సాహితీ రంగంలో, స్వాతంత్ర్య పోరాటంలో సవ్యసాచి శ్రీమతి సుభద్రకుమారి చౌహాన్

6
3

[dropcap]ఆ[/dropcap]గష్టు 16 వ తేదీ  శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె ప్రముఖ హిందీ కవయిత్రి. సమాంతరంగా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్రని పోషించారు. బాల సాహిత్యంతో పాటు స్త్రీవాద సాహిత్యాన్ని సృజించారు. పసిపిల్లవాడితో సహా జైలుకి వెళ్ళారు. తన ‘ఝాన్సీ-కి-రాణి’ కవిత ద్వారా లక్షలాది మంది ప్రజల హృదయాలను దేశ భక్తితో నింపారు. బాధలని కూడా హాస్యంతో మేళవించి సాహితీ సృజన చేసిన హాస్య చతురురాలు. ఆమే శ్రీమతి సుభద్రాకుమారి చౌహాన్.

ఈమె 1904 ఆగష్టు 16వ తేదీన (నాగపంచమి రోజున) నాటి యునైటెడ్ ఫ్రావిన్స్, నేటి ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లాలోని ధీరాజ్ కున్వారి, రామనాథ్ సింగ్ ఇంట జన్మించింది. రామనాథ్ సింగ్‌కి విద్య అంటే చాలా ఇష్టం. కుమార్తెని చదివించారు.

ఈమె క్రాస్త్‌థ్వైట్ బాలికా పాఠశాలలో చదివారు. 1919లో మిడిల్ స్కూల్ పరీక్షను పూర్తి చేశారు. ఆమె చదువులో ప్రథమ స్థానాన్ని సంపాదించి బహుమతులు పొందారు. చిన్నతనంలో భారత వీరుల కథలు, గాథలు చదివారు. 1857 విప్లవ వీరుల కథనాలు ఈమెలో దేశభక్తిని పెంపొందింపజేశాయి. తనకి దేశభక్తి కలిగినంత మాత్రాన ఆమె సంతృప్తి చెందలేదు. నలుగురితో ఆ గాథలను పంచుకుని అందరిలో దేశభక్తిని రగిలించడానికి నిర్ణయించుకున్నారు. అందుకు అనువయినది సాహితీ సృజన. నాటి యువతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి, త్యాగాలు చేయడానికి ధైర్యాన్ని, ప్రేరణను కలిగించింది ఈమె సాహిత్యము అనడం అతిశయోక్తి కాదు.

9వ ఏటనే Neem అనే కవితను వ్రాశారు. ‘మర్యాద’ అనే పత్రికలో అచ్చయింది. సుభద్రాకున్వారి’ పేరుతో ఈ కవితని వ్రాశారు. బడికి టాంగా మీద వెళ్ళేవారు. దారిలోనే పద్యాలను, కవితలను వ్రాయడం ఓ విశేషం.

మహాదేవివర్మ ఈమె బడి మిత్రురాలు. ఇద్దరూ కలిసి కొన్ని కవితలు వ్రాసి పత్రికలకు పంపేవారు. అవి అచ్చయాక ఆనందించేవారు.

సుభద్ర ‘ఖడీబోలి’ మాండలికంలో వ్రాసేవారు. ఇది చాలా స్పష్టంగా, సరళంగా ఉండేది. ఈమె కవితలు, కథలు వ్రాశారు. పిల్లల కోసం సరళమైన భాషలో కవితలని సృజించారు. ఈమె కవితలలో శ్రావ్యత పాడుకోవడానికి అనువుగా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పుకోవలసింది ‘ఝాన్సీ కి రాణి’. ఈ కవితలో ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం, సాహసం, దండయాత్రలు, విజయాలు, వీరమరణం అన్నీ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి. దేశంలోని అనేక పాఠ్య గ్రంథాలు ఈమె కథను తమలో ఇముడ్చుకున్నాయి. లక్షలాది మంది బాలలు ఈ గీతాన్ని వల్లెవేసి చక్కటి రాగాలాపనతో సుసంపన్నం చేశారు. ఆ పిల్లలనే కాదు, పెద్దలందరినీ అలరించడం విశేషం. ఒక కవిత ద్వారా ఇది సాధించడం అద్వితీయం.

‘జలియన్ వాలాబాగ్ మే వసంత్’ కవిత ‘జలియన్ వాలాబాగ్ మారణకాండ’ని కళ్ళ ముందు నిలుపుతుంది. చదివిన సహృదయ పాఠకుల కళ్ళు చెమర్చకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు.

‘వీరోన్ కా కైసా హో బసంత్’, ‘సీధే సాదే చిత్ర్’, ‘రాఖీ కీ చునౌతీ’, ‘విదా’ (స్వేచ్ఛా ఉద్యమం) మొదలయినవన్నీ స్వాతంత్రోద్యమానికి సంబంధించినవే! ఇవన్నీ భావోద్వేగభరితంగా, ఉత్తేజభరితంగా ఉండేవి.

రచయిత జైనేంద్ర కుమార్ వంటి గొప్ప కవిపండితులు ఈమె ఇంటికి వచ్చే వారు. మళ్లీ లాల్ చతుర్వేది వంటి గొప్ప సాహితీవేత్తను ఈమె గురువుగా భావించారు. సాహిత్య రంగంలో, రాజకీయ రంగంలో ఈమెకు స్పూర్తిని కలిగించారాయన.

16 ఏళ్ళ వయసులో ఖాండ్వాకి చెందిన ఠాకూర్ లక్ష్మణ సింగ్ చౌహాన్‍తో ఈమె వివాహం జరిగింది. వీరికి ఐదుగురు పిల్లలు. లక్ష్మణ్ సింగ్ చౌహాన్‌ది దేశభక్త కుటుంబం. భార్యాభర్తలిద్దరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వివాహం తరువాత తమ నివాసాన్ని జబల్పూర్‌కి మార్చారు.

1921లో బాపూజీ అనుయాయులుగా మారారు భార్యాభర్తలు. గ్రామాలకి వెళ్ళి నిధులను సేకరించారు. సత్యాగ్రహ కార్యక్రమానికి అందించారు. ఆయన ఇచ్చిన పిలుపునందుకుని సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. సత్యాగ్రహిగా మారారు. నాగపూర్‌లో అరెస్టయి జైలుకి వెళ్ళారు.

1922లో ‘జబల్పూర్ జెండా సత్యాగ్రహమే’ దేశంలోని తొలి సత్యాగ్రహం. ఇదే ఈమె తొలి సత్యాగ్రహం కూడా!

భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్రను పోషించారీమె. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా ఎనలేని సేవలను అందించారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో దేశంలోని జాతీయ నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించింది బ్రిటిష్ ప్రభుత్వం. మధ్యప్రదేశ్ నుండి సుభద్ర, లక్ష్మణ్ సింగ్ చౌహాన్‌లు అరెస్టయారు.

మన పల్లెలలో ఈనాటికి ఇంట్లోని పెద్ద ఆడపిల్లలకి ఎడపిల్లలని అప్పగించి పొలం పనులకు వెళ్ళడం జరుగుతూనే ఉంది. ఈ సంఘటన ఆ విషయాన్ని గుర్తుకు తెస్తుంది. సుభద్ర పెద్ద కుమార్తె సుధా చౌహాన్‌కు మిగిలిన నలుగురు పిల్లలను అప్పగించి జైలుకి వెళ్ళారు. కనీసం ఇంట్లో నిత్యావసర వస్తువులు సరిపడాలేవు. ఎంత బాధాకరం. ఇటువంటి త్యాగాలు చేసిన దేశభక్తులు, వారి పిల్లలు మనకు కొల్లలుగా కన్పిస్తారు.

జైలులో కూడా ఈమె త్యాగాలు అజరామరం. తోటి ఖైదీల సంక్షేమం కోసం కష్టపడి పని చేసేవారు. అన్నింటికంటే గొప్పతనం తోటి ఖైదీలకు ఆహారం సరిపోకపోతే తన ఆహారాన్ని త్యాగం చేసేవారు. ఇటువంటి వారిని మనం చూడగలమా? ఈ రోజుల్లో.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అనారోగ్యం పాలయిన బిడ్డని ఒడిలో ఉంచుకుని జైలుకి వెళ్ళారు. అక్కడ అనారోగ్యం పాలయారు. ఆపరేషన్ అవసరమయింది. జైలు నుండి విడుదలయిన తరువాత ఆపరేషన్ జరిగింది.

1936లో భారతదేశంలోని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. 1936లో, 1946లో రెండుసార్లు సుభద్ర శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

స్వాతంత్ర్యం లభించిందని సంతోషించారు. కాని దేశవిభజనతో మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆనాటి మతకల్లోలాలు, లూటీలు, గొడవలు ఈమెను మానసికంగా మరీ క్రుంగదీశాయి. అయినా ప్రజల కోసం కృషి చేయాలనుకున్నారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 15వ తేదీన ఆమె జీవితంలో చీకటి రోజు. నాగపూర్ నుండి జబల్‌పూర్ వెళుతున్న సుభద్ర కారు ప్రమాదానికి గురయింది. ‘సియోని’ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఒక విద్యాసదస్సుకి హాజరయి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఇలా జరగడం విషాదం.

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నాగపూర్ కరస్పాండెంట్ ఈమెను ‘స్థానిక సరోజినీ నాయుడు’ అని ప్రశంసించారు.

ఈమె 2 కవితా సంకలనాలు, 3 కథాసంకలనాలను వెలువరించారు. 1930లో ముకుల్, త్రిధర కవితా సంకలనాలను వెలువరించారు. బాలలకోసం, మహిళల కోసమే గాక ప్రకృతి రమణీయానికి కూడా ఈ కవితలలో ప్రాముఖ్యతను ఇచ్చారు.

మరో ప్రముఖ హిందీ కవయిత్రి మహదేవి వర్మతో కలిసి కవితలు వెలయించారు. వీరిద్దరు జంట కవయిత్రులుగా పేరు పొందారు.

1932 లో వెలువడిన తొలి కథాసంకలనం ‘బిక్రేమోతి’లో శిథిలాలు, ఆహుతి, మత్స్యకారుల కుమార్తె మొదలయిన 15 కథలు, 1934లో ప్రచురించబడిన రెండవ కథాసంకలనం ‘ఉన్మాదిని’లో ఉన్మాదిని, బంగారు నెక్లెస్, స్వచ్చమైన అసూయ, మొదలైన 9 కథలు, 1947లో మూడవ సంపుటం ‘సీధే సాదే చిత్ర్’ లో రూప, కళ్యాణి, మంగళ, హింగ్వాలా, రాహి, తంగే వాలా వంటి 14 కథలు ఉన్నాయి.

ఈ కథలలో సింహభాగం మహిళల సమస్యలు, సామాజిక దురాచారాలకు సంబంధించిన మహిళా ఇతివృత్తాలకు నిలయమైనవి. మిగిలినవి జాతీయ భావాలకి, దేశభక్తికి సంబంధించిన కథలు.

ఈమె కవితలు, కథలు, మహిళాభ్యుదయానికి స్థానం కల్పించాయి. సాంఘిక దురాచారాలు, మూఢాచారాలను తూర్పారబట్టాయి.

ఈమె పెద్ద కుమార్తె సుధా చౌహన్‌ను ప్రముఖ హిందీ రచయిత ప్రేమచంద్ కుమారుడు అమృతారాయ్ కిచ్చి కులాంతర వివాహం చేశారు. ఆరోజుల్లో ఈ వివాహం గొప్ప సంచలనం కలిగించింది.

సుధ తన తల్లిదండ్రుల జీవితచరిత్రను, వారికి ఎదురైన సామాజిక, ఆర్థిక సమస్యలను గురించి ‘మిలా తేజ్ సే తేజ్’ అనే గ్రంథంలో వివరించారు.

ఈమె అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈమె కవితా, కథాసృజనకు మానవతావాదం, సామాజిక అవరోధాల పట్ల అసహనం, మహిళలు-దళితుల జీవనం పట్ల బాధ, కరుణలు చోదకశక్తులుగా పనిచేశాయి.

ఈ రోజుల్లో కవులు, రచయితలకు వారసులు లభించడం లేదు. కాని సుధా చౌహన్ కుమారుడు (సుభద్రాచౌహన్, ప్రేమ్‌చంద్‌ల మనవడు) అలోక్ రాయ్, మరో మనవడు ఇషాన్ చౌహన్‌లు బామ్మ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించే ప్రయత్నం చేయడం ముదావహం.

“హిందీ కవితా ప్రపంచంలో లక్షలాది మంది యువతీ యువకులు ఎడతెగని దుఃఖాన్ని విడిచి పెట్టి, స్వాతంత్ర్య పోరాటానికి తమ పిలుపుతో తమను తాము అంకితం చేసుకోవడానికి ప్రేరేపించిన ఏకైక కవయిత్రి సుభద్రా కుమారి చౌహన్” అని ‘అనుభూతి’ పత్రిక వ్రాసింది.

“సుభద్ర మానవ సంబంధాలను సుసంపన్నం చేస్తారు. ఈమె జాతీయ సేవ ప్రత్యేకమైనది. జాతీయ ఆదర్శం జీవితమంతా వ్యాపించింది. జీవన సంబంధాలన్నింటినీ జాతీయోద్యమంతో ముడి పెట్టింది” అని జి.ఎం. ముక్తిబోధ్ అన్నారు.

1931లో ‘ముకుల్ సెక్మారియా ప్రైజ్’ను, 1933 లో ‘బిక్రేమోతి’కి అవార్డును పొందారు.

ప్రమాదంలో ఈమె మరణించక పోయినట్లయితే సాహితీ రంగంలో, రాజకీయ రంగంలో కూడా అప్రతిహతంగా విజయాలను సాధించేవారు. మనకి ఇంకా గొప్ప చరిత్ర మిగిలేది.

ఈమె జ్ఞాపకార్థం 1976 ఆగష్టు 6వ తేదిన 25 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. లేత నీలి ఆకుపచ్చ రంగులో నిండు ముత్తయిదువలా పెద్దబొట్టుతో గంభీరంగా, మెరుస్తూ కన్పిస్తారామె.

ఆగష్టు 16వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here