[dropcap]ఫి[/dropcap]బ్రవరి 24 శ్రీమతి రుక్మిణీదేవి అరండేల్ వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
భరతనాట్యం పట్ల గల చిన్నచూపుని తొలగింపజేసి – గౌరవస్థానాన్ని కల్పించేటందుకు అహరహం కృషి చేసిన మహిళ, జంతువుల పట్ల మిక్కిలి దయ చూపించడమే కాక జంతు సంక్షేమం కోసం జీవితకాలం పరితపించిన దయామూర్తి, మాంటిస్సోరి విద్యావిధానాన్ని మనదేశానికి పరిచయం చేసిన విద్యావేత్త, భారత రాష్ట్రపతి పదవినే గౌరవంతో పరిత్యజించిన గొప్ప నారీశిరోమణి శ్రీమతి రుక్మిణీదేవి.
వీరు 1904వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన నాటి మదరాసు ప్రెసిడెన్సీ (నేటి తమిళనాడు) లోని మధురైలో జన్మించారు. తల్లి శేషమ్మాళ్, తండ్రి నీలకంఠం శాస్త్రి. తల్లి సంగీత కళాకారిణి. తండ్రి గొప్ప ఇంజనీర్. నీలకంఠశాస్త్రి గారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు. ఆ సమాజ సేవాగుణం వీరిని ఆకర్షించింది. వీరు పదవీ విరమణ చేసిన తరువాత అడయార్‌లోని దివ్యజ్ఞాన సమాజానికి దగ్గరలో నివాసము ఏర్పరుచుకున్నారు.
రుక్మిణిదేవి బాల్యం నుండి తండ్రి అడుగుజాడలలో నడిచి దివ్యజ్ఞాన సమాజం పట్ల ఆకర్షితులయ్యారు. వారి కార్యక్రమాలలో పాలు పంచుకునేవారు. గురుదేవులు రవీంద్రులకి ఈ సమాజంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. వీరు వ్రాసిన ‘మాలిని’ నాటకంలో నటించి ఒక పాట పాడారు. దీనిని దర్శించిన నీలకంఠశాస్త్రి కుమార్తెను సంగీతాభ్యసనం చేయమని కోరారు. ఆమె సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. కాని తరువాత నాట్యం వైపు అడుగిడారు.
దివ్యజ్ఞాన సమాజ వార్షికోత్సవాలలో వీరు విస్తృతంగా పాల్గొనేవారు. ఈ సమయంలోనే అనీబెసెంట్ శిష్యులు శ్రీ జి.యస్.అరండేల్ వీరికి పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారింది.
1920వ సంవత్సరంలో జి.యస్.అరండేల్‌తో వీరి వివాహం జరిగింది. కుటుంబం వ్యతిరేకించడం వల్ల బొంబాయి రిజిష్ట్రారు ఆఫీసులో జరిగింది.
వివాహమయిన తరువాత యూరప్ దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఆస్ట్రేలియా పర్యటనలో ‘అన్నాపాబ్లోవా’ని కలిశారు. అన్నాపాబ్లోవా ప్రదర్శించిన ‘బాలే’లు రుక్మిణీదేవిని అద్భుతంగా ఆకర్షించాయి. క్లియోనోర్డి వద్ద బాలేలోని మెలకువలను అభ్యసించారు.
ఈ దంపతులు విదేశ పర్యటనలో వివిధ కళలు, థియేటర్, సంగీతం, చిత్రలేఖనం, ఒపెరా నాట్యం, బాలే నృత్యం, శిల్పం మొదలయిన వాటిని పరిశీలించారు. వివిధ కళారూపాల గురించి అవగాహన చేసుకున్నారు.
1930వ సంవత్సరంలో ‘అమెరికన్ ఇండియన్’ నాటకాన్ని ప్రదర్శించారు.
ఇ.కృష్ణయ్యర్ గొప్ప న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు. వారు 1933లో ఇద్దరు దేవదాసీల నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రుక్మిణీదేవిని కూడా ఆహ్వానించారు. మధుర మనోహరమైన నాట్యాన్ని చూసిన రుక్మిణీదేవి దీనిపట్ల మక్కువని పెంచుకున్నారు. ఈ నాట్యాన్ని అభ్యసించాలని అభిలాషించారు. వీరి కోరికను నెరవేర్చుకోవడానికి అరండేల్ కుటుంబీకులు, దివ్యజ్ఞానసమాజ సభ్యులు ప్రోత్సహించారు.
