Site icon Sanchika

ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న పాట – ‘టెల్ మీ వై’

[ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న పాట – ‘టెల్ మీ వై’ గురించి వివరిస్తున్నారు అనుకృతి.]

(ఈ వ్యాసం చదివిన తర్వాత గానీ, చదవటానికి ముందుకానీ Declan Galbraith పాడిన ‘Tell me why’ పాటను ఒక్కసారి వినమని కోరుతున్నాను. అప్పుడే ఈ పాట గొప్పతనం అర్ధమవుతుంది.)

[dropcap]‘టె[/dropcap]ల్ మీ వై’ టైటిల్‌తో వచ్చిన ఈ ఇంగ్లీష్ పాట, సంగీత ప్రపంచంలో ఓ అరుదైన ఘనతను, ఖ్యాతిని సొంతం చేసుకొన్న ఒక అద్భుతమైన పాట. దీనిని పాడిన గాయకుడి వయస్సు, పన్నెండు సంవత్సరాల లోపే. మొదట ఈ పాట Declan Galbraith ఒక్కడే పాడాడు. 2002 డిసెంబర్ తొమ్మిదిన, 83,637 బాల బాలికలతో కలిసి పాడిన ఈ పాట ఒక ప్రపంచ రికార్డుని సొంతం చేసుకొంది. 83,637 బాల బాలికల CHORUS కోసం ఇంగ్లాండ్, ఐర్లాండ్ లోని వివిధ ప్రదేశాలనుండి సెలెక్ట్ చేసి పాడించారు. ఈ పాట గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించినది ‘Young Voices in Concert’ అనే సంస్థ. ఈ అత్యద్భుతమైన సంగీత విభావరి ద్వారా వసూలయిన డబ్బుని ‘సార్జెంట్ కాన్సర్ కేర్ ఫర్ చిల్డ్రన్’కి డొనేట్ చేశారు.

ప్రస్తుత ప్రపంచంలో జాతి, మత విద్వేషాలకు బలైపోతున్న ప్రజలు కోట్లలో వున్నారు. యుద్ధాల వలన అమాయక ప్రజలు బలై పోతున్నారు. ఆకలితో, రోగాలతో, నిలువనీడ కోల్పోయి, ఒక్కొక్క యుద్ధం వలన జీవితాన్ని కోల్పోయి, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని, కట్టుబట్టలతో ఆశ్రయం కోసం వేరే దేశాల సరిహద్దుల్లోకి జొరబడి, ప్రాణాలు కోల్పోయిన వారెందరో. ఆకలితో అలమటిస్తూ, సహాయం కోసం ఎదురుచూసే నిస్సహాయుల ఆక్రందనల గురించే ఈ పాట.

యుద్ధమంటే ఆధిక్యత కోసం రెండు రాజకీయ వర్గాలు కానీ, మత ప్రాతిపదికన విధ్వంసాలు సృష్టించేవారు కానీ, చేసే ఒక రాక్షస క్రీడ. అటువంటి స్పర్ధ వలన బలై పోతున్న అమాయకుల గురించి ఎవరూ పట్టించుకోరు, ఆలోచించరు. మనకు, వార్తా పత్రికలలో, టీవీ లల్లో కాసేపు వాటి గురించి చదివినా, చూసినా, వాటి ప్రభావం కొంత సేపు మాత్రమే ఉంటుంది. ఇటువంటి పాశవిక సంఘటనల్లో బలైపోయేది ఎక్కువగా స్రీలు, పిల్లలు. స్త్రీల గోడు పట్టించుకొనేదెవ్వరు? పిల్లల్ని, భర్తనీ, బంధువలనీ కోల్పోయి మానభంగాలు చిత్ర హింసలకుగురయ్యేది ఎక్కువగా స్త్రీలే. కళ్ళముందే పిల్లల్నీ, భర్తనీ కోల్పోయి రోదించే స్త్రీలను ఎవరు పట్టించుకొంటారు? ఒకసారి యుద్ధం మొదలయ్యిందంటే, జీవితాలు కాలిపోయినట్టే. పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమవుతాయి. ప్రశాంతమూ, స్థిరమైన జీవితం ఉండదు. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ఆధునిక రీతుల ద్వారా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. గెలిచిన వారికీ, ఓడిపోయిన వారికీ, ఇద్దరికీ భయంకరమైన అనుభవాలే మిగులుతాయి. కోల్పోయిన వాటినన్నిటినీ పొందటం అసలు సాధ్యమయ్యే పనికాదు. క్షతగాత్రులైన సైనికులూ, ముఖంగా ప్రజలు ఆహారమూ, నీరు, వైద్యం దొరకని భయంకర పరిస్థిలలోకి నెట్టబడతారు. ఇన్ని అంశాలతో నిండిన ఈ పాటని, ప్రపంచ దేశాల పాలకులందరికీ ఒక విజ్ఞాపన లాంటిది.

