Site icon Sanchika

భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ

[dropcap]ఏ[/dropcap]ప్రిల్ 20వ తేదీన తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

తిరుమలను దర్శించే వారందరికీ ‘మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం’లో అన్న ప్రసాదం లభిస్తుంది. హారతి కార్యక్రమాన్ని దర్శించే వారికి ‘వెంగమాంబ ముత్యాల హారతి’ కనువిందు చేస్తుంది. భక్తి భావాన్ని పెంపొందిస్తుంది.

ఇంతకీ వెంగమాంబ ఎవరో? 18వ శతాబ్దం నాటికే వివిధ సాహిత్య ప్రక్రియలలో తెలుగు సాహిత్యాన్ని వెలయించిన సాహితీ సృజని; భక్తమీరాబాయి శ్రీకృష్ణుని సేవించినట్లు – శ్రీ వేంకటేశ్వర స్వామిని సేవించి, కొలిచి, హారతిచ్చిన భక్త కవయిత్రి, మహాయోగిని.

తరిగొండ నృసింహాలయంలో పూజలందుకుంటున్న తాపసి ఆమె. తన సాహిత్యంలో తప్పులను మన్నించమని, ఏమి తెలియనిదానినని చెప్పుకున్న వినయశీలి. ఆమే తరిగొండ వెంగమాంబ

ఈమె 1730 ఏప్రిల్ 20వ తేదీన తిరుపతి సమీపంలోని గుర్రంకొండ దగ్గరి తరిగొండ గ్రామంలో జన్మించినారు. ఈమె తల్లి మంగమాంబ, తండ్రి కృష్ణయామాత్యుడు.

సహజంగా పిల్లలు బాల్యంలో ఆటపాటల వైపు ఆకర్షింపబడతారు. కాని ఈమె పిల్లలతో కలిసేది కాదు. ఈమె తల్లి దగ్గర శ్లోకాలు, భక్తిపాటలు నేర్చుకున్నారు. ఏకాంతంగా కూర్చుని భగవంతుని గురించిన ధ్యాస, ధ్యానంలో ఉండేది. కుమార్తె ఆసక్తిని గమనించిన కృష్ణయామాత్యుడు ఆమె ధ్యాసను మరలించాలని నిర్ణయించారు. ఇంట్లో పనిపాట్లు చేయాలని పురమాయించేవారు. అయినా ఆమె మారలేదు.

పెళ్ళి చేస్తే ఆమె మనసు మారుతుందని, ఇహలోకం పట్ల ఆసక్తిని పెంచుకుంటుందని యోచించారు. సమీపంలోని నారిగుంటపాలెంకి చెందిన ఇంజేటి వేంకటచలపతికిచ్చి పెళ్ళి చేశారు.

అయితే చలపతికి భార్య అమ్మ వారిలా కన్పించింది. మనసు వికలమయి త్వరలోనే మరణించాడు. ఆమెను వితంతువును చేయాలని ఆశించారు ఊరిప్రజలు. కాని మీరాబాయి కృష్ణుని భర్తలా భావించిన భక్తురాలిలా… ఈమె శ్రీవేంకటేశ్వరుని భర్తలా భావించారు. ఆమె భక్తి మరింత ఎక్కువయింది.

కృష్ణయామాత్యుడు కుమార్తెకి కొత్త జీవితం ఇవ్వాలని ఆకాంక్షించారు. మదనపల్లిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆయన శిష్యరికంలో వెంగమాంబ అనేక ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని ఔపోసన పట్టారు. కొంతకాలం తరువాత తమ ఊరికి తిరిగివచ్చారు.

కొంతమంది ఈమెను భక్తురాలిగా, తపస్వినిగా గౌరవించారు. కాని సామాన్యంగా కొంతమంది పొగుడుతుంటే మరి కొంతమంది విమర్శిస్తుంటారు. ఇది అనాదిగా కన్పించే మానవనైజం. వెంగమాంబకూ ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. ఆమెని వ్యతిరేకించేవారు పుష్పగిరి పీఠాధిపతుల దగ్గరకు వెళ్ళి ఆమెని వితంతువుగా జీవించమని ఆదేశించాలని కోరారు. వారు ఈమెని పరీక్షించారు. ఆమె తన భక్తి ప్రపత్తులతో గెలిచారు. ఆమె దేవుడి అంశతో జన్మించిందని, ఆమెని ఇబ్బందులకు గురిచేయవద్దని వారించారాయన.

ఆమె తరిగొండకు తిరిగి వెళ్ళారు. ఆ ఊరి ప్రజలు కొందరు ఆమెను వేధించడం కొనసాగించారు. ఆ వేధింపులకు తాళలేక ఆమె తిరుమలేశుని సన్నిధికి చేరుకున్నారు. శ్రీవేంకటేశ్వరుని ప్రతిరోజు దర్శించుకునేవారు. ఆమె భక్తి తత్పరతను చూసి తిరుమల ప్రజలు అబ్బుర పడేవారు. ఆమె అభిమానులు ఆమె కోసం ఇంటిని నిర్మించి ఇచ్చారు. అది ఋషివాటికలా విలసిల్లింది. ఆమెకు నిత్యం దేవుని నైవేద్యం ప్రసాదంగా అందేవి. తులసిమాలలల్లి నిత్యం ఆ దేవ దేవునికి సమర్పించుకునేవారు.

కొంతకాలం ఇలా గడిచింది. అన్నమయ్య వంశస్థులు ఈమెకు ఉత్తరమాడ వీధిలో ఒక ఇంటిని ఇచ్చారు. ఈమె పని దేవుని గురించి పూజ చేయడం, తులసిమాలలతో అలంకరించే ఏర్పాటు చేయడం, సాహితీ సృజన చేయడం. మరోముఖ్యమైన పని దేవునికి కర్పూర నీరాజనాలను అర్పించడం. ఈ కర్పూర హారతిని ఇంటి నుండే శ్రీవేంకటేశ్వరునికి అందించేవారు. ఇంటిలో నుంచే పూజాది కార్యక్రమాలు చేయడం స్థానికులకు కోపం తెప్పించింది. ఆమె ఇచ్చే హారతిని ఆపించాలని ధృఢంగా నిశ్చయించుకున్నారు.

ఆ తరవాత దేవుని ఊరేగింపు రథం ఆమె ఇంటి ముందు ఆగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వెంగమాంబను హారతివ్వమని వేడుకున్నారు. ఆమె హారతి అందగానే రథం ముందుకు కదిలింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అప్రతిహతంగా వెంగమాంబ హారతి తప్పని సరిగా ‘ముత్యాల హారతి’ పేరుతో శ్రీవేంకటేశ్వర స్వామి స్వీకరిస్తూనే ఉండడం గొప్ప విశేషం, ఈ నాటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వెంగమాంబ ముత్యాలహారతికి ప్రాధాన్యత ఉంది.

ఈమె భక్తురాలేకాదు. తెలుగు భాషలోని వివిధ సాహితీ ప్రక్రియలలో సాహితీ సృజన చేసిన గొప్ప సాహితీకారిణి.

రామాయణ సృష్టికర్త మొల్ల “శ్రీ కంఠమల్లేశు కృపవల్ల కవయిత్రిని అయ్యాను” అని చెప్పుకున్నట్లు ఈమె “తరిగొండ నృసింహుని దయవల్లనే కవయిత్రినయ్యాను” అని చెప్పుకున్నారు.

ఈమె తనకు సాహిత్యంలో మెలకువలు తెలియదని, వ్యాకరణం, అలంకారాల గురించి చదవలేదని అయినప్పటికీ తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయా దాక్షిణ్యాల వలననే కవిత్వం తనకి కవిత్వం అబ్బిందని వేంకటాచల మాహాత్మ్యం పీఠికలో వ్రాసుకున్నారు.

“నా చిన్ననాట నోనామాలు నైన నా

చార్యుల చెంతనే జదువలేదు

పేరగ ఛందస్సులో బది పద్యములనైన

నిక్కంబుగా నేను నేర్వలేదు

లలి కావ్యనాటకాలంకార శాస్త్రముల్

వీనులనైన వినగలేదు

పూర్వేతిహాస విస్ఫురితాంధ్ర సత్ క్రుతుల్

శోధించి వరుసగా చూడలేదు”

అని వినయంగా చెప్పారు. ‘నారసింహదేవుడానతిచ్చిన రీతి’ రచన చేసినట్లు చెప్పుకున్నారామె.

ఈమె రచనలలో యక్షగానాలు, ఆధ్యాత్మిక గేయాలు, పద్యకృతులు, పద్యకావ్యాలు, ద్విపదకావ్యాలు, తాత్విక కావ్యాలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలు దర్శనమిస్తాయి. తాత్విక కావ్యాలలో రాజయోగామృతసారం గొప్పగా పేరు పొందింది.

నృసింహ విలాసము, విష్ణుపారిజాతము, చెంచు నాటకం, శ్రీ రుక్మిణీ నాటకం, బాలకృష్ణ నాటకం, జలక్రీడా విలాసం, ముక్తికాంత విలాసం మొదలయిన యక్షగానాలను అద్భుతంగా వెలయించారు.

వాసిష్ఠరామాయణం, రమాపరిణయం, ద్విపదభాగవతం వంటి కావ్యాలను దేశీ ఛందస్సు రూపమయిన ‘ద్విపద’లో వ్రాశారు. ఈమెకు పూర్వం ద్విపద భాగవతాలు తెలుగు సాహిత్యంలో రచింపబడ్డాయి. కాని ఈమె కావ్యానికి ఎక్కువ ప్రశస్తి లభించింది.

ఈమె వ్రాసిన ‘శ్రీకృష్ణమంజరి’ స్తుతికావ్యాన్ని శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు తమ ‘భక్తసంజీవని’ పత్రికలో ప్రచురించారు. 1929 జనవరి సంచికలో దీనిని ముద్రించారు.

“శ్రీవెంకటేశ నా చిత్తంబు నందు

నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ

నన్నేల తరిగొండ నరహరాకృతిని

బ్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ”

అనే పద్యంతో మొదలవుతుంది ఈ కావ్యం. సుబ్బారావు గారు కావ్య పరిచయం చేస్తూ “వెంగమాంబ గొప్ప యోగిని కవయిత్రి, భక్తురాలు” అని కొనియాడారు.

ఈమె ఆ రోజులలోనే పాత్రోచితభాషతో పద్యాలను అల్లిన నేర్పరి. శ్రీ వెంకటాచల మాహాత్మ్య కావ్యంలో సోదమ్మిచేత సోదిభాషను మాట్లాడించి మెప్పించారు.

“అవ్వోయవ్వ నీ తలంచిన తలంపు మేలవుతాదంట.

దేవుళ్ళు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా,

సెప్పెద వినుదయితమ్మ ఆ నల్లనయ్య యేదిక్కు

నుండి వచ్చినాడంటావా తల్లీ ఇదిగో ఈ మూలనుండి వచ్చాడే”

అంటూ సోది చెప్పించారు.

ఈమెకు పూర్వం చాల ద్విపద భాగవతాలు తెలుగులో రచించబడ్డాయి. కాని వెంగమాంబ ద్విపద భాగవత కావ్యం మాత్రమే పోతన గారి ఆత్మను గుర్తించి సమర్థవంతంగా వెలయించారనే ఖ్యాతిని పొందడం విశేషం.

శతకంలో వంద నుండి నూట ఎనిమిది పద్యాల వరకూ ఉండడం సాధారణ నియమం. ప్రతిపద్యం చివరి పాదం మకుటంతో వ్రాయబడుతుంది. ఈమె నృసింహ శతకంలో 103 పద్యాలను వ్రాశారు. ‘దరికొండ నృసింహ దయాపయోనిధీ’ అనే మకుటాన్ని ఉపయోగించారు.

సంఘంలో వితంతు ఒంటరి మహిళకు ఎదురయ్యే అవరోధాలు ఆమెకి చాలా సార్లు ఎదురయ్యాయి. పుట్టిన తరిగొండలో బాధలు భరించలేక తిరుమల కొండకు చేరారు. అక్కడ తపస్సు చేసుకునే సమయంలో, శ్రీవారికి హరతినిచ్చే సమయంలో పలు వేధింపులకు గురయ్యారు. స్వామి సలహా మేరకు తుంబురకోనకు వెళ్ళి తపస్సు చేసుకుని, రాత్రివేళ హారతినిచ్చేవారు. చివరకు పూజారులు ఆమెని క్షమించమని కోరి గుడికి రమ్మని ఆహ్వానించారు.

తిరుమరి శ్రీవారి సేవలో తరిస్తూ 1817 ఆగష్టు 21 వ తేదిన మోక్షం పొందారామె. తిరుమల కొండను దర్శించిన వెంటనే ఆమె భక్తి పరవశురాలై ఆశువుగా…

“శృంగార రాయని చెలువు మీటిన కోరిక

ఫణిరాజు పేరిట పసిడి కొండ

ఘోరపాపమణంచు కోనేర్లు గల కొండ

తలచున్ మోక్షంబు తగులు కోరిక”

ఆలపించి కోరుకున్న రీతిలో మోక్షం పొందడం ముదావహం.

“శ్రీపన్న గాద్రి వర శిఖరాగ్ర వాసునకు

పాపాంధికార ఘన భాస్కరునకూ……

జయమంగళం నిత్య శుభమంగళం”

అంటూ ఆమె ఇచ్చిన ముత్యాల హారతి ఈ నాటికీ తిరుమలేశ శ్రీవేంకటేశ్వరుడు అందుకుంటూనే ఉన్నారు.

“వినరయా కవులార, విద్వాంసులార

ఘనయతి ప్రాస సంగతులు నేనెఱుగ

తఱచుగా నీ కవిత్వమునకు మీరు

వరుస ఆక్షేపింపవలదు…”

అని వినయంతో ప్రార్ధించిన వినయశీలి తరిగొండ వెంగమాంబ జ్ఞాపకారం ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. 2017 ఏప్రిల్ 26వ తేదీన 5 రూపాయల విలువతో ఈ స్టాంపు విడుదలయింది. ఈ స్టాంపు మీద కుడివైపున శివుని చిత్రం కనిపిస్తుంది. సింహభాగం తపోముద్రలో ఉన్న వెంగమాంబ ప్రశాంతవందనంతో కనిపిస్తారు.

తెలుగులో రామాయణాన్ని ఆంద్రీకరించిన కవయిత్రి ఆతుకూరి మొల్ల, రామాయణ కల్పవృక్షమును వెలయించిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గార్ల స్టాంపులతో కలిసి ఈమె స్టాంపు విడుదలయింది.

ఏప్రిల్ 20వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version