ఓ కుక్క కృతజ్ఞతని చాటిన కవిత ‘నింగినంటే విశ్వాసం’

0
2

[వేముల ప్రభాకర్ గారు రచించిన ‘నింగినంటే విశ్వాసం’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, రిటైర్డ్ జాయింట్ రిజిస్ట్రార్ కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్, వేముల ప్రభాకర్ కలం నుండి జాలువారిన ‘నింగినంటే విశ్వాసం’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది.

‘నింగినంటే విశ్వాసం’ కవితను ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. మోసం చేయకుండా ఉండటం విశ్వాసం. అప నమ్మకం కానిది విశ్వాసం. ఈ రోజు ప్రపంచంలో ఒక్కరికి కూడా విశ్వాసం విలువ తెలియడం లేదు.

విశ్వాసాన్ని కొందరు గుడ్డి నమ్మకం అంటారు. ఏదైనా సాధ్యమవుతుందన్న నమ్మకమే విశ్వాసం. కొందరు మనుషులలో కుక్కకున్న విశ్వాసం కూడా లేదని అనుకుంటారు.

‘ఎవరు వదిలేశారో
ఎలా వచ్చిందో తెలువదు
వాకిట్లో పడుకోనిస్తే
ఇల్లే తనదని మురిసిపోయింది.’

ఎవరు వదిలేశారో తెలువదు. ఎక్కడ పుట్టిందో తెలువదు. ఎక్కడ నుండి ఎలా వచ్చిందో దాని పుట్టుక సంగతులు తెలవదు. దాని తల్లిదండ్రులు ఎవరో తెలవదు. దాన్ని చూడగానే కొందరు పిల్లలు మరియు పెద్దలు కర్రలతో కొడతారు. రాళ్లు విసురుతారు. అది ఎవరికీ ఏ హాని చేయదు. ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ ఇంటి వాళ్లను చూసి అక్కడే కదలక మెదలక తోక ఊపుతూ ఉంది. ఆ ఇంటి ఇల్లాలు దాన్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమిరింది. అది తోక ఊపుతూ అక్కడే పడుకుంది. అది ఆ ఇంటి వద్ద నుండి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉన్న చద్ది అన్నం తీసుకువచ్చి మట్టి చిప్పలో వేసి దాని ముందర పెట్టింది. ఆ కుక్క చంటి పిల్లాడిలా చిప్పలో వేసిన అన్నం తిన్నది. ఆ ఇల్లాలు తమ ఇంటి వాకిట్లో కుక్కను పడుకోనిస్తే అది ఆ ఇల్లు తనదని ఎంతో సంతోషంతో మురిసిపోయింది అనే కవి ప్రభాకర్ భావన చక్కగా ఉంది.

‘పిల్లలతో ఆడుకోనిస్తే
తోబుట్టువులా కలిసి పోయింది.’

ఆ ఇంటి ఇల్లాలు, ఆమె భర్త, పిల్లలు దానితో కలిసిపోయి సంతోషంగా ఆడుకున్నారు. పిల్లలతోపాటు అది ప్రేమగా ఆప్యాయంగా కలిసిపోయింది. పిల్లలతో పాటు అది తోబుట్టువులా ఆత్మీయంగా కలిసి మెదిలింది.

‘ఇంటి ముందు
సిమెంటు బెంచీ కింద మకాం పెట్టి
ఈగ కూడా వాలకుండా
కాపలా కాసింది.’

ఆ ఇంటి ఇల్లాలు ప్రేమతో చిప్పలో నాలుగు మెతుకులు వేస్తే మహదానందంగా తినేది. ఇంటి ముందు గల సిమెంట్ బెంచీ కింద కాసింత నివాసం ఏర్పాటు చేసుకొంది. అది ఆ ఇంటి మీద ఈగ వాలకుండా ఏ దొంగ ఆ ఇంటి గుమ్మం తొక్కకుండా విశ్వాసంతో కాపలా కాసింది.

‘ఇల్లాలు అనారోగ్యంతో
ఆస్పత్రుల చుట్టూ
ప్రదక్షణలు చేసిన రోజుల్లో
మా వెంట రావాలని
అన్ని ప్రయత్నాలు చేసేది.’

