రాజయోగిని దాది జానకి

15
3

[box type=’note’ fontsize=’16’]జనవరి 1 వతేదీ రాజయోగిని దాది జానకి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.[/box]

***

ప్రజాపిత బ్రహ్మకుమారీలు ఈశ్వరీయ విద్యాలయాన్ని గురించి, బ్రహ్మకుమారీలు వివిధ రంగాలలో అందించే సేవలను గురించి మనకు తెలుసు. పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అహింస, సత్యం, శాకాహార ప్రచారం, శాంతి, సామరస్యం, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం వంటి వాటి కోసం విస్తృత ప్రచారం చేయడంతో సరిపెట్టరు వీరు. ఆచరణలోనూ స్థిరచిత్తాన్ని చూపిస్తారు. భారతీయ ధ్యానానికి విశ్వవ్యాప్త ప్రచారాన్ని గావించారు. ఈ సంస్థలో సామాన్య సభ్యురాలిగా ప్రవేశించి 60 ఏళ్ళ వయస్సులో విదేశాలలో సంస్థ కార్యకలాపాలని సుసంపన్నం చేసి, 91 ఏళ్ళ వయస్సులో స్వదేశానికి తరలి వచ్చి సంస్థ అధిపతిగా 104వ ఏట వరకు సేవలందించి, భారత ప్రధాని చేత ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన మహిళామణి రాజయోగిని దాది జానకి. దాది అంటే పెద్దక్క అని అర్థం.

ఈమె నాటి అవిభక్త భారతదేశంలోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హైదరాబాద్ (నేటి పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో) జనవరి 1వ తేదీన జన్మించారు. 4వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఈమె తండ్రితో కలిసి దేశమంతా పర్యటించారు. సాధువుల జీవనం ఈమెను అమితంగా ఆకర్షించింది. 19 ఏళ్ళ వయస్సులో తండ్రితో కలిసి గుర్రపు బగ్గీ మీద ప్రయాణం చేసేవారు. దారిలో కనిపించే రోగులకు సాయం చేసేవారు. వృద్ధులను చూసి బాధపడేవారు. ఈమె మనసులో జాలి, దయ, కరుణ తొణికిసలాడుతుండేవి. ఈమెకి వివాహం జరిగింది. అయితే ఈమె భర్త మాట వినలేకపోయారు. ఆమె మనసంతా సాధుజీవనం, ఆధ్యాత్మికతలతో నిండి ఉండేది. తనకి సహకరించని భార్యను కొట్టి, హింసించి గృహ నిర్బంధం చేశారు.

1937లో ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. 1937లో ‘ఓం మండలీ సంస్థ’ లో సభ్యురాలిగా చేరారు.

1935లో లేఖరాజ్ ఖుబ్‌చంద్ కిర్పిలానీ (ఓం బాబా లేదా బ్రహ్మబాబా) ఈ సంస్థని స్థాపించారు. ఈ సంస్థని నాటి సింధ్ ప్రావిన్స్ నేటి పాకిస్థాన్‌లోని కరాచీలో స్థాపించారు. వీరు సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారి. ఈ సంస్థలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సంపన్నులు సభ్యులుగా చేరారు.

ఇది సత్సంగశైలిని ప్రోత్సహించేది. ఈ సంస్థ బోధనా సిద్ధాంతాలు భగవద్గీతాసారానికి దగ్గరగా ఉంటాయి. ‘ఓంకారం’ తో ప్రసంగాలను మొదలు పెట్టే సంస్థ కాబట్టి దీనికి ‘ఓం మండలి’ అనే పేరు సార్ధకత చేకూర్చింది.

సంవత్సరాలు గడిచిన కొద్దీ ఈ సంస్థ మహిళా కేంద్రీకృతంగా తయారయింది. 8 మంది సభ్యులతో కూడిన నిర్వహణ కమిటీ దీనిని నిర్వహించేది. సభ్యురాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అవివాహితులై ఉండాలి. ఈ బృందానికి రాధే పోకర్ రాజ్‌వానీ అధ్యక్షురాలిగా పనిచేసేవారు.

ఈ సంస్థలో దాది జానకి కీలకమైన బాధ్యతలను నిర్వహించేవారు. ఈ సంస్థ తర్వాత కాలంలో బ్రహ్మకుమారీ సంస్థగా మారింది.

మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఈ బ్రహ్మకుమారీ సంస్థకు వ్యతిరేకంగా ‘Anti Om Mandali Committee’ ఒకటి పికెటింగ్ చేసింది. దీనిని ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా కూడా ప్రకటించారు. అయినప్పుటికీ ఈ సంస్థ సభ్యురాళ్ళకున్న మంచి సిద్ధాంతాలు, అలవాట్లు, జీవన విధానం వలన ఇది సత్సంగంగా కొనసాగింది.

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత 1950లో ఈ సంస్థని భారతదేశానికి తరలించారు. రాజస్థాన్ లోని మౌంట్ ఆబూ దీనికి కార్యక్షేత్రంగా మారింది. దీని పేరును ‘బ్రహ్మకుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ’గా మార్చారు.

ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థని దాది జానకి తన నేతృత్వంలో నడిపారు. ఆధ్యాత్మిక ఉపవ్యాసాలను ఇచ్చేవారు. రోజుకి ఐదారుసార్లు మురళిని చదివేవారు. ఆత్మ స్పృహ యొక్క అన్వేషణని నిరంతరం కొనసాగించేవారు. ఆధ్యాత్మిక సాధన కోసం యోగా చేసేవారు. బ్రహ్మకుమారీల కార్యకలాపాల కోసం, ప్రచారం కోసం ఈమె చేసిన కృషి ఎనలేనిది. 1950 తరువాత వివిధ నగరాలలో తిరిగి ప్రచారం చేశారు. 1965లో, 69లో బ్రహ్మ బాబా మరణించిన తరువాత ఈ సంస్థకి అధిపతిగా నియమించబడ్డారు.

1965లో అవ్యక్త్‌గా మారారు. 1969 తరువాత యాగకార్యాలను నిర్వహిస్తూ సేవలను కూడా విస్తృతం చేశారు. 1969 తరువాత కొత్త సత్సంగ కేంద్రాలను స్థాపించారు. 

1974వ సంవత్సరంలో అప్పటి సంస్థ అవ్వక్త్ బాప్ దాదా దాది జానకిని లండన్ పంపించారు. ఈమె లండన్ నగరంలో బ్రహ్మకుమారీ కేంద్రాన్ని స్థాపించారు. ఈమెకు ఆంగ్ల భాషలో ప్రవేశం లేదు. అయినప్పటికీ దుబాసీల సాయంతో తరగతులను నిర్వహించేవారు. ఈ విధంగా ఆధ్యాత్మికత, దైవత్వం మూలాలను అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశపెట్టి విజయం సాధించారు. 40 సంవత్సరాల పాటు ఐరోపాలో సేవలను అందించారు.

1974లో నాటి పేదలు నివసించేది, ప్రస్తుతం ఫ్లాట్ గ్రేటర్ అని పిలవబడే ప్రాంతంలోని చిన్న గదిలో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇప్పుడు లండన్ నగరంలో పెద్ద భవనంలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగడం వెనుక జానకి కృషి అసామాన్యం.

వివిధ సంస్కృతులు, వృత్తులకు సంబంధించిన ప్రజలు ఉన్నత ఆశయాలతో జీవించడానికి, యోగ సాధన ద్వారా సుసంపన్నమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడం కోసం అవసరమైన బోధనలు చేశారీమె. అక్కడి నుండే ప్రపంచ దేశాలలో విస్తృతంగా బ్రహ్మకుమారి కేంద్రాలను నెలకొల్పడానికి కృషి చేశారు.

లండన్‌లో నిర్వహించిన ఈ కార్యకలాపాలన్నింటిలోనూ అక్కడ స్థిరపడిన సింధ్ ప్రావిన్స్ కుటుంబీకులు ఈమెకు సహకరించారు. వారిలో రజనీ కృపలాని, మురళి కృపలాని మరియు వారి కుమార్తె జయంతి ముఖ్యులు.

అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియా, భారతదేశం, గ్రీస్, బ్రెజిల్, జోర్డాన్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో అనేక సమావేశాలలో ఉపన్యసించారు. ఈమె దగ్గర ఈ సంస్థ శాఖలలో శిక్షణ పొందిన వారు ఆయా సంస్థల సభ్యులకి యోగా, ఆధ్యాత్మికతలను గురించి బోధించేవారు. వీరందరికీ దాది సంకల్పం ఇచ్చారు. ఈమె విదేశీయులతో ఎక్కువ కాలం గడిపారు. అందువల్ల వారి పట్ల ప్రేమ, మక్కువ కనబరిచేవారు. వారిలోని నీతినిజాయితీలు, నిష్కపటత్వం, జ్ఞానం, ధైర్యం ఈమెను ఆకర్షించాయి.

1983లో ఐక్యరాజ్యసమితిలో బ్రహ్మకుమారీ సంస్థల ఆశయాలు, కర్తవ్యాలు, విజయాలను గురించి అద్భుతంగా ఉపన్యసించారు. ఐక్యరాజ్యసమితిలో ఈ సంస్థకు ప్రభుత్వేతర సంస్థగా గుర్తింపును సంపాదించగలిగారు. ఈ విధంగా అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళడంలోనూ దాది జానకి పాత్ర అద్వితీయం.

1992లో రియోలో జరిగిన (భూమిని రక్షించుకునే) ఎర్త్ సమ్మిట్‌లో ఈ సంస్థ తరపున పాల్గొన్నారు. ఈ విధంగా ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

1996లో టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించారు.

2006వ సంవత్సరంలో లండన్ కి చెందిన ‘బీగీస్’ (Bee Gees) ఈమె గొప్పతనాన్ని గురించి ‘Mother of Love’ అనే గేయాన్ని వ్రాశారు. బ్రిటన్‌లో గొప్ప పేరు గల ‘రాబిన్ గిబ్’ ఆధ్వర్యంలోని సంగీత కళాకారులు ఈ గీతాన్ని ‘వెంబ్లీ ఎరీనా’ మీద ఆలపించారు. ఈమె 90వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమె ఐరోపా దేశవాసులను ఎంతగా ప్రభావితం చేశారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలు.

2007లో దాది ప్రకాశమణి మరణించారు. ఆ స్థానాన్ని భర్తీ చేసి సంస్థ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించవలసిన అవసరముంది. ఈ పని చేయగల ప్రతిభ ఈమెకి మాత్రమే ఉంది.

91 ఏళ్ళ వయస్సులో భారత దేశంలోని ప్రధాన కార్యక్షేత్రం మౌంట్ అబూలోని “ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం’ ప్రధాన కేంద్రానికి తరలి వచ్చారు. ఆ వయస్సులోనూ ప్రతి రోజూ 20,000 మంది సభ్యులు హాజరయిన సమావేశాలలో ప్రసంగించడం ఈమె ఉపన్యాసఝరికి నిదర్శనం.

ఈమె గురించిన ఒక ముఖ్యమైన విశేషం. 1978వ సంవత్సరంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లోని Medical and Science Research Institute శాస్త్రవేత్తలు వివిధ సందర్భాలలో ఈమె ప్రజ్ఞను విశ్లేషించారు. వంట చేస్తున్న సమయంలో, తినే సమయంలో, ఉపన్యసిస్తున్నపుడు, లెక్కలు చేస్తున్నపుడు, చివరికి నిద్రపోతున్న సమయంలో ఈమె ఒకేలా స్థిరచిత్తంతో ఉండడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈమెను ప్రపంచంలోనే స్థిరమైన మనస్సు గల వ్యక్తిగా ప్రకటించారు.

1997వ సంవత్సరంలో ‘జానకి ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ కేర్’ ఛారిటబుల్ ట్రస్టు స్థాపించారు. ఈ సంస్థ లండన్ నగరంలో అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూంది.

2004లో స్పెయిన్ పార్లమెంటులో, 2009లో ఆస్ట్రేలియా పార్లమెంటులలో ఉపన్యసించారు.

2011వ సంవత్సరంలో ఈమె అందించిన మానవత సేవలకు, ధార్మిక కార్యక్రమాలకు, శాంతి స్థాపనకు కృషి చేసినందుకు గాను జోర్డాన్‌లో ఒక గుర్తింపు లభించింది. జోర్డాన్ రాజు H.M KING ABDULLAH.L ఈమెకు గ్రాండ్ కార్టన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఆల్ ఇస్తిక్‌లాల్’ (The medal of Independence) ను అందజేశారు.

2015వ సంవత్సరంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతల కోసం ఈమె చేస్తున్న సేవలను గుర్తించి ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి గౌరవించారు.

2017లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణానికి చెందిన ‘గీతమ్ విశ్వవిద్యాలయం’ వారు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి గౌరవించారు.

2019లో 103 ఏళ్ళ వయస్సులో దేశవిదేశాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం కోసం ఆమె తిరిగిన దూరం చూస్తే సామాన్య మానవులకి కళ్ళు తిరగక మానవు. ఆ దూరం 72,000 కిలోమీటర్లు. దుబాయ్, నైరోబీ, లండన్, న్యూయార్క్ మొదలైన నగరాలన్నీ ఈ పర్యటనలో ఉన్నాయి. ఇదే ఈమే చివరి విదేశీ పర్యటన.

ఈమె కంపానియన్ ఆఫ్ గాడ్, వింగ్స్ ఆఫ్ సోల్, పెరల్స్ ఆఫ్ విజ్ఞమ్ వంటి గ్రంథాలను వ్రాశారు. ఈ గ్రంథాలు బ్రహ్మకుమారీ సంస్థలని గురించిన చాలా విషయాలను ప్రపంచానికి తెలియజేశాయి.

బ్రహ్మకుమారీల సానుకూల ఆలోచన, స్వీయ నిర్వహణ నాయకత్యం, జీవన విలువలు, శాంతి కాముకత్వం, సత్యాన్వేషణ, అహింసా సిద్ధాంతంగా, ధ్యానం మొదలయిన అంశాలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

130కి పైగా దేశాలలో ఈ సంస్థకి అనుబంధ శాఖలున్నాయి. 1993లో 35,000 శాఖలు, 1998లో 4,00,100 శాఖలు, 2000 నాటికి 4,50,000 శాఖలు విజయవంతంగా విధులను నిర్వర్తిస్తున్నాయి.

ఈమె 2020 వ సంవత్సరం మార్చి 27వ తేదీన దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, గుండెపోటు కారణంగా మరణించారు. 104 సంవత్సరాల 3 నెలల వయసులో మౌంట్ అబూలోని బ్రహ్మకుమారీల గ్లోబల్ హాస్పిటల్‌లో మరణించారు. ఈ శతాధిక వృద్ధ మహిళ 60 సంవత్సరాలకి ఉద్యోగ విరమణ చేసే వయస్సులో విదేశయానం చేసి సేవలను అందించడం, 91 ఏళ్ళ వయస్సులో తిరిగి స్వదేశానికి వచ్చి 13 సంవత్సరాల పాటు విశ్వవిద్యాలయ అధిపతిగా సేవలను అందించడం ‘నభూతో నభవిష్యతి’.

ఈమె జ్ఞాపకార్థం 2021 ఏప్రిల్ 12 వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. అద్వితీయ వర్చస్సుతో మెరిసిపోతున్న దాది జానకి చిత్రాన్ని ముద్రించారు. 12 స్టాంపుల షీట్‌లెట్ మీద దిగువ భాగంలో మౌంట్ అబూలోని కార్యనిర్వాహక భవనాన్ని ముద్రించారు.

జనవరి 1వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

Image Courtesy: Internet

 

పుట్టి నాగలక్ష్మి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here