32 మంది బ్రిటిష్ సైనికులని హతమార్చిన వీరనారి ఉదాదేవి

4
2

[dropcap]1[/dropcap]857 విప్లవంలో పాల్గొని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైన్యంతో పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరులు, వీరనారులు లెక్కలేనంత మంది ఉన్నారు. మహరాజులూ, మహరాణులే కాదు. వారి అనుచరులూ, సైనికాధికారులు, సామాన్యులు కూడా వీరిలో కనిపిస్తారు. కొన్ని రాజ్యాలలో భార్యాభర్తలు యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన యోధులు కనిపిస్తారు. భర్తలను చంపిన బ్రిటిష్ సైన్యంతో పోరాడి వారిలో కొంతమందిని హతమార్చి తాము వీరమరణం పొందిన నారీశిరోమణులు కనిపిస్తారు.

అటువంటి వారిలో ఒకరు నాటి అవుధ్ రాణి బేగం హస్రత్ మహల్ సైనికురాలు ఉదాదేవి. ఈమె నేటి ఉత్తర ప్రదేశ్ లోని లక్నో సమీపంలోని ఉజిరియావోలో జన్మించారు.

ఈమెకి ఔధ్ సైనికుడు మక్కాపాసితో వివాహం జరిగింది. భార్యాభర్తలు సైన్యంలో మంచి క్రమశిక్షణ, నిబద్ధతలతో పనిచేసేవారు. ఔధ్ రాజ్య సైనిక వ్యవస్థలో వీరిది ప్రత్యేక స్థానం. వీరి శౌర్య పరాక్రమాలతో రాణి బేగం హజ్రత్ మహల్ అభిమానాన్ని చూరగొన్నారు.

1857 మీరట్‌లో మొదలయిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం ఔధ్ రాజ్యానికి కూడా పాకింది. ఔధ్ సైన్యానికి ఈస్టిండియా కంపెనీ సైన్యంతో యుద్ధం జరిగింది.

ఈ సమయంలో గోమతి నది ఒడ్డున సుమారు రెండువేల పై చిలుకు బ్రిటిష్ సైన్యం విడిదిని ఏర్పాటు చేసుకుంది. వీరికి కావలసిన ఆహార పదార్థాలు, తుపాకి మందు, యుద్ధ సామాగ్రికి కొరత ఏర్పడింది. స్థానిక రాజులతో యుద్ధం చేయడానికి కావలసిన శక్తియుక్తులున్నప్పటికీ ఆయుధాలు లేకపోయాయి.

బ్రిటిష్ కుమాండర్‌కి సమాచారం అందించారు వారి అనుచరులు. వివిధ ప్రాంతాలలో తిరుగుబాటులను అణిచి వేస్తూ ముందుకు సాగాడు తూర్పు ఇండియా కంపెనీ సైన్యానికి చెందిన జనరల్ కాలిన్ కాంప్‌బెల్. ఈ సైన్యం ఔధ్ రాజ్యంలోని సికిందర్ బాగ్ మీద దాడి చేసింది.

ఔధ్ రాజ్యంలోని మహిళా సైన్యానికి నాయకురాలు ఉదాదేవి. ఈమె రాణికి నమ్మకమైన నాయకురాలు. ఈమె భర్త చిన్హాట్ యుద్ధంలో మరణించాడు. భర్త మరణానికి చింతించారామె.

కాని భర్తను చంపిన వారిపై పగబట్టారు. ప్రతీకారం తీర్చుకుంటానని భీషణ ప్రతిజ్ఞ చేశారు.

సికిందర్ బాగ్ యుద్ధంలో ఈమె బ్రిటిష్ సైన్యం మీద ప్రతీకార దాడి మొదలు పెట్టారు. పురుషవేషంలో ఈమె యుద్ధంలో పాల్గొన్నారు. వేలాది మంది మహిళలు ఈమెతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు. ఇరు సైన్యాల మధ్య భీకరయుద్ధం జరిగింది. ఇరువైపుల సైన్యం హతులయ్యారు.

1857 నవంబర్ 16వ తేదీన సికిందర్ బాగ్ వద్ద భీకర పోరాటం జరిగింది. ఈ సమయంలో ఈమె మర్రిచెట్టు మీద అశ్వికుల ఆయుధ సామాగ్రితో సహా మోహరించారు. చెట్టు మీద నుంచి కిందకి తుపాకులను పేల్చారు. చాలమంది కంపెనీ సైనికులు క్షతగాత్రులయ్యారు. సుమారు 32 మంది బ్రిటిష్ సైనికులు ఈ దాడిలో మరణించారు.

చిట్టచివరకు బ్రిటిష్ సైన్యం సికిందర్ బాగ్‌ను ఆక్రమించింది. తమ సైనికులలో క్షతగాత్రులయిన వారిని గాయపరచిన వారు ఎక్కడి నుండి, ఎవరు చేసి ఉంటారోనని పరిశీలించారు అధికారులు. మర్రిచెట్టుపై నుంచి కాల్పులు జరిగాయని గ్రహించారు. చెట్టుపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఉదాదేవి మరణించి నేలకొరిగారు. ఈ కాల్పుల కార్యక్రమమంతటినీ కమాండర్ కోలిన్ కాంప్‌బెల్ ఆధ్వర్యంలోనే నిర్వహించారు.

ఒక మహిళా సైనికురాలు చెట్టుమీద నుంచి దాడి చేసి కాల్పులు జరిపి తమకి, తమ సైన్యానికి నష్టం కలిగించినందుకు బ్రిటిష్ వారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచారు.

‘రిమినిసెన్సెస్ ఆఫ్ ది గ్రేట్ మ్యుటినీ’ గ్రంథంలో వీరనారీ శిరోమణి ఉదాదేవి పాసి గురించి “ఆమె ఒక జత బరువైన పాత-నమూనా అశ్విక దళ పిస్టల్స్‌తో ఆయుధాలు ధరించింది. అందులో ఒకటి ఆమె బెల్ట్‌లో ఇంకా లోడ్ చేయబడి ఉంది. ఆమె వద్ద ఇంకా ఆయుధాలు ఉన్నాయి” అని ఫోర్బ్స్- మిచెల్ ప్రశంసించారు.

ఈమె జ్ఞాపకార్థం ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్‌కు చెందిన ఈమె బంధుత్వ వారసులు ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన ఉదాదేవి బలిదాన వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఈమె గౌరవార్థం భారత తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసి గౌరవించారు. తలపాగా ధరించి, గంభీరమైన చూపులతో నిశితంగా తదేకదీక్షతో చూస్తున్న ఉదాదేవి చిత్రం కనిపిస్తుంది.

ఆజాదీ కా అమృత్ మహత్సవ్ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here