‘రామప్ప దేవాలయం’ వైశిష్ట్యాన్ని చాటే డా. మజ్జి భారతి కవిత

0
2

[డాక్టర్ మజ్జి భారతి రచించిన ‘రామప్ప దేవాలయం’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

[dropcap]ప్[/dropcap]రముఖ కవయిత్రి, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం, డాక్టర్ మజ్జి భారతి కలం నుండి జాలువారిన రామప్ప దేవాలయం కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. ‘రామప్ప దేవాలయం’ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరు దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి రామప్ప దేవాలయం, 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

‘శిల్పి పేరు ఉన్న దేవాలయం

అదే రామప్ప దేవాలయం’

కాకతీయుల కాలానికి చెందిన ఆలయంలో ఉన్న దైవం – దేవుని పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు కూడా కలిపి రామలింగేశ్వరుని ఆలయం అని పిలుస్తారు. అలా పిలవడం ఇక్కడ విశేషం అని చెప్పవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునక అని చెప్పవచ్చు.

‘రేచర్ల రుద్రుని సంకల్పం

800 సంవత్సరాల చరిత్ర గల నిర్మాణం’

కాకతీయుల పరిపాలనలో 13,14 శతాబ్దాల మధ్య వెలుగొందిన కాకతీయ రాజు గణపతి దేవుడు రామప్ప దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం రామప్ప దేవాలయాన్ని 1213 లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రేచర్ల రుద్రుని సంకల్పం వల్ల ఆలయ నిర్మాణం జరిగింది. శిలా శాసనాలు కూడా రేచర్ల రుద్రుని పేరుని తెలియజేస్తున్నాయి. ఇట్టి రామప్ప ఆలయం 800 సంవత్సరాల చరిత్ర గల నిర్మాణం అని కవయిత్రి భారతి తెలియజేయడం చక్కగా ఉంది.

‘రామలింగేశ్వరుని ఆలయం

లేనేలేదు గర్భగుడికి గవాక్షం’

రామప్ప ఆలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. రాముడు కొలిచిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడు అని వ్యాప్తిలో ఉంది. రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం అని చెప్పవచ్చు. తూర్పు దిశాభిముఖంగా ఎత్తయిన వేదికపై గర్భాలయం ఉంది. గవాక్షం అంటే  ఏమిటి? కిటికి. ఆంగ్లంలో వెంటిలేటర్ అని అర్థం. ఒక గదిలోకి గాలి చక్కగా వీచడానికి వెలుతురును గదినిండా ప్రసరించడానికి ఏర్పాటు చేయబడిన చతురస్రపు లేదా వృత్తాకార రంధ్రం తలుపులతో కూడి ఉండడాన్ని గవాక్షం అంటారు. గర్భగుడిలోని కేంద్ర చిహ్నం యొక్క కాంతి మరియు వైభవాన్ని ప్రతీకాత్మకంగా గవాక్షం ప్రసరింపజేస్తుంది. ప్రత్యామ్నాయంగా వారి దేవత ప్రపంచాన్ని చూసేందుకు ఒక కిటికిని అందిస్తున్నట్లు చెప్పబడింది. గదికి కిటికీ అవసరం. దేవుని గదికి గవాక్షం ఉంటే గాలి వెలుతురు వస్తుంది. గర్భగుడికి గవాక్షం లేకుంటే గాలి, వెలుతురు ఎలా వస్తాయి?అక్కడ గర్భగుడికి గవాక్షం లేదు అని చెప్పడం చక్కగా ఉంది.

‘ఐనా శివలింగం చుట్టు కాంతిపుంజం

ఇదో సాంకేతిక అద్భుతం’

తూర్పు దిశాభిముఖంగా ఎత్తు గల వేదిక పై గర్భాలయం ఉంది. అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారం గల మహా మండపం కలిగి ఉంది. ఇందలి గర్భాలయమున ఎత్తు గల పీఠం పై నల్లని నున్నని రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. శివలింగం చుట్టు కాంతి పుంజం కాంతులు వెదజల్లుతూ ఉంది. శివలింగం ప్రకాశమానమై వెలుగుతుండడం, ఆనాటి శిల్పుల ప్రతిభ మరియు సాంకేతికత అద్భుతం అని కవయిత్రి భారతి వ్యక్తం చేయడం హృద్యంగా ఉంది.

‘ఇసుక పునాదులపై కట్టడం

భూకంపాలకు చెదరని నిర్మాణం’

రామప్ప ఆలయాన్ని ఇసుక పునాదులతో కట్టడం ఆనాటి శిల్పుల ప్రతిభ అని చెప్పవచ్చు. భూకంపం వస్తే అన్ని రకాల కట్టడాలు నేల మట్టమవుతాయి. రామప్ప ఆలయం 800 సంవత్సరాల కింద నిర్మించినప్పటికీ భూకంపాలు వచ్చినప్పటికీ ఆ దేవాలయం యొక్క కట్టడాన్ని ఏమీ చేయలేదు. చెక్కుచెదరని నిర్మాణం అద్భుతమని కవయిత్రి భారతి తెలియజేశారు.

‘తేలే ఇటుకలతో నిర్మితం గోపురం

ఇన్నేళ్లయినా చెక్కుచెదరని దారుఢ్యం’

రామప్ప దేవాలయ గోపురం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఆలయానికి వాడిన ఇటుకలు నీటిమీద తేలేటంత తేలికైనవి. రామప్ప ఆలయాన్ని నిర్మించి వందల సంవత్సరాలు అయినప్పటికి ఆ కట్టడాల నిర్మాణం ఇప్పటికి చెక్కుచెదరలేదు. ఆనాటి రాజులు కట్టడాలు నిర్మించడంపై సరైన శ్రద్ధ చూపారు. ఈనాటి మన పాలకులు ఒక వర్షానికే పాడైపోయే రోడ్లు వేస్తున్నారు. ప్రభుత్వ కట్టడాల నిర్మాణాల్లో నాణ్యత ఉండడం లేదు. పాలకులు అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఈనాటి పాలకుల అవినీతి ప్రవర్తన సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. ఆలయ గోపురం నిర్మితమై వందల సంవత్సరాలు అయినప్పటికి చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న ఆ దేవాలయాన్ని సందర్శించిన కవయిత్రి భారతి తనలో కలిగిన అనుభూతిని కవిత ద్వారా వ్యక్తం చేయడం గొప్పగా ఉంది.

‘రాయిని కరిగించి చేసిన స్తంభం

ఇప్పటికీ మెరుపు పోని వైనం’

గర్భగుడికి ఎదురుగా మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రాయిని కరిగించి చేసిన స్తంభం ధగధగా మెరుస్తూ ఉంది. వందల సంవత్సరాలు అయినప్పటికి స్తంభం చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. స్తంభాల నిర్మాణం ఆనాటి శిల్పుల యొక్క ప్రతిభను తెలియజేస్తున్నది. శిల్పుల కళాత్మకతకు అద్దం పడుతున్నది.

‘నల్ల రాతిపై శిల్పకళా చాతుర్యం

నేటికి తళ తళలాడే కళా వైభవం’

గర్భాలయమున ఎత్తైన పీఠంపై నల్లని నునుపైన రాయితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. మహా మండపం మధ్య భాగమున గల కుడ్య స్తంభములు వాటి పై గల రాతి దూలములు రామాయణ, పురాణ,ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. నల్ల రాతిపై చెక్కిన శిల్ప కళా చాతుర్యం అద్భుతం. కాకతీయుల కాలంనాటి శిల్పకళావైభవం అపూర్వం అని చెప్పడంలో సందేహం లేదు.

‘సర్వాలంకృత నంది విగ్రహం

ఎంత చూసినా తనివి తీరని సమ్మోహనం’

రామప్ప ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. నంది ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టుకొని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది. ఆలయంలో ముందు ఉన్న నందిని ఏ దిశ నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. నంది అలా అగుపించడం విశేషం అని చెప్పవచ్చు. సర్వాలంకృతమైన నంది విగ్రహం ఎంత చూసినా తనివి తీరని సమ్మోహనం అని కవయిత్రి భారతి పేర్కొనడం చక్కగా ఉంది.

‘ప్రక్కనే రామప్ప తటాకం

చుట్టూ అందమైన పూలవనం’

రామప్ప దేవాలయం ప్రక్కనే రామప్ప చెరువు ఉంది. ఈ రామప్ప చెరువు కాకతీయుల కాలం నాటిది. చెరువు నీరు వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రాత్మక గ్రామం అని చెప్పవచ్చు. చెరువు తన చుట్టూ ఉన్న అందమైన పూలవనంతో అలరారుతూ చూపరులను ఆకట్టుకుంటుంది. చెరువు ప్రకృతికి పర్యాయపదంలా ఉంది. అలల నీటి గలగలలతో చెరువుగట్టు శోభాయమానంగా ఉంటుంది. పచ్చని పూల చెట్లతో,పక్షుల కిలకిలారావాలతో కళకళలాడుతూ రమణీయంగా ఉంటుంది.

‘ఇప్పుడిది ప్రపంచ వారసత్వ కట్టడం

తెలుగు జాతి ఆత్మ గౌరవం.’

కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. 2021 జులై 25న ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడింది. యునెస్కో రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా 800 సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించారు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురం నిర్మించారు. ఆలయ నిర్మాణానికి వాడిన నల్ల రాయి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం చెప్పదగినది. రామప్ప ఆలయ పరిరక్షణకు యునెస్కో సంస్థ పలు సూచనలు చేసింది. ఇప్పుడు ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. తెలుగువారి ఆత్మగౌరవం కూడా ఇనుమడింపజేసింది అని కవయిత్రి భారతి కవితలో వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి.

భారతికి రామప్ప ఆలయం పట్ల గల శ్రద్ధకు నిదర్శనం ఆమె రాసిన ‘రామప్ప దేవాలయం’ కవిత అని చెప్పవచ్చు. డాక్టర్ మజ్జి భారతి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


కవయిత్రి, డాక్టర్ మజ్జి భారతి 1965 సంవత్సరంలో జన్మించారు. వీరు డోలపేట గ్రామం శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. వీరు ఇంటర్మీడియట్ వరకు రాజాంలో చదువుకున్నారు. వీరు ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. వీరు శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిగా పనిచేశారు. వీరు సూక్ష్మ జీవశాస్త్ర విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు ఆంధ్ర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వీరు ప్రస్తుతం శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వైద్య విద్యా బోధనతోపాటు విద్యార్థులకు నైతిక విలువల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వీరు 11 ఏళ్ల వయసులో దేశభక్తి మీద కవిత రాశారు. వీరు రచించిన ‘ఆలోచనా తరంగాలు’ కథల సంపుటి 2022 సంవత్సరంలో ప్రచురింపబడింది. వీరు రాసిన 20 కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరు కవితలు, కథలు, పద్యాలు రాస్తున్నారు. వీరికి చిత్రలేఖనం, చిత్రగ్రహణం అంటే మక్కువ. వీరు వైద్య వృత్తిపరంగాఎన్నో అవార్డులు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here