దురదృష్టం, ఆ ఇంటి ఇల్లాలు తీవ్రమైన అనారోగ్యం బారిన పడింది. ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్యం బాగు చేయడం కొరకు ఆస్పత్రుల చుట్టూ రోజు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇల్లాలును ఆసుపత్రికి తీసుకు వెళ్తుంటే ఆ కుక్క వెంట రావాలని అన్ని రకాలుగా మారాం చేసేది. ఆ కుక్క శత విధాలా వెంట రావాలని ప్రయత్నాలు చేసేది. ఆ కుక్కను ఎలా ఆపాలో ఎవ్వరికీ తెలిసేది కాదు. వాళ్లు వెళుతున్నారు. వారి వెంట వెళ్లాలి అనే తపన దానిలో గూడు కట్టుకుని ఉండేది.

‘ఆలస్యమై అర్ధరాత్రి తిరిగొచ్చినా
అమ్మలా ఎదురుచూసేది.’

ఆ ఇంటి ఇల్లాలు ఆసుపత్రుల చుట్టూ తిరిగి పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు కూడా ఆ కుక్క అమ్మలా ఎదురుచూస్తూ ఇంటి ముందు కాపలా కాసేది. ఇంటి ఇల్లాలు రాగానే తోక ఊపుతూ ఆప్యాయంగా దగ్గరికి చేరేది. ఆ ఇంటి ఇల్లాలు అంటే దానికి ఎంతో ప్రేమ.

‘ఆమె కాలం చేసిన్నాడు
ఎందరు వారించినా వినకుండా
స్మశానం వరకు వచ్చి
అంతిమ వీడ్కోలు పలికింది.’

ఆ కుక్కకు ఎంతో బాధ కలిగింది అని చెప్పవచ్చు. ఆ ఇంటి ఇల్లాలు అర్ధాంతరంగా అనారోగ్యం బారిన పడి ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది. ఆ ఇంటి ఇల్లాలు అంతిమ సంస్కారాలు చేయడానికి అందరూ వెళ్ళుతున్నారు. ఎంత వారించినా ఆ కుక్క వినకుండా స్మశానం వరకు వచ్చి ఆ ఇల్లాలుకు అంతిమ వీడ్కోలు పలికింది.

‘చూడ్డానికి ఆ శునకం నలుపు
దాని హృదయం మాత్రం
స్వచ్ఛమైన తెలుపు.’

నిజానికి ఆ శునకం నలుపు రంగులో ఉండేది. ఆ శునకం ఆ ఇంటి ఇల్లాలు పట్ల చూపించిన ప్రేమ అసాధారణమైనది. ఆ నల్ల శునకం యొక్క హృదయం స్వచ్ఛమైన తెలుపు అని చెప్పడం చక్కగా ఉంది.

‘దానికి మేము వేసినవి
ఎంగిలి మెతుకులే
అది పెంచుకున్నది
నింగినంటే విశ్వాసం.’

ఆ ఇల్లాలు ఇంటి ముందు కాపలా ఉన్న శునకానికి మేము వేసినది ఎంగిలి మెతుకులు మాత్రమే అని చెపుతున్నారు. ఆ శునకం కాసింత ఎంగిలి మెతుకులు తిని కూడా అపారమైన ప్రేమతో నింగినంటే విశ్వాసంతో ఆ ఇంటిలో మెదిలింది అని చెప్పడం చక్కగా ఉంది. కుక్కలు తోటి కుక్కలతో కలిసి ఉండవు. కుక్క ఇంకొక కుక్క కనిపించగానే ఎగబడి కొట్లాడుకుంటాయి. కుక్కలు ఎందుకు కొట్లాడుకుంటున్నాయో చూస్తే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. అందుకే కుక్కల కొట్లాట అనే సామెత వాడుకలో ఉంది. కానీ కుక్కలు మాత్రం మనుషుల్ని చూడగానే ఆప్యాయంగా తోక ఊపుతాయి. కుక్కలు ఎంగిలి మెతుకులు వేసినా తిని ఆప్యాయంగా మెదులుతాయి. కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదు. కుక్కలు మనుషుల పట్ల చూపించే ప్రేమ నింగినంటే విశ్వాసం అనే కవి ప్రభాకర్ వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది.

నలుపు, తెలుపు, కుక్క ఏ వర్ణమైనా చూపించే ప్రేమను వెల కట్ట లేని ప్రేమగా చెప్పవచ్చు. పల్లెలో ప్రతి ఇంట కుక్క ఉంటుంది. పల్లెవాళ్ళు అన్నం తినే ముందు మొదటి ముద్దను కుక్క కోసం పక్కన పెడతారు. పల్లెవాళ్లు కుక్కను దైవంగా భావిస్తారు. పల్లెల్లో పట్టణాల్లో కుక్కలు చేసే మేలును మరువలేం. ఇవ్వాళ కుక్కలు వీధి వీధినా కనపడతాయి. రాత్రి పూట కుక్కలు ఎక్కడ చూసినా నిద్రపోకుండా కాపలా కాస్తాయి. ఒకప్పుడు పోలీసులు రాత్రి పూట నగరంలో తిరుగుతూ కాపలా కాసే వారు. నేరాలు, ఘోరాలు రాత్రి పూటనే జరుగుతుంటాయి. అసాంఘిక శక్తులు రాత్రి పూటనే రెచ్చిపోతుంటారు. ఎందుకో? ఏమిటో? తెలియదు. పోలీసులు మాత్రం రాత్రి పూట కాపలా డ్యూటీ చేయడం లేదు. ఏమీ తీసుకోకుండా కుక్కలు రాత్రి పూట అన్ని వీధుల్లో కాపలా కాస్తున్నాయి. కానీ కుక్కలకు ఒక ముద్ద వేసే వాళ్ళు కరువై పోయినారు. వీధి కుక్కల పరిస్థితి ఘోరంగా తయారైంది. కుక్కలు చెత్త కుండీల వద్ద ఆహారం కొరకు వెతుకుతూ కనిపిస్తాయి. వీధి కుక్కలను చూస్తే బాధగా అనిపిస్తుంది. సమాజానికి ఏమీ తీసుకోకుండా సేవలు చేసే వాటిలో కుక్కలను ప్రత్యేకంగా చెప్పవచ్చు. కుక్కలను కాపాడుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది. కవి ప్రభాకర్ నింగినంటే విశ్వాసం కవితలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. కవి ప్రభాకర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


కవి వేముల ప్రభాకర్ 10 – 06- 1951 రోజున రాయికల్ గ్రామంలో జన్మించారు. వీరు జగిత్యాల జిల్లాకు చెందిన వారు. వీరి తల్లిదండ్రులు ఆండాలమ్మ, రాజా గౌడ్. వీరి తండ్రి రాజా గౌడ్ ఆర్.ఎం.పీ. డాక్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ప్రభాకర్ 1 వ తరగతి నుండి 11 వ తరగతి వరకు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల, రాయికల్ గ్రామంలో చదివారు. పి.యు.సి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జగిత్యాలలో చదివారు. బి.కాం. డిగ్రీ ఆంధ్ర విద్యాలయ, గగన్ మహల్, హైదరాబాదులో చదివారు.

ప్రభాకర్ 1972వ సంవత్సరంలో ఎ.పి. మార్క్ ఫెడ్, హైదరాబాదులో జూనియర్ అసిస్టెంట్‌గా నియమింపబడ్డారు. వీరు 1978 సంవత్సరంలో గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమింప బడ్డారు. వీరు వివిధ హోదాలలో పనిచేస్తూ 2009 సంవత్సరంలో కో-ఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. కవి ప్రభాకర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన 1969వ సంవత్సరం నుండి రచనా వ్యాసంగం ప్రారంభించి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

ప్రభాకర్ వెలువరించిన పుస్తకాల వివరాలు:

  1. వర కవి భూమ గౌడ్ నవల – 2017 (రామానుజ సహస్రాబ్ది కానుక).
  2. అంతస్తులు నవల – 1983 (జనధర్మ పత్రికలో సీరియల్ గా వచ్చింది).
  3. విరాటుడు (స్టీఫెన్ జుగ్ నవలకు అనువాదం.) నివేదిత ప్రచురణ
  4. తియ్యని వేప (రావికంటి కథలు) –
  5. స్వర్ణ యాగం కవితా సంపుటి – 2015.
  6. పోరాడి గెలిచిన తెలంగాణ కవితా సంపుటి
  7. బతుకు తొవ్వ కవితా సంపుటి –
  8. భూమి పుత్రులు కవితా సంపుటి –
  9. మనోనేత్రం కవితా సంపుటి –
  10. కార్మిక గీత కవితా సంపుటి –
  11. కాల జ్ఞానం వ్యాస సంపుటి –
  12. వికలాంగుల్లో విజేతలు వ్యాస సంపుటి –
  13. కరీంనగర్ జిల్లా సాహితీమూర్తులు – వ్యాస సంపుటి జనధర్మ పత్రికలో వచ్చింది.
  14. చెప్ప లేదంటనక పోయేరు వ్యాస సంపుటి –
  15. గౌడ నాడు వ్యాస సంపుటి –
  16. నామకరణం పేర్ల పుస్తకం సంకలనం

ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన పుస్తకాల వివరాలు:

  1. మానవతా పరిమళాలు వేముల పెరుమాళ్ళు గారి స్మారక సంచిక –
  2. కీర్తిశేషులు వేముల పెరుమాళ్ళు గారి తెలంగాణ జాతీయాలు –
  3. రాఘవ పట్టణం రామసింహ కవి ఆత్మకథ-
  4. సహకార సమాచారం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సహకార యూనియన్ మాసపత్రిక, 2002,2003,2004.

ప్రభాకర్ అందుకున్న సన్మానాలు సత్కారాల వివరాలు:

  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం నవలా రచనకు –
  2. సాంస్కృతీ సమైక్య,విజయవాడ,వారిచే డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు కవితా సృజన పురస్కారం
  3. హసన్ ఫాతిమా పురస్కారం, K -2013. ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం ఒంగోలు.
  4. గోపా వారి మామిండ్ల రామా గౌడ్ వారి స్మారక పురస్కారం, – 2016.
  5. ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం,నాగపూర్. ఎస్ సి జెడ్ సిసి పద్ నాట్య సమారోహ్ –
  6. తెలంగాణ భాషా సంస్కృతి, రాయికల్ –
  7. ఆచార్య రావికంటి వసునందన్ సప్తతి ప్రతిభా పురస్కారం –
  8. బి. ఎస్. రాములు సాహిత్య స్వర్ణోత్సవ నవలల పోటీ విజేత –
  9. అంతర్నేత్ర ఫౌండేషన్, హైదరాబాద్ వారిచే వికలాంగుల సంక్షేమానికి చేసిన కృషికి పురస్కారం -2018.

~

ప్రభాకర్ వివాహము 14 – 04 -1976 రోజున చంద్రభాగతో చందూర్ గ్రామం, బాన్సువాడ మండలం, నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ప్రభాకర్ చంద్రభాగ దంపతులకు ముగ్గురు సంతానం.

ప్రథమ సంతానం: రోహిత్. భార్య లావణ్య. రోహిత్, అడ్వకేట్‌గా పని చేయుచున్నాడు.

ద్వితీయ సంతానం: విరాట్ గౌడ్. భార్య సమీర. విరాట్ గౌడ్ వ్యాపారం చేయుచున్నాడు.

తృతీయ సంతానం: సుస్మిత. భర్త మనోహర్. సుస్మిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మనోహర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరిద్దరూ యూఎస్ఏ లో ఉంటున్నారు.

ప్రభాకర్ భార్య చంద్రభాగ 18 – 06 -2022 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయింది. ప్రస్తుతం కవి ప్రభాకర్ హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. తనకు సాహిత్య సృజన మరియు పుస్తక పఠనం పట్ల ఆసక్తి మెండు అని చెబుతున్నారు. ఇప్పటికీ ఉత్సాహంగా వివిధ సాహిత్య సమావేశాల్లో పాల్గొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here