అయితే ఆ రోజుల్లో భరతనాట్యం కేవలం దేవదాసీలకు సంబంధించినదని, చిన్నం మేళం, సాదిర్ అని చిన్నచూపు చూసేవారు. ఇంకా ఉన్నత వర్గాల వారికి నిషేధమని అనేవారు. అయితే రుక్మిణీదేవి భరతనాట్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. కళాత్మక దుస్తులను రూపొందించడం, సంగీత కళాకారులను వేదిక మీద ఒక ప్రక్కన కూర్చుండ పెట్టడం వంటి నూతన కళారూపాన్ని మేళవించి, సాంకేతికతను జోడించారు. ఆధ్యాత్మికతను నింపే ప్రయత్నం చేశారు.
వీరు మైలాపూర్ గౌరీ అమ్మాళ్, మీనాక్షి సుందరం పిళ్ళై, వంటి వారి దగ్గర శిష్యరికం చేశారు. భరతనాట్యాన్ని దేవాలయ ప్రాంగణాల నుండి రంగస్థల వేదిక మీదకు తీసుకొని వచ్చి విజయం సాధించిన ఘనత వారిది.
1935లో దివ్యజ్ఞాన సమాజ వజ్రోత్సవాలలో తొలి ప్రదర్శన ఇచ్చారు. 2000 మంది ప్రేక్షకులలో శ్రీ శ్రీనివాసశాస్త్రి, శ్రీ సి.పి.రామస్వామి అయ్యర్, అరండేల్, జేమ్స్ కజిన్స్ వంటి వారు ఉండడం విశేషం.
అయితే ఈ నాట్యం తనతోనే ఆగిపోకూడదని వీరి కోరిక. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు, మరికొందరు భారతీయుల సహాయసహకారాలతో మద్రాసులోని అడయార్లో ‘కళాక్షేత్రం’ను 1936లో స్థాపించారు. (ఈ సంస్థకు ఇంతకు ముందు ‘International Academy of Arts’ అని పేరుండేది.) కళాక్షేత్రపు తొలి గురువులు మీనాక్షి సుందరం పిళ్ళై, చొక్కలింగం పిళ్ళైలు. నలుగురే నలుగురు విద్యార్థులతో మొదలయింది. రాధా బర్నియర్ ఈ నలుగురిలో ఒకరు.
నాట్యంతో పాటు సంగీతానికి ప్రాముఖ్యతని కల్పించడం విశేషం.
‘కళాక్షేత్రం’ నుండి గొప్ప నాట్యకళాకారిణులైన వారితో రాధా బర్నియర్, శారదా హఫ్మన్, అంజలి మెహర్, సంయుక్త పాణిగ్రాహి, యామినీ కృష్ణమూర్తి వంటి వారు ఉన్నారు.
రుక్మిణీదేవి రూపొందించిన నృత్యరూపకాలలో వాల్మీకి రామాయణం, గీతగోవిందం, శ్రీరామపట్టాభిషేకం, శబరిమోక్షం, కుమారసంభవం ప్రపంచ ప్రసిద్ధి పొందడమేగాక ఈనాటికీ ప్రదర్శించబడుతుండడం గొప్ప విశేషం. తన తరువాత తరాలవారికి కళారూపాలని అందించాలనే వీరి ఆకాంక్ష ఈ విధంగా నెరవేరింది.
1952వ సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. 2 పర్యాయములు ఈ పదవిని నిర్వహించారు.
వీరు మొదటి నుండి జంతు ప్రేమికురాలు. 1960వ సంవత్సరంలో రాజ్యసభలో ‘జంతువుల పై క్రూరత్వ నిరోధపు బిల్లు’ను ప్రతిపాదించారు. దీనిని గురించి విస్తృతమైన చర్చజరిగింది. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ విషయాన్ని చట్టం ద్వారా అమలులోకి తీసుకుని వచ్చారు.
1962లో ఈ చట్టంలో భాగంగా ‘జంతు సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు రుక్మిణీదేవి అరండేల్‌ను అధ్యకురాలిగా నియమించారు. 1986వ సంవత్సరం వరకు వీరు ఈ పదవిలో కొనసాగారు. జంతువధను నిషేదించే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
జంతు సంక్షేమానికి, శాకాహార ఉద్యమానికీ అంతులేని అవినాభావ సంబంధం ఉంది. వీరు ప్రపంచ శాకాహార కాంగ్రెస్‌తో సంబంధాలేర్పరుచుకున్నారు. 1955 నుండి 1986 వరకు ఈ సంస్థ సభులుగా సేవలందించారు. 1957వ సంవత్సరంలో ప్రపంచ శాకాహార కాంగ్రెస్ సమావేశాలు మనదేశంలో జరగడంలో వీరి పాత్ర ఎనలేనిది.
1937వ సంవత్సరంలో కార్మిక మంత్రిత్వశాఖ కళాక్షేత్రానికి ‘నేత కేంద్రాన్ని’ మంజూరు చేసింది. పాత మగ్గాలను సేకరించి బాగు చేయించారు. తరువాత కొత్త మగ్గాలను తెప్పించారు. బట్టలు తయారు చేయించారు. కమలాదేవి ఛటోపాధ్యాయ కూరగాయల రంగులతో కలంకారీని అభివృద్ధి పరిచారు. కళాక్షేత్ర చీరలకు, దుస్తులకు మంచి డిమాండ్ ఉండేది.
కళాక్షేత్ర ఆధ్వర్యంలో సంగీతం, నాట్యం వంటి కళలకే కాదు చేతి పనులు, వృత్తి విద్యలు, దేశవాళీ పరిశ్రమలకు స్థానం లభించింది. వీటిలో శిక్షణను ఇవ్వడం కోసం అనేక సంస్థలను స్థాపించారు రుక్మిణిదేవి. విద్యాభివృద్ధి కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను స్థాపించారు.
ప్రముఖ విద్యావేత్త మరియా మాంటెస్సోరి కళాక్షేత్రను సందర్శించారు. మాంటెస్సోరి విద్యావిధానానికి శ్రీకారం చుట్టారు రుక్మిణీదేవి.
ద బెసెంట్ థియొసోఫికల్ హై స్కూలు, ద బెసెంట్ అరండేల్ హయ్యర్ సెకండరీ స్కూలు, ద మరియా మాంటెస్సోరి స్కూల్ ఫర్ చిల్డ్రన్, ద క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కలంకారీ యూనిట్, రుక్మిణీదేవి మ్యూజియం, యూ.వి.స్వామినాధ అయ్యర్ లైబ్రరీ వంటి సంస్థలెన్నో ఈ కళాక్షేత్రంలో విలసిల్లి, భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి.
ఈ సంస్థలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్ధులు, నాట్య, సంగీత కళాకారులు, కలంకారీ నేర్పరులు, వేలాదిగా దేశవిదేశాలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు ఈ నాటికీ!
1977వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ మంత్రివర్గం రుక్మిణీదేవి అరండేల్‌ను రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవ అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ విషయాన్ని వీరికి తెలియజేయగా “రాజకీయ పదవుల కంటే సేవ చేయడమే ఇష్టం” అని సున్నితంగా తిరస్కరించి తన సంస్కారాన్ని నిరూపించుకున్నారామె.
వీరిని అనేక పురస్కారాలు వరించాయి. 1956లో పద్మభూషణ్, 1967లో సంగీత నాటక అకాడమి ఫెలోషిప్, 1968లో ప్రాణిమిత్ర, 1984లో కాళిదాస సమ్మాన్ వంటి పురస్కారాలు వీరికి వన్నె తెచ్చాయి.
జంతు సంక్షేమం, శాకాహార సంస్థల కోసం వీరు సలిపిన కృషికి గాను క్వీన్ విక్టోరియా సిల్వర్ మెడల్ ఆఫ్ రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్స్, ది హేగ్ వారి ‘ఫెడరేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ కన్జర్వేషన్’ లతో పాటు వివిధ దేశాల విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు లభించాయి.
వీరు దివ్యజ్ఞాన సమాజం పట్ల చూపిస్తున్న నిబద్ధతకు, పనితీరుకు శ్రీమతి అనీబెసెంటు మెచ్చుకునేవారు. వీరికి గల నైపుణ్యాలను గమనించారు. అందువల్లనే 1923వ సంవత్సరంలో ‘ALL INDIA FEDERATION OF YOUNG THEOSOPHISTS’ సంస్థకు, 1925వ సంవత్సరంలో ‘WORLD FEDERATION OF YOUNG THEOSOPHISTS’ కు అధ్యక్షులుగా నియమించారు. ఈ విధంగా అనీబిసెంటు వీరికి అంతర్జాతీయ సేవలను అందించే అవకాశాన్ని కలిపించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ‘అడయార్ కళాక్షేత్రం’ వంటి గొప్ప సంస్థని నడపడం కోసం దేశవిదేశాల్లోని థియోసోఫి సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. మాతృభూమి ఋణాన్ని తీర్చుకున్నారు.
గురుదేవుని ‘శాంతినికేతన్’తో సమానంగా ‘అడయార్ కళాక్షేత్రం’ పేరు ప్రఖ్యాతులు పొందింది. స్వయంగా గురుదేవులే ప్రశంసించారు.
సుదీర్ఘ సేవలను అందించిన అనంతరం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ 1986వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన చెన్నైలో మరణించారు. వీరి జ్ఞాపకార్ధం 1987 డిశంబరు 27 వ తేదీన 60 పైసల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.
వీరి వర్థంతి ఫిబ్రవరి 24 సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet