క్వాంటమ్ టెక్నాలజీపై పైచేయికి ఎందుకంత ఆసక్తి?

1
2

[క్వాంటమ్ టెక్నాలజీపై పైచేయి సాధించడానికి దేశాలు ఎందుకు ఆసక్తి చూపుతున్నాయో ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]

[dropcap]సూ[/dropcap]క్ష్మాతిసూక్ష్మమైన స్థితిలో పదార్థం/మేటర్ తరంగ ధర్మాన్ని, రేణువు ధర్మాన్ని రెండిటినీ కలిగి ఉంటుంది. దీనికి కాంతి కిరణం చక్కటి ఉదాహరణ. కాంతిని విశ్లేషిస్తే అది సూక్షాతిసూక్ష్మమైన రేణువుల గొలుసుకట్టు అని తెలుస్తుంది. ఈ ద్వంద్వత లేదా విశిష్టతను శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను వినియోగించి పట్టుకోగలగడమే క్వాంటమ్ టెక్నాలజీ మూల సూత్రం. అలా రెండు రకాల ధర్మాలను కలిగి ఉన్న స్థితిలో ఉన్న రేణువులను విడగొట్టి బిట్స్‌గా వినియోగించుకోవడమే క్వాంటమ్ కంప్యూటింగ్.

క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోజనాలలో ముఖ్యమైనది అణుస్థాయిలో పదార్ధాల ప్రవర్తనను ప్రేరేపించడం. అయితే క్వాంటమ్ స్థితి చాలా సున్నతమైనది. ఇది 0 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే పని చేస్తాయి. ఉష్ణోగ్రతలో చిన్న మార్పు సైతం ఫలితాలను తారుమారు చేయవచ్చు. ఉష్ణోగ్రత మార్పులే కాకుండా ప్రకంపనాలలో ఏ చిన్న మార్పులు సంభవించినా ఇవి తమ ప్రత్యేక స్థితి నుండి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా వీటిని అతి శీతల వాతావరణంలో ప్రత్యేకమైన ఛాంబర్స్‌లో ఉంచుతారు. కొన్ని సంస్థలు సిలికాన్ చిప్స్ మీద ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ లోని రేణువులను ఒడిసి పడుతున్నాయి. మరి కొన్ని క్రయో విధానంలో చల్లదనాన్ని నిర్దేశిస్తున్నాయి. ఏది ఏమైనా ఇదంతా ఒక సంక్షిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ క్వాంటమ్ విధానంలో ఒనగూరే ప్రయోజనాలు విశిష్టమైనవి.

సంప్రదాయ కంప్యూటర్లలో ‘బిట్స్’ నంబరును రెట్టింపు చేస్తే వాటి శక్తి రెండింతలు అవుతుంది. కాని క్వాంటమ్ పరికరాలు/కంప్యూటర్లలో ‘క్యూబిట్స్’ సంఖ్యని పెంచితే ఆ పరికరాల సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది. కారణం వాటి పరస్పర అనుసంధానత/ఎన్‌టాన్‌జిల్‍మెంట్ అనబడే ప్రత్యేక ధర్మం. ఆ ప్రత్యేకత కారణంగానే సంప్రదాయ కంప్యూటర్ సంవత్సరాలలో చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్ క్షణాలలో పూర్తి చేయగలగుతుంది. క్వాంటమ్ క్రిష్టోగ్రఫీ విధానంలో ఎక్కువ డేటాని ఎక్కవ వేగంగా ప్రాసెస్ చేసి భద్రపరచడానికి వీలవుతుంది. స్విట్జర్లాండ్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ముఖ్యమైన సమాచారాన్ని ‘క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ’ లోనే భద్రపరుస్తున్నారు.

చైనా:

చాలా కాలం క్రిందటే చైనా శత్రు దుర్భేద్యమైన కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం శాటిలైట్స్‌ను రూపొందించి ప్రయోగించింది. 2016లో ప్రయోగించిన ‘Micius’ ఆ కోవ లోనిదే. హేకింగ్‌కు చిక్కని సమాచార వ్యవస్థల రూపకల్పన దిశగా ప్రయోగాలకై ‘Micius’ ప్రయోగించబడింది. క్వాంటమ్ టెక్నాలజీ ఆధారిత రాడార్‌నూ రూపొందించింది. ఆ రాడార్ స్టెల్త్ సబ్ మెరైన్స్, యుద్ధవిమానాలు వంటి వాటి జాడను పసిగట్టగలదు. అక్కడ ఈ రంగంలో పరిశోధనలూ ముమ్మరంగానే సాగుతున్నాయి. హక్కుల నమోదుకై పేటెంట్ ఆఫీస్‌కు అప్లికేషన్లు గణనీయమైన సంఖ్యలోనే అందుతున్నాయి.

మన దేశంలో:

ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటేషన్ సెన్సర్స్‌లో చక్కగా ఉపయోగపడుతోంది. భౌతిక శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఇంజనీర్లు ఇలా వివిధ రంగాలలోని నిపుణులు సమన్వయంతో మన దేశంలో బెంగుళూర్ లోని IISC 2020లో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనకు శ్రీకారం చుట్టింది. రామన్ రీసెర్చ్ సెంటర్, IISC, సీడాక్ కలసి సంయుక్తంగా క్వాంటమ్ కమ్యూనికేషన్, సెన్సింగ్ రంగాలలో పరిశోధనలు జరుపుతున్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హరీశ్ చంద్ర రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలను సాగిస్తున్నాయి. అనేక IIT లు క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here