రాణి దుర్గావతి

10
2

[dropcap]జూ[/dropcap]న్ 24వ తేదీ రాణి దుర్గావతి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మధ్యయుగ భారత చరిత్రలో (మొఘలాయి చరిత్ర) కాలంలో వీరనారీమణులు రాజ్యమేలి, మొఘల్ చక్రవర్తులను ఎదిరించారు. అపజయాలు ఎదురయినా ఆత్మాహుతి చేసుకున్నారు. కాని భౌతిక శరీరాలను శత్రువుల చేతికందనీయని అకళంక దేశభక్తులెందరో! వారిలో అక్బర్ పాదుషా నెదిరించిన ‘రాణి దుర్గావతి’ ఒకరు.

వీరు 1524 అక్టోబర్ 5వ తేదీన (బుందేల్‌ఖండ్) నేటి ఉత్తర ప్రదేశ్ లోని బందాలో జన్మించారు. కళింజర్ కోట గుల్జార్ చందేలా రాజపుత్ర పాలకుడైన కీరత్‌పాల్ సింగ్ వంశంలో పుట్టారు. వీరి తండ్రి శాలివాహాన్ చందేల్. దుర్గావతి తల్లి వీరి బాల్యంలోనే మరణించారు. మరణించే సమయంలో ‘కుమార్తెకు స్వేచ్ఛను ఇవ్వమని, ఆమెకి ఇష్టమైన వారికిచ్చి పెళ్ళి చేయమ’ని భర్త దగ్గర మాట తీసుకుంది. ఆడపిల్లకి స్వేచ్ఛ కావాలని సుమారు 500 ఏళ్ళ క్రితమే ఆ తల్లి కోరుకోవడం గొప్ప విషయం.

దుర్గావతికి తండ్రి గుర్రపుస్వారి, వేట, విలువిద్య, బాకు విసిరేయడం వంటి యుద్ధవిద్యలను నేర్పించారు. యుద్ధవ్యూహాలలో శిక్షణను యిచ్చారు. అన్ని విద్యలను క్షుణ్ణంగా నేర్చారామె. ఆయుధాలు కలిగి ఉండడం ఒక ఎత్తు, వాటిని ఉపయోగించే నైపుణ్యం సంపాదించడం మరొకఎత్తు. ఆయుధాలను వాడే నైపుణ్యంలో కూడా తండ్రి వద్ద శిక్షణ పొందారు.

అద్భుతమైన సౌందర్యవతి, సుగుణశీలురాలు, సౌహార్దశీలి అయిన వీరిని వివాహం చేసుకోవడం కోసం రాజపుత్ర రాజులు పోటీపడ్డారు. వారు తన కుమార్తెకు సాటి కాదని శాలివాహన్ అభిప్రాయం.

మాండ్లా గోండుల రాజు, రాణి దుర్గావతి పరస్పరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. శాలివాహన్ గోండుల రాజు సంగ్రామ్ షా కుమారుడు దళపత్ షా కిచ్చి కుమార్తె వివాహం చేశారు. దళపత్ షా విలాసాలలో మునిగి తేలుతుండేవాడు. పరిపాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. దుర్గావతి పరిపాలన పట్ల శ్రద్ధ వహించమని భర్తను శతథా పోరారు. అతను లెక్కచేయలేదు. రాజ్యంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దుర్గావతికి ఒక కుమారుడు జన్మించాడు.

వీరి పూర్వీకులు గజనీ మహమ్మద్‌ని ఎదిరించి నిలిచిన వీరులు. ఖజురహో లోని గొప్ప శిల్ప కళా నైపుణ్యం ఉట్టిపడే దేవాలయాల నిర్మాతలు వారు. వారు నిర్మించిన 85 దేవాలయాలలో 20 మాత్రమే ఇపుడు మిగిలాయి.

వారి వంశీకురాలు దుర్గావతికి ఆ ధైర్య స్థైర్యాలు వారసత్వంగా అలవడ్డాయి. పసివాడైన కుమారుని సింహాసనం పైన కూర్చో పెట్టారు. తను సంరక్షకురాలిగా ఉండి పరిపాలన సాగించారు. భర్త నిర్లక్ష్యం వల్ల దీనావస్థకు చేరుకున్న రాజ్యాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు.

ఆధార్ కాయస్థ, మాన్ ఠాకూర్ వంటి మంత్రులు వీరికి పరిపాలనలో తోడ్పడ్డారు.

వీరు దయ, దాక్షిణ్యాలతో పరిపాలించారు. న్యాయ పరిపాలనకు అగ్రతాంబూలమిచ్చారు. ప్రజలకు కావలసిన సౌకర్యాలను సమకూర్చారు. సరస్సులు, చెరువులు, కాలవలు కట్టించారు. నర్మదానది పైన జజల్పూర్ దగ్గర ‘రాణితాల్’ అనే పెద్ద రిజర్వాయర్ నిర్మించారు. సుమారు 13000 గ్రామాలకు తాగునీరు, సాగునీరు. అందించిన గొప్ప పరిపాలకురాలు. వీరి మంత్రులు కూడా రిజర్వాయర్లను నిర్మించారు.

వీరు రాజధానిని ‘సింగౌరీఘర్’ కోట నుంచి సుమారు 250 మైళ్ళ దూరంలో, పంచమరీ ప్రాంతంలో ఉన్న చైరాఘర్ కోటకు మార్చారు. ఇది సాత్పురా పర్వత ప్రాంతపు అడవులలో నిర్మించిన దుర్భేద్యమైన కోట. ఈ ప్రాంతంలో ఇంకా 50 చిన్న చిన్న కోటలు కూడా ధృఢంగా నిర్మితమయి ఉండడం విశేషం.

సుమారు 50 చిన్న పెద్దా యుద్దాలు చేశారు. రాజ్యాన్ని విస్తరింపజేశారు. గోండ్వానాని రాజకీయంగా ఏకం చేశారు. ఈ ఏకీకరణను గర్హాకటంగా అని పిలుస్తారు.

విద్యా సౌకర్యాలను కల్పించారు. విద్యాధికులను గౌరవించి ప్రోత్సహించారు. ముస్లిం ప్రాబల్యంతో కునారిల్లుతున్న రాజ్యంలో హిందూమత ప్రాబల్యం పరిఢరిల్లే ఏర్పాట్లు చేశారు. కొత్త దేవాలయాలను నిర్మించారు. పాత దేవాలయాలను పునరుద్ధరించారు. ప్రజలకు వీరంటే తగని ప్రేమాభిమానాలుండేవి, హిందూమత పక్షపాతి అయినప్పటికీ పరమతసహనాన్ని అమితంగా కనపరచారు. ముస్లింలకు అనేక ఉన్నతోద్యోగాలను కల్పించారు.

సరిహద్దు మాళవరాజు బాజ్ బహదూర్‌ను యుద్ధంలో ఓడించారు. అనేక యుద్ధాలు చేసి చిన్నచిన్న రాజ్యాలను జయించారు.

అక్బర్ భారతదేశంలో సింహభాగాన్ని పరిపాలిస్తున్న రోజులవి. మాళవ, రేవా రాజ్యాలను వరుసగా జయించారు. ఇక మిగిలింది దుర్గావతి పరిపాలన లోని గోండు మాండ్గా రాజ్యం.

అక్బర్ రాణి దుర్గావతి గొప్పతనాన్ని, యుద్ధనైపుణ్యాలను గురించి విన్నాడు. ఈ గొప్ప వీరరాణీమణి తన సామంతురాలిగా ఉండాలని కోనుకున్నాడు.

తన సేనాధిపతి అసఫ్ ఖాన్‌కు మాండ్లారాణి దుర్గావతిని ఓడించే బాధ్యతను అప్పగించాడు.

అప్పటికే రాజ్యలను గెలిచిన అనుభవం అసఫ్ ఖాన్‌ది. తన సైన్యంతో దండెత్తాడు. అద్భుతంగా యుద్ధం చేసి మొఘలాయి సైన్యాలను ఓడించి తరిమి కొట్టారు దుర్గావతి.

