సేవాధురీణ శ్రీమతి పొణకా కనకమ్మ

6
2

[dropcap]10[/dropcap]-06-2022 పొణకా కనకమ్మ గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆంధ్ర ప్రాంతం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా, బాపూజీ ఆశయాలకు అనుగుణంగా వివిధ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళిన మహిళగా చరిత్ర సృష్టించారామె. కస్తూరిదేవి విద్యాలయాన్ని నిర్వహించిన స్త్రీ విద్యావేత్త. పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని స్థాపించేందుకు స్థలాన్ని అందించిన దాత. స్వయంగా ఖాదీని వడికి, ధరించి, అమ్మిన ఖాదీ ఉద్యమకారిణి. విప్లవ పథం వైపు మొగ్గి తుపాకీని పేల్చడం నేర్చుకున్న విప్లవోద్యమకారిణి. అయితే బాపూజీ సత్యాహింసాయుధాల పట్ల ఆకర్షితురాలైన శాంతియుత ఉద్యమ ప్రచారిణి.

స్వయంగా వివిధ భాషలను అభ్యసించి, వివిధ గ్రంథాలను తెలుగు భాషలోకి అనువదించారామె. ‘భగవద్గీత’ను ‘జ్ఞాననేత్రం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈమె లక్ష్మీబాయమ్మ గారూ కలిసి మహిళలు చేసిన అనువాదం చాలా గొప్పగా ఉందని శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ప్రశంసించారు. ఈ గొప్ప మహిళే శ్రీమతి పొణకా కనకమ్మ.

ఈమె 1892 జూన్ 10 వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ (నేటి ఆంధ్రప్రదేశ్ లోని) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో జన్మించారు. తల్లి కామమ్మ, తండ్రి మరుపూరు కొండారెడ్డి. గొప్ప పేరున్న ధనిక భూస్వామ్య కుటుంబం వీరిది.

9 ఏళ్ళ వయస్సులోనే మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో ఈమె వివాహం జరిగింది. పుట్టిల్లు, అత్తిల్లు కూడా ధనికులే! ‘జమీన్’ పత్రికను స్థాపించిన కుటుంబం వీరిది. ఈమెకు విద్య పట్ల మక్కువ ఎక్కువ. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. అందుచేతనే బాల్యంలో పాఠశాల విద్య అంతగా లేకపోయినా కష్టపడి చదువుకున్నారు. తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో పాండిత్యాన్ని సంపాదించారు. గొప్ప సాహితీవేత్తగా ఎదిగారు. విద్యావేత్తగా విద్యాలయాలను స్థాపించారు.

ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు, కనకమ్మ గారు జంట కవయిత్రులు. వీరిద్దరూ కలిసి ‘ఆరాధన’ అనే కావ్యాన్ని వ్రాశారు. శశిరేఖ, హిందూ సుందరి, అనసూయ పత్రికలలో ఈమె రచనలు ప్రచురించబడ్డాయి. ఈమె పద్యకవయిత్రి, వ్యాస రచయిత్రే కాదు. మంచి కాలమిస్ట్ కూడా! ‘హిందూసుందరి’ పత్రికలో ‘చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో అనేక వ్యాసాలు వ్రాశారు. ‘రాణిపద్మిని’ నవల రచించి నవలా రచయిత్రి అయ్యారు.

వీరు గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధురాలు. ఈమె తొలి రోజులలో చెన్నపట్టణంలోని ఓ.వి.చిదంబరం పిళై, ఉన్నవ లక్ష్మీనారాయణ గార్లతో కలిసి తుపాకులు, బాంబులతో పోరాటంలో పాల్గొనాలని భావించారు. కాని భారత జాతీయ పోరాట ఘట్టాలలో గాంధీయుగం మొదలైన తరువాత సంపూర్తిగా గాంధేయవాదిగా మారారు.

గాంధీజీ పిలుపునందించిన శాసనోల్లంఘనోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమం, ఉప్పుసత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలయిన వాటిలో ఉత్సాహంతో పాల్గొన్నారు.

నెల్లూరు ప్రాంతంలో వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమ నాయకుల కుటుంబంగా పేరుపొందింది. శ్రీయుతులు బాపూజీ, బిపిన్ చంద్రపాల్, బాబూ రాజేంద్రప్రసాద్, టంగుటూరి ప్రకాశం పంతులు, యన్.జి.రంగా, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ మొదలయిన నాయకులు వీరింటి ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. వీరి గృహంలో ఉద్యమాలను గురించి చాలా చర్చలు జరిగేవి.

ఆంధ్రప్రాంతం నుండి కాంగ్రెస్ కార్యకలాపాలలో పాల్గొన్న తొలి మహిళ ఈమె. 1934లో ‘ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్’కు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె కుమార్తె వెంకట సుబ్బమ్మ బాపూజీ నెల్లూరు పర్యటనకు వచ్చినపుడు తన వంటిమీద నగలన్నీ కాంగ్రెస్ నిధికి విరాళంగా అందించి తల్లికి తగ్గ తనయ అనిపించుకున్నారు. కనకమ్మ జైలు శిక్షను కూడా అనుభవించారు. ఖద్దరు స్వయంగా తయారు చేసి, ధరించారు. ఇల్లిల్లు తిరిగి ఖద్దరును అమ్మారు.

ఈమె 1913లో సుజనరంజనీ సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం ద్వారా సంఘసేవా కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను, స్వాతంత్ర్య పోరాట విషయాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించేవారు.

ఈమె బాలికల విద్యకోసం కస్తూర్బా పట్ల గౌరవంతో 23 ఎకరాల స్థలాన్ని దానంగా అందించి, ధనాన్ని వెచ్చించి ‘కస్తూరిదేవి విద్యాలయాన్ని’ స్థాపించారు. దీనికి బాపూజీ పునాదిరాయి వేశారు. ఈమె రాయవెల్లూరులో జైలుశిక్షని అనుభవించినపుడు విద్యాలయం తాత్కాలికంగా మూసి వేశారు. జైలు నుండి విడుదలయిన అనంతరం మళ్ళీ స్కూలుని తెరిపించారు. కాని ఈమె ప్రాణమైన పాఠశాలని ఈమెకి దూరం చేసి మానసికంగా బాధించారు ధనిక నిర్వాహకులు.

1930, 1932 సంవత్సరాలలో ఈమెతో పాటు రాజాజీ, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయ్ దేశ్‍ముఖ్ వంటి వారు రాయవెల్లూరులో శిక్షని అనుభవించారు.

1921లో బాపూజీ పల్లెపాడు గ్రామంలో ఒక గాంధీ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని పినాకినీ నది పేరుతో చిరస్థాయిగా నిలపడం కోసం 13 ఎకరాల స్థలాన్ని అందించారు తమ దాతృత్వ గుణాన్ని సుసంపన్నం చేశారు. దీనికి ‘పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం’ అని పేరు పెట్టారు. గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను పూర్తిగా అనుసరించిన సింహపురి ప్రాంతపు ఆశ్రమంగా పేరు పొందింది. శ్రీ చతుర్వేదుల కృష్ణయ్య, దిగుమర్తి హనుమంతురావులు ఈ సమాజాన్ని గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించారు.

ఈమె గ్రంథాలయోద్యమంలో కూడా కృషి చేశారు. 1913లో కొత్తూరులో నెల్లూరు వాసుల సహాయంతో ‘వివేకానంద గ్రంథాలయాన్ని’ నెలకొల్పారు. ఇంకా అనేక గ్రామాలలో గ్రంథాలయాలను స్థాపించారు.

పలు కారణాలవలన ఈమె ఆస్తులను పోగొట్టుకున్నారు. భర్తని, కుమార్తెని పోగొట్టుకున్నా మానసికంగా తట్టుకుని నిలబడి తన కార్యక్రమాలని ధైర్యంగా నిర్వహించారు.

ఈమె కుటుంబ సభ్యులలో ఎక్కువ మంది సాహితీ సృజనకారులు, స్వాతంత్ర్యసమర యోధులు, సంఘసేవకులు కావడం విశేషం.

ఈమెని పలు సత్కారాలు వరించాయి. 1955లో గృహలక్ష్మీ స్వర్ణకంకణం లభించింది. శ్రీమతి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ‘మద్రాసు మహిళా సభ’ రజతోత్సవ సభలలో తన మిత్రురాలు, సహ స్వాతంత్ర పోరాట యోధురాలు, జైలులో సహాధ్యాయి, సంఘసంస్కరణాభిలాషి అయిన ఈమెను తన చేతులతో స్వర్ణకంకణాన్ని అందించి సత్కరించి గౌరవించారు.

1963 సెప్టెంబర్ 15వ తేదీన మరణించారు.

“స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలము. ఒక పత్రికా నిర్వహణమునే కాదు. రాజ్యాంగమునే శాసించగలము”. అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఈమె తన స్వీయచరిత్రని ‘కనకపుష్యరాగం’ పేరుతో గ్రంథస్థం చేశారు. దీనిని 2011లో డాక్టర్ పురుషోత్తంగారు వెలుగులోకి తెచ్చి మనకి అందించారు. కనకమ్మగారు చివరి రోజులలో ఆరోగ్యం క్షీణించి, ఇబ్బందులు పడి, అష్టకష్టాలకు గురయినప్పటికీ స్వీయచరిత్రని పూర్తి చేశారు.

ముఖ్యంగా ఈ చరిత్రలో ఆత్మస్తుతీ, పరనిందా రెండింటికీ తక్కువ ప్రాముఖ్యతనిచ్చి తన సంస్కారాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

ఈమె జ్ఞాపకార్థం 08-03-2021వ తేదీన తపాలాశాఖ ప్రత్యేక కవరును ముద్రించి గౌరవించింది. ఈమె చిత్రాన్ని అందమైన చట్రంలో ముద్రించారు. శాంత గంభీరంగా తేజస్సుతో కనిపిస్తుందీమె చిత్రం.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here