డాక్టర్ ముదిగొండ వీరేశలింగం మూడు కవితలు – విశ్లేషణ

0
1

[డాక్టర్ ముదిగొండ వీరేశలింగం గారు రచించిన మూడు కవితలను విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రిటైర్డ్ తెలుగు భాషా రీడర్, కాకతీయ డిగ్రీ కళాశాల, హన్మకొండ, డాక్టర్ ముదిగొండ వీరేశలింగం రచించి ‘స్పందన’ అనే కవితా సంపుటిలో ప్రచురితమైన కవితలలోంచి నాకు బాగా నచ్చిన మూడు కవితలను విశ్లేషణకు తీసుకున్నాను.

1. నాలోని నాదాలు

‘నాలోని నాదాలు’ కవితను ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది. ‘నాలోని నాదాలు’ ఏమిటి? అని ఆశ్చర్యం కలిగించవచ్చు. ‘నాలోని నాదాలు’ నాలోని భావాలుగా తోస్తుంది. కవి వీరేశ లింగం కవితా చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.

‘నాలోని నాదాలు నేడెందుకో పలికె

నాటికి నేటికి వినలేదు కనలేదు

ఏటికో కోటికో ఒక్క నాటి పిలుపు

కమ్మ తెమ్మెర లీను కమనీయ రాగం’.

భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహం రాగం. రాగం అనగా స్వర వర్ణములచే అలరింపబడి జనుల చిత్తమును ఆకర్షించునట్టి ధ్వని. రాగ సృష్టి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు  సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్టు సంగీత కోవిదులు చెబుతారు. సంగీతంలోని రెండు స్రవంతులకు కూడా రాగమే ఆధారం. ఏమిటో నాలో ఎన్నడు చూసి ఉండని భావనామయ లోకం ఆనంద సాగరమై ఎదను పులకింపజేస్తుంది. ఇవ్వాళ ఎందుకో నా హృదయం పరవశమై నాలో పొంగి పొరలే భావ ధార  ప్రవాహమై సాగుతుంది. నా గుండె లోతుల్లో నుండి ఉబికి వచ్చే భావాలు ఎందుకో చిత్ర విచిత్రంగా పలికాయి. నా ఎదను భావ జలపాతం ఎందుకో గిలిగింతలు పెట్టింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కవి.

యుగాలు గడిచిపోయిన భూతకాలం నాటి సంగతులు ఏనాడు ఎవరి నోట విని ఉండలేదు. నడుస్తున్న వర్తమాన కాలంలో కూడా నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. వినలేదు, కనలేదు అని తనలో కలిగిన భావాన్ని తెలియజేస్తున్నారు. అలనాటి యుగాల నుంచి ఈనాటి నడుస్తున్న యుగం వరకు కోటి పిలుపులలో ఒక్కటి మాత్రమే కమనీయంగా వినిపిస్తున్నది. ఎక్కడో దూర తీరాల నుంచి వీచిన కమ్మని గాలితో నా మనసు విప్పారినట్లుగా కమనీయ రాగం ఒకటి వినబడి హృదయం ఆహ్లాదంతో ఆనంద డోలికల్లో తేలియాడింది.

‘విదిత జాతీయతా విరహమొప్పెను నేడు

విమల గాంధర్వమ్ము వెల కట్టనే లేను

నా జాతి నా మాత నా కెంతొ యింపు

పరవశమ్మొప్పెను పర దైవ మెంతొ’.

జాతి అనగా ఒకే సంస్కృతి, చరిత్ర, భాష లేదా స్వజాతీయత పంచుకునే వ్యక్తుల సమూహం. ఇది ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. జాతి యొక్క విశేషణం జాతీయత అని చెప్పవచ్చు. జనులలో నేడు ఎందుకో జాతీయ భావం దూరమై పోవుట చూస్తున్నాము. దేవతలైన గంధర్వులు పాడిన పాట గాంధర్వము. దీనిని వినగానే ఒక్కసారి మనస్సు రాగ రంజితమై పోతుంది. స్వచ్ఛమైన గాంధర్వము వెల కట్టలేనిది. నేను పుట్టిన నేల, నవ మాసాలు నన్ను తన కడుపులో మోసి జన్మనిచ్చిన తల్లి నాకు ఎంతో ఇష్టం అని తెలియజేస్తున్నారు. పుట్టుకకు కారణమైన తల్లి లేని జీవితం నాకు వద్దు. ఏ గడ్డ మీద నయితే పుట్టానో ఆ గడ్డ మీద ప్రేమ లేని మనిషి మనుగడ వ్యర్థం. నా జన్మ భూమి యందు పుట్టించిన ఆది దేవుడైన శివునిపై నాకు భక్తి పారవశ్యం కలిగింది.

‘ఉన్నవాడికినైన లేనివాడికినైన

ఉండి లేదను వాని ఉపయోగమే లేదు

జాతి, మాతలు లేని జర్జరమ్మును లేని

జీవితమే లేదు: జాతీయతయె లేదు’.

మనం నివసిస్తున్న సమాజంలో ధనవంతులు ఉన్నారు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేదలు ఉన్నారు. సమాజంలో సంపన్నుడిగా ఉండి తన వద్ద సంపద ఏమీ లేదు అని  చెప్పిన వాని వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదు. ఒకే సంస్కృతి, చరిత్ర, భాష లేదా స్వజాతీయత పంచుకున్న సమూహమైన జాతి పుట్టుకకు కారణం అయిన తల్లి మరియు జాతీయ భావన లేని మనిషికి జీవితం లేదు అని కవి వీరేశలింగం చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘కమ్మ తేనెలు కురియు, కళలెన్నియో విరియు

కంటికింపైనట్టి, కంటగింపైనట్టి

కాంతి మీరిన యట్టి కమిలిపోని యట్టి

భారతమ్మీ నేల భాసించు ఈనాడు’.

తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే తియ్యటి ద్రవపదార్థాన్ని తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. ఎందుకంటే పంచదార కంటే రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణం కలిగి ఉంటుంది. ఆనాటి కాలం నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు. కళలు కొన్ని ఉపయోగ దృష్టి తోను, కొన్ని సౌందర్య దృష్టి తోను అలరిస్తున్నాయి. ప్రతిభా నైపుణ్యములకు మూలములైన వాటన్నింటిని కళలు అంటారు. కళలు అరువది నాలుగని ప్రాచీనులు వివరించారు. కళలలో మొదటి తెగకు చెందినవి మానవ శరీర సౌందర్యమునకును, రెండవ తెగకు చెందిన కళలు మానవ హృదయానందమునకు తోడ్పడును. కళలను సామాన్య కళలు, లలిత కళలు అని చెబుతున్నారు. నా హృదయం లోతుల్లో నుండి వచ్చే స్వచ్ఛమైన భావాలు కమ్మని తేనెలను కురుస్తాయి. నా హృదయంలోని భావాల ద్వారా కళలు మధువును చిందే పుష్పాలై వికసిస్తాయి. నాలో కదలాడే భావాలు ఇంపుగా మనస్సుకు తెలియని ఉల్లాసం కలిగిస్తాయి. నాలో పొంగి పొరలే మరి కొన్ని భావాలు ఎందుకో మనస్సుకు ముల్లులా గుచ్చుకుంటాయి. నాలో నుండి చీల్చుకు వచ్చే భావాలు ఎందుకో మధ్యాహ్నం మార్తాండుడి కిరణాల వలె వాడిగా వేడిగా ఉంటాయి. నాలోని భావాలు అగ్ని సోకి కూడా కమిలిపోకుండా ఉంటాయి. పునీతమైన నేల గల భారతమాత ఈనాడు గొప్పగా ప్రకాశిస్తుంది చూడమని చెప్పిన భావం చక్కగా ఉంది.

‘యుగయుగాలుగా నేను తరచి చూచినయట్టి

తిమిరమమరని యట్టి,స్వచ్ఛందమైనట్టి

మనసు కింపైనట్టి,మాధుర్యమున దొట్టి

హైందవమ్మీ నాడు జగమెల్ల నిండె’.

హిందూ సంప్రదాయం అనుసరించి కొన్ని సంవత్సరములు కలిసి ఒక యుగముగా కాలమానము లెక్కింపబడుచున్నది. యుగాలు నాలుగుగా చెప్పబడ్డాయి.1) కృతయుగం 2) త్రేతా యుగం 3) ద్వాపర యుగం 4) కలియుగం. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది. త్రేతా యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది. ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది. కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడుస్తుంది అని చెబుతారు. యుగయుగాల నుండి చరిత్రలో జరుగుతున్న సంగతులను ఆలోచించాను. నాలోని భావాల ద్వారా తరచి చూచాను. అజ్ఞానమనే చీకటి లేని స్వచ్ఛందమైనటు వంటి మనసుకు ఆహ్లాదం కలిగించేటటువంటి మనసుకు ఇంపైనటువంటి తీయందనంతో కూడిన హిందుత్వం ప్రపంచమంతటా వ్యాపించింది. హైందవ సంస్కృతి యొక్క మహత్వం ఈనాడు ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని కవి వీరేశలింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘రామదాసును కన్న,త్యాగయ్యనే కన్న

వాల్మీకి గన్న,వ్యాసదేవుని గన్న

భారతీ ఆనాటి భవ్య రూపమేదమ్మ

చూపు నాకొక మారు చూపరులు వెరుగొంద’.

భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న 1620 లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామములో జన్మించాడు. రామదాసు భార్య కమలమ్మ. గోపన్న శ్రీరాముని కొలిచి, కీర్తించి భక్త రామదాసుగా పేరు తెచ్చుకొన్నాడు. భద్రాచల దేవస్థానమునకు ఇతని జీవిత కథకు అవినావ సంబంధం ఉంది. రామదాసు తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. రామదాసు రచించిన దాశరథి శతకం, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచల దేవస్థానం. ఇవి రామదాసు నుండి మనకు సంక్రమించిన పెన్నిధులు. త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయ కారుడు. త్యాగయ్య కీర్తనలు అతనికి గల విశేష భక్తిని వేదాలపై ఉపనిషత్తులపై అతనికి ఉన్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో గొప్ప కవి. రామాయణాన్ని రాశాడు. వాల్మీకిని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. వాల్మీకి శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నాడు. వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సంప్రదాయంలో కృష్ణ ద్వైపాయుడిగా పిలువబడేవాడు. వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడిగా ప్రసిద్ధి పొందాడు. వ్యాసుడు వేదాలతో పాటు మహా భారతం, మహా భాగవతం, అష్టాదశ పురాణాలు రచించాడు. భారతీ దేవి అంటే సరస్వతి దేవి. సరస్వతి ఆధ్యాత్మిక తేజస్సు, జ్ఞానానికి అధిదేవత. ఆమె చదువుల తల్లి. పూర్వపు కావ్యాలు సాహిత్యం వంటివి ఇప్పుడు లేవని కవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన మన దేశంలో పుట్టిన రామదాసు, త్యాగయ్య, వాల్మీకి, వ్యాసుడు మున్నగు దివ్యమూర్తులు చరిత్రలో ప్రసిద్ధి పొందారు. భారతి నీ స్వచ్ఛమైన రూపం ఎక్కడ ఉంది అమ్మా? ఒక్కసారి నీ దివ్య రూపం చూపించమని అడుగుతున్నారు. ఓ భారతీ మాత: ఇప్పుడు చూసే వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా, ఆశ్చర్యం కలిగేలా నీ దివ్య రూపం ప్రదర్శించమని కవి వీరేశలింగం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

‘రేజీకటుల నిండ రెప్పలార్చుచు నుంటి

జంతువైతి నేడు,జాతీయత యే తెలుపు

తెలుపు చూచి నేను నలుపనుకొన్నాను

దృష్టిలేని ద్రష్ట నెన్నటికి కాను?’

రాత్రి వేళ కలుగు చూపు మాంద్యం రేచీకటి. వ్యాధిగ్రస్థులు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడలేరు. పగలు కనిపిస్తూ రాత్రి సమయానికి అనగా చీకటిగా ఉండుట వలన ఈ వ్యాధిని రేచీకటి అంటారు. కంటిలోని తెల్లని పొర ప్రకాశిస్తూ ఉండకుండా పొడి ఆరి పోయినట్లుగా ఉండును. కంటి  గ్రుడ్డు మీద తెల్లని మచ్చలు ఉండును. ఎందుకో ఏమిటో తెలియదు. ఒక్కసారి నా కళ్ళను రేచీకట్లు కమ్మినాయి. నేడు ఎందుకో నా కళ్ల  రెప్పలను ఆర్చుచు జంతువు వలె అయినాను. నా దేశం పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండుటయే జాతీయత. జాతీయత తెలుపు రంగులో కనిపిస్తుంది. జాతీయత యొక్క తెలుపును చూచి నా కళ్ళు రేచీకటి సోకినట్లు నలుపు అనుకున్నాను. సరియైన చూపు లేని నేను జరగబోయే యుగాల భవిష్యత్తు వాణిని తెలిపే మహర్షిని ఎన్నటికీ కాలేను అని కవి వీరేశలింగం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

టహింసయె ఈనాటి పరమ హంసాయెను

అంత కన్నను నేడు  అమరత్వమే లేదు

నెత్తుటి కూటిని తిననిచ్చయే లేదు

దారొకటి నీవైపు చూపవేమమ్మా’.

ఈనాటి సమాజంలో మానవులు హింసపరులై  బతుకు గడుపుతున్నారు. ఏం చేయకూడదో అట్టి హింసను చేస్తూ తాను చేసేది సరి అయినదని భావిస్తూ పరమహంసను అనుకుంటున్నారు. చేయకూడని హింస చేస్తూ అదే సరి అయినది అనుకుంటున్నారు. చేయకూడని కార్యాలు చేస్తూ దానినే నేడు దైవత్వంగా భావిస్తున్నారు. ఒకరు బాధపడుతుంటే చూసి సంతోషించడం, ఒకరి నెత్తుటి కూటికి ఆశించడం నా నైజం కాదు. నాలో కలిగిన భావాలకు తల్లి భారతీ నీవు నాకు సరియైన దారి చూపమని వేడుకుంటున్నారు.

కవి వీరేశ లింగం తన కవితలో వ్యక్తం చేసిన భావాలు సమాజానికి స్ఫూర్తిని కలిగించేవిగా ఉన్నాయి.

2. పరమ రహస్యాలు

‘పరమ రహస్యాలు’ కవితను ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది. పరమ రహస్యాలు ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. మనిషి జీవితంలో పరమ రహస్యాలు ఉంటాయి. పరమ అంటే శ్రేష్ఠమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, సత్యము యొక్క జ్ఞానం, పునాది, అంతిమమైనది, అత్యంత ఉన్నతమైనది అనే అర్థాలతో కూడి ఉంది. రహస్యాలు అంటే ఆంగ్లంలో secrets అని అర్థం. ఎవరికి తెలియకుండా దాచబడినది రహస్యం. విచిత్రమైనది,తెలియనిది రహస్యం. ఒక విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా ఉంచటం రహస్యం. ఎవరికి తెలియని విషయం రహస్యం. గుప్తంగా ఉంచిన విషయం రహస్యం. పరమ రహస్యాలు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉందా, కవి వీరేశలింగం కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.

‘సంస్కారానికి నామం పెట్టావా

సంస్కృతి అంతరించుతుంది’

మంత్ర పూర్వకంగా చేసే క్రియలు సంస్కారాలు. జాత కర్మ మొదలు అంత్యేష్ఠి వరకు పదహారు సంస్కారాలు చేస్తారు. వీటిని షోడష సంస్కారాలు అంటారు. అన్నప్రాశనం, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం మొదలైనవి సంస్కారాలు. మనిషి సంఘజీవి. మనిషి సంఘంలో ఎట్లా మెలగాలో చూచి తెలుసుకోగలడు. కొందరు మనుషులు అహంకారంతో దురాశతో తనకు ఆ తీరు తగినదా కాదా? అని ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్లను సంస్కారహీనులు అని అంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏ విధంగా నడుచుకోవాలో పెద్దలు సంస్కారాన్ని తెలియజేయాలి. ఇంట్లోని కుటుంబ సభ్యుల సంస్కారం సామాన్యంగా పిల్లలకు అలవడుతుంది. పాఠశాలలో మంచి గురువులు నేర్పిన శిక్షణ వల్ల సంస్కారం అబ్బుతుంది. సంస్కారములు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు. ఇవి ప్రతి హిందువు జీవిత పర్యంతం వివిధ దశలలో జరుపబడుతాయి. అధికారులు, పాలకులు సంస్కారహీనులైతే ప్రజల జీవితాలు వెతల పాలవుతాయి. సంస్కృతి అనేది మానవ సమాజాలలో కనిపించే సామాజిక ప్రవర్తన. సంస్కృతి అంటే సంస్థలు విధించే  నిబంధనలతో పాటు జ్ఞానం, నమ్మకాలు, కళలు, చట్టాలు, ఆచారాలు, సామర్థ్యాలు మరియు అలవాట్లను కలిగి ఉండే ఒక భావనగా చెప్పవచ్చు.

మానవులు సాంఘికీకరణ యొక్క అభ్యాస ప్రక్రియల ద్వారా సంస్కృతిని పొందుతారు. ఇది సమాజాలలోని సంస్కృతుల వైవిధ్యం ద్వారా చూపబడుతుంది. గతం నుంచి పాటిస్తూ వచ్చిన ఒక నిర్దిష్టమైన పద్ధతిని సంప్రదాయం అంటారు. భారతదేశ సంస్కృతి అంటే భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, కులాలు, వర్గాల సమిష్టి కలయికగా చెప్పవచ్చు. భారతదేశం భిన్న సంస్కృతుల ఏకత్వంతో నిండి ఉంది. భారతదేశంలోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ, ఆచారాలు వ్యవహారాలు, ఒక్కో ప్రాంతంలో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతుంది.

సంస్కృతి మానవ సమాజం జీవన విధానంలోని ఆచారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు వంటి వాటిని సూచిస్తుంది. మన దేశంలో అనాదిగా ఆచరిస్తూ వస్తున్న సంస్కారాన్ని వదిలి వేయకూడదు. సంస్కారాన్ని పరి రక్షించుకోవాలి. అనాదిగా ఆచరిస్తూ వస్తున్న సంస్కారాన్ని వదిలివేస్తే మన దేశ సంస్కృతికి ముప్పు వాటిల్లి అంతరించిపోతుంది. మన దేశ వాసులు సంస్కారంతో వ్యవహరిస్తే సంస్కృతి కాపాడబడుతుంది అని కవి వీరేశలింగం కవితలో వ్యక్తం చేసిన భావం అద్భుతం.

‘అభిమానానికి అంతు లేకపోతే

దురభిమానం దరి చేరుతుంది’.

అభిమానం దేనినైనా ఇష్టపడే పూర్వ స్థితి. ఇష్టపడే సానుకూల భావన. అభిమానం. ఆప్యాయత, ప్రేమ భావాల నుండి ఉబికి వచ్చే దానిని వాత్సల్యం అని అంటారు. పెద్దల పట్ల కలిగి ఉండే ఆరాధన పూర్వకమైన భావన అభిమానం. ఒక వ్యక్తి పట్ల ఆరాధన భావం కలిగి ఉండటం బలమైన అభిమానాన్నీ తెలియజేస్తుంది. ప్రేమలో స్వార్థానికి చోటు లేదు అంటారు.

నిష్పక్షపాత తీర్పుకు తగినంత సమయాన్ని శ్రద్ధను చూపించకుండా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం దురభిమానం. ఇతరుల అభిప్రాయములను సహించలేనితనం దురభిమానం. దురభిమానంతో ఏ పనిని చేయరాదు. మనం కొన్ని విషయాలను, కొందరు వ్యక్తులను అభిమానిస్తాం. ఈ అభిమానం ఎలా ఏర్పడుతుంది? అంటే చెప్పడం కష్టం. ఒక పాట, ఒక కళారూపం మనసుకు హత్తుకుంటుంది. ఇది పూర్తిగా అతని వ్యక్తిగత విషయం. అదే పాట, అదే కళారూపం ఇంకొకరిని మెప్పించ లేకపోవచ్చు. మరి వారికి ఎందుకు నచ్చింది? అంటే వారి అభిరుచి, సంస్కారం, కుటుంబ నేపథ్యం, పెరిగిన సామాజిక వాతావరణం, ఇలా అనేక కారణాలు ఉంటాయి. అభిమానంగా ఉన్నంత వరకు పేచీలు రావు. అదే అభిమానం అంతటితో ఆగకుండా దురభిమానంగా మారడంతోనే చిక్కులు వస్తాయి.

అభిమానానికి ఒక హద్దు ఉండాలి. అంతులేని అభిమానంతో దురభిమానం ఏర్పడుతుంది. దురభిమానం వల్ల తాను ఏం చేస్తున్నాడో మరిచిపోయి ప్రవర్తిస్తాడు. దురభిమానంతో పక్షపాతంతో చేసే పనుల వల్ల ఇతరులకు హాని జరుగుతుంది. అభిమానం ఉండాలి. అంతులేని అభిమానం కూడదు. అంతులేని అభిమానం వల్ల దురభిమానం ఏర్పడితే ఎన్నో అనర్థాలు, సాటివారిని గౌరవించ లేని స్థితికి చేరుతుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

‘వేగం ఎక్కువ కావాలని ప్రయత్నిస్తే

ఆ వేగం అతుక్కుపోతుంది’.

సాధారణ వాడుక భాషలో వడి అనే పదంకు బదులుగా వేగం అనే పదం ఉపయోగిస్తుంటారు. వాహనం ప్రయాణం నిర్ణయింపబడిన దూరం వెళ్ళుటకు సమయం శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన వేగం. వేగం అనేది ఎంత వేగంగా కదులుతుందో తెలిపే పరిమాణాత్మక కొలత. వేగం శరీరం లేదా వస్తువు యొక్క కదలిక దిశను నిర్వచిస్తుంది. వాహన చోదకుడు ఎక్కువ వేగం కావాలని ప్రయత్నిస్తే వాహనం అదుపుతప్పి బోల్తా పడుతుంది. వాహన చోదకుడు అజాగ్రత్తగా నడపడం వల్లనే ప్రమాదానికి గురి అవుతాడు. అతి వేగం వల్ల నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించక పోవడం వల్ల అతి వేగంగా దూసుకు పోవడం వల్లనే ప్రమాదం జరుగుతుంది. అతివేగం ప్రమాదం అని చెబుతున్నప్పటికీ కొందరు వినడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాద వార్తలు వినాల్సి వస్తోంది. ఇందులో మనుషుల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా నిలుస్తోంది. అతి వేగమే మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. మితి మీరిన వేగం కొరకు వాహన చోదకుడు ప్రయత్నిస్తే ఆ వేగం వల్ల అదుపు తప్పి వాహనం బోల్తా పడుతుంది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదంకు గురి అవుతారు అని కవి వీరేశలింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

‘జీవితం రాగ రంజితం కావాలని ప్రయత్నిస్తే

వైరాగ్యం మితిమీరుతుంది

ఇవన్నీ జీవితంలో భాగాలు

విశ్లేషిస్తే అంతర్భాగాలు’.

జీవితం ఆంగ్లంలో The Life అంటారు. జీవితం అంటే జీవితం యొక్క ఉనికిని తెలిపే పదం. జీవితం అనేది సజీవంగా ఉన్న స్థితిని సూచించడానికి ఆరోగ్యం, ఆనందం, సంబంధాలు మరియు వృత్తి వంటి జీవితంలోని వివిధ అంశాలను వివరించడానికి తోడ్పడుతుంది. జీవితం యొక్క అర్థం ఏమిటి? సాధారణంగా జీవించడం ఉనికి యొక్క ప్రాముఖ్యతకు సంబంధించినది. రాగమనగా స్వర వర్ణములచే అలంకరింపబడి జనుల చిత్తమును ఆనందింపజేయునట్టి ధ్వని.రాగ స్వరములను వినడం వల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. జీవితం స్వర వర్ణాలతో అలంకరించు రాగాలను వింటూ ఉంటే మనసు ఏదో తెలియని అనుభూతులు, ఆహ్లాదంలో తేలియాడుతుంది. జీవితాన్ని ఆహ్లాదంగా గడపాలని ప్రయత్నిస్తూ పాటల లోకంలో విహరిస్తూ ఉంటే విరక్తి కలుగుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆయా విషయాల పట్ల నిరాసక్తత ఏర్పడుతుంది. ఎవరైనా దగ్గర బంధువులు ఈ లోకాన్ని వీడినప్పుడు వారి అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకు వెళ్లిన క్రమంలో మనిషికి జీవితం ఇంతేనా అనే వైరాగ్యం కలుగుతుంది. ఆహ్లాదంగా సాగి పోతున్న జీవితంలో ఒక్కసారిగా తెలియని వైరాగ్యం ఆవహిస్తుంది  అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

జీవితంలో కష్టము, సుఖము, దుఃఖము, విచారము, సంతోషము, ఆనందము అన్ని ఉంటాయి. జీవితంలో కష్టం లేకుండా సుఖం ఉండదు. సుఖం లేకుండా సంతోషం ఆనందం ఉండవు. వెలుగు లేకుండా చీకటి ఉండదు. చీకటి లేకుండా వెలుతురు ఉండదు. కష్ట సుఖాలు కావడి కుండల వలె జీవితంలో ఇవి భాగాలు. జీవితాన్ని విశ్లేషిస్తే అంతర్భాగాలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది. ఎక్కడో ఒక పాట వీనుల విందుగా వినిపిస్తూ ఉంటుంది. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అనే సినీ గీతం జీవితానికి అర్థం తెలిపినట్లుగా ఉంది.

‘కొండంత నాలుక కోసం ప్రయత్నిస్తే

కొండనాలుక ఊడుతుంది

ఆలోచించు – తేల్చు నిజం

ప్రయత్నిస్తాం పరి పరి విధాల కొన్ని

అప్రయత్నంగా జరిగేవి ఎన్ని

ఇదే జీవిత సత్యాలు

ఏనాటికి తెలియని పరమ రహస్యాలు’.

అంగులి సాధారణంగా కొండ నాలుక అని పిలవబడేది. చూడటానికి శంకువు ఆకారంలో మృదు తలుపు మధ్య భాగం నుండి ముందు చొచ్చుకు వచ్చి బంధన కణజాలం కలిగి రేసమస్ గ్రంథులెన్నో గల నోటిలోని భాగం. దీని యందు ఎన్నో రక్తరసి గ్రంథులు కూడా ఉండి చాలా పలుచని లాలాజలాన్ని స్రవిస్తాయి. వేడి చేసినప్పుడు ఆ కొండ నాలుక సాగి నాలుక మీద తగులుతూ ఉంటుంది. నోటి లోపల నాలుక పై భాగాన ఉండేది కొండ నాలుక. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడుతుంది అనే సామెత ఉంది. మనం ఒకటి అనుకుంటే దానికి వ్యతిరేకం అవుతుంది. అమ్మవారు నోరు తెరచి నాలుక చాపి రాక్షసులను చంపేస్తుంది. అమ్మవారికి అది సాధ్యమవుతుంది. మనలాంటి మామూలు మనుషులకు సాధ్యం కాదు. ఏదైనా విషయాన్ని మనసులో కొత్తగా విచారించడాన్ని ఆలోచించడం అంటారు. అదే విషయంపై అతిగా నిమగ్నమవ్వు. ఏదో ఒక విషయం గురించి ఆపకుండా ఆలోచించు. ఏదో ఒక విషయంపై చాలా ఆసక్తి పెంచుకుని లేదా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ప్రక్రియను ఆలోచన అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడిన అభిప్రాయాలు లేదా ఆలోచనల వల్ల సరి అయిన దారి దొరుకుతుంది. నిజం వైపుకు పయనం కొనసాగుతుంది. సత్యముతో కోరుకున్నది నిజం. ఇది యదార్థమైన మాట. గాంధీ గారి సిద్ధాంతాలలో నిజం ఒకటి. ఏదైనా పని మొదలు పెట్టే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచించాలి. పనిలో అనుకూలమైనది ఏమిటి? పనిలో అనుకూలం కానిది ఏమిటి? ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో సానుకూల అంశాలు ఉంటాయి. మనకు బాగా నచ్చిన వాళ్ళతో నేను ఈ పని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను. పనిలో గల సాధ్యాసాధ్యాలు ఏమిటి?  అని వాళ్ళను అడగాలి. నీ మంచి కోరే వాళ్ళు నీకు సరైన సలహా ఇస్తారు. అట్టి సలహాలను అందుకుని ముందుకు వేగంగా సాగిపోవాలి. పని చేస్తుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఉన్నాయని మొదలు పెట్టిన పనిని ఆపకూడదు. నీ కర్తవ్యం నీవు నెరవేర్చు. నిజం నీ వెంట ఉండి నీకు స్వాగతం పలుకుతుంది. ప్రయత్నం లేకుండా ఎలాంటి పని జరగదు. ప్రయత్నం లేకుండానే కొన్ని పనులు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. మనం ఒక పని కావాలి అనుకుంటే ఇంకొక పని జరుగుతుంది. అదే పరమ రహస్యం. ఆధ్యాత్మికంగా మనకు తెలియకుండా ఉండేది ఏమిటి? అదే పరమ రహస్యం. మనకు తెలియకుండా జరిగేది జీవన సత్యంగా చెప్పవచ్చు అని కవి వీరేశలింగం వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.

3. జాతి విలువ

‘జాతి విలువ’ కవితను ఆసక్తితో చదివాను.  నాలో ఆలోచనలు రేకెత్తించింది. జాతి విలువ ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. జాతి అనే పదం సాంప్రదాయకంగా భారత ఉపఖండంలో ఒక తెగ, సంఘం, వంశం, ఉపవంశం, మతపరమైన విభాగం వంటి సమ్మిళిత సమూహాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ప్రతి జాతికి సాధారణంగా ఒక వృత్తి, భౌగోళికంగా, తెగతో అనుబంధం ఉంటుంది. భారతీయ సమాజం నేటికీ అనేక కులాలు, తెగలు, మతపరమైన సంఘాల సముదాయంగా ఉంది. ఇవ్వాళ మనం నివసిస్తున్న నేటి సమాజం అల్లకల్లోలలాతో అస్తవ్యస్తంగా ఉంది. ఇవ్వాళ జాతి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఉందా? అని మనకు సందేహాలు కలుగుతాయి. ఇవ్వాళ దేశంలో కులాల వారిగా కుమ్ములాటలు రగులుతున్నాయి. దేశంలో మతాల పేరిట మారణహోమం కొనసాగుతుంది. జాతి విలువ గురించి తెలుసుకోవాలంటే కవి వీరేశలింగం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి. అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.

‘మంది బలంతో కాదు

జాతి విలువ తెలిపేది

మద గజ బలంతో అంత కన్నా కాదు

వంద యేనుగులనైనా వంచి వేయగల

మావటీని బలం కావాలి’.

మంద అంటే మానవ నియంత్రణలో కలిసి ఉంచబడిన జంతువుల పెద్ద సమూహం. ఊరి బయట ఉండే  పశువుల సముదాయాన్ని మంద అంటారు. పశువుల మందలో ఎన్నో రకాల పశువులు ఉంటాయి. అన్ని రకాల పశువులు నా  మందలో ఉన్నాయి. కాబట్టి  మంద బలం నాకు ఎక్కువగా ఉంది. ఇవ్వాళ సమాజంలో నాయకుడిగా పేరు తెచ్చుకొని బుద్ధి జ్ఞానం లేని జనాలకు ఏవో తెలియని ఆశలు కల్పించి మాయ మాటలతో బురిడీలు కొట్టించి ఓట్ల కొరకు తన వెంట తిప్పుకుంటారు. అమాయకమైన ఓటర్లకు గాలం వేసి కోట్లు ఖర్చు పెట్టి తినిపించి, తాగించి ఓట్లు లాక్కుంటున్నారు. ఆ నాయకుని వెంట తిరుగుతున్న ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అది అతని మంద బలం కాదు. అతను ప్రజలను మోసం చేసి తన వెంట తిరుగునట్లు చేస్తే జాతి విలువ పెరుగదు. నిజమైన నాయకుడుగా జాతి ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడితేనే జాతి విలువ తెలుస్తుంది. మద గజానికి బుద్ధి లేదు కాబట్టి మావటి వాడు తన సామర్థ్యంతో అదుపు చేయ గలడు. పశువులు అకారణంగా ఎవరి జోలికి రావు. నేటి రాజకీయ నాయకులు మద గజంలా చెలరేగి పోతున్నారు. మదం పట్టిన ఏనుగు వలె బలం ఉంది కదా అని నాయకుడు అసాంఘిక కార్యకలాపాలకు అవినీతికి పాల్పడుతూ సమాజానికి చేటు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? వారు ఒక్కసారిగా తిరుగుబాటు చేస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. వంద ఏనుగులను కూడా అదుపు చేసే సామర్థ్యం మావటి వానికి ఉంటుంది. అలాంటి మావటి వాని బలం దేశ ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడే జాతి నాయకునికి కావాలి అని ప్రేరణ ఇస్తున్నారు.

‘బలం విలువ – స్థలంలో కూడా ఉంటుంది

అందుకే చివరికి మిగిలేదే స్థాన బలం – బుద్ధి బలం’.

ఎవరైనా మనిషి వేరే ఊరికి పోతే అతను బలవంతుడు అయినప్పటికీ ఆ ఊరిలో అతని బలం పని చేయదు. అందుకే మనం  చేసే ప్రతి పనికి  పుట్టిన ఊరు యొక్క స్థాన బలం మరియు బుద్ధి బలం కొండంత అండగా నిలుస్తుంది అని జాతి జనులకు ప్రేమతో తెలియజేస్తున్నారు.

‘దేశాలెన్నైనా తిరిగేస్తాం ఆవేశంతో

విచారిస్తాం చివరికి ఆలోచనతో

వెళ్తాం తిరిగి మన దేశానికి

చూస్తాం మన స్వరూపమేమిటో

జరిగినవీ,జరుగుతున్నవీ, జరగాల్సినవీ

మన బాధ్యతలు – హక్కులూ,

అపుడే తెలుస్తుంది – నిజ స్వరూపం’.

యువకుడిగా ఉండి తెలియని ఆవేశంలో మంచి చెప్పే ఇంటి వాళ్లను మరియు సజ్జనుల మాటలను పెడ చెవిన పెట్టి అహంకారంతో ఎన్నెన్నో దేశాలు తిరుగుతాడు. అతడు తాను అనేక దేశాలు పిచ్చి పట్టినట్లు ఎందుకు తిరిగాను? అని చివరికి మనసులో కలిగిన ఆలోచనతో ఆత్మ విమర్శ చేసుకుంటాడు. అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చి తిరిగి తన దేశానికి రావడం జరుగుతుంది. అతనికి పరాయి దేశంలో కంటే మన దేశ స్వరూపమే బాగుందని తెలుస్తుంది. మన దేశంలోని పద్ధతులు, ప్రమాణాలు సకల జనులకు ఆచరణీయం. మన దేశం వేద భూమి. ఎందరో మహనీయులు జన్మించిన దేశం మనది. ఆనాటి మహనీయులు సమాజ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డారు. అక్కడ జరిగిన సంఘటనలు అతన్ని తీవ్రమైన విషాదంలోకి నెట్టుతాయి. ఇతర దేశాలలో  జరుగుతున్న ఘటనలు అతనికి  బాధ కలిగిస్తాయి. అక్కడ జరగాల్సిన వాటి గురించి తలుచుకొని వేదన కలుగుతుంది. మనం హక్కుల గురించి పోరాటం చేస్తాం. మనం నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి సరిగా నిర్వర్తించామా? అని ఆలోచించడం లేదు. మనం మన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదు. ఇవ్వాళ మనిషి తన హక్కుల కొరకు పోరాడుతున్నాడు. కానీ తాను తన దేశానికి  విధ్యుక్త ధర్మంతో చేయవలసిన బాధ్యతలను మరిచి పోతున్నాడు. బాధ్యతలను మరిచిపోయిన అతనికి తాను ఏమి చేయాలో తన కర్తవ్యం ఏమిటో అతనికి  అవగతం అవుతుంది.

‘నందై నాలుగేళ్లే బ్రతకాలి

పందై పదేళ్లు బ్రతక్కూడదని

విన్నాణంలో వింతలు గ్రహిస్తూ

పాషాణంలా బ్రతక్కూడదని

జాతిని నిర్వీర్యం చేసే

నిస్పృహలూ – నిరాశలు – నినాదాలు

కట్టిపెట్టాలని కాలరాచేయాలని

కష్టపడాలని,పనిచేయాలని

కలలు కూడదని,మమత కావాలని

గ్రహిస్తేనే జాతికి బిక్ష

మరుస్తే మనకిక లేదు రక్ష’.

నంది శివుని యొక్క బంటు. నంది శివుని యొక్క ద్వార పాలకుడు. నంది హిందువుల దేవుడైన  శివుని వాహనం. నంది శివుని నివాసమైన కైలాసానికి సంరక్షక దేవత. దాదాపు అన్ని శివాలయాలు సాధారణంగా ప్రధాన మందిరానికి అభిముఖంగా కూర్చున్న నంది రాతి విగ్రహాలను కలిగి ఉంటాయి. నంది అంటే  ఆనందాన్ని లేదా సంతృప్తిని కలిగించేది అని అర్థం. నంది అంటే  పెరగడం, వృద్ధి చెందడం, కనిపించడం అని భావించవచ్చు. దైవత్వం కలిగిన ఎద్దును నందిగా భావిస్తారు. కవి వీరేశలింగం నంది వలె నాలుగు సంవత్సరాలు బ్రతకితే చాలు అని వ్యక్తీకరించడం చక్కగా ఉంది.

మానవ వ్యర్థాలను, చెత్తను ఏరుకుని తింటూ గడిపే పంది వలె పది సంవత్సరాలు బ్రతుకును కొనసాగించడం తగదని కవి వీరేశలింగం వ్యక్తం చేస్తున్నారు. అందరి కోసం లేక అవసరాల కోసం భవిష్యత్తు తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరుగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న ఖచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం జ్ఞానంల కలయికలో ఏర్పడింది విజ్ఞానం. నేర్చుకున్న జ్ఞానాన్ని ఎవరు దొంగిలించ లేరు. మనిషి నేర్చుకున్న విజ్ఞానంతో వింతలను గ్రహిస్తూ బండ వలె చలనం లేకుండా బ్రతుకును గడపకూడదని కవి వీరేశలింగం చెప్పిన తీరు చక్కగా ఉంది.

జాతి ఉనికిని నిర్వీర్యం చేసే నిస్పృహలు, నిరాశలు, నినాదాలు కట్టిపెట్టాలని, కాల రాచేయాలని చెప్పిన తీరు బాగుంది. మీరు కోరుకున్నది సాధించనందుకు నిరాశలో కూరుకుపోయి ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. నిస్పృహ నిరాశలతో నిండి ఉంటే మీరు జీవితంలో దేన్ని సాధించ లేరు. జీవితంలో ఉత్సాహం నింపుకొని పని చేయాలి. చీమను ఉదాహరణగా తీసుకొని బ్రతుకును సాగించండి. చీమ నిరాశ చెందదు. చీమ నిరుత్సాహ పడదు. చీమ పడి పోయేదాకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎవరో చెప్పిన నినాదాల మాయలో పడి పోకూడదు. సుఖం కానిది కష్టం. శారీరకంగా లేదా మానసికంగా కలుగు బాధ కష్టం. అనుకూల పరిస్థితులు కానప్పుడు ఏర్పడేది కష్టం. మనిషి కష్టపడి పని చేయాలి. కష్టపడకుంటే ఫలితం రాదు. మనిషికి సాధించే కలలు ఉండాలి. సాకారం కాని కలలు వద్దు. పగటి కలలు కూడా పనికి రావు. పగటి కలలతో కాలాన్ని వ్యర్థం చేయకూడదు. మనిషి తనను ప్రేమిస్తూనే ఇతరుల పట్ల ప్రేమను కనబరచాలి. మనిషి నిస్పృహలు, నిరాశల నినాదాల జోలికి వెళ్ళ వద్దు. మనిషి  కష్టపడుతూ శ్రద్ధతో పని చేయాలి. మనిషి కలలు కంటూ ఊరికే కూర్చోకూడదు. మనిషి సాటివారి పట్ల మమతను పంచాలి. జాతి విలువ కొరకు పాటుపడే వ్యక్తి పై విషయాల పై దృష్టి పెట్టాలి. మనిషి దేశానికి మంచి చేయాలనే స్పృహలో ఉంటే అది జాతికి రక్షణ కవచంలా ఉంటుంది. మనిషి స్పృహలో లేకుంటే లేదు జాతికి రక్షణ అని వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. కవి వీరేశలింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


డాక్టర్ ముదిగొండ వీరేశలింగం తేది 08-06-1940 న వరంగల్ జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భవానమ్మ,శంకర శాస్త్రి. వీరి తండ్రి శంకర శాస్త్రి వరంగల్ పట్టణంలో విశ్వేశ్వర సంస్కృత కళాశాల, దుర్గేశ్వర మహిళా కళాశాలలను నడిపారు. ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి గారు శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. శంకర శాస్త్రి ప్రియమైన శిష్యుడు ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి. శంకర శాస్త్రి 1993 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడిపోయారు.

వీరేశలింగం 5 నుండి 10వ తరగతి వరకు ఎ.వి. హై స్కూల్, హన్మకొండలో చదివారు. 10వ తరగతి 1957 సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారు. పి.యు.సి. నుండి బి.ఏ. డిగ్రీ (1959 – 1962) వరకు ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల, వరంగల్ లో చదివారు. ఎం.ఏ. తెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ లో చదివారు. వీరు ఎం.ఏ. తెలుగు 1965 సంవత్సరంలో పాసయ్యారు.

వీరేశలింగం జైమిని భారతం సంశోధనాత్మక పరిశీలన అంశంపై ప్రొఫెసర్ యం.కులశేఖర రావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి 1978 సంవత్సరంలో పి.హెచ్.డి. అవార్డు పొందారు. వీరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పటి నుండి సాహిత్య సృజన చేయడం ప్రారంభించారు. వీరు డిగ్రీ కళాశాల, గూడూరు, నెల్లూరు జిల్లాలో లెక్చరర్‌గా నియమింపబడ్డారు. వీరు వివిధ హోదాలలో పని చేస్తూ కాకతీయ డిగ్రీ కళాశాల, హన్మకొండ నుండి రీడర్‌గా 30-06-1998 రోజున రిటైర్ అయ్యారు. వీరు రీడర్‌గా కాకతీయ డిగ్రీ కళాశాల, హన్మకొండలో పని చేస్తున్నప్పుడు వీరి పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు పి.హెచ్.డి. అవార్డు పొందారు. వీరి పర్యవేక్షణలో పిన్న శారద మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి జీవితం సాహిత్యం అంశం పై పరిశోధన చేసి పి.హెచ్.డి.అవార్డు పొందారు. పిన్న శారద దుర్గేశ్వర మహిళా కళాశాల, వరంగల్ నుండి ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. వీరేశలింగం గారి పర్యవేక్షణలో హరి సనత్ కుమార్, విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన అంశం పై పరిశోధన చేసి పి.హెచ్.డి.అవార్డు పొందారు. హరి సనత్ కుమార్ ప్రొఫెసర్ హరి శివకుమార్ తమ్ముడు. హరి సనత్ కుమార్ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన గ్రంథం ప్రచురింపబడింది. వీరేశలింగం గారు ఇస్కాన్ ముంబాయి సంస్థలో నవంబర్ 1998 నుండి 2011 వరకు ఉచితంగా పని చేశారు.

వీరు సంస్కృతం భగవద్గీతకు సంపాదకత్వం వహించారు. వీరు భాగవతం 18 వాల్యూమ్స్ లకు సంపాదకత్వం వహించారు. వీరి సంపాదకత్వంలో ఇస్కాన్ సంస్థ నుండి 25 పుస్తకాలు వెలువడ్డాయి. శివానందమూర్తి గారి ప్రచురించిన వ్యాస గ్రంథాలలో వీరు రాసిన వ్యాసాలు యోగశాస్త్రం, తెలంగాణలో శైవ మత వ్యాప్తి ప్రచురింపబడినవి.

వీరేశలింగం గారి వివాహం జ్ఞాన ప్రసూనాంబతో తేది 08 – 06 -1966న పెసరమిల్లి గ్రామం, కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. 1) ప్రథమ సంతానం: కుమారి శివ కౌముదీ దేవి. కవయిత్రి, కథలు, వ్యాసాలు రాశారు. కుమారి శివ కౌముదీ దేవి తేది 02-06 -2016 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడారు. 2) ద్వితీయ సంతానం దుర్గాప్రసాద్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పని చేస్తున్నారు. 3) తృతీయ సంతానం భావనా శంకర్. భార్య శైలవర్తన. భావనా శంకర్ కెనడాలో బ్యాంక్ మేనేజర్త్రత్రగా పని చేస్తున్నాడు.

కవి వీరేశలింగం వెలువరించిన పుస్తకాల వివరాలు:

1) స్పందన కవితా సంపుటి -1982.

2) జైమినీ భారతం సంశోదనాత్మక పరిశీలన గ్రంథం – 1983.

వీరు నూతన రచయితలకు కొన్ని సూచనలు చేశారు. చేతిలో కలం ఉంది కదా అని  ఏది పడితే అది రాయకూడదు. రాసేవాళ్ళు ఆలోచించి రాయాలి. నేను రాసిన దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా లేదా అని ఆలోచించాలి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. పెద్దల యెడ గౌరవాన్ని కలిగి ఉండాలి. ఎవరిని అవమానించ కూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టు లాగా బతకాలి. ప్రాచీన, ఆధునిక సాహిత్యం రెండూ చదవాలి. మనసులో ద్వేషం పెట్టుకుని పుస్తకాలు చదవ వద్దు. ఎవరిని గూర్చి కూడా చెడు మాట్లాడకూడదు అని చెప్పినారు. వీరు వరంగల్లో స్వగృహంలో ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here