[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 14వ తేదీన శంషాద్ బేగం జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఈమె అవిభక్త భారతదేశంలో టాకీ యుగపు తొలి స్వర్ణయుగంలో వెండి తెరని అలరించిన కోయిలమ్మ. దేశవిభజన తరువాత తన గురువుతో సహా సహ గాయనీగాయకులు, సంగీత దర్శకులు పాకిస్థాన్ తరలి వెళ్ళినా భారతాన్ని మురిపించాలని ఇక్కడే ఉండిపోయారు. 1940ల నుండి 1980ల వరకు హిందీ సినిమా గాయనిగా పేరు ప్రఖ్యాతులను పొందారు. తండ్రి విధించిన ఆంక్షలతో బందీయై, శ్రోతలకు వినిపించడమే గాని కనబడని కోయిలగా నిలిచారు. 1970ల తరువాత మాత్రమే అక్కడక్కడ ఆమె ముఖం మెరిసి మురిపించింది.
లతాజీని కూడా ఆమె ననుకరించి పాడమని కోరిన సంగీత దర్శకులన్నారంటే ఆమె స్వరం ఎంత ఉచ్చస్థాయిలో తారాస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆమెతో కోరస్ ఆలపించిన వారు సంగీత దర్శకులు, గాయకులుగా ఎదిగినప్పుడు వారిని ప్రోత్సహించి పాటలను ఆలపించిన నిగర్వి, మంచి మనసున్న మహామహిళామూర్తి ఆమె. భర్త మరణానంతరం ఇంట్లోనే ఉండి, తనని కోరి వచ్చిన వారి సినిమాల కోసం అడపాదడపా పాటలు పాడారు. ఆమే ‘ఒరిజినల్ నైటింగేల్ ఆఫ్ ఇండియా’ శంషాద్ బేగం.
ఈమె 1919 ఏప్రిల్ 14వ తేదీన నాటి బ్రిటిష్ ఇండియా నేటి పాకిస్థాన్ లోని లాహోర్‌లో జన్మించారు. ముస్లిం మతానికి చెందిన కుటుంబం వారిది. తల్లి గులాం ఫాతిమా సంప్రదాయ గృహిణి. తండ్రి హుస్సేన్ బక్ష్‌మాన్ మెకానిక్‌గా పనిచేసేవారు. బాల్యం నుండి పాటలు పాడటమంటే ప్రాణమామెకు.
ప్రాథమిక పాఠశాలలో చదివే సమయంలోనే ఈమె స్వరం అందరినీ ఆకర్షించేది. పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలలో ఈమె పాటలే ఆకర్షణగా నిలిచేవి. ఉపాధ్యాయులను విద్యార్థులనూ అలరించేవి.
బంధు మిత్రుల వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయి తన పాటలను వినిపించి తను సంతోషించి వారిని సంతోష పెట్టేవారు. బయటకు వచ్చేవారు కాదు.
15 ఏళ్ళ వయస్సులో హిందూ మతస్థుడు గణపత్ లాల్ బట్టోతో ఈమెకి వివాహం జరిగింది. ఈ దంపతుల కుమార్తె ఉష. ఈమెను లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ రాత్ర పెళ్ళి చేసుకున్నారు. శంషాద్ భర్త 1955లో మరణించాక కూతురు, అల్లుడు, మనవలతో గడిపారు.
ఈమె బాల్యం నుండి ఆలాపన చేసే ఖవ్వాలీలు, గజలను మామ అమీర్ ఖాన్ ఇష్టంగా వినేవారు. అప్పటికే లాహోర్‌లో సంగీత కళాకారుడిగా పేరు పొందిన గులాం హైదర్ దగ్గరకు ఈమెను తీసుకునివెళ్ళి పరిచయం చేశారు. వారిద్దరూ కలిసి ఈమెను ‘జెనోఫోన్ మ్యూజిక్ కంపెనీ’కి తీసుకెళ్ళారు. ఈ కంపెనీ వారి ఉత్పత్తులు ధనవంతుల చేత, ఉన్నత వర్గాల చేత ఆదరింపబడేవి. అత్యధిక ప్రజాదరణ కలిగిన కంపెనీగా పేరు పొందింది.
ఈమె పాడిన బహదూర్‌షా జఫర్ వ్రాసిన గజల్ “మేరా యార్ ముఘే మైలే అగర్” గులామ్ హైదర్‌కి బాగా నచ్చింది. ఆయన 12 పాటలు పాడే అవకాశాన్ని అందించారు. శంషాద్ తండ్రి అయిష్టంగానే కూతురు పాడడానికి అనుమతించారు. అయితే బురఖాలోనే ఉంటుందనే షరతును విధించారు.
చివరకు జెనోఫోన్ కంపెనీతో ఒప్పందం కుదిరిందామెకు. 5000 రూపాయలు పారితోషికంగా లభించిందామెకి. ఆ రోజుల్లో చాలా మొత్తం అది.
గులామ్ హైదర్ సంగీత రచనలో ఈమె గాన నైపుణ్యం సుసంపన్నమైంది. 1937లో లాహోర్ లోని ఆకాశవాణి కేంద్రం నుండి రాగాలాపన ప్రస్థానాన్ని ఆరంభించారు. తరువాత ఢిల్లీలో స్వయంగా ఒక సంగీత బృందాన్ని స్థాపించారు. దీని పేరు “ది క్రౌన్ ఇంపీరియల్ ధియేట్రికల్ కంపెనీ ఆఫ్ పెర్మార్పింగ్ ఆర్ట్స్”. ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఢిల్లీ ఆకాశవాణి కోసం పాటలు పాడారు. ఈ రేడియో కేంద్రాల ద్వారా ఈమె పాటలు విస్తృత ప్రచారాన్ని పొందాయి. ఇంకా ఈమె వివిధ గ్రామోఫోన్ రికార్డింగ్ కంపెనీల ద్వారా పాడి విడుదల చేసిన రికార్డులు ఈమెకు గొప్పగాయనిగా పేరు తెచ్చాయి.
ఈమె స్పష్టమైన స్వరం ఆమెకి అభిమానుల సంఖ్యా బలాన్ని సుసంపన్నం చేసింది. ప్రముఖ సారంగి వాయిద్య ప్రముఖులు మాస్టో హుస్సేన్ బక్ష్వాల్ సాహెబ్ ఈమె గానాన్ని మెచ్చి, శిష్యురాలిగా స్వీకరించారు.
గులామ్ హైదర్ ఈమెను ‘చౌముఖి’ అని ప్రశంసించారు. అంటే ఏ పాటనయినా పాడగల గాయని (All Round Artist) అని అర్ధం.
ఈమె హిందూ భక్తి గీతాన్ని ఉమాదేవి పేరుతో ఆలపించి రికార్డును విడుదల చేశారు.
అనేక నాట్స్ (ఇస్లాం భక్తి గీతాలు)ను ఆలపించారు. ఈ పాటలతో వివిధ కంపెనీలు గ్రామఫోన్ రికార్డులను విడుదల చేశాయి. వీటి ద్వారా దేశమంతా ఈమె పేరు మార్మోగి పోయింది.
ఇవన్నీ ప్రజలలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈమె స్వరాన్ని అందరూ ఆదరించారు. ఈమె స్వరమాధురి అలా అలా సినిమా ప్రపంచానికి చేరింది. చాలా మంది సంగీత దర్శకులు ఈమె స్వరానికి ఫిదా అయ్యారు.
1940లో ఈమె తొలిసారిగా పంజాబీ సినిమా యమ్లాజాట్ (కంకాణ్ దియాన్ ఫసలా పకియా మే) పాటతో సినీ నేపథ్య సంగీత ప్రస్థానాన్ని ఆరంభించారు.
ఆ తరువాత గులాం హైదర్ తన సంగీత దర్శకత్వంలో ఖజాంచి, ఖాన్‍దాన్ చిత్రాలలో పాడించారు. ఈమెకి నిర్మాత పంచోలీ నటిగా అవకాశం ఇస్తానన్నారు. కాని ఈమె తండ్రి తన కూతురు నటించకూడదని నిర్బంధం విధించారు. అంతేకాదు పాటలు పాడేప్పుడు కూడా ఈమె ముఖం ఎవరికీ కనపడకూడదని, బురఖాలో మాత్రమే రికార్డింగ్‌కు వస్తుందని షరతు పెట్టారు. అంతేకాదు ఫోటో దిగకూడదు, ఫంక్షన్లకు వెళ్ళకూడదనీ నిబంధన. ఈ విధంగా తండ్రి ఆలోచనలు, సిద్ధాంతాలకు తలవంచారు. 1970ల తరువాత మాత్రమే ఈమె అక్కడక్కడా కన్పించేవారట.
ఈమె విలక్షణ స్వరం మంద్ర స్థాయిలో ఉండేది. ఈమె స్వరాన్ని O.P. నయ్యర్ -ఆలయగంట- గా అభివర్ణించారు. మైక్‌కి దూరంగా ఉండి కూడా ఉచ్చస్వరంతో గేయాలను ఆలపించేవారు. ఇంత గొప్ప స్వరం వివిధ భారతీయ భాషలలోని గీతాలను అలవోకగా, అద్భుతంగా, అద్వితీయంగా వెలువరించి, ప్రేక్షక శ్రోతలను అలరించింది. హిందీ, బెంగాలి, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళ భాషలలో సుమారు 6000 దాకా పాటలు పాడారు. అత్యధిక పారితోషకం తీసుకున్న గాయని ఈమె.
ఈమె అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు నౌషాద్ అలీ, O.P. నయ్యర్, గులాం హైదర్, సి. రామచంద్ర, ఎస్.డి. బర్మన్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, శంకర్ జైకిషన్, రోషన్, రాంగంగూలీ, మదన్ మోహన్, అనిల్ బిశ్వాస్, వసంత్ దేశాయ్, బులో సి. రాణి, ధనిరాయ్, ఖయ్యామ్, లక్ష్మణ్ బెర్డేకర్ మొదలైన సంగీత దర్శకుల వద్ద నవరసాలు, విభిన్న రాగాలు, వైవిధ్య భరిత పాత్రల కోసం పాడిన పాటలు ఈతరం ప్రేక్షకశ్రోతలను కూడా అలరిస్తూనే ఉంటాయి. రీమిక్స్ పాటలు తయారుచేస్తున్నారు కూడా! చాలా మంది సంగీత దర్శకుల తొలి చిత్రాలకు పాటలు పాడి వారికి ప్రోత్సాహాన్ని అందించారు. వారిలో తరువాత కాలంలో పేరుపొందిన మదన్మోహన్ వారుండడం విశేషం. అనేకమంది సహగాయనీ గాయకులతో కలిసి ఈమె ఆలపించిన గీతాలు ఈనాటికి శ్రోతల హృదయాలను గిలిగింతలు పెడ్తూనే ఉన్నాయి.
లతామంగేష్కర్, ఆశా భోస్లే, ఉషామంగేష్కర్ సోదరీమణులతో పాటు జోహ్రాబాయి, అమీర్‌బాయి కర్నాటికి, నూర్జహాన్ మొదలైన అత్యుత్తమ గాయనీమణులతో కలసి ఈమె ఆలపించిన యుగళగీతాలు ఈనాటికి అజరామంగా నిలిచాయి.
ఈమె హిందుస్థానీ శైలిలోని ఖయాల్స్, టుమ్రీలు, గజల్స్ వంటి వాటితో పాటు, భావగీతాలు, అభంగ్లు, భజనలు ఆలపించారు. పాప్ సంగీతంతో కూడిన పాటలనీ అత్యుత్సాహంతో ఆలపించి యువతరం హృదయాలను దోచుకున్నారు. వివిధ శైలులకి సంబంధించి శాస్త్రీయ సంగీత మూలాలను భంగపరచలేదు. అందుచేతనే ఆమె అత్యున్నత ఒరిజినల్ నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఎదగగలిగారు.
ఈమెను మెహబూబ్ ఖాన్ బొంబాయి తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. కుటుంబం మొత్తానికి ఈ సౌకర్యాలను సమకూర్చి తన సినిమాలలో పాడించారు. ‘తఖదీర్’ సినిమాలో నర్గీస్‌కు పాడించి ఇద్దరికీ పేరు తీసుకొచ్చిన ఘనతను పొందారు.
ఈమె పాటల ప్రస్థానాన్ని అవలోకిస్తే “సావన్ కే నజారే హై” (ఖజాంచి), “మేరే పియాగయే రంగూన్” (పతంగా), “రేష్మీ శల్వార్ కుర్తా జాలీకా” (నయాదౌర్), “డర్నా మొహబ్బత్ కర్ లే” (అందాజ్), “ఉడన్ కటోలే పే జావూ” (అన్‌మోల్ ఘడీ), “మేరీ నీందో మే తుమ్” (నయా అందాజ్), “ఓ లేకే పెహ్లా పెహ్లా ప్యార్” (సి.ఐ.డి), “మిలే హి ఆంఖేదిల్ హువా దీవానా” (బాబుల్), “కజ్రా మొహబ్బత్ వాలా” (కిస్మత్), “దూర్ కోయి గాయే ధున్”(బైజుబావరా), “కభీ ఆర్ కభీ పార్ తీరే నజర్” (ఆర్ పార్), ‘ఆన్’ సినిమాలోలో “ఆగ్ లగీ తన్ మన్ మే దిల్ కో పద ధామ్నా”, “ఛాయా మేరీ ఉమ్మిద్ కి దునియా మే అంధేరా” (చాందీ రాత్) వంటి పాటలన్నీ ఈమె ఆలపించిన గొప్ప పాటలలొ కొన్ని మాత్రమే. మరికొన్ని ప్రత్యేక తరహా పాటలు ఈమె ఆలాపనలో చోటు చేసుకున్నాయి.
‘ఆవారా’ సినిమా కోసం “ఏక్, దో, తీన్ ఆజా మాసమ్ హై రంగీన్” క్లబ్ పాటని ఆలపించారు. ఈ పాట ఈ నాటికీ ప్రేక్షకుల చేత గెంతులు వేయిస్తుందనడం అతిశయోక్తి కాదు.
ఈమె అద్భుతంగా ఆలపించిన “ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే సే సండే” పాటని ‘షెహనాయి’ సినిమా కోసం తొలిసారిగా పాశ్చాత్య బాణీలో స్వరపరిచి రికార్డును సృష్టించారు. సంగీత దర్శకులు సి.రామచంద్ర.
“హోలీ ఆయీరే కన్వాయి” అనే హోలీ పాటని మదర్ ఇండియా కోసం అద్వితీయంగా ఆలపించారు. ఇది ఈ నాటికీ సూపర్ హిట్ పాటే!
“యే దునియా రూప్ కీ చోర్” అనే బహు భాషా గీతాన్ని షబ్నం’ సినిమా కోసం ఆలపించారు.
‘మొఘల్-ఎ-ఆజం’ సినిమా కోసం లతా మంగేష్కర్‌తో కలిసి ఆలపించిన ఖవ్వాలీ గీతం “తేరీ మెహఫిల్ మే కిస్మత్ ఆజ్మాకే హమ్ భీ దేఖేంగే” పాట ఈ నాటికీ ఖవ్వాలీలో అత్యుత్తమమైనదే! షాజెహాన్ సినిమా కోసం పాడిన “జబ్ ఉస్నే గెసు బిఖారాయే” గొప్ప నృత్య గీతం.
ఇంకా ఎన్నెన్నో పాటలు-ఈ చిన్ని వ్యాస కమండలంలో ఎలా ఇమడ్చగలం?
“కాహే కోయర్ షోర్ మచాయిరే” (ఆగి) పాటకో చరిత్ర ఉంది. రాజ్ కపూర్ తొలి స్వంత చిత్రం ‘ఆగ్’ కోసం పాడమని ఈమెను కోరారు. పృధ్వీరాజ్ కపూర్ పట్ల గౌరవంతో ఒప్పుకున్నారు ఈమె. సంగీత దర్శకుడు రాంగంగూలీ, ఆయన సహాయకులు (తరువాత పేరు పొందిన సంగీత దర్శకులు అయిన) శంకర్ జైకిషన్లతో కలిసి ఈమె ఇంటికి వెళ్ళి పాటలు రికార్డు చేశారంటే…. ఆనాడు శంషాద్ బేగంకి సినీ పరిశ్రమలో లభించిన గౌరవాభిమానాలు మనకు అర్ధమవుతాయి.
స్వర్ణయుగపు నటీమణులలో చాలామందికి తొలిపాటలు శంషాద్ బేగం పాడటం గొప్ప విశేషం. నర్గీస్, మీనాకుమారి, మధుబాల, గీతాబాలి, కామినీ కౌశల్, నళినీ జయవంత్, షకీలా, వైజయంతి మాల, వహీదా రెహమాన్ కధానాయికల నటనకు తన స్వరంతో సొబగులందించారు ఈమె.
ఈమె నటగాయని, దక్షిణ భారత సినిమా చరిత్రలో ఎన్నో విషయాలలో తొలి మహిళగా పేరుపొందిన శ్రీమతి భానుమతీ రామకృష్ణకు పాటలు పాడడం ఒక గొప్ప చారిత్రక విశేషం. అది గొప్ప రికార్డు కూడా! తమిళం నుండి హిందీలో నిర్మించబడిన నిషాన్, మంగళ చిత్రాలలో శంషాద్ తన స్వరంతో భానుమతి నటనను పరిఢవిల్లజేశారు. ఈ అవకాశం ఈమెకు లభించిన అపురూప వరం కూడా!
“ఈమె మృదుస్వభావి, పబ్లిసిటీ కోరిక లేని సెంటిమెంట్ మహిళ”, అని ప్రశంసించారు నౌషాద్.
ఈమె ఆలపించిన సుమారు 6000 పాటలలో 1200 పైచిలుకు హిందీ పాటలేనని అంచనా. పంజాబీ భాషలో ఈమె పేరు నొందిన అత్యధిక పారితోషికం తీసుకున్న గాయనిగా పేరుపొందారు.
ఈ సంగీత సామ్రాజ్జి 1940, 1950 దశాబ్దాల కాలంలో ఆలపించిన పాటలు ఈ నాటికీ గ్రామ ఫోన్ల రూపంలో భద్రపరచబడి ఉన్నాయి. అవి రేడియో, టి.వి.ఛానల్స్, డి.వి.డి, యూట్యూబ్స్ ద్వారా ఈ నాటికీ శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి. అభిమానులు ఈమెను Godess of Gramophone అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు.
2009లో ఈమెకి ఓ.పి.నయ్యర్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
2009లో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైద్రాబాద్‌లో అప్పటి రాష్ట్ర ఆర్థికమంత్రి కె.రోశయ్య, గాయనీమణులు రావుబాల సరస్వతీ దేవి, పి. సుశీల, కె.జమునారాణి, యల్.ఆర్.ఈశ్వరి
మొదలయిన వారి చేతుల మీదుగా సత్కరించి ‘కళాసరస్వతి’ బిరుదును అందించి గౌరవించారు. ఈమె పాటలతో నిర్వహించిన సంగీత విభావరిని ప్రేక్షకులతో పాటు ఈమె కూడా అమితానందంతో ఆలకించి సంతోషాతిరేకంతో పులకించిపోయారు.
1976 వరకు అప్పుడప్పుడూ నిర్మాత కోరిక మేరకు సినిమాలలో పాటలు పాడుతూనే ఉన్నారు. ఆమె సుదీర్ఘ కాలం వృద్దాప్య కారణంగా అనారోగ్యంతో 2013 ఏప్రిల్ 23వ తేదీన ముంబైలోని తన నివాసం హీరానందాని గార్డెన్స్‌లో మరణించారు.
ఈమె జ్ఞాపకార్థం 2016 డిసెంబర్ 30వ తేదీన 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. నవ్వుతూ మెరిసిపోతున్న శంషాద్ చాలా అందంగా కన్పిస్తారు ఈ స్టాంపు మీద.
Legendary Signers of India – శీర్షికతో విడుదలయిన 10 మంది గాయనీగాయకులతో కలిసి స్టాంపు విడుదలవడం ముదావహం.
ఏప్రిల్ 14 వ తేదీన శంషాద్ బేగం జయంతి సందర్భంగా ఈ వ్యాసం.
***
Image Courtesy: Internet