యుద్ధం ముగిశాక మనం ఏమనుకొంటాం? హమ్మయ్య, యుద్ధం ముగిసింది, అని న్యూస్ పేపర్ మూసేస్తాము.

Declan Galbraith

యుద్ధాల వల్ల పైన చెప్పిన నష్టాలే కాదు, అనేక మానసిక సమస్యలూ ఏర్పడతాయి. శబ్ద కాలుష్యానికి వినికిడి శక్తి ద్వంసమౌతుంది. ఎక్కువమంది ఆప్తులని కోల్పోయి పిచ్చివాళ్ళైపోతారని రీసెర్చెస్ చెబుతున్నాయి.

కానీ వైరి వర్గాలు, యుద్ధం అయిపోయిందని ఎగిరి గంతేసి, కొత్త సంధి చేసుకోవచ్చు, కానీ మానసికంగా కృంగిపోయి, మానసిక వికలాంగులైపోయే మనుషులు లక్షలలోనే ఉంటారు. గాయపడిన పిల్లలకు, వికలాంగులై, దుర్భర జీవితాన్ని గడుపుతున్న ప్రజల గోడు, ఆక్రందన వినేదెవరు? ఆపన్నహస్తం అందించేదెవ్వరు అన్న ప్రశ్నలతో మనందరికీ ఈ బాలలు నిలదీస్తున్నారు.

ఈ పాటలో అన్నీ ప్రశ్నలే. అసలు పాటే పెద్ద ప్రశ్న. జవాబు లేని, సభ్య ప్రపంచం పరిష్కారం చూపలేని ప్రశ్నలతో, సంధించిన బాణంలా మన గుండెల్ని చీల్చి వేస్తుంది.

పాట ఇలా మొదలవుతుంది.

“In my dream, children sing

A song of love for every boy and girl”

అదొక అందమైన కల, ఆ కలలో పాట ప్రారంభంలో వర్ణించిన ఒక బాలునికి వచ్చిన అందమైన కల, ఏమిటది? ఆ కలలో ప్రపంచం లోని అందరు బాలబాలికల నుద్దేశించి పాడుతున్న సార్వజనీకమైన విశ్వ ప్రేమని చాటే అద్భుతమైన పాట.

“The sky is blue and fields are green

And laughter is the language of the world”

నీలాకాశం ఎంతో అందంగా వుంది ప్రశాంతతకు ప్రతీకలా వుంది. పచ్చని పొలాలు అంతటా పరుచుకొని వున్నాయి. అవి మానవ జీవితం లోని పచ్చదనానికి, సవ్యమైన, ఆనందభరితమై, జీవన సౌభాగ్యానికి ప్రతీకలుగా నిలుచుని, తలలూపుతున్నాయి. మానవుడికి మాత్రమే భగవంతుడిచ్చిన గొప్పవరమైన నవ్వులతో నిండిపోయి కనిపించిన ప్రపంచం, అతని కలలో కనిపించి, అతని హృదయాన్ని సంతోషభరితం చేసింది.

“Then I wake and all I see

Is a world full of people in need.”

మెలకువ వచ్చి చూస్తే ఏముంది? అంతా గందరగోళం, చుట్టూవున్న ప్రపంచంలో సహాయం కోసం అర్థిస్తున్న నిస్సహాయ చేతులు!

పాట మొదటి భాగంలోనే ప్రపంచంలో ఇన్నిరకాల వైషమ్యాలు, వైరుధ్యాలు ఎందుకున్నట్టు? ఎవరు ఈ వ్యథాభరిత జీవితాలకు కారకులు? ఎవరిని నిందించాలి? అన్నీ ప్రశ్నలే, జవాబులేని, రాని ప్రశ్నలే~

అన్నివేలమంది బాల బాలికల కోరస్‌గా పాడిన ఈ పాట, పాటకు సమకూర్చిన సంగీతం కూడా ఎంతో అద్భుతంగా అమరింది.

“Tell me why (why) does it have to be like this?

Tell me why (why) is there something I have missed?

Tell me why (why) cause I don’t understand

When so many need somebody

We don’t give a helping hand

Tell me why?”

దుస్వప్నాలు, కలత నిద్ర ప్రతి మనిషికి అనుభవమే. పీడకలలు మనని భయాందోళనలకు గురిచేస్తాయి. మెలకువ వచ్చి చూస్తే, అంత సవ్యంగా, ఉంటుంది. ఆ భయమూ, ఆందోళన మాయమై, మనసు ప్రశాంతమౌతుంది. కానీ పాటలో వర్ణించిన దృశ్యాలు దీనికి వ్యతిరేకం. కల ఎంతో అందమైనది, , మెలకువ వచ్చి చూస్తే చుట్టూ అంతా వేదన, సహాయం అర్థించే హస్తాలు, వ్యథాభరిత చూపులు, నిరాశ్రయులైన అభాగ్యుల విన్నపాలు, మానవ పాలకుల తప్పిదాలకు బలైన ఆ మానవులు ఆదుకోవటానికి ఎవరూ ఎందుకు ముందుకు రావటం లేదని, తోటి మానవుల పట్ల ఇంత ఉదాసీనత ఎందుకన్న ప్రశ్న.

పిన్నవయస్కుడైన Declan Galbraith వల్లనో ఏమో ఈ పాట మన హృదయాలకి సూటిగా తాకి, మనసు ఆర్ద్రమవుతుంది.

ముందు చెప్పినట్టుగా ఈ పాటంతా ప్రశ్నలే.

“Every day I ask myself,

What will I have to do to be a man?

Do I have to stand and fight,

To prove to everybody who I am?

Is that what my life is for,

To waste in a world full of war?”

ఈ పై లైన్స్ లో ఒక పన్నెండేళ్ళు కూడా లేని ఆ బాలుడు, తన భవిష్యత్ గురించి ప్రశ్నిస్తున్నాడు. అసలు అతనికి భవిష్యత్ అంటూ ఒకటుందా? ఛిద్రమైపోయిన జీవితాలూ, చితికిపోయిన కుటుంబాలు ఎలా వాళ్ళ జీవితాలని గడుపుతారు? ఆ బాలల జీవితాలలో వెలుగునింపటం సాధ్యమేనా? వాళ్ళ చుట్టూ వున్న ప్రపంచం ఎంతో ఘర్షణతో కూడిన వ్యథాభరితప్రపంచం. వాళ్ళ చుట్టూ సంకెళ్లు, వినాశనాన్ని కల్పించిన యుద్ధాలు, అంతులేని వ్యథ, ఏ ఆశా లేని ఈవితాలు, బాల్యానికి భవిష్యత్ లేని ఈ లోకంలో తన పాత్ర ఏమిటో అర్థం కావటం లేదంటూ ఘోషిస్తాడు. పెరిగి పెద్దయ్యి, తుపాకీ చేతబట్టి, మారణహోమం సృష్టించటమేనా నా భవిష్యత్తు అంటూ అత్యంత వేదనతో ప్రశ్నిస్తున్నాడు. మన పిల్లల్ని పెద్దయితే ఏం చేస్తావు అని అడిగితే ఆశావాహక దృక్పథంతో జవాబిస్తారు. యుద్ధానికి బలియైపోయిన బాల్యానికి భవిష్యత్తే లేదని ఆ బాలల ఆవేదన.

పాట చివరి పంక్తులు చాలా పవర్‌ఫుల్ ప్రశ్నలతో, మనల్ని ఆలోచింప జేస్తాయి.

“Tell me why (Why why, does the tigers run?)

Tell me why (Why why, do we shoot the gun?)

Tell me why (Why why, do we never learn?)

Can someone tell us why we let the forests burn?

పైన మానవ తప్పిదాలని మరో కోణంలో సృజించి ప్రశ్నిస్తాడు. అడవుల్లో బడబాగ్నికి బలైపోతున్న జంతువుల మరణాలకు కారకులెవరు? మనిషి కాదా? మానవుడు తన స్వార్థానికి జంతువులని వేటాడుతున్నాడు. అందుకే ఇన్ని అనర్థాలు ఈ ప్రపంచంలో. నదులు కాలుష్యమయమై పోతున్నాయి, పంటపొలాలు విషతుల్యమై పోతున్నాయి, ఇవన్నీ మనిషి స్వార్థానికి పరాకాష్ట. సునామీలు, బడబాగ్నులు, భూకంపాలు, అన్నీ సంభవిస్తూనే వున్నాయి, కానీ మనిషి ఈ విపత్తుల నుండి ఏ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. జలప్రళయం అటుంచి, ఇప్పుడు జల విపత్తు, తాగు నీరు, సాగునీరు లేక అల్లాడిపోతున్న ప్రపంచ జనం. ఈ క్రింది కవితా పంక్తులు చూడండి, అన్నీ ‘ఎందుకు’ అన్నప్రశ్నలే. వీటికి జవాబివ్వగలిగిన శక్తి ఎవరికుంది? యుద్ధాలలో లక్షల మంది చనిపోవటాని కారణమైన వివిధ దేశాల పాలకులా, రాజకీయ నాయకులా? ఎవరు ఎవరు ఈ హింసాత్మక పరిభ్రమణాన్ని ఆపగలరు?

(why why do we say we can?) tell me WHY

(why why is it still the same?) tell me why

(why why do we talk and run?) tell me why

Can someone tell us why we let the ocean die?

క్రింది పంక్తులలో ఎవరూ తమ తప్పు తెలుసుకోవటం లేదు, తప్పు ప్రక్కవాళ్ళ మీదికి తోసేస్తే సరిపోతుందా? ఈ బ్లేమ్ గేమ్ కొనసాగుతూనే ఉంటుంది, ఎందుకు మనం స్నేహితులుగా ఉండలేక పోతున్నాము? అని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు లేకపోవటానికి, నదులు, సముద్రాలు ఇంకి పోవటానికి కారణమెవరు అని ప్రశ్నిస్తున్నారు.

Declan Galbraith

(why why do we always say?) tell me why

(why why do we pass the blame?) tell me why

(why why does it never rain?)

Can someone tell us why we cannot just be friends?

అమాయకమైన ఆ బాల బాలికల ప్రశ్నల్లో, భవిష్యత్తు అనేది లేకుండా చేస్తున్న ఈ తరం వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలంతా స్నేహభావంతో ఎందుకు బ్రతకలేక పోతున్నారు? దీనికి కారణమెవరని ప్రశ్నిస్తే, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకుంటున్నారు తప్ప, ఎవరూ జవాబుదారీతనం చూపించటం లేదు అన్న వ్యథ ఆ పసిగొంతుకలలో ధ్వనిసున్నది. .

(why why do we close our eyes?)

(why why do we really lie?)

(why why do we fight for land?)

Can someone tell us why cause we don’t understand.”

చివర్లో కొన్ని వేల బాలల గొంతుకలు ఒక్కటై, ప్రపంచ సమస్యల గురించే కాదు అనేక ప్రశ్నలని సంధిస్తున్నారు. ఎందుకు నదులు, సముద్రాలు ఎండిపోతున్నాయి? అడవులు లోని బడబాగ్నికి కారకులెవరు? ఎందుకు పులులు పారిపోతున్నాయి? ప్రకృతి సమతుల్యాన్ని కాపాడగలిగే జంతుజాలాన్ని, వినాశనానికి పునాదులు తవ్వుతూన్నదెవరు? రెండో ముఖ్యమైన ప్రశ్న అసలు ఈ యుద్ధాలు ఎవరి బాగు కోసం?, ఎవరి ఉన్నతి కోసం? ఏమి సాధించటానికి? పాటలో ఒకసారి ఎందుకు మనం గన్ ఫైర్ చేస్తున్నాము? ప్రకృతిని రక్షించి, మానవ మనుగడ సజావుగా సాగటానికి గన్స్ అవసరమా, నీళ్ళ కోసం, భూమి కోసం, ఈ యుద్ధాలు చివరికి ఎక్కడికి దారితీస్తాయో అన్న భయం, భాద వారి గొంతుకులలో ప్రతిధ్వనిస్తూ, మనల్ని ఆలోచింపజేస్తుంది.

Images courtesy: Internet

Exit mobile version