’
ఒక్కోసారి మనసు లోపల అత్యంత బాధాకరమైన స్థితి ఏర్పడి ఏ నిర్ణయం తీసుకోకుండా మనిషి లోపల ఉన్న జల బాధ రూపంలో బయటకు రావడం, పొంగిపొరలడం చూస్తుంటాం. అలాంటి గడ్డు సమయంలో ఒక నిట్టూర్పు ఏమీ తోచని స్థితిలో వేడి శ్వాసల రూపంలో బయటకు వస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
‘నిన్నటి దాకా నవ్వినట్టున్న ముఖాల్ని
ఇవ్వాలే ఎవరో అపహరించుకు పోయాక..
కొన్ని సార్లు భలే ముసురుకుంటాయి
నలుపు మేఘాలు..!’
ఎందుకో తెలియదు. నిన్నటి వరకు మీతో ప్రాణ స్నేహితుడుగా కలిసి ఉన్న మిత్రుని ప్రశాంత వదనంలో కనిపించే చిరు నవ్వు అపహరించబడినప్పుడు నవ్వు లేని మిత్రుని ముఖంలో విషాదపు గుంపులు ఆకాశంలో ముసురుకున్న నల్లటి మేఘాల వలె కనిపించింది అని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
‘బరువును పెంచే
మనుషులు ఎప్పుడూ ఉంటారు.
కానీ
బరువు దించే మనుషులే
మహానుభావులై నిలిచిపోతారు’
నడుస్తున్న ఈ లోకంలో మనలను బాధల ప్రపంచంలోకి నెట్టే మనుషులు ఎప్పుడూ ఎక్కువగా ఉంటారు. కానీ మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చి మన కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉండి మన కష్టాల బరువును దించే వాళ్లే మహానుభావులై నిలిచిపోతారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. ‘నలిపెడుతున్న భావమేదో’ అనే చక్కని కవితను రాసిన గుడిపల్లి నిరంజన్‌ను అభినందిస్తున్నాను. కవి నిరంజన్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కొడిదెల నిరంజన్ 15-04-1981 రోజున జన్మించారు. వీరు నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి గ్రామానికి చెందినవారు. వీరి తల్లిదండ్రులు కిష్టమ్మ,పోషన్నలు. తండ్రి పోషన్న వ్యవసాయ కూలీ పని చేసి జీవనం సాగించేవారు. పోషన్న 20-11- 1997 రోజున ఈ లోకాన్ని వీడి పోయారు. కిష్టమ్మ 28- 07- 2020 రోజున ఈ లోకాన్ని వీడిపోయింది. వీరి తాత కొములయ్య, నాయనమ్మ లచ్చమ్మ. వీరి తాత కొములయ్య వ్యవసాయ కూలి పని చేసి జీవనం సాగించే వారు.
నిరంజన్ 1 నుండి 7 వ తరగతి వరకు గుడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదివారు. 8 నుండి 10వ తరగతి వరకు రేవల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్‌లో చదివారు. 8 నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువును కొనసాగించారు. ఇంటర్మీడియట్ నాగర్ కర్నూల్ లోని జ్ఞాన జ్యోతి ప్రైవేట్ జూనియర్ కళాశాలలోనూ, నాగర్ కర్నూల్ లోని నవోదయ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బి.కాం. చదివారు. సూర్యపేట లోని వికాస్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి బి.ఎడ్. చేశారు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. ఎకనామిక్స్ చదివారు. దూర విద్య ద్వారా ఎం.ఏ. తెలుగు చదివారు.
26 – 12 – 2005 రోజున జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, అంబటిపల్లి గ్రామంలో స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల లింగసానిపల్లి గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
26-05- 2010 రోజున నిరంజన్ వివాహం సోనీ హార్సికతో గుడిపల్లి గ్రామంలో జరిగింది. నిరంజన్, సోనీ హార్సిక దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రథమ సంతానం – ప్రజిత్ సాహు మహారాజ్. ద్వితీయ సంతానం- ప్రణీత్ మహారాజ్.
నిరంజన్ రాసిన మొదటి కవిత 2007 ఏప్రిల్ మాసంలో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ప్రచురింపబడింది. కవి నిరంజన్ వెలువరించిన పుస్తకాల వివరాలు:
- లంద పొద్దు తెలంగాణ బహుజన కవిత్వం
- ఎరుక బహుజన మహోద్యమ దీర్ఘ కావ్యం
- నిట్టాడి అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక జీవితంపై దీర్ఘ కావ్యం
- నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య చరిత్ర,తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ
- వెన్నెల కల జంబూ ద్వీప తత్వ కవిత్వం
కవి నిరంజన్ సంపాదకత్వంలో వెలువడిన పుస్తకాలు:
- తెలంగాణ దళిత కథలు -2021 (సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి)
- తొండెం బొక్కెన తెలంగాణ దళిత వార్షిక (2020) (సిద్దెంకి యాదగిరి, తప్పెట ఓదయ్యలతో కలిసి)
- చిందు నేల దళిత కథా వార్షిక, (2022) (సిద్ధెంకి యాదగిరి, తప్పెట ఓదయ్యలతో కలిసి)
- పొద్దైంది కందనూలు కవిత్వం (2012).
- మహాబోధి కమ్మెర స్వర్ణోత్సవ సంచిక (2015)
- బడి కైతలు 38 మంది విద్యార్థుల బాల కవిత్వం (2016).
సెప్టెంబర్ 2021 సంవత్సరంలో నాగర్ కర్నూలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. నిరంజన్ జంబు సాహిత్యం, పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక, నాగర్ కర్నూల్ సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరి అసలు పేరు కొడిదెల నిరంజన్. వీరు పుట్టిన ఊరు మీద ఉన్న మమకారంతో గుడిపల్లి నిరంజన్ కలం పేరుతో రచనా వ్యాసంగం చేస్తున్నారు.