Site icon Sanchika

సంగీత విదుషీమణి సునందా పట్నాయక్

[dropcap]ఆ[/dropcap]మె గొప్ప సంగీత కళాకారిణి. సంగీత కళాకారిణిగా ఒడిస్సాకు పేరు తీసుకుని వచ్చారు. తండ్రి కవిత్వాన్ని తన స్వరంలో నిక్షిప్తం చేసిన గాయని ఆమె. నాటి ఒడిస్సా గవర్నర్ అసఫాలీ ప్రశంసలు, భారత ప్రథమ రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతిభవన్‌లో కచేరీ చేసి ఆయనని అలరించిన స్వరం ఆమెది. పూనా సంగీత కళాశాల నుండి యం.ఎ. పట్టాని పొందడం, అనేక పురస్కారాలు, డాక్టరేట్లని స్వంతం చేసుకున్న ఘనత ఆమెది. ఒడియా చలన చిత్రాలలో ఈమె పాడిన పాటలు అజరామరంగా నిలిచాయి. ఈమే సునందా పట్నాయక్.

ఈమె 1934 నవంబర్ 7వ తేదీన కటక్ జన్మించారు. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న కటక్ బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో బెంగాల్ ఫ్రావిన్సెస్ (బ్రిటిష్ ఇండియా) లో భాగంగా ఉండేది.

ఆమె తండ్రి బైకుంఠనాథ్ పట్నాయక్ గొప్పకవి. ఆయన కవితలు కుమార్తె గళంలో ప్రతిధ్వనించాయి. తండ్రి కవితలు కుమార్తె గళం నుండి పల్లవించి ఒడియా ప్రజల హృదయాలలో సుసంపన్నమై వెలిగాయి. ఈ విధంగా తండ్రి కలం, కుమార్తె గళాల సమ్మిళిత సంగీతం సాహితీ, సంగీత ప్రియులకు లభించడం, అలరించడం అరుదు.

ఆ రోజుల్లో ఆకాశవాణిలో పాడడం ద్వారా సంగీత కళాకారులకి విస్తృత ప్రచారం లభించేది. ఈమె కూడా 1948 నుండి కటక్ రేడియో కేంద్రంలో పాటలు పాడేవారు. ఇది ఈమెకి కొత్త అవకాశాలను కల్పించింది.

ఈమెకి సంగీతమంటే తగని మమకారం. హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్ కుండల్ ఆదినారయణ్ వద్ద శిష్యరికం చేశారు. ఈమెను గొప్ప సంగీత కళాకారిణిగా, గురువును మించిన శిష్యురాలిగా తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

1952లో ఈమె సంగీతాన్ని పూరీలో విని ఆస్వాదించిన ప్రముఖులు భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఈమె సంగీతాన్ని మెచ్చారు. పూనా లోని సంగీత కళాశాలలో చేరడానికి అవసరమైన వేతనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రముఖ హిందుస్తానీ కళకారులు శ్రీ పండిట్ వినాయక్ పట్టవర్ధన్ ఈమె సంగీత గురువు.

1956 పూనా సంగీత విద్యాలయం వారు సంగీతంలో ఈమెకి యం.ఎ. డిగ్రీని ప్రదానం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ సంస్థల నుండి సంగీత కచేరీలు చేయమని ఈమెకు ఆహ్వానాలు అందాయి. ఈమె వాటిని స్వీకరించి కచేరీలు చేసి శ్రోతల మన్ననలను అందుకున్నారు.

ఒడిసాకి చెందిన హిందుస్తానీ సంగీత కళాకారిణులలో ఈమె మొదటివారు. హిందుస్తానీ సంగీత సంప్రదాయానికి చెందిన ఖయాల్స్, టుమ్రీలు, తరానాలు, భజనలను ఈమె ఆలపించారు. దేశమంతా ఈమె ఇచ్చిన సంగీత కచేరీలలో పై పద్ధతులలో ఈమె ఆలపించిన గీతాలు ప్రేక్షకశ్రోతలను అమితంగా అలరించి ఆమెకు అభిమానులను చేశాయి.

ఈమె ఒడియా గ్వాలియర్ ఘరానా గాయనిగా పేరు పొందారు. సరికొత్త రాగాలను ఆవిష్కరించి గ్వాలియర్ ఘరానాకు జోడించి సంప్రదాయాన్ని ఆధునికీకరించి సుసంపన్నం చేశారు. నానక్, కబీర్, సూరదాస్, మీరాబాయిల భజన్‍లు, ఆదిశంకరాచార్యుల వారి జగన్నాథాష్టకం, భజగోవిందం జయదేవుని గీతగోవిందం ఈమె స్వరంలో సరికొత్త సొబగులను సంతరించుకున్నాయి. ఈ విధంగా ఈమె దేశానికి, ముఖ్యంగా తన జన్మభూమి ఉత్కళ ప్రాంతానికి పేరు తెచ్చారు. ఒడిసా సంగీత సామ్రాజ్ఞిగా చరిత్రను సృష్టించారు.

1957లో కలకత్తాలో ఆల్ ఇండియా సద్రంగ్ సంగీత్ సమ్మేళనం జరిగింది. ఈమెకు ఈ కార్యక్రమంలో 13 బంగారు నాణేలను బహూకరించారు.

ఈమెకు లభించిన పురస్కారాలు ఈమె సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపాయి. ఆ పురస్కారాలకు ఈమె వలన సొబగులు చేకూరాయనడంలో అతిశయోక్తి లేదు.

ఈమెకి 1970లో ఒడిసా సంగీత నాటక అకాడమీ అవార్డు, 1975లో అఖిల భారతీయ గంధర్వ మహా విద్యాలయ మండల్ వారి డాక్టరేట్ లభించాయి. 1999లో ఉత్కళ్ విశ్వ విద్యాలయం వారి డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించిది. 2009లో భారతీయ జీవితకాల సాఫల్యపురస్కారం లభించిందీమెకి.

2012లో ది ఒరిస్సా సోసైటీ ఆఫ్ అమెరికాస్ వారు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని, ఠాగుర్ అకాడమీ వారి సంగీత నాటక పురస్కారాన్ని పొందారు.

ఈమెకి ఒడిసా ప్రభుత్వం అందించిన అత్యంత గౌరవం 2020 అక్టోబర్‌లో లభించింది. ఒడిసా సంగీత అకాడమీ వారు ఒడిసా శాస్త్రీయ కళాకారులకి సంగీత నాటక అకాడమీ పురస్కారాలను ప్రదానం చేసేవారు. ఈ పురస్కారాల పేరును ‘సునందా సన్మాన్’గా మార్చి ఈమెని గౌరవించారు.

ఈమె జీవితచరిత్ర శ్రీదిలీప్ పట్నాయక్ దర్శకత్వంలో ‘నీలమాధవ’ పేరుతో లఘు చిత్రంగా నిర్మింబడింది. భారతీయ ఫిల్మ్స్ డివిజన్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 2010 సంవత్సరంలో 58వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులలో ‘బెస్ట్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ’ చిత్రంగా నిలిచింది. ఒడిసా ఘరానా శాస్త్రీయ సంగీతంలో ‘గురుమా’ గా కొనియాడ బడ్డారు.

ఒరిస్సాకి చెందిన ఈమె 1983లో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ‘విష్ణు వినాయకా సంగీత ఆశ్రమం’ పేరుతో హిందుస్తానీ సంగీత విద్యాలయాన్ని స్థాపించారు. దీని ద్వారా చాలామంది సంగీత కళాకారులని దేశానికి కానుకగా అందించారు.

‘జిబానా పత్రమో భరిచ్చాకేతేమేట్’, ‘నిషాబద శరత్ ప్రతే’, ‘జిబాన బంధు జయజయహే’, ‘దుఖేతుమారీ ఉత్సవ దీప’, ‘ఖ్యల్ సభీ దుఃఖాకీ బైనా’ వంటి పాటలు ఈనాటికి ఒడిసా ప్రేక్షకుల మదిని అలరిస్తూనే ఉన్నాయి. ఈమె హైపిచ్‌లో ఆలపించి వెలయించిన గాయనీమణి.

ఈమె 2020 జనవరి 19వ తేదీన 85 ఏళ్ళ వయస్సులో కోల్‌కతాలో వృద్ధాప్య బాధలతో మరణించారు.

ఈమె గౌరవార్థం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2022 సెప్టెంబర్ 24 వ తేదీన ఒక ప్రత్యేక కవర్‌ని విడుదల చేసింది భారత తపాలా శాఖ.

చేతిలో సంగీత వాయిద్యంతో గొప్ప విద్వన్మణిగా సునంద చిత్రం కవరు మీద ఎడమ వైపున, క్యాన్సిలేషన్ ముద్రలోమె కూడా దర్శనమిస్తుంది. కవర్ మీద కుడివైపున సంగీత వాద్య పరికరాలు సంగీత ప్రియులను అలరిస్తాయి.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version