[dropcap]ఫి[/dropcap]బ్రవరి 13వ తేదీ శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
“అమ్మా! సరోజినీదేవి!
స్త్రీ జాతి శిరోమణివమ్మా!
అమ్మా! సరోజినీదేవీ!”
పాటను వింటుంటేనే తెలుగువారి మనస్సులు దేశభక్తితో ఉప్పొంగుతాయి. ఆమె పదమూడేళ్ళ వయస్సులోనే దీర్ఘ కవిత వ్రాసిన కవయిత్రి. దేశ, విదేశాల్లో పర్యటించి జాతీయోద్యమాన్ని గురించి విస్తృత ప్రచారం సలిపిన నారీశిరోమణి, భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ, తొలి భారతీయ మహిళా గవర్నర్, తెలుగింటి కోడలు శ్రీమతి సరోజినీ నాయుడు.
వీరు 1879వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన నాటి నిజాం సంస్థానం (నేటి తెలంగాణా) లోని హైదరాబాద్‌లో జన్మించారు. వీరి తల్లి వరదసుందరీ దేవి, తండ్రి డా॥ అఘోరనాథ ఛటోపాద్యాయ. బెంగాలీ అయిన అఘోరనాథ్ నిజాం సంస్థానంలోని హైదరాబాద్ (నేటి నిజాం కాలేజి) కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేసారు.
వరదసుందరీ దేవి స్వయంగా కవయిత్రి, కథారచయిత్రి, ఆ వారసత్వం సరోజినికి అబ్బింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, బెంగాలీ, పర్షియన్ భాషలలో ప్రావీణ్యులు. పదకొండేళ్ళ వయసులోనే ఆంగ్లంలో రచనలు చేశారు. పన్నెండేళ్ళ ప్రాయంలోనే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 13వ ఏట 1300 పంక్తులలో (LADY OF THE LAKE) ‘సరోవరరాణి’ని ఆంగ్ల భాషలో సృజించారు. పర్షియన్ భాషలో ‘మహేర్ మునీర్’ నాటకాన్ని రచించారు. దీనిని చదివిన తరువాత వీరి తెలివితేటలను, జిజ్ఞాసను గమనించిన 6వ నిజాం మహబూబ్ ఆలీఖాన్ ‘నిజామ్ ఛారిటబుల్ ట్రస్ట్’ తరపున సంవత్సరానికి 4000 పైచిలుకు రూపాయలను స్కాలర్‌షిప్ మంజూరు చేశారు. వీరిని చదువుకునేందుకు లండన్ పంపించారు. కింగ్స్ కాలేజి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోని గిర్టన్ కాలేజిలలో చదువును కొనసాగించారు.
లండన్‌లో ఆంగ్ల సాహితీ విమర్శకులు ఆర్థర్ సైమన్స్, ఎడ్వర్డ్ గూస్‌లు వీరు ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టినందకు అభినందించారు. అక్కడి ఆంగ్ల పండితుల సాంగత్యంలో వీరి ప్రతిభ సుసంపన్నమయింది. ఆంగ్లభాషలో మంచి గ్రంథాలను వెలయించడానికి దోహదం చేసింది. అయితే ఆ గ్రంథాలలో భారతీయ సంస్కృతీ వైభవం, జీవన విధానాలకు పెద్దపీట వేశారావిడ. ఇది వీరి దేశభక్తిని తెలియజేస్తుంది. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి”ని ఈ విధంగా నిరూపించుకున్నారామె.
ఇంగ్లాండ్‌లో ఉండగానే డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారితో పరిచయమయింది. తరువాత 1898వ సంవత్సరంలో లండన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. నిజాం సంస్థాన వైద్యాధికారి అయిన డా॥ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారితోనే వీరి వివాహం జరిగింది. వీరిది కులాంతర వివాహం. వీరి వివాహం కందుకూరి వీరేశలింగం గారి చేతుల మీదుగా జరగడం విశేషం.
ఆ రోజుల్లో గోపాలకృష్ణ గోఖలే దేశమంతా విస్తృతంగా పర్యటించి మహిళా చైతన్యం కోసం తన ఉపన్యాసాల ద్వారా స్పూర్తిని కలిగించారు. సరోజినీ నాయుడు కూడా వారి ఉపన్యాసాల ద్వారా స్ఫూర్తిని పొందారు. దేశమంతటా పర్యటించి తన ఉపన్యాసాల ద్వారా ప్రజలను జాగృత పరిచారు. బ్రిటిష్ వారి వల్ల భారతీయులు పడుతున్న బాధలను ఉత్తేజపూరిత ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరించారు. ఆడపులిలా గర్జించేవారు. వీరికి స్వామి అరబిందో, గురుదేవ్ రవీంద్రులు, జవహర్ లాల్ నెహ్రూలతో కూడా పరిచయముంది. వారందరూ వీరిని అభిమానించేవారు.