ప్రజలు జయ జయ ధ్వానాలతో వారికి నీరాజనాలను అర్పించారు. అవి వారికి మరింత స్పూర్తినిచ్చాయి. అక్బర్ పాదుషా బారి నుండి తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి కంకణం కట్టుకున్నారు.

ఈ లోగా అసఫ్ ఖాన్ సైనిక బలాన్ని, ఆయుధబలాన్ని పెంచుకుని మళ్ళీ మాండ్లా మీదికి దండెత్తాడు. దుర్గావతి రాత్రి సమయంలో గెరిల్లా దాడి చేద్దామని తన వారిని సంప్రదించారు. వారు అందుకు అంగీకరించలేదు.

సేనాధిపతి అర్జునదాస్ వీరమరణం పొందారు. అపుడు తనే సేనాధిపతిగా యుద్ధాన్ని నడిపించారామె. మొఘలుల బలం ఎక్కువగా ఉందని లొంగిపోయి సంధి చేసుకుంటే మంచిదని దీవాన్ వివరించాడు. వారికి లొంగిపోవడం కంటే మరణమే మేలని రాణి భావించారు.

ఈ యుద్ధంలో బాలుడు వీర నారాయణ్ కూడా పాల్గొని మొఘలులను ఎదిరించడం గొప్ప విశేషం. పులి కడుపున పులే పుడుతుంది కదా! అయితే ఎదుటివారి ఆయుధ బలానికి తాళలేక యుద్ధంలో మూర్ఛిల్లాడు. విషయాన్ని తెలుసుకున్న రాణి గాయపడిన కుమారుని కోటలోకి తీసుకుని వెళ్ళి సపర్యలు చేయమని పురమాయించారు. తను యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

సుమారు గా 20,000 మంది అశ్వికదళాలు, 1000 ఏనుగులు, వేలాది కాల్బలం దుర్గావతి సైన్యంలో భాగంగా ఉండేవి. చివరకు 300 మంది సైన్యంతో యుద్ధభూమిలో మిగిలారు ఆ వీరనారి.

గౌర్, నర్మదా నదుల మద్య ప్రాంతాన్ని యుద్ధానికి అనువుగా ఎంచుకున్నారు.

అసఫ్ ఖాన్ వీరి దగ్గరికి వచ్చాడు. వీరిని హతమార్చడానికి చూశాడు. కాని ఆ ఉగ్రరూపం చూసి భయపడి దూరంగా వెళ్ళి పోయాడు.

అక్కడి నుండి బాణాలను కురిపించాడు. బాణాలు ఆమె శరీరాన్ని ఛిద్రం చేశాయి. చెవి, మెడ భాగాలలో గుచ్చుకున్న బాణాలు తల భాగాన్ని రక్తసిక్తం చేశాయి.

అయినా వెనుకంజ వేయలేదు. ఒరలో నుంచి చురకత్తిని తీసుకుని తనని తాను పొడుచుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. పరిచారకుడు వీరి భౌతికకాయాన్ని దాచి ఉంచి తను ఆత్మహుతి చేసుకున్నారు.

1564 జూన్ 24 న జబల్బూర్ సమీపంలోని నారాయ్‌నాలా అనే ప్రదేశంలో వీరు ఆత్మాహుతి చేసుకోవడంతో ఒక శకం ముగిసింది.

ఈ విధంగా, ధైర్య స్థైర్యాల కలబోత, దయా దాక్షిణ్యాలు గల పరిపాలకురాలు, యుద్ధవ్యూహ కోవిదురాలు, అకళంక దేశభక్తురాలు, హిందూ మత పునరుద్ధరణ కోసం కృషి సలిపిన రాణి దుర్గావతి వర్థంతిని ‘బలిదాన్ దివస్’గా జరుపుకుంటున్నారు.

వీరి జ్ఞాపకార్థము 1988 జూన్ 24 వ తేదీన 60 పైసల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. యుద్ధరంగంలో ఒక చేతిలో డాలు, మరొక చేతిలో చురకత్తితో గంభీరంగా దర్శనమిస్తారు వీర నారీ శిరోమణి, వీరమాత రాణి దుర్గావతి.

జూన్ 24 వ తేదీ వీరి వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here