[dropcap]మ[/dropcap]హాభారతంలోని సాత్యకి శ్రీకృష్ణుని భక్తుడు. అర్జునుడితో కలిసి ద్రోణుని వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. అర్జునినికి మంచి స్నేహితుడు కూడా. ఇతనికి యుయూధనుడు అనే పేరు కూడ ఉంది. ఇతని తండ్రి సాత్యక. ఇతను శ్రీకృష్ణునికి చెందిన వృషణి, యాదవ వంశానికి చెందినవాడు. మహాయోధుడు కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన యుద్ధము చేసాడు. శ్రీకృష్ణునికి ఆప్తుడు. శ్రీకృష్ణుడు హస్తినకు శాంతి రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని వెంటే ఉన్నాడు. యాదవ వీరులలో కురుక్షేత్ర సంగ్రామములో పాల్గొన్న ప్రముఖలలో సాత్యకి కృతవర్మలు ఉన్నారు. సాత్యకి పాండవుల పక్షనా, కృతవర్మ కౌరవుల పక్షాన పోరాడారు. కురుకేత్ర సంగ్రామములో సాత్యకి పాత్ర చాలా ఉంది. యుద్దములో గురువైన ద్రోణుని విల్లును 101 సార్లు విరిచి అందరిని ఆశ్చర్యపరిచాడు.
కురుక్షేత్ర సంగ్రామములో సాత్యకి చాలా సార్లు కౌరవ వీరులతో తలపడతాడు. మొదటిసారి అర్జునుడు కర్ణుడు పోరాడుతున్నప్పుడు సాత్యకి భీముడు కలిసి, ధృష్టద్యుమ్నుడు కర్ణుడిపై దాడి చేస్తారు. కర్ణుడు అర్జునుడిది తప్ప మిగిలిన అందరి ధనస్సులను విరిచి వేస్తాడు. అర్జునుడు కర్ణుని పై దాడి చేసినప్పుడు భీముడు, ధృష్టద్యుమ్నుడు సాత్యకి కర్ణునిపై బాణాలను కురిపిస్తారు. ఆ సమయములో దుర్యోధనుడు, ద్రోణుడు, జయధ్రదుడు కర్ణుని రక్షిస్తారు. అలాగే ధృష్టద్యుమ్నుడు భీముడు ఇతర పాండవ వీరులు సాత్యకిని రక్షిస్తారు. శ్రీకృష్ణుడు సాత్యకి కోసము ఒక దివ్య రథాన్ని కర్ణుడితో యుద్ధము చేయటానికి ఇస్తాడు.
రెండవ సారి కర్ణుడిని సాత్యకి ఎదుర్కొన్నప్పుడు జరిగిన యుద్దములో శ్రీకృష్ణుడి రథసారథి దారుకుడు ముఖ్య పాత్ర వహిస్తాడు. దారుకుడు మంచి నేర్పు కలిగిన రథసారథి. సాత్యకి కర్ణుడి అశ్వాలను సంహరిస్తాడు. రథాన్ని నాశనము చేస్తాడు. వృషేణుడూ తదితరులు కర్ణుడికి సహాయముగా వచ్చినా సాత్యకిని అదుపు చేయలేకపోతారు. దీనికంతటికి కారణము ప్రత్యేకమైన రథము, నేర్పరి అయిన రథసారథి దారుకుడు. శ్రీకృష్ణుడు ఒక్క కర్ణునితో పోరాడేందుకే దారుకుని నియమిస్తాడు. ఇది ఒక విధముగా సాత్యకి కర్ణునిపై విజయంగా చెప్పవచ్చు.
మూడవసారి ధృష్టద్యుమ్నుని పై కర్ణుడు దాడి చేసినప్పుడు ఇంచుమించు కర్ణుడు ద్రుష్టద్యుమ్నుడిని చంపబోయినప్పుడు సాత్యకి రక్షణకు వస్తాడు..
నాల్గవ సారి ధృష్టద్యుమ్నుడు శిఖండి ఇతరులు 14వ రోజు యుద్ధములో కర్ణుడిని చుట్టూ ముడతారు. కానీ కర్ణుడు ఒంటరిగానే చేసిన యుద్దములో అందరు ప్రాణాల కోసం పారిపోతుంటే ఘటోత్కచుడు వచ్చి కర్ణుడి నుండి అందరిని రక్షిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదునాల్గవ రోజున అప్పటికే బాగా అలసియున్న సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న భూరిశ్రవునితో యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు.
భూరిశ్రవుడు సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధ స్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునునితో జరుగుతున్న పోరాటం గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. భూరిశ్రవుడు సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో అర్జునుడు తన బాణంతో భూరిశ్రవుని చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు. భూరిశ్రవుడు ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని అర్జునుని నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని అర్జునుడు ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు. అంతట భూరిశ్రవుడు ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని ధ్యానం చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో భూరిశ్రవుని తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి భూరిశ్రవుని తల ఖండిస్తాడు.
ఐదవసారి కర్ణుడు ఇతర కౌరవ వీరులతో కలిసి సాత్యకిపై దాడి చేస్తాడు. మొదట్లో సాత్యకిదే పై చేయిగా ఉన్నతరువాత వెనకబడటం వలన అర్జునుడు సహాయానికి రావటంతో కర్ణుడు సాత్యకిని వదలి అర్జునుడితో తలపడతాడు. ఈ పోరు కర్ణుడిపై మూకుమ్మడి దాడి అవుతుంది. కానీ కర్ణుడి ధాటికి అర్జునుడు తప్ప మిగిలినవారు వెనక్కు తగ్గుతారు. ఇంతలో సూర్యస్తమయము అవటంతో యుద్ధమును ఆపేస్తారు.
అరవసారి పాండవుల పక్షాన ధృష్టద్యుమ్నుడు సాత్యకి ద్రౌపది కుమారులు కలిసి కర్ణుడు, కర్ణుని కుమారులతో తలపడతారు. ఈ యుద్దములో ఇరుపక్షాలు సమానంగా పోరాడతాయి. కొన్ని సందర్భాలలో కర్ణుడు చాలా మంది సైనికులను చంపుతాడు. ధర్మరాజుపై దాడి చేసి చుట్టూ రక్షణగాఉన్న సైనికులను అనేక మందిని కర్ణుడు చంపుతాడు. కానీ కర్ణుడు ధర్మరాజును చంపకుండా వదిలి వేస్తాడు ఇలా సాత్యకి కర్ణుడు ఇంకా మూడు సార్లు ఇతర వీరులతో కలిసి తలపడతారు కానీ అన్ని సందర్భాలలో కర్ణుడిదే పై చేయిగా ఉంటుంది కానీ సాత్యకి తన పట్టు వీడడు.
పదకొండవ సారి కర్ణుడితో తలపడ్డప్పుడు కర్ణుడి పక్షనా కర్ణుడి కొడుకు సుషేణుడు, సాత్యకి పక్షనా శిఖండి ధృష్టద్యుమ్నుడు ఇతరులు ఉన్నారు. కర్ణుడు సాత్యకి అశ్వాలను సంహరిస్తాడు. ఇది అవకాశముగా తీసుకొన్న సుషేణుడు సాత్యకి పై దాడి చేస్తాడు. కానీ సాత్యకి సుషేణుడిని చంపుతాడు. కోపముతో కర్ణుడు సాత్యకిపై అస్త్రాలను సాధిస్తే సాత్యకిని శిఖండి రక్షిస్తాడు. అప్పుడు కర్ణుడి బారి నుండి పాండవ సైన్యాన్ని రక్షించటానికి అర్జునుడు వచ్చి అందరిని రక్షిస్తాడు.
కర్ణుని ముందు సాత్యకి చాలా చిన్న యోధుడు కానీ శ్రీకృష్ణుడు ఇచ్చిన రథసారథి దారుకిని వలన చాలా సార్లు కర్ణునితో ఒంటరిగా కాకుండా సమూహములతో తలపడతాడు. కర్ణునితో తలపడ్డ సందర్భాలలో ఎనిమిది సార్లు కర్ణుడి విజయము సాధిస్తాడు. ఒక్కసారి మటుకే సాత్యకి కర్ణునిపై విజయము సాధిస్తాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో సాత్యకి, కృతవర్మ ఇద్దరూ బ్రతికారు. కృతవర్మ కృపాచార్యుడు, అశ్వత్థామలతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు రాత్రి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని కృతవర్మని, కృతవర్మ నిరాయుధుడైన భూరిశ్రవుని చంపావని సాత్యకిని పరస్పరం నిందించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, కృతవర్మ, మిగిలిన యాదవ వంశం మొత్తం గాంధారి శాపం మూలంగా నాశనం అయింది. ఆ విధముగా సాత్యకి చరిత్ర ముగుస్తుంది.
Image courtesy: Internet