మార్గ నిర్దేశం చేసే కవిత ‘నేనెంతో వెనుకబడ్డాను’

0
2

[మాదాడి నారాయణ రెడ్డి గారు రచించిన ‘నేనెంతో వెనుకబడ్డాను’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ‘స్పందన’ కవితా సంపుటిలోని ‘నేనెంతో వెనుకబడ్డాను’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది.

‘నేనెంతో వెనుకబడ్డాను కవిత ఏమిటి?’ అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. నేనెంతో వెనుకబడ్డాను ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నేనెందుకు వెనుకబడ్డాను అని తనని తాను ప్రశ్నించుకున్నట్లుగా ఉంది. వెనుకబడడం అంటే ఏమిటి? అనే ప్రశ్నలు ప్రతి మనిషి తనకు తాను వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వాళ ఉన్నట్టి ఈ సమాజంలో ఏం జరుగుతుంది? సమాజంలో జరుగుతున్న వాటిని చూస్తూ మనం మౌనంగా ఉండకూడదు. సమాజాన్ని పరిశీలిస్తూ ముందుకు దూసుకు వెళ్లాల్సిన బాధ్యతను గుర్తించాల్సి ఉంది. నేనెందుకు వెనుకబడ్డాను కవిత మనలను సరైన మార్గంలో నడిచేటట్లు మార్గ నిర్దేశం చేస్తుంది. కవిత రాసి దాదాపుగా 41 సంవత్సరాలు అయింది. అయినప్పటికి సమాజంలోని మార్పులేని తీరుకు ఈ కవిత అద్దం పట్టినట్లుగా ఉంది. మనం మన పట్ల బాధ్యతగా ఎలా మెలగాలి? మనం బాధ్యతగా లేకుంటే ఈ అసమ సమాజపు చిక్కుల్లో పడి వేదనకు గురి అవుతాం అనే సందేశం ఇస్తుంది.

‘నేనెంతో వెనుకబడ్డాను’ కవిత ద్వారా మనం బాధ్యతగా లేకుంటే వెనుకబడడమే కాదు, మనం అన్ని విధాలుగా నష్టపోవడమే అని చెప్పడం వాస్తవంగా ఉంది. మన పట్ల గల బాధ్యతను గుర్తు చేసే విధంగా ఉంది. నారాయణరెడ్డి (మానారె) ఆచార్యుడిగా ఉండి ఎందరో విద్యార్థుల నడవడిని తీర్చిదిద్దారు. ఇప్పటికి ఆ సుగుణాలను ‘నేనెంతో వెనుకబడ్డాను’ అనే కవిత ద్వారా మనకు తెలియజేస్తున్న తీరు మనం గమ్యం వైపు చక్కటి అడుగులు వేసేందుకు దారి చూపుతుంది. సమాజం చక్కగా విరాజిల్లాలంటే ప్రజలు శాంతి కాముకులై ఉండాలి. పొరుగువారి మేలును కోరే వారై ఉండాలి. స్వార్థాన్ని కొంతైనా మానుకొని పరుల శాంతి సౌభాగ్యాల కోసం, సుఖశాంతుల కోసం, సోదర భావాన్ని, త్యాగ శీలాన్ని పెంపొందించుట కోసం ప్రయత్నించాలి. కరుడుగట్టిన స్వార్థపరులున్న ఈ సమాజంలో ప్రజలు నిరంతరం బాధలకు లోనవుతున్నారు. నేతలు, ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, కార్మికులు మొదలైన వారు ఏ వృత్తిలో కొనసాగుతున్న వారైనా ఉత్తమ మార్గాన్ని అనుసరించి సాటి సోదర మానవులకు మేలు చేయాలని కవి మాదాడి నారాయణ రెడ్డి (మానారె) ఆకాంక్షిస్తున్నారు.

‘సుజ్ఞాన దీపులనుకున్నాను

వక్ర భాష్యాలు చేస్తారని తెలియక’

మార్గదర్శకులుగా ఉన్నవారు మంచిని పంచేవారని అందరు అనుకుంటారు. సుజ్ఞానుల వల్ల సమాజంలో అజ్ఞానాంధకారం తొలగిపోయి జ్ఞాన దీపాలు వెలిగి ప్రజలు చక్కటి మార్గంలో నడుస్తారని కవి నారాయణరెడ్డి (మానారె) భావించారు. కాని దీనికి విరుద్ధంగా వంకర బుద్ధులు కలిగిన సమాజంలోని మార్గదర్శకులైన వారు తమ కుళ్ళిపోయిన భావాలతో వక్రబుద్ధితో కూడిన మాటలతో సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. సుజ్ఞాన దీపులు అంటే మంచి జ్ఞానమును ప్రకాశింపజేసేవారు అని అర్థం. అట్లాంటి సుజ్ఞాన దీపులు మంచి జ్ఞానంతో చుట్టు ఉన్న వాళ్లకు వెలుగును ప్రసాదించాలి. సుజ్ఞాన దీపులు తమ తెలివిని మరియు జ్ఞానాన్ని ఇతరులను తప్పుడు మార్గం వైపు అడుగులు వేయించడానికి ఉపయోగిస్తున్నారు. ప్రజలను పక్క దారి పట్టించడం వల్ల సమాజానికి నష్టం కలుగుతుందని తెలిసినప్పటికీ వాళ్లు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. కవి మాదాడి నారాయణ రెడ్డి (మానారె) తమ కవితలో వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది.

‘వైషమ్యాలను తొలగిస్తారనుకున్నాను

విషబీజాలు నాటుతారని తెలియక’

ఈనాటి సమాజంలో బడాబాబులు వ్యక్తికి వ్యక్తికి మధ్య కొనసాగుతున్న విభేదాలను తొలగించి సుహృద్భావాన్ని వ్యాప్తి చేస్తారనుకున్నారు కవి నారాయణరెడ్డి (మానారె). కాని ఈనాటి బడా బాబులు కవి ఊహించిన దానికి భిన్నంగా వ్యక్తుల హృదయాలలో ఈర్ష్య, అసూయ, విద్వేషం, వైరం, మత  వైషమ్యాలనే విషపు విత్తులను నాటుతున్నారు. బడా బాబుల ప్రవర్తన వల్ల సమాజంలో వెల్లివిరియాల్సిన సమతా భావం నీరుగారిపోతున్నది. వైషమ్యం అంటే వ్యక్తుల్లో ఉండే విభేదాలు అని చెప్పవచ్చు. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించకపోతే విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరి మధ్య సమన్వయంతో అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉంటేనే స్నేహం చిగురించడానికి అవకాశం ఉంటుంది. స్నేహం వికటిస్తే విభేదాలకు తావు ఏర్పడుతుంది. మంచితనంతో మెలిగే వాళ్ళు విభేదాలను తొలగిస్తారు అని అనుకున్నారు కానీ మంచితనం ముసుగులో విభేదాలను పెంచి పోషిస్తున్నారు. విద్వేషాలు వ్యాప్తి చెందే విధంగా తోటి వారిలో విష బీజాలు నాటడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇట్లాంటి బడా బాబుల ప్రవర్తన సమాజంలో ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నది. బడా బాబులు సమాజంలో మంచి మనుషులు అనే పేరుతో ప్రవర్తిస్తున్న తీరును చూసి విసుగు చెంది కవి నారాయణ రెడ్డి (మానారె) కవితలో వ్యక్తం చేసిన భావం సమంజసంగా ఉంది.

‘యువతకు మార్గం చూపుతారనుకున్నాను

అవినీతులు నేర్పుతారని తెలియక’

ఉత్తములు ఏ మార్గంలో నడిస్తే సమాజంలో నివసిస్తున్న వాళ్ళందరు కూడా ఆ త్రోవనే ఎన్నుకుంటారు. సమాజంలోని పెద్దలు యువతకు సమాజ సేవా భావాన్ని వ్యక్తిత్వ నిర్మాణపు శిక్షణను మంచి నాయకత్వ లక్షణాలను నేర్పి జాతి మరియు దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడుతారని అనుకున్నారు. దేశానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన యువత అవినీతిపరులైన పెద్దలను అనుసరించి అవినీతిపరులుగా మారడం బాధాకరంగా ఉంది.

యువతను స్ఫూర్తితో నింపి వాళ్ళ దృష్టిని లక్ష్యాల వైపు పరుగులు తీయించాలి. యువతలో పొంగిపొరలే ఉత్సాహం ఆదర్శవంతమైన స్ఫూర్తితో నిండి ఉంటుంది. యువతను సరైన మార్గం వైపు నడిపిస్తే ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉండేది. ఏ మంచి పని జరగాలన్నా యువత ద్వారానే సాధ్యమవుతుంది. నిజంగానే మనం పిల్లలను చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యంలో పిల్లలకే ప్రవేశం ఉంది అని ఏసుక్రీస్తు అన్నాడని బైబిల్‌లో వ్రాయబడి ఉంది. పిల్లలను చూడండి ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లలకు ఏదైనా దిగులు కలిగినప్పటికి వారు దానిని  వెంటనే మరిచిపోతారు. పిల్లలు ఏమీ జరగనట్లుగా మెదులుతారు. జీవితంలో  కోరుకున్న దానిని సాధించగల ప్రాయం ఏదైనా ఉందని అనుకుంటే అది యవ్వనం అని చెప్పవచ్చు. దురదృష్టవశాత్తు ఈనాటి యువతకు సరైన ప్రాతినిధ్యం ఎక్కడా లభించడం లేదు. రాజకీయ నాయకులు మరియు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న అధికారులు అందరు తమ స్వార్థం కోసం యువకులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలక్షన్లలో రాజకీయ నాయకుల గెలుపునకు యువకులదే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అట్లాంటి యువకుల శ్రమను అప్పనంగా దోచుకుంటున్నారు. యువతకు అవినీతి పనులు నేర్పుతున్నారు. స్వార్థంతో నిండిన నాయకుల వల్ల యువత యొక్క శ్రమ వృథా అవుతున్నది. యువతలో అంకితభావం లోపిస్తున్నది. యువత తమలోని నైరాశ్యం వీడి ఆశాభావంతో సన్మార్గంలో ముందుకు సాగితేనే వారు కోరుకున్న లక్ష్యాలను సాధించగలరు. సమాజ శ్రేయస్సు కోసం తోడ్పడగలరు అనే సందేశం కవితలో ఉంది.

‘ఎంతో త్యాగ బుద్ధు లనుకున్నాను

ఇంత స్వార్థ బద్ధులని తెలియక’

పెద్దలైన నాయకులు, అధికారులు త్యాగానికి చిరునామాగా ఉంటే సమాజం సకల సౌకర్యాలతో మరియు సకల సంపదలతో కూడి శోభాయమానంగా విరాజిల్లుతుందనడంలో సందేహాలకు తావు లేదు. గొప్ప నాయకులు, అధికారులు తమకున్న సంపదలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అత్యావశ్యకమైన బడులు, గుడులు, వైద్యశాలలు మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు, మూఢాచారాలను తొలగించడానికి ఉపయోగిస్తే సమాజం మనం ఆశిస్తున్న అభివృద్ధిని సాధించగలుగుతుంది. ఇలాంటి మంచి పనులను త్యాగ బుద్ధులుగా చలామణి అవుతున్న గొప్ప నాయకులు, అధికారులు సాధిస్తారని, సమాజ సౌభాగ్యం కోసం తపించే కవి నారాయణ రెడ్డి (మానారె) ఆశించారు. కాని వారి కోరికలకు విరుద్ధంగా త్యాగ శీలురనుకున్న గొప్ప నాయకులు, అధికారులు అంతా స్వార్థ బద్ధులై పోయారు. అన్నింటిని తాను, తనవాళ్లు మాత్రమే పొందాలని ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినప్పటికి వాటిని తమ బంధువులకు, స్నేహితులకు, ఆశ్రితులకు మాత్రమే అందజేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలు అందక ఎప్పటిలాగానే పేదరికంలో వారు మగ్గిపోతున్నారు.

త్యాగం అంటే వదలుకోవడం. త్యాగం మానవీయ సంబంధాలకు పునాది. మానవ జీవితంలో త్యాగాన్ని మించిన ఉత్తమ గుణం మరొకటి కనిపించదు. సమాజంలో ఎంతో మంది మహనీయులు సమాజ శ్రేయస్సు కోసం తమ సంపదను, తమ సుఖాలను, కుటుంబాలను త్యాగం చేశారు. స్వాతంత్ర సమరంలో ఎందరో మహనీయులు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ మరెందరో వీరులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు 1200 మంది వీరులు ప్రాణాలు అర్పించారు. త్యాగం వల్ల స్వార్థం నశిస్తుంది. వసుధైక కుటుంబ భావన కలుగుతుంది. అందువల్ల త్యాగ గుణాన్ని మానవులంతా అలవర్చుకోవాలి. మనం తోటి వారికి వీలైనంతగా సహాయపడాలి. మనకు ఉన్న దానిని నలుగురికి పంచడం వల్ల  ఆత్మ సంతృప్తి కలుగుతుంది. స్వార్థాన్ని కొంత వీడి తోటి వారికి సహాయపడాలి. త్యాగం స్వార్థ చింతనను దూరం చేస్తుంది. త్యాగంతోనే లోకంలో ఏ మహత్తరమైన కార్యమైనా సిద్ధిస్తుంది. సజ్జనులు స్వార్థం లేకుండా నిజాయితీగా తాము సంపాదించిన సంపదను సమాజాభివృద్ధికి వినియోగిస్తారు. అటువంటి వారే నిజమైన త్యాగమూర్తులు అని చెప్పవచ్చు. ఇవాళ సమాజంలో తమ స్వార్థం కోసమే పనిచేస్తున్న వాళ్లు ఎక్కడ చూసినా మనకు అగుపిస్తారు. స్వార్థపరులు ఏ పని చేసినా స్వార్థంతో చేస్తారు. స్వార్థంతో ఎలాంటి ద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు. స్వార్థపరులైన నాయకులు చేస్తున్న పనుల వల్ల సమాజానికి చేటు కలుగుతున్నది. గొప్పగా పేరుపొందిన నాయకులు, అధికారులు కూడా స్వార్థాన్ని వీడడం లేదు. త్యాగబుద్ధిని ఏనాడో మరిచిపోయారు. అలాంటి స్వార్థపరులతో కలిసి పని చేయరాదు. అలాంటి స్వార్థపరులకు ఎలాంటి పనుల్లో కూడా సహకరించరాదు. స్వార్థపరులు చేసే ద్రోహ చింతన నుండి యువతను కాపాడుకోవాలని కవి నారాయణ రెడ్డి (మానారె) పిలుపునివ్వడం అద్భుతం ఉంది అని చెప్పవచ్చు.

‘మంచితనం కలవారనుకున్నాను

వంచనలో మించిన వారని తెలియక’

మంచితనం అనేది దయ, నిజాయితీ మరియు కరుణ వంటి సానుకూల లక్షణాలతో కూడి ఉంటుంది. మంచితనాన్ని పెంపొందించుకోవడానికి కృషి అవసరం. నిజాయితీ మరియు కరుణని ప్రోత్సహించే సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడం ఇందులో ఉంటుంది. నిజాయితీతో ఇతరులకు సహాయం చేయడం అనేది మంచితనం యొక్క లక్షణం. మంచితనం అంటే మంచి అభిప్రాయాలు కలిగి ఉండుట. మంచి స్నేహంతో మెదలడం. మంచి ప్రవర్తన మనుషులను గొప్పవారిగా చేస్తుంది. అందరికి మంచి చేయాలనే హృదయం కలిగి ఉండడం అనేది మంచి మనిషి యొక్క లక్షణం అని చెప్పవచ్చు. మంచి గుణం మనిషికి అలంకారం లాంటిది. జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని అవగాహన చేసుకుని నడుచుకోవాలి. మనలో కోపం ఉత్పన్నం అయితే మనలోని మంచితనం గుర్తుకు రాదు. చెడు స్నేహమంటే శకుని లాంటి వంచకులతో గల స్నేహమన్నమాట. జీవితంలో మనకు చాలా మంది మిత్రుల రూపంలో ఎదురవుతారు. అట్లాంటి వారు ఇచ్చే చెడు సలహాలను దూరం పెట్టాలి. లేకపోతే మనతోనే ఉంటూ మన జీవితాన్ని ఆపదలలోకి నెట్టి వేస్తారు. వంచన అంటే ఇతరులకు ద్రోహం చేయాలనే భావన లేదా కుయుక్తితో వంచించే ఆలోచన అని చెప్పవచ్చు. తెల్లని బట్టలు ధరించి స్వచ్ఛమైన మనసు కలిగిన మంచి నాయకులు, అధికారులు వారు. మంచి నాయకులు, అధికారుల వల్ల సమాజంలోని దుఃఖార్తులు, దీనుల కష్టాలు తొలగిపోతాయి. అమావాస్య లాంటి చీకటి రోజులు పోయి పున్నమి లాంటి వెన్నెల వెలుగులు వారి జీవితాలలోకి ప్రసరిస్తాయని కవి నారాయణ రెడ్డి (మానారె) భావించారు. కాని ఈ మంచితనం ముసుగులో ఉన్న నాయకులు, అధికారులు కూడా అమాయకులైన ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాల పేరిట తాయిలాలు అందిస్తామని వంచిస్తున్నారు. మాయమాటలతో జనాన్ని మోసం చేస్తున్నారు. కవితలోని భావాలు ఈనాటి నాయకులు, అధికారులు చేస్తున్న అవినీతి పనులను బట్టబయలు చేసినట్లుగా అద్దం పడుతుంది.

‘గుండెలున్న దండివారనుకున్నాను

తుమ్ముకు తుళ్లేవారని తెలియక’

నాయకులు గొప్ప ధైర్యవంతులని అపారమైన తెలివితేటలు, సాహసం, గుండెనిబ్బరం కలవారని అనుకున్నారు. గొప్ప నాయకులు కాబట్టి ఎటువంటి విపత్తులు వచ్చినా తమ పై అధికారులను రాజకీయ నాయకులను సంప్రదించి ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలను కలిగిస్తారు. ప్రజల సౌఖ్యం కోసం వీరోచితంగా పోరాటం చేస్తారు అని కవి నారాయణ రెడ్డి (మానారె) ఆశించారు. కాని వారంతా ప్రభుత్వం యంత్రాంగం ముందు మరియు రాజకీయ అధినాయకుల ఎదుట పెదవి విప్పి అడిగే ధైర్యం లేని పిరికివారుగా కొనసాగడం సిగ్గుచేటుగా చెప్పవచ్చు. కవితలోని భావాలు సమాజంలోని వాస్తవిక స్థితిని మరియు రాజకీయ నాయకులు, అధికారుల కూటనీతికి సాక్ష్యంగా చెప్పవచ్చు.

‘స్నేహితులని గర్వంగా చెప్పుకున్నాను

అహితులై గోతులు తీస్తారని తెలియక’

ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన స్నేహితులు చాలా ముఖ్యమైన వారు. జీవితంలో నిజమైన స్నేహితులను కలిగి ఉండాలి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు లేని జీవితం అసంపూర్ణం. ఆస్తులు లేని వారు పేదవారు కాదు. ఆపదలో ఆదుకునే స్నేహితులు లేని వారు నిజమైన పేదవారు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహబంధం ప్రత్యేకమైనది. మనతో రక్తసంబంధం లేకపోయినా మన వెనుక బంధువులు ఎవరు రాకపోయినా మనల్ని వెన్ను తట్టి నడిపించేవారు స్నేహితులు. దేవుడు మనుషులందరితో బంధాలు సృష్టిస్తాడు. అయితే మనకు తెలియకుండానే ఏర్పడే బంధం స్నేహం ఒక్కటే. స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా నిలుస్తారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతత కలిగించే దివ్యమైన ఔషధం ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. స్నేహితులు మనకు గురువులా బోధించి దారి చూపిస్తారు. తప్పు చేసినప్పుడు మందలిస్తారు. ప్రతిరోజు మాట్లాడుకోకపోయినా అవసరమైనప్పుడు మనకు ధైర్యం ఓదార్పు ఇచ్చే వాడు నిజమైన స్నేహితుడు. తల్లిదండ్రులు తోబుట్టువులు లేని వారు ఉంటారు. కాని స్నేహితులు లేనివారు ఉండరు. సొంత వాళ్లకు చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకుంటారు. బాధైనా, సంతోషమైనా స్నేహితులతో పంచుకుంటారు. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా స్నేహితులతో గడుపుతుంటారు. శత్రువులు అంటే ఒకరి వినాశానాన్ని కోరుకునేవారు, తోటి వారికి చెడు చేయాలనుకునే వారు శత్రువులు. శత్రువు అంటే ఒకరికి, కొందరికి లేదా దేశానికి హాని కలిగించేవాడు. మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానప్పుడు మనసులో కలిగేటటు వంటి ఒక భేద భావన ఒకరిని మరొకరికి శత్రువుగా తయారు చేస్తుంది. అలా తయారైన వాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు కలిగే ప్రతీకారేచ్చ కారణంగా శత్రువులు తయారు అవుతారు. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడేవారు స్నేహితులు అని కవి నారాయణ రెడ్డి (మానారె) భావించాడు. ఎలాంటి కష్టాలు వచ్చినా తమ తోడ్పాటును స్నేహితులు అందిస్తారని అనుకున్నాడు. కాని తీరా చూస్తే స్నేహితులు సహాయం చేయడం మాట అటుంచి వెనుక గోతులు తీయడానికి కూడా వెనకాడని వారని తేలిపోయింది. స్నేహం పేరిట స్నేహితులు చేస్తున్న బండారం బయటపడింది. ఈ కవిత కనువిప్పు కలిగించేలా ఉంది.

‘అన్నీ తెలిసి గమ్యం చేరే సరికి

తెలిసింది నేనెంతో  వెనుకబడ్డానని’

ఎన్నో మంచి ఆలోచనలతో భావాలతో కూడిన పెద్దలైన నాయకులు, అధికారులు సమాజంలో ఉన్నారు. అలాంటి పెద్దలైన నాయకులు, అధికారం కల వారి వల్ల సమాజం బాగుపడుతుంది అనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. చివరకు బడా బాబులు, అధికారులు నిజస్వరూపంతో సమాజాన్ని ఎలా విచ్చినం చేస్తున్నారో వారి ఎత్తుగడలు, ద్రోహచింతన బట్టబయలయ్యాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కవి నారాయణ రెడ్డి (మానారె) సమాజంలోని వ్యక్తుల మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేయడంలో నేనెంతో వెనుకబడ్డాను అని బాధపడుతున్నారు. నారాయణ రెడ్డి (మానారె) మరిన్ని కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here