Site icon Sanchika

నిజాయితీ భావాల కవిత ‘పరీక్షలు’

[మాదాడి నారాయణ రెడ్డి గారు రచించిన ‘పరీక్షలు’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్, మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని ‘పరీక్షలు’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది.

‘పరీక్షలు’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నన్ను ఆలోచింపజేసింది. రోజువారి జీవితంలో ప్రతి మనిషి పరీక్షలు ఎదుర్కొంటాడు. పుట్టిన పాప మొదలుకొని పండు ముదుసలి వరకు జీవితంలో అనేక రకమైన పరీక్షలు ఎదుర్కొంటాడు. ప్రతి మనిషి సహనంతో పరీక్షలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగవల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతో ఉంది.

ఏదేని వస్తువు యొక్క గుణం, దోషము మొదలైన వాటిని అనుభవపూర్వకంగా చూచుట పరీక్ష. ఏదేని  విషయమునకు సంబంధించి ప్రశ్నల సూచిక పరీక్ష. నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా అని పట్టి పట్టి చూచుట పరీక్ష. ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని పరీక్ష. విద్యార్థుల ఉత్తీర్ణత సాధించడానికి పెట్టేది పరీక్ష. రక్తంలోని లోటుపాట్లను తెలుసుకోవడానికి చేసే పని పరీక్ష. వ్యక్తి యొక్క యోగ్యత, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయు పని పరీక్ష. శోధించే క్రియ కూడ పరీక్ష.

మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజును, యమధర్మరాజు యక్షుని రూపంలో సంధించిన ప్రశ్నలు పరీక్షలు.

ప్రపంచం యొక్క రూపకల్పన తరగతి గదిలోనే జరుగుతుంది అనేది నిజమని చెప్పవచ్చు. భావితరాలకు సామాజిక చింతనను కలిగించి వారిలో గల నైపుణ్యాలను, సృజన శక్తిని తట్టి లేపే ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లనే సామాజిక మార్పులకు బలమైన పునాదులు ఏర్పడతాయని చెప్పడంలో సందేహం లేదు. తరగతి గదుల ప్రభావం నుంచి నూతన తరం ప్రభవించి సమాజం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది.

నారాయణ రెడ్డి (మానారె) ‘పరీక్షలు’ కవితలో వెల్లడించిన భావాల్లో నిజాయితీ ఉంది. సంస్కృతంలో వాక్యం రసాత్మకం కావ్యంలా మనలను ఆలోచింపజేస్తుంది.

పరీక్షలు కవితలోని చరణాల పై దృష్టి సారిద్దాం.

పరీక్షలు (శీర్షిక)

‘నేడు పరీక్షలు
పరాన్న భుక్కుల
మధుర మనోహర స్వప్నాలకు
హక్కుల పట్టాలకు
ముద్రలు వేసే సమావేశాలు’

ఈనాటి వర్తమాన సమాజంలో చదువుకునే విద్యార్థులు పరీక్షలకు సంబంధించి పరాన్న భుక్కులై ఉన్నారు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పరాన్న భుక్కుల గురించి ఆలోచిస్తే ఒక రకమైన బాధ, ఆవేదన కూడా కలుగుతుంది. నేడు నిర్వహిస్తున్న  పరీక్షలు ఒక ప్రహసనంగా ఒక మాయగా అనిపిస్తుంది. పరీక్షల వల్ల చదువుకొన్న విద్యార్థుల బుద్ధి వికసించాలి. చదువుకునే విద్యార్థుల్లో ఇంకా నేర్చుకోవాలి అనే తపన పెరగాలి. ఇవ్వాళ వ్యవస్థలో జరుగుతున్న పరీక్షలు విద్యార్థి లోకానికే కాదు, తల్లిదండ్రులకే కాదు, బాధ్యత గల పౌరులకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనాడు జరుగుతున్న పరీక్షల తీరుపట్ల తీవ్రమైన ఆవేదనకు గురి అయ్యారు. విద్యార్థుల భవితవ్యాన్ని మెరుగైన సమాజం దిశగా మార్చేందుకు పరీక్షలు దోహదం చేయాలి. పరీక్షలు కవిత ద్వారా నారాయణ రెడ్డి (మానారె) వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది. విద్యార్థులు పరీక్షల ద్వారా నేర్చుకొని మంచి పౌరుడుగా ఎదిగేందుకు అందించిన సూచనలు మార్గదర్శకంగా ఉన్నాయి.

ఈనాటి సమాజంలో పరీక్షలకు సంబంధించి పరాన్న భుక్కు అంటే సొంత తెలివితేటల మీద నమ్మకం తగ్గి తాను చదివిన చదువు మీద సరియైన పట్టు లేక ఇతరులు వ్రాసిన సమాధానములను కాపీ చేసే వారు. చిట్టీల మీద వ్రాసుకుని చిట్టీలో ఉన్న సమాధానములను కాపీ చేస్తూంటారు. పుస్తకం నుండి సమాధానములను కాపీ చేస్తుంటారు. పుస్తకమునకు సంబంధించిన గైడ్ ముందు పెట్టుకుని సమాధానములను కాపీ చేస్తుంటారు. ఇట్లాంటి పరాన్న భుక్కులు ఉంటారా? అంటే ఉంటారు అని చెప్పవచ్చు. విద్యార్థులు సరిగా చదవకపోవడం వల్ల ఇతరులు వ్రాసిన సమాధానములను చూసి రాస్తుంటారు.

1969 -1970 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమం ఉవ్వెత్తున కెరటంలా ఎగసింది. 369 మంది తెలంగాణ సాధన దిశగా పోరు బాటలో సాగి అమరులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడింది. విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా తరగతులను బహిష్కరించడం జరిగింది. కళాశాలలు మూతపడటం వల్ల చదువులు కొనసాగలేదు. ప్రత్యేక తెలంగాణ కొరకు సమరం జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కళాశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. కళాశాలలో జరిగే పరీక్షలకు విద్యార్థులు తగిన విధంగా సన్నద్ధం కాలేకపోయినారు. విద్యార్థులు మరియు యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించిన కలలలో తేలిపోతున్నారు. విద్యార్థులు పరీక్ష పాస్ అయితే డిగ్రీ లభిస్తుంది అనే దోరణిలో కొట్టుకుపోతున్నారు. విద్యార్థులు డిగ్రీ పాస్ అయితే చాలు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి అనే తీయని ఇంపైన కలలు కంటున్నారు. కలలు సాకారం కావాలంటే విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. అటువంటి సంక్షోభ సమయంలో జరుగుతున్న పరీక్షలు విద్యార్థులకు హక్కులను కల్పించే డిగ్రీలు అనే పట్టాలకు ముద్రలు వేసే సమావేశాలుగా మాత్రమే కొనసాగినాయి.

విద్యార్థులు పరీక్షల కొరకు చదువుకోలేదు. విద్యార్థులు మూకుమ్మడిగా పరీక్షలలో కాపీ కొట్టడానికి నిర్ణయించుకున్నారు. అటువంటి గడ్డు పరిస్థితిలో కళాశాల పరీక్ష నిర్వాహకులు మరియు ఇన్విజిలేటర్లు కూడా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో విద్యార్థులు పాల్గొని చదువును కొనసాగించలేకపోయినారు విద్యార్థులు పరీక్షల నిర్వహణను సీరియస్‌గా తీసుకొనలేదు. పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు విద్యార్థుల యెడ గల సానుభూతితో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నప్పటికి వారిని నివారింపలేక పోయారు. కాబట్టి జరుగుతున్న పరీక్షలు విద్యార్థుల హక్కుల పట్టాలకు ఆమోద ముద్రలు వేసే సమావేశాలుగా మారిపోయినాయని కవి వ్యక్తం చేసిన భావాల్లో నిజాయితీ ఉంది.

ఆనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు పాల్గొని విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయినారు. విద్యార్థులు పరీక్షలలో పాల్గొని కాపీయింగ్కు పాల్పడటాన్ని చూసి తనలో కలిగిన స్పందనను ‘పరీక్షలు’ అనే కవిత ద్వారా పంచుకున్న భావాలు చక్కగా ఉన్నాయి. కవి నారాయణ రెడ్డి ఆనాటి ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు జరిగిన పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ‘పరీక్షలు’ అనే కవితను రాసి సజీవం చేశారు.

మాదాడి నారాయణ రెడ్డి (మానారె) మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version