[dropcap]అ[/dropcap]క్టోబరు 28 సోదరి నివేదిత సందర్భంగా జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
మన దేశానికి విదేశాల నుండి వచ్చి వివిధ రంగాలలో సేవలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు ఐరిష్ మహిళ, స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత. ఈమె బాలికా, మహిళా విద్యావేత్తగా/కళాకారులకి ప్రోత్సాహాన్ని అందించిన కళాకారిణిగా, శాస్త్రవేత్తలకు ఆర్థిక సాయాన్ని అందించిన విజ్ఞానశాస్త్ర అభిమానిగా/సాహితీ సృజన చేసి సాహితీకారులతో సత్సంబంధాలు నెరపిన సాహితీవేత్తగా పత్రికా సంపాదకురాలిగా/ ప్లేగు వ్యాధి బాధితుల సహాయకారిగా/స్వాతంత్ర్య పోరాట యోధులను ప్రోత్సహించి సలహాలను, సహాయాన్ని అందించారు.
ఈమె 1867 అక్టోబర్ 28వ తేదీన ఐర్లాండ్ లోని కౌంటీ టైరోన్‌లో జన్మించారు. అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. తల్లిదండ్రులు మేరీ ఇస్‌బెల్లా, శామ్యూల్ రిచ్‍మండ్‌లు. తాత హామిల్టన్ ఐర్లండ్ స్వాతంత్ర్య పోరాట యోధుడు.
బాల్యంలో కొంతకాలం మాంచెస్టర్, గ్రేట్ టొరింగ్‌టన్‍లో నివసించారు. పదేళ్ళ వయసులో తండ్రి మరణించారు. తరువాత తాత హామిల్టన్ దగ్గరకు ఐర్లాండ్ వెళ్ళారు.
తోటి మానవులని కరుణతో చూడడమే భగవంతునికి నిజమయిన సేవ చేయడమని బాల్యంలోనే తండ్రి బోధనల నుండి గ్రహించారు. తన ఆశయంగా భావించారు. జీవితాంతం దీనిని పాటించారు.
ఈమె తల్లి మేరీ ఉపాధ్యాయురాలుగా పని చేశారు. చదువు విలువ తెలియడంతో కుమార్తెను చదివించారు. మార్గరెట్ హాలిఫాక్స్ కళాశాలలో చదివారు. పదిహేడేళ్ళ వయసులో కెస్విక్‌లో స్కూలును ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యావేత్త జోహాన్ హెన్రిచ్ పెస్టలోజీ (Johann Heinrich Pestalozzi), జరన్మీ విద్యావేత్త ఫ్రెడరిక్ ఫ్రూబెల్ (Friedrich Frobel)ల అభిప్రాయాలను చదివి విద్యాసంస్కరణల ఆవశ్యకతను గ్రహించారు. వీరిద్దరు Pre School Education ప్రాముఖ్యతను గురించి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ గ్రంథాలు వ్రాశారు. వీటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. వాటిని పాటిస్తూ పాఠశాలలను నడిపారు. రస్కిన్ స్కూల్‌ను స్థాపించారు. రుక్బై లోని అనాథాశ్రమంలో పిల్లలకు పాఠాలను బోధించారు. ఆటపాటలతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చే విద్యను అందించాలని ఈమె అభిప్రాయం.
భౌతికశాస్త్రం, చిత్రకళ, సాహిత్యం సంగీతాలంటే ఈమెకు చాలా ఇష్టం. ఆదివారం క్లబ్, లివర్‌పూల్ సైన్స్ క్లబ్‌లో సభ్యురాలిగా చేరారు. కొత్త విద్యావిధానాన్ని గురించి అక్కడ చర్చించేవారు. 1892లో ‘కింగ్స్ లీగేట్’లో ఒక పాఠశాలను స్థాపించారు. ఈమె అనుసరించిన కొత్త పద్ధతులకు, విద్యాసంస్కరణలకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
1895లో స్వామి వివేకానందను లండన్ పర్యటనలో ఈమె కలిశారు. ఆయన కోరిక మీద భారత దేశానికి వచ్చి బాలలకు, వృద్ధులకు సేవ చేయడానికి పూనుకున్నారు.
‘మొంబాస’ అనే ఓడలో బయలుదేరి 1898 జనవరి 28వ తేదీన కలకత్తా చేరారు. భారతదేశ గొప్పతనాన్ని, భారతీయ తత్వశాస్త్రం, సామాజిక పరిస్థితులను గురించి గురువు గారి ద్వారా తెలుసుకున్నారు. భారతీయ మూలాలను అవగాహన చేసుకుని, హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యారు.
ఈలోగా స్వామి వివేకానంద మరో ఇద్దరు యూరోపియన్ శిష్యురాళ్ళు సారాసిబుల్, జోసెఫిన్ మాక్లెమోడ్‌లు భారతదేశానికి వచ్చారు. వీరు మార్గరెట్‌తో కలిసి మనదేశానికి సేవలను అందించారు.
స్వామి వివేకానంద మార్గరెట్ పేరును సోదరి నివేదితగా మార్చారు. తరువాత రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవిని కలిశారు. శారదాదేవి ఈమెను ‘చిన్నమ్మాయి’ అని పిలిచేవారు. ఇలా ఈమెకు సన్నిహితులయ్యారు.
స్నేహితులు ముగ్గురు స్వామి వివేకానందతో కలిసి భారతదేశమంతా విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు.
భారతదేశంలో బాలికావిద్య అవసరాన్ని గుర్తించారు. విదేశాల నుండి కూడా నిధులను సమకూర్చుకున్నారు. కొంత మంది కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు. వారి కుమార్తెలను పాఠశాలకు పంపమని కోరారు.
1898లో కలకత్తాలోని బాగ్ బజార్‌లో 16బోస్ పెరాలే లో శారదాదేవి, స్వామి వివేకానందలు అతిథులుగా వచ్చి బాలికా పాఠశాలను స్థాపించారు.
ఇక్కడ శిక్షణ పొందిన బాలికలు ఆదర్శ బాలికలుగా మారగలరని శారదామాత ఆకాంక్షించి, ఆశీర్వదించారు. ఈ పాఠశాలలో పాఠాలతో పాటు వృత్తిపనులు, నేత, కుట్టు, నర్సింగ్, ప్రాథమిక వైద్య చికిత్స, ఇతర కుటీర పరిశ్రమలలో శిక్షణను అందించేవారు.
1899లో కలకత్తా నగరం ప్లేగు మహమ్మారికి గురయింది. నివేదిత ఈ వ్యాధి బాధితులకు విస్తృతంగా సేవలను అందించారు. వీరికి సహాయం చేయమని అభ్యర్థనలను పంపించారు.
ఈమెకి కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుచేతనే మనదేశ ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులు అయిన నందలాల్ బోస్, అసిత్ కుమార్, సురేంద్రనాథ్ గంగోపాధ్యాయ గురుదేవ్ రవీంద్రులు, అబలా బోస్, అబనీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారితో సత్సంబంధాలను నెలకొల్పింది.
ఈమె విజ్ఞానశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తిగా సమాజాభివృద్ధికి ఇది అవసరమని గుర్తించారు. మన దేశ శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ చంద్రబోస్ మంచి పరిశోధకులు. అయితే పరిశోధనకి కావలసిన ఆర్థిక వనరులు లేవు. ఆయన పరిస్థితిని గమనించిన నివేదిత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక శాస్త్రవేత్తగా జగదీశ్ చంద్రబోస్‌కు పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా సాయం చేశారు.
భారత స్వాతంత్రోద్యమంలో కూడా ఈమె నిర్వహించిన పాత్ర ఎనలేనిది. 1902లో గాంధీజీ ఈమెను కలిశారు. ఆమె సేవలను ప్రశంసించారు.
1905 బెంగాల్ విభజన సమయంలో ‘వందేమాతరం’ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో స్వాతంత్ర్య పోరాటయోధులకు సహాయసహకారాలను అందించారు.
‘అనుశీలన్ సమితి’ అనే రహస్య సంస్థ నాటి బెంగాల్ ప్రెసిడెన్సీ పోరాట కార్యక్రమాలను నిర్వహించేది. చాలామంది యువకులు ఈ సంస్థలో చేరి వీరందరికి ఈమె అందించిన సహాయం అనుపమానం.
శ్రీ అరబిందోకి ఈమె అత్యంత సన్నిహితులు. బ్రిటిష్, ఇండియన్ పరిథిని దాటి పోరాటం నిర్వహిస్తే జైలుకి వెళ్ళకుండా ఉండవచ్చని ఈమె అభిప్రాయం. అరవిందులు ఫ్రెంచి వారి పుదుచ్చేరికి వెళ్ళడానికి ఇదే కారణం కావచ్చు.
దక్షిణ భారతదేశ పర్యటనలో మరో ఐరిష్ వనిత శ్రీమతి అనీబెసెంట్‌ను, ప్రముఖ తమిళకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతిని కలిసి అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశ స్త్రీలకు విద్య, స్వాతంత్ర్య అత్యవసరమని చర్చించారు.
‘రామకృష్ణశారద మిషన్’ను స్థాపించారు. సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
1907 నుండి 1911 వరకు అమెరికా, ఇంగ్లాండ్‌లలో పర్యటించారు. తన మాతృదేశం ఐర్లాండ్‌కి కూడా వెళ్ళారు. భారతదేశ మహిళల సమస్యలను గురించి, భారత దేశానికి స్వాతంత్ర్యం యొక్క ఆవశ్యకతని గురించి విదేశాలలోని భారతీయులకి తన ఉపన్యాసాల ద్వారా వివరించారు.
ద మదర్, హిట్స్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఎ పిల్‌గ్రిమ్స్ డైరీ, బ్లాక్ ద మదర్, మాస్టర్ ఎడ్జ్‌కేమ్, వెబ్ ఆఫ్ ది ఇండియన్ లైఫ్, ద మాస్టర్ యాజ్ సీన్ హిమ్, కేదార్‌నాథ్ – బదరీనాథ్ వంటి గ్రంథాలను రాశారు.
‘జాతీయ విద్య పై సూచనలు’ గ్రంథంలో భారత విద్యావిధానంలో రావలసిన మార్పులను గురించి చర్చించారు. ‘యుగాంతర్’ పత్రికకు సంపాదకత్వం వహించారు.
ఈ విధంగా విద్యావేత్తగా భారతదేశంలో అడుగుపెట్టి, హిందూమతాభివృద్ధికోసం కృషి చేసి, వృత్తి విద్యకు ప్రాధాన్యతను ఇచ్చి, భారతస్వాతంత్ర్య పోరాటంలో పరోక్షంగా పాల్గొని, మహిళాభివృద్ధి కోసం కృషి చేసిన సోదరి నివేదిత వ్యక్తి కాదు, వ్యవస్థ అని నిరూపించుకున్నారు.
‘రేమండ్, లిజెల్. ది డెడికేటెడ్ ఎ బయోగ్రఫీ ఆఫ్ నివేదిత’ అనే గ్రంథంలో జాన్‌డే ఈమె జీవితాన్ని చిత్రించారు.
విశాంతికోసం చివరి రోజులలో జగదీశ్ చంద్రబోస్ దంపతులతో కలిసి డార్జిలింగ్ వెళ్ళారు. రక్త విరేచనాలతో బాధపడ్డారు. మంచి వైద్యాన్ని అందించినా ఫలితం కనిపించలేదు. 1911 అక్టోబర్ 13వ తేదీన డార్జిలింగ్ లోనే మరణించారు. డా॥ జగదీశ్ చంద్రబోస్ దంపతులు కృతజ్ఞతతో ఈమెకి చివరి వరకూ సపర్యలు చేసి ఋణం తీర్చుకున్నారు.
1968 అక్టోబర్ 27వ తేదీన 20 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. సోదరి నివేదిత నిలువెత్తు చిత్రం ఈ స్టాంపు మీద కనిపిస్తుంది.
ఈమె జయంతి అక్టోబర్ 28 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet