[dropcap]సు[/dropcap]దేవుని పాత్ర భాగవతములో చాలా చిన్నది. కానీ ఒక భక్తాగ్రేసరుడిగా ప్రసిద్ధి చెంది అంబరీషుని కన్నా ముందే స్వర్గాన్ని చేరి అంబరీషునికి ఆశ్చర్యము కలుగజేసిన వాడు. అంబరీషుని పేరు తెలియని వారు సాధారణముగా ఉండరు. అయన గొప్ప రాజు ప్రజలకు సుపరిపాలన అందించిన చక్రవర్తి అంతే కాకుండా మహా భాగవతోత్తముడు. ఎన్నో యజ్ఞ యాగాదులను చేసినవాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించినవాడు. ధర్మాత్ముడు. ధరణి మెచ్చతగ్గవాడు. అందరి లాగానే అయన శరీరాన్ని విసర్జించాడు. అయన చేసిన పుణ్యకార్యాలు ఫలితంగా ఆయనకు పుణ్యలోకాలు ప్రాప్తించినాయి. కానీ అక్కడ విశేషం లేదా ఆశ్చర్యకరమైన సంఘటనతో అంబరీషుడు ఆశ్చర్య చకితుడైనాడు. సంఘటన ఏమిటి అంటే అయన కంటే ముందు అయన భటుడు సుదేవుడు స్వర్గానికి చేరి అక్కడ మహోజ్వలమైన విమానము ఎక్కి వివిధ రకాల వినోదాలలో మునిగి తేలటాన్ని చూసి అమితంగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఏనాడు ఏ యాగము లేదా యజ్ఞము చేయని సుదేవుడు తనకంటే ముందుగా పుణ్యలోకాలకు ఎలా చేరుకోగలిగాడు అనే సందేహము అంబరీషునికి వచ్చింది.
తన భటుడు సుదేవుని చూచి ఆశ్చర్య చకితుడైన అంబరీషుడు ఇంద్రుని, “దేవేంద్రా నా భటుడు సుదేవుడు ఈనాడు ఏ ఒక్క యాగము చేయకపోయినప్పటికీ ఇక్కడకు వచ్చి ఈ భోగ భాగ్యాలను ఎలా అనుభవిస్తున్నాడు? నా సందేహము తీర్చవలసినదిగా ప్రార్థిస్తున్నాను”అని అడిగాడు. “రాజా నీ అనుమానం సమంజసమైనదే. కానీ సుదేవుని కథనం చాలా విచిత్రమైనది, తెలుసుకోదగ్గది. పూర్వకాలములో శతశృంగుడు అన్న దైత్యనాధుని కుమారులు సదముడు, విదముడు, దముడను వారలు మహా భయంకరులై నీ రాజ్యము పై పడి ప్రజలను నానా హింసలు పెట్టేరు. ఆ సంగతి నీవు మరచి పోయావనుకుంటాను. ఆ సమయములో నీవు సుదేవుని పిలిచి ఆ రాక్షసులతో పోరాడి విజయముతో రమ్మని ఆదేశించావు.
రాజు ఆదేశానుసారం సుదేవుడు గూఢచారుల ద్వార ఆ రాక్షసుల శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నాడు. సైన్యాన్ని పంపేసి పరమేశ్వరుని ప్రార్థించి అయన కరుణతో వీరిని తుదముట్టించాలని సంకల్పించి శివుని ఆరాధించటానికి అరణ్యానికి చేరాడు. నిండు భక్తితో శివుని పూజించాడు, ప్రస్తుతించాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు సుదేవుని పిలిచి ఎందుకంత దుస్సాహసము చేసావని అడుగుతాడు. అప్పుడు పరమానంద భరితమైన సుదేవుడు పరమశివునికి ఈ తపస్సుకు గల కారణాన్ని వివరించి శివుని కరుణను అర్థించాడు. భక్తుని సత్సంకల్పానికి సదాశివుడు మురిసిపోతారు.
సదాశివుడు సుదేవునికి దివ్యరథాన్ని, భయంకర శస్త్ర సంపదను, సుదృఢకార్ముకమును ఇచ్చి విజయుడివి కమ్ము అని దీవిస్తాడు. ఈ అస్త్ర శస్త్రాలతో అసురులను నిలువరించి విజయము పొందగలవని పరమశివుడు కరుణా పూరితుడై వరదానము చేసాడు. సుదేవుడు పరమశివుని ఆశీస్సులతో, వరాలతో రాక్షస జనవాహినిని ఢీకొన్నాడు. సుదేవుని ప్రతాపాగ్నికి సదముడు, దముడు,ఆహుతి అయినారు. ఇది చుసిన విధముడు రెచ్చిపోయి భరించరాని కోపముతో సుదేవుని ఎదిరించాడు. సుదేవుడు ఆవేశములో శివుని ఆజ్ఞ అయిన రథం దిగకుందా యుద్ధము చేయమన్న విషయాన్ని మరచిపోయి విదమునితో యుద్దానికి తలపడ్డాడు. ఈ భయంకర పోరాటంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు రాక్షస పీడా వదిలింది. ఈ పుణ్య కార్యము వలన, శివుని దర్శనము వలన, వీర మరణము పొందటం వలన సుదేవుడు పరమ పుణ్యాత్ముడై పుణ్యలోకములో ప్రవేశించి స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు” అని ఇంద్రుడు సుదేవుని చరితమును అంబరీషునికి వివరిస్తాడు.
విన్న అంబరీషుడు సుదేవుని స్వామి భక్తికి పరవశించి అతనిని అనేక రకాలుగా కొనియాడుతాడు. ఆ విధముగా సామాన్యుడైన సుదేవుడు అకుంఠిత స్వామి భక్తితో స్వామి కార్యము నెరవేర్చటానికి ప్రజల సంక్షేమము కోసము పరమశివుని మెప్పించి పరమశివుని ఆశీస్సులతో అసురులను చంపి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసిన వారికి కూడా సాధ్యపడని పుణ్యలోకాల ప్రవేశాన్ని సాధించాడు.