[dropcap]ప్రే[/dropcap]మ అనేది అందరికీ ఒకటే! అయితే వారి వారి స్థాయిని బట్టి రూపం మారుతుంది. పేదవాళ్ళు ప్రదర్శించుకునే ప్రేమ మామూలు వాళ్ళకి వింతగా అనిపించవచ్చు. వాళ్లు ప్రేమించుకోవడానికి ప్రత్యేక స్థలాలు లేకపోవచ్చు ఉత్తరాలు లేకపోవచ్చు, మొబైల్ ఫోన్‌లు లేకపోవచ్చు, ప్రేమ సందేశాలు అందించే ఇతర సాధన ప్రక్రియలు లేకపోవచ్చు, ప్రేమ సంభాషణలు చెప్పుకునే వెసులుబాటు లేకపోవచ్చు. కానీ వారికీ ఒక మనసనేది ఉంటుంది. అందచందాలను ఆస్వాదించగల మనసూ ఉంటుంది. అది ప్రేమ అని తెలియకపోయినా ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణా ఉంటుంది. మనసు పారేసుకోవడమూ ఉంటుంది. కష్టపడి పని చేస్తూ పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్న భార్యను, కొంచెం కూడా భార్యని సుఖపెట్టక పోగా తాగి వచ్చి తందానాలాడుతూ వివిధ రూపాల్లో భార్యలను హింసించే భర్తలను ఏ భార్య అయినా ఎంతకాలం ఓపికపట్టి సహించగలదు? కొందరు హింసను భరిస్తూ అలాగే భర్తను కూడా భరిస్తుంటారు. వీళ్ళు సమాజాన్ని, ఎదుగుతున్న పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని అలా నరకం అనుభవిస్తూనే వుంటారు. కానీ అందరూ అలా వుండలేరు, తమను ప్రేమగా చూసుకునే వారిని వెతుక్కుంటూ పోతారు. అందులో వారు విజయం సాధించనూ వచ్చును లేదా అక్కడ కూడా ఓడిపోవచ్చును. ప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు కె. కె. మీనన్, ‘సీతాలు గుడిసె మారింది’ (ఇది స్త్రీకింగ్ కాదు.. కథా సంపుటి) అనే తన కథలో ఇదే ఇతివృత్తంతో చక్కని కథను రాసి, సుఖం కోసం తాను చేసిన పనిని సమర్థిస్తారు. పేదవాళ్ళు, పనిచేసుకునేవాళ్లు మాత్రమే కాదు, సమాజంలో గొప్పవాళ్లుగా చెలామణి అయ్యేవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారు. లేదంటే పేదింటి ఆడది ఈ పని చేస్తే ‘లేచిపోయింది’ అంటారు. గొప్పోళ్ళ ఆడది ఇంకొకరితో వెళ్ళిపోతే దానికి ‘సహజీవనం’ అని పేరు పెడతారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా సహజీవనం పేరుతో సంసారాలు చేసి పిల్లల్ని కంటున్నారు, అది వేరే విషయం. దానికి కోర్టులు కూడా ఆమోదముద్ర వేసాయి.
ఇక అసలు కథలోకి వస్తే ‘ప్రేమంటే..’ అనే కథలో రచయిత్రి ఒక పనిమనిషి ప్రేమకథను అద్భుతంగా చిత్రించి తన కలంలోని బలం నిరూపించుకున్నారు. చాలామంది గొప్పింటి మహిళలు తమ పనిమనుషులను వారి జీవితాలను అసలు పట్టించుకోరు కదా, అసహ్యించుకుంటారు కూడా! కొందరు అలా కాదు, వారి కష్టసుఖాలను గమనించి లేదా తెలుసుకుని తగిన సూచనలు-సలహాలు ఇవ్వడమో లేదా తగురీతిలో సహాయం చెయ్యడమో జరుగుతుంటుంది. ఈ కథలో యజమానురాలు ఈ రెండవ కోవకు చెందుతుంది. అలా కథ ‘రత్తాలు పదమూడో రోజున పనిలోకి వచ్చింది’ అని మొదలుపెడతారు రచయిత్రి. ఈ కథలో హీరో, హీరోయిన్, విలన్, అన్నీ రత్తాలు పాత్రకే ఆపాదించారు. కథ మామూలుదైనా కథను చెప్పడంలో వారి ప్రత్యేక ప్రావీణ్యతను నిరూపించుకున్నారు. రచయిత్రి ఎన్నుకునే పదజాలం కథకు ప్రత్యేకతను సమకూరుస్తాయి.
భర్త చనిపోయిన పదమూడో రోజు రత్తాలు పనికి వచ్చింది. పిటపిటలాడే రత్తాలు, నీరసంగా దుఃఖంతో నిండివున్న ఆమెను ‘బాగా ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లున్న రత్తాలు మొహం నూనెతో మర్దనా చేసినట్లు నల్లగా మెరుస్తోంది. చీది.. చీది ఆమె బండ ముక్కు మరింత లావయింది’ అని ఆమె అప్పటి పరిస్థితిని వర్ణిస్తారు. దుఃఖంలో వున్నరత్తాలును ముందు కాఫీ తాగమని కప్పుకాఫీ ఇస్తుంది యజమానురాలు. కాఫీ త్రాగుతున్నప్పుడు ఆపుకోలేని ఆమె దుఃఖాన్ని ‘ఆమె ఎదపొంగులు ఇంకా ఎగిసిపడుతూనే వున్నాయి’ అంటారు రచయిత్రి. ఇలాంటి ప్రయోగాలు రచయితలు చేస్తే దుమ్మెత్తి పోస్తారు మహిళా విమర్శకులు. ఇలాంటి సాహసాలు చేయడం రచయిత్రికి కొట్టినపిండి అన్న విషయం రచయిత్రి కథలన్నీ చదివితే చక్కగా అవగాహన కలుగుతుంది.
ఆమెను చూచిన తర్వాత యజమానురాలి కలిగిన సందేహాన్ని ఇలా అడుగుతుంది. “మీలోభర్త పోయాక పసుపుకుంకుమలు తీసివేసే ఆనవాయితీ లేదా?” అని హిందూ సంప్రదాయానికి సంబందించిన విషయాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ పనిమనిషి అన్న మాటలతో అసలు కథకు మార్గం సుగమం అవుతుంది.
“ముండని.. మళ్ళీ ఏమి ముండమోపుతారమ్మా” అని పనిమనిషి అన్నప్పుడు, యజమానురాలు “అవేం మాటలే” అంటుంది. అప్పుడు రత్తాలు అసలు కథకు శ్రీకారం చుడుతుంది.
“యాదయ్య పెండ్లాన్ని నేను ముండని చేశానమ్మా” అంటుంది రత్తాలు.
“యాదయ్య నీ భర్త కాడా?” అని ఆశ్చర్యం వెలిబుచ్చుతుంది యజమానురాలు.
“కాదమ్మా నేను ముండమోసి ఏడేళ్లు అయింది. రంకుముండనై రెండేళ్లు అయింది. నా పెనిమిటి వెంకటయ్య” అని చెబుతుంది. కథ అంతా ఈ మాటల్లోనే అల్లుకుని వుంటుంది. ఇలాంటి పదాల వాడకం రచయితికి అలవోకగా వచ్చేస్తుంది.
కథను వదలకుండా చదివించే శైలి రచయిత్రికి ఉండడం వల్ల, ఈ కథనే కాదు ‘చీకటి వెన్నెల’ కథల సంపుటిలోని కథలన్నింటినీ వదలకుండా చదివిస్తాయి. కథా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి అభినందనలు.
పుస్తకం కావలసినవారు, రచయిత్రిని 98660 5965, మొబైల్ నంబరుతో సంప్రదించ వచ్చును.