దత్తశర్మ గారి ‘రససిద్ధి’ కథ – ఒక ఆలోచన..!!

0
1

[dropcap]జీ[/dropcap]వితం మూడు ముఖ్యమైన దశలను దాటుకు వెళుతుంది. ఇంచుమించు అందరూ ఈ దశలను అనుభవిస్తారని నా నమ్మకం.

అవి – యవ్వనానికి ముందు, యవ్వనం, యవ్వనం తర్వాత. అయితే ఏ దశనూ అనుభవించకుండా జీవితం వెళ్లబుచ్చేవాళ్ళు కూడా మన సమాజంలో లేకపోలేదు. దానికి కారణాలు అనేకం. అయితే ఆడ అయినా, మగ అయినా కోర్కెలు సహజం. అందులో శృంగార జీవితం అంటే ఏమిటో తెలియకుండానే, అలాంటి కోర్కెలు సహజంగానే చాలామందిలో యవ్వనంలో ప్రవేశించక ముందే ప్రారంభ మవుతాయి.

అలంటి సమయంలో పుట్టే శృంగార భరిత కోర్కెలు, కొందరిలో గందరగోళాన్ని కూడా సృష్టిస్తాయి. అలాంటప్పుడు ఆ యువకుడు లేదా యువతి తెలిసీ తెలియని విషయాల్లో చిక్కుకు పోతారు. మరికొందరు ఏమీ చేయలేని పరిస్థితిలో మానసిక క్షోభను అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, మానసికంగా కృంగిపోతారు.

ఇక యవ్వన దశ చాలా ముఖ్యమైనది, ప్రమాదమైనది కూడాను. ఈ వయసులో ‘శృంగారం’ మనిషిని కుదిపేస్తోంది. ఇక్కడ తరతమ భేదాలు కనిపించవు. ఇక్కడ అదుపు చేసుకోగల వారు అదృష్టవంతులు మిగతావారు ప్రేమ – దోమ అంటూ చెలరేగిపోతారు. ఏది ఏమైనా తర్వాత ఏదో రూపంలో పెళ్ళి తప్పదు. తర్వాత పిల్లలు, వాళ్ళ పెంపకం, చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్లకి పెళ్లిళ్లు, వాళ్లకి పిల్లలు. అంతవరకూ ఏదో ఇంతో అంతో శృంగార జీవితం అనుభవించినా, మనవలు పుట్టాక అది ఏదో రూపంలో స్తంభించి పోతుంది

యవ్వనం తర్వాత దశ ఇదే! వయసు మీరినా, మనసులు యవ్వనం తోనే బుసకొడతాయి కొందరిలో. దీనికి ఆడ – మగ తేడా లేదు. ఇక్కడినుంచే ఇబ్బందులు మొదలవుతాయి. భార్యకు ఇష్టం ఉంటే భర్తకు ఇష్టం లేకపోవడం, భర్తకు ఇష్టం ఉంటే భార్యకు ఇష్టంలేకపోవడం.

మెజారిటీ రెండోరకం వాళ్ళే వుంటారు. ఇంచుమించు వయసుమళ్ళిన వాళ్ళల్లో ఎక్కువశాతం మందిలో ఇది ఉంటుంది. అయితే ఇది కొందరు చెప్పుకుంటారు, మరి కొందరు బయట పడరు. దీనితో అవగాహనా లోపాలు, కోపతాపాలు, అనారోగ్యాలు.. ఇలా ఎన్నెన్నో కొనితెచ్చుకునే సమస్యలు.

ఇదే విషయాన్ని కథా రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ తన కథ ‘రససిద్ధి’లో చర్చించారు. కొందరికి ఈ కథ (సరస కథ) ఈ కథా సంపుటిలో చేర్చడం నచ్చక పోవచ్చుగాని, ఇది చాలా అవసరమైన కథగా భావిస్తాను. జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. కథలోని అహోబలరావు పాత్ర, వైదేహి పాత్ర,మన చాలా కుటుంబాలలో కనిపించే పాత్రలే! కొందరికి చెప్పుకోవడానికి ఇది బూతుగా అనిపింఛ వచ్చు. ఈ కథలో అహోబలరావు, భార్య మీద కోపగించి కొన్ని రోజులు బయటికి వెళ్లిపోవడం కాస్త అసహజంగా అనిపించింది. వైదేహికి అమ్మవారు కలలో కనిపించడం కూడా అసహజమే! నిజానికి వైదేహి పరమ భక్తురాలు. కలలో ముందుగానే అమ్మవారు కనిపించి హెచ్చరించవచ్చుకదా! ఇద్దరికీ జ్ఞానోదయం కావడానికి బహుశః రచయిత ఈ సన్నివేశాలు కల్పించి ఉంటారని పాఠకుడు ఊహించుకోవచ్చు. మరో విషయం భార్య మానసిక స్థితిని అవగాహన చేసుకోకుండా ఆ వయసులో అహోబలరావు తొందరపడటం కూడా కరెక్ట్ కాదు. ఇద్దరి మధ్య ఈ విషయంలో సయోధ్య వున్నప్పుడే అది జరగాలి.

రచయిత, దత్తశర్మగారు సరస కథల పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాసి వుంటారుగాని, మామూలుగా అయితే రాసి వుండేవారు కాదేమో!

ఇలాంటి మనోవైజ్ఞానిక కథలు ఇంకా రావలసిన అవసరం వుంది. ఈ కథ రాసి కొందరి మెదళ్ళకు పనిపెట్టిన దత్తశర్మ గారికి అభినందనలు.

(ఈ వ్యాసానికి ప్రేరణ – శ్రీ పాణ్యం దత్తశర్మ గారి కథా సంపుటి ‘దత్త కథాలహరి’ లోని కథ ‘రససిద్ధి’).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here