ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టయిన తొలి భారతీయ మహిళ శ్రీమతి తిరుమతి రుక్మిణీ లక్ష్మీపతి

0
2

[box type=’note’ fontsize=’16’] ది 6-12-2020న శ్రీమతి తిరుమతి రుక్మిణీ లక్ష్మీపతి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]భా[/dropcap]రత స్వాతంత్ర్య పోరాటం ఎన్నో ఉద్యమాలకు నెలవు. ఈ ఉద్యమాలలో ఉద్యమించి జైలు శిక్షను అనుభవించిన నాయకులు ఎందరెందరో? వారిలో స్త్రీ, పురుష/కుల, మత/భాషా, జాతి బేధాలు లేవు. అటువంటి నాయకీమణులలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష ననుభవించిన నాయకురాలు ఒకరున్నారు. ఆమే శ్రీమతి తిరుమతి రుక్మిణీ లక్ష్మీపతి.

రుక్మిణి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో 1892వ సంవత్సరం డిశంబర్ 6వ తేదీన జన్మించారు. ఈమె తల్లిదండ్రులు చూడామణి, శ్రీనివాసరావులు. మద్రాసుa క్రిస్టియన్ కాలేజీ నుండి బి.ఎ. డిగ్రీని సంపాదించారు. శ్రీ ఆచంట లక్ష్మీపతి గారిని వివాహమాడారు. వీరి కుమారుడే ప్రముఖ రచయిత ఆచంట జానకీరామ్.

ఈమె జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. వీరిమీద బాపూజీ, సరోజినీ నాయుడు, డా. చక్రవర్తుల రాజగోపాలాచారిల ప్రభావం ఎక్కువగా ఉంది.

బాపూజీ హరిజన సంక్షేమ నిధి కోసం తన బంగారు ఆభరణాలను అన్నింటిని సమర్పించి ఆయన అభిమానానికి పాత్రులయ్యారు. సహాయ నిరాకరణోద్యమంలోను, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలోను పాల్గొన్నారు. 6 నెలలు జైలుశిక్షను అనుభవించారు.

బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుమీద పన్ను విధించింది. కోట్లాదిమంది నిరుపేదలు ఉప్పు కొనలేక అల్లాడిపోయారు. ఈ సమయంలో బాపూజీ ‘ఉప్పు సత్యాగ్రహం’ కోసం పిలుపును అందించారు. 1930వ సంవత్సరంలో మదరాసు రాష్ట్రంలోని వేదారణ్యంలో భారీ జనసమ్మేళనంతో సత్యాగ్రహం జరిగింది. ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న రుక్మిణి అరెస్టయి జైలు శిక్షను అనుభవించారు. దేశం మొత్తంమీద ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలుశిక్షను అనుభవించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. బ్రిటిష్ కమీషనర్ ఆదేశాల మేరకు జరిగిన లాఠీఛార్జిలో దెబ్బలు తిన్నారు.

1935-36లో (తమిళనాడు) నాటి మదరాసు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యారు. 1936లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1937వ సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ సభ్యులుగా పనిచేశారు. ఈ అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్ బాధ్యతలను నిర్వహించారు. 1941లో సత్యాగ్రహం చేయడం కోసం బాపూజీ ఎంపిక చేసిన 21 మంది సత్యాగ్రహులలో ఈమెకి స్థానం లభించడం గాంధీజీకి ఈమెపట్ల గల అపార నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఖద్దరు ప్రచారం కోసం కృషిచేశారు.

1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. 1941లో ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి. వీరి ప్రభుత్వంలో రుక్మిణి ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. ఈ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు.

స్వాతంత్ర్య పోరాటయోధురాలిగానే కాదు, స్త్రీ అభ్యుదయం కోసం కూడా కృషి చేశారు రుక్మిణి. ‘ఇండియన్ ఉమెన్ అసోసియేషన్’ సభ్యులుగా విశిష్ట సేవలను అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు.

పారిస్‌లో జరిగిన స్త్రీల ఓటు హక్కు గురించిన సమావేశానికి మన దేశ ప్రతినిధిగా హాజరయ్యారు. జపాన్‌లో స్త్రీల పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఆ దేశాన్ని దర్శించారు. మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.

స్త్రీలకు మనస్తాపం కలిగించే బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను సమర్థించారు. చిన్న కుటుంబాలలో బాధలకు కారణమవుతున్న మద్యపానాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆరోగ్యమంత్రిగా పనిచేసినపుడు మహిళలు, శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడానికి కొన్ని సంస్కరణలను చేపట్టారు.

మొత్తంగా సామాజిక సేవా కార్యకర్తగా అణగారిన వర్గాల పిల్లలు, మహిళల కోసం కృషి చేస్తూనే సమాంతరంగా స్వాతంత్ర్య పోరాటయోధురాలిగా రికార్డు సృష్టించడం విశేషం.

1951వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మద్రాసులో మరణించారు. ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వ తపాలాశాఖ 1997వ సంవత్సరం ఆగష్టు 6వ తేదీన 2 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది.

తెలుగు వారి కోడలయిన స్వర్గీయ తిరుమతి రుక్మిణీ లక్ష్మీపతి గారి జయంతి డిశంబర్ 6వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

Image Courtesy – internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here