జీవభాషలో కవితకు నగిషీలు ‘వాన వాసన’

0
1

[డాక్టర్ నలిమెల భాస్కర్ గారి ‘వాన వాసన’ కవితని విశ్లేషిస్తున్నారు నరేంద్ర సందినేని.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బహుభాషావేత్త, అనువాదకుడు, తెలంగాణ పద కోశం కర్త, డాక్టర్ నలిమెల బాష్కర్  కలం నుండి జాలువారిన ‘సుద్దముక్క’ కవితా సంపుటి లోని ‘వాన వాసన కవిత’ పై విశ్లేషణా వ్యాసం ఇది.

తెలంగాణ మాండలిక భాషలో రాయబడిన కవిత. నేను చదివాను. నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది. కవిత శీర్షిక ‘వాన వాసన’. వాన వాసన ఏమిటని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. వానకు వాసన ఉంటుందని ఈనాటి తరానికి అయితే తెలువదు. పాతకాలం నాటి వాళ్ళు అందరు కాకపోయినా కొందరు అయినా వాన వాసన గురించి మనకు తెలియజేస్తారు. మరుగునపడిన మాణిక్యం లాంటి వాన వాసన గురించి రాసి కవితకు జీవం పోశారు. వాన వాసన కవితను సజీవం చేశారు. వాన వాసన కవిత చదివితే పల్లె భాషలో ఉన్న సొగసు సౌందర్యాన్ని మనం ఆస్వాదించ వచ్చు. తెలంగాణ పల్లె భాషకు పట్టం కట్టే రోజులు ముందు ముందు రానున్నాయా  అనిపించింది. పల్లెల్లో శి‌‌ష్ట వ్యావహారికం మాట్లాడుతున్నారు. పల్లెవాసులు ఏమిటి? ఆంగ్ల పదాలు చక్కగా పలుకడం ఏమిటి? అనిపించవచ్చు. నేను ఈ మధ్యనే ఒకరోజు ఆటోలో ప్రయాణిస్తున్నాను. ఒక పల్లెటూరు అతను ఆటో ఎక్కాడు. “ఏమయ్యా ఎక్కడికి వెళుతున్నావు?” అని అడిగిన. “సార్ హాస్పిటల్‌కు వెళుతున్నాను” అన్నాడు. “అవునయ్యా దావఖానకు వెళుతున్నావా?” అని అడిగిన. “కాదయ్యా, నేను హాస్పిటల్‌కు వెళుతున్నాను” అన్నాడు. అతడు చదువు సంధ్య లేని వాడు. అతని చేతిలో డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ కాగితాలు ఉన్నాయి. ఆంగ్లంలో హాస్పిటల్, హిందీలో దావఖాన, తెలుగులో ఆసుపత్రి, వైద్యశాల అంటారు. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు మాట్లాడే భాషను గౌరవించాలి. మన తెలంగాణ భాషలో ఆంగ్ల పదాలు కూడా వచ్చి చేరాయి. తెలంగాణ పల్లె పదాలనే మాట్లాడాలని ఎక్కడా లేదు.

వాన వాసన కవితలో పదబంధాలు, నుడికారం, జాతీయాలు, అద్భుతంగా పలికించారు. వాన ఎట్లా పడుతుంది? వాన వచ్చేముందు ఏం జరుగుతుంది? ప్రకృతిలో జరిగే మార్పులను పల్లె పదాలు ఉపయోగించి జీవభాషలో కవితకు నగిషీలు అద్దిన తీరు అద్భుతంగా ఉంది. మామూలు భాషలో రాస్తే వాన వాసన కవితకు ఇంత సొగసు ఉండదు. భాస్కర్‌కు పల్లె భాష మీద ఆయనకున్న పట్టు, వాన వాసన కవిత ద్వారా ద్విగుణీృతం ఐంది.

భాస్కర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో జన్మించారు. భాస్కర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. భాస్కర్ విద్యాభ్యాసం నారాయణపురం, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, కామారెడ్డి, హైదరాబాద్ వరకు  కొనసాగింది. భాస్కర్ 1977లో  ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి వివిధ హోదాలలో పని చేస్తూ కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాష ఉపన్యాసకులుగా 2011లో రిటైర్ అయ్యారు. ఇప్పటికీ సాహిత్య వ్యవసాయం కొనసాగిస్తున్నారు. వివిధ సాహిత్య సంస్థలతో అనుబంధం పెంచుకున్నారు. సాహిత్య సమావేశాల్లో అద్భుతంగా మాట్లాడుతారు. ఏ విషయం గురించి అయినా అనర్గళంగా సంభాషించే నేర్పును ఒడిసి పట్టుకున్నారు. ఉత్తమ ఆచార్యుడిగా ఉండి ఎందరో విద్యార్థులకు విద్యా దానం చేశారు. వర్ధమాన కవులకు అండగా ఉంటూ వాళ్లు కవులుగా ఎదిగేందుకు పలు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ నిత్య చైతన్య విద్యార్థిలా ఉంటూ సమాజానికి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. భాస్కర్ బహు బాషా వేత్తగా పేరొందారు.14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఏకాగ్రత నేర్చుకోవాలనే తపన, చిత్తశుద్ధి, పట్టుదల ఉంటేనే భాషా సంపద అలవడుతుంది. మన కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 14 భాషల్లో మాట్లాడేవారు అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 భాషల్లో మాట్లాడే భాస్కర్ ఉన్నాడని చెప్పుకోవడం జిల్లాకే కాదు పల్లె నారాయణపురంకు కూడా గర్వ కారణం. భాస్కర్ తల్లిదండ్రులు అందించిన సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని గొప్ప రచయితగా ఖ్యాతిని తెచ్చుకున్నారు.

‘ఇగ తెప్పలన్ని

ఒగ దాన్ని పట్టక ఒగటి

నీళ్ళు తాగెతందుకు

సముద్రాలల్ల కు ఉర్కుతయి’

తెలంగాణ పల్లె భాషలో తెప్పలు అంటే మేఘాలు అని అర్థమవుతుంది. వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. వర్షాలు పడే కాలాన్ని వానాకాలం ఉంటారు. జల చక్రంలో వాన ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆ తేమ తిరిగి ద్రవీభవించి బుడగల లాగా ఏర్పడిన అవపాతం ఆకాశానికి చేరుతుంది. ఆ అవపాతం వానగా కురుస్తుంది. వాన పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తిచేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాసక్రియలో ఆవిరిగా వాతావరణం లోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా ఏర్పడతాయి. శరీరం మీద బట్ట తడిపే వానను బట్టతడుపు వాన అంటారు. నాగలితో దున్ని పదును పెడితే దుక్కి వాన అంటారు. ఒక నీటి బిందువు మేఘం నుండి భూమి వైపు దూకినప్పుడు వర్షపు చినుకుగా వస్తుంది. వర్షం వ్యవసాయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకు జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షాల వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి. వర్షం స్వాంతననిస్తుందని చూసి అనుభవించుటకు హృద్యంగా ఉండటం వలన ఆనందదాయకమని భావిస్తారు.

‘మొగులు మెత్త వడుతది’

మొగులు అంటే ఆకాశం అని అర్థం అవుతున్నది. మొగులు ఎందుకు మెత్తబడుతది? అని మనలో సందేహాలు పొడచూపుతాయి. వర్షం పడగానే మొగులు మెత్తగా దూది పింజలా తేలికగా అయితది. మేఘాల తాకిడికి మొగులు మెత్తదనం సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు. మేఘాలు విస్తరించడం వల్ల వాన రాకడతో మొగులు కూడా మెత్తగా అవ్వడం నిజమే అనిపిస్తుంది. కవి భాస్కర్ భావన చక్కగా ఉంది.

‘మెల్లగ మబ్బుల వడుతది’

మేఘాలు వచ్చిన తర్వాత ఆకాశమంత మబ్బులతో నిండి ఉంటుంది. మబ్బులు ఆకాశంలో తెల్లని దూది పింజలా తేలిపోతూ కనిపిస్తాయి. వాన వచ్చే ముందు గర్జించే మేఘాలతో ఆకాశం ఆవరించి ఉంటుంది. మబ్బులు వడితే వాన వస్తుందని సూచన. పల్లెల్లో జనాలు మొగులు దిక్కు చూసి “అగో మబ్బులు పడ్డయి. వాన వచ్చేటట్టుంది” అంటరు.

‘మైసమ్మ మూలకు నల్లగా

మొగులు కొండోలె అయితది’

మైసమ్మ హిందువుల గ్రామ దేవత. ఆమెను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పూజిస్తారు. ఈ దేవతను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తారు. ఆమె పశువులను కాపాడుతుందని నమ్ముతారు. ఆమెను పూజించడం వల్ల మశూచి, ఆటలమ్మ వ్యాధుల నివారణ జరుగుతుందని ప్రజల విశ్వాసం. కొండ ప్రాంతాలను రాళ్లతో నిండిన ఎత్తైన ప్రదేశాలను మరియు చెట్లతో కూడిన ప్రదేశాలను మైసమ్మ గుడికి అనువైన ప్రదేశాలుగా ఎన్నుకుంటారు. మైసమ్మ మూలకు వాయువ్యం దిక్కున కొలువై ఉంటుందని ఒక నమ్మకం. వాన పడే ముందర ఆకాశం నల్లగా కొండవలె కనిపిస్తుందన్న కవి భాస్కర్ భావన చక్కగా ఉంది. మొగులు కొండోలె అయితది అనేది చక్కటి నుడికారం అని చెప్పవచ్చు.

‘వాన శేర్లు దిగుతయి’

వాన పడుతున్నప్పుడు మనం పరిశీలించి చూస్తే ఆకాశం నుంచి ధారలుగా కురుస్తున్నట్లు. వాన నీరు ధారలు ధారలుగా కిందికి వచ్చినట్టు మనకు అగుపిస్తుంది. దాన్ని వాన శేర్లు దిగుతున్నాయి అంటరు. వాన ధారలు ధారలుగా ఆకాశం మీద నుంచి భూమి పై కురుస్తున్నప్పుడు అవి భూమిపై నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.

‘దూరం కెల్లి వాన వాసన

కమ్మగా వత్తది’

చాలామంది తొలకరి వర్షానికి ముందు వర్షం పడేటప్పుడు భూమి నుండి వచ్చే ప్రత్యేక వాసనను ఇష్టపడతారు. ఈ మట్టి వాసనకు మూలం మొక్కలు ఉత్పత్తి చేసే పెట్రికార్ అనే నూనె. మొక్కలు ఉత్పత్తి చేసే తైలాన్ని రాళ్లు, నేల పీల్చుకుంటాయి. వర్షం పడినప్పుడు దీనిని గాలిలోకి వదులుతాయి. ఈ చిరుజల్లులు రొమాంటిక్‌గా ఉంటాయని కొందరు భావిస్తారు.

మేఘాల నుంచి పెద్ద చుక్కలుగా నీరు కిందికి పడటాన్ని వర్షం అంటారు. వాతావరణంలోని చిన్న నీటి బిందువుల మంచు కణాల సమూహమే  మేఘాలