సేవాతత్పరురాలు శ్రీమతి రామేశ్వరి నెహ్రూ

8
3

[box type=’note’ fontsize=’16’] ది. 10-12-2020 శ్రీమతి రామేశ్వరి నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]తివలు అబలలు కాదు – సబలలు అని నిరూపించిన వనితలెందరో భారతదేశ చరిత్రలో మనకు దర్శనమిస్తారు. జాతీయోద్యమంలో వివిధ రంగాలలో గాంధీ మహాత్ముని అనుసరించి/దేశ విభజన సమయంలో కన్నీటిధారలతో భయభ్రాంతులైన కాందిశీకులకు సేవలందించిన అపురూప సేవాతత్పరురాలు, ‘శారదా చట్ట’ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యురాలు, నానాజాతి సమితి జెనీవా సమావేశంలో ప్రసంగించిన భారతీయ మహిళ శ్రీమతి రామేశ్వరీ నెహ్రూ.

ఈమె 1889వ సంవత్సరం డిశంబర్ 10వ తేదీన లాహోర్ (నేటి పాకిస్థాన్)లో జన్మించారు. ఈమె తండ్రి రాజా నరేంద్రనాధ్ స్త్రీలు సనాతన సంప్రదాయాలలో జీవించాలని భావించే ఛాందసుడు. అందుచేతనే రామేశ్వరి విద్యాభ్యాసం ఇంటివద్దే కొనసాగించారు.

1902లో మోతీలాల్ అన్న కుమారుడు బ్రిజ్‌లాల్ నెహ్రూతో ఈమె వివాహం జరిగింది. ఆ విధంగా నెహ్రూ కుటుంబ కోడలిగా ‘ఆనందభవన్’లో అడుగుపెట్టారామె. తరువాత భర్తతో కలిసి లండన్ వెళ్ళారు. ఈ సంఘటనతో ఆమె జీవితం కొత్త పుంతలు తొక్కింది.

భారతదేశంలో బ్రిటిష్ వారికి బానిసల్లా బ్రతుకుతున్న భారతీయుల పరిస్థితిని అవగాహన చేసుకున్నారు. బాలలు, అనాథలు, వృద్ధులు అనుభవిస్తున్న బాధలకు ఈమె చలించిపోయారు. వీరందరి సంక్షేమం కోసం ఎంతో తపించారు.

1909వ సంవత్సరంలో ‘స్త్రీ దర్పణం’ హిందీ పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో మహిళలకు సంబంధించిన వ్యాసాలను ప్రచురించారు. నాటి పత్రికలు జాగృతపరచేవి. ఈ పత్రిక మహిళలకు తమ దీనావస్థను తెలియజేస్తూ, పరిష్కారమార్గాలను సూచించింది. హిందీలో రూపొందిన పత్రిక కావడంతో దేశమంతటా మహిళలకు సందేశాలను అందించగలిగింది. ‘అఖిల భారత మహిళా పరిషత్’ ఆవిర్భావానికి ఈ పత్రిక దోహదం చేసింది.

ఆ రోజుల్లో బాల్యవివాహాలు సర్వసాధారణం. బ్రిటిష్ ప్రభుత్వం బాల్యవివాహాలను నిషేధించేటందుకు ప్రతిపాదనలు తయారుచేయడం కోసం ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలోని ఏకైక మహిళ రామేశ్వరి నెహ్రూయే అంటేనే ఆమె గొప్పదనం మనకు అర్థమవుతుంది. ఈ కమిటీ తీర్మానాలు, సిఫార్సుల మేరకే బాల్యవివాహాలను నిషేధించిన ‘శారదా చట్టం’ రూపొందింది.

వీరు 1930వ సంవత్సరంలో లండన్ వెళ్ళి మహిళా అభివృద్ధికి సంబంధించి ఉపన్యసించారు. ఈమె ప్రతిభను గుర్తించిన మహిళా సంస్థలు 1931 ఏప్రిల్ 30వ తేదీన కామన్వెల్త్ మహిళా సమాఖ్యకి అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి. ఈ హోదాలో అనేక దేశాలను పర్యటించారు. మహిళల పరిస్థితులను గురించి ఉపన్యసించారు.

1919 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ‘నానాజాతి సమితి’ ఏర్పడింది. ఈ సమితి అంతర్జాతీయ మహిళల రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలను గురించి చర్చించడం కోసం జెనీవా నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు రామేశ్వరిని ఆహ్వానించారు. ఈ విధంగా లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ వేదిక మీద మహిళా సమస్యలను ప్రస్తావించారు.

1933-34 సంవత్సరాలలోన బెంగాల్ కరువుతో బాధపడిన సమయంలో ఈమె చేసిన సేవలు నిరుపమానం. ధనధాన్యాలు, ఇతర వస్తువులు, వస్త్రాలను సేకరించి కరువు బాధితులకు అందజేశారు.

జాతీయోద్యమంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించడంతో/సమాంతరంగా ఈమె సేవారంగాన్ని గమనించారు బాపూజీ. 1935వ సంవత్సరంలో ‘అఖిల భారత హరిజన సేవక సంఘాని’కి ఉపాధ్యక్షురాలిగా రామేశ్వరిని నియమించారాయన.

దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ ప్రాంతాలలో హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం ఉద్యమించారు రామేశ్వరి. ఈ పనిలో సఫలమయ్యారు.

‘కస్తూర్బా ట్రస్ట్’ బాధ్యతలను కూడా బాపూజీ రామేశ్వరి నెహ్రూకే అప్పగించారు. ఈ పదవికి ఆమే అనాయసంగా రాలేదు. ఆనందభవన్‌లో కోడలిగా అడుగు పెట్టి, స్వయంకృషితో వివిధ వర్గాల సమస్యలను అవగాహన చేసుకుని, దేశ విదేశాలలో పర్యటించి ప్రజలను, మహిళలను సంస్కరణపథం వైపు నడిపించడం దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాదు పీడిత మహిళలు, బాలలు, నేరస్థుల కోసం ప్రత్యేక గృహాలను నెలకొల్పి వారిని సత్పౌరులుగా తీర్చిదిద్దే కృషిని చేపట్టి సఫలీకృతులవడం కూడా మరొక కారణం.

1947లో బాపూజీ సిఫారసు మీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా విభాగానికి డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ‘నారీనికేతన్’ ద్వారా మహిళలకు సేవలందించారు.

దేశవిభజన సమయంలో కాందిశీకుల కుటుంబాలకి పునరావాస సదుపాయాలు కల్పించడంలో ఈమె నిర్వహించిన పాత్ర ఎన్నలేనిది.

ఈ కార్యక్రమాలు స్వతంత్ర భారతంలో వివిధ సేవాకార్యక్రమాలను అందించడానికి, వివిధ దేశాలలో మహిళా సదస్సులలో పాల్గొనడానికి కావలసినంత అనుభవాన్ని వీరికే సమకూర్చాయి.

1949 సంవత్సరంలో పునరావాస సలహాదారుగా నియమితులయ్యారు. ఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా దేశాల సదస్సులో కీలకపాత్రను నిర్వహించారు. ‘Indian Association for Afro-Asian Solidarity’ అధ్యక్షురాలిగా పనిచేశారు.

ప్రపంచశాంతి కోసం భారత ప్రభుత్వం వీరి ఆధ్వర్యంలో బృందాలను విదేశాలకు పంపింది. 1957లో టోక్యో, 1958 స్టాక్‌హోమ్, 1962లో మాస్కోలలో ఈ బృందాలు పర్యటించాయి. నిరాయుధీకరణ సమావేశాలలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్యోద్యమ నాయకురాలిగా/వివిధ రంగాలలో నిస్వార్థ సేవలను అందించిన నారీమణిగా, 80 పైగా దేశీయ, అంతర్జాతీయ సేవాసంస్థలతో అనుబంధం పెనవేసుకున్న సేవామూర్తిగా పేరు పొందారు.

1955 సంవత్సరంలో పద్మవిభూషణ్’ పురస్కారాన్ని, 1961లో ‘లెనిన్ శాంతి’ బహుమతిని పొందారు. 1966 సంవత్సరం నవంబర్ 8వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు. వీరి జ్ఞాపకార్థం 1987 డిశంబలో 10వ తేదీన 60 పైసల స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

ది. 10-12-2020 శ్రీమతి రామేశ్వరి నెహ్రూ జయంతి సందర్భంగా నివాళిని అర్పిద్దాం.

Image Courtesy – internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here