1915లో బొంబాయి, 1916లో లక్నో నగరాలలో జరిగిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ సమావేశాలలో పాలుపంచుకున్నారు. 1919వ సంవత్సరంలో ‘ALL INDIA HOME RULE LEAGUE’ లో పాల్గొనేందుకు లండన్ వెళ్ళారు.
జలియన్ వాలాబాగ్ మారణకాండ తరువాత లండన్ నుండి గాంధీజీకి లేఖ వ్రాశారు. ఉద్యమానికి ఉపక్రమించమని అందులోని సారాంశం. లండన్ నుండి భారతేశానికి రావడంతోనే గాంధీజీ అనుచరురాలిగా మారారు. శాసనోల్లంఘనోద్యమంలో, విదేశీ వస్తు బహిష్కరణోద్యమాలలో పాల్గొన్నారు.
1925వ సంవత్సరంలో ‘భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షులయ్యారు. అలా తొలి భారతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత 1926లో దక్షిణాఫ్రికా, 1928లో కెనడా, అమెరికా, 1929లో ఆఫ్రికా దేశాలలో పర్యటించి అక్కడి భారతీయులలో జాతీయోద్యమ స్ఫూర్తిని ఇనుమడింపచేశారు. 1930లో దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం) సమయంలో మహాత్మునికి అండగా నిలిచారు. 1931లో మహాత్మునితో కలిసి లండన్ వెళ్ళి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
గాంధీజీ జైలుకి వెళుతూ ఉద్యమ నాయకత్వాన్ని వీరికి అప్పగించారంటేనే వీరి ప్రతిభ మనకు తేటతెల్లమవుతుంది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో వీరిని అరెస్టు చేసి జైలులో నిర్భందించారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం క్షీణించింది. 1945వ సంవత్సరం వరకు జైలుశిక్షను అనుభవించారు.
స్వాతంత్ర్యం లభించిన తరువాత మనదేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేశారు.
వీరు 1905లో ‘ది గో ల్డెన్ థ్రెషోల్డ్’, 1912లో ‘ది బర్డ్ ఆఫ్ టైమ్’, 1917లో ‘ది బ్రోకెన్ వింగ్’ సంకలనాలను వెలువరించారు. 1943లో ‘ది స్కెప్ట్రెడ్ ఫ్లూట్’ పేరుతో కవితలు ప్రచురితమయ్యాయి. వీరి కుమార్తె పద్మజానాయుడు వీరు 1927 నాటికి రాసిన కవితలను సవరించి 1961వ సంవత్సరంలో ‘ది ఫెదర్స్ ఆఫ్ ది డాన్’ గా విడుదల చేశారు.
1914వ సంవత్సరంలో ‘రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్’కి ఎన్నికయ్యారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ కవయిత్రిగా ఈమెకి లభించిన బిరుదు అయితే/ స్వాతంత్ర సమరయోధురాలిగా ‘జోన్ ఆఫ్ ది ఆర్క్’గా ప్రసిద్ధి పొందారు.
మహిళాభివృద్ధి కోసం కూడా కృషి చేశారు. ఉన్నత ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ/వివిధ వర్గాల మహిళల సమస్యలను క్షేత్రస్థాయి నుండి అవగాహన చేసుకున్నారు. 1917వ సంవత్సరంలో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు అక్కడ, తరువాత
భారతదేశంలోను మహిళల ఓటుహక్కు కోసం, బాల్యవివాహాల, పరదా పద్ధతి, వివిధ మూఢాచారాల నుండి విముక్తి మార్గాలను చూపించారు.
1949వ సంవత్సరం మార్చి 2వ తేదీన లక్నోలో మరణించారు.
కవయిత్రి, రచయిత్రి, స్త్రీవాది, మహిళోద్యమ నాయకులు, స్వాతంత్ర్య సమర యోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ తొలి భారతీయ మహిళాధ్యక్షురాలు, తొలి భారతీయ మహిళా గవర్నర్, గుండె జబ్బుని లెక్కచేయక పోరాడిని ధీశాలి. వీరి జ్ఞాపకార్థం 1964వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలా శాఖ.
వీరి జయంతి ఫిబ్రవరి 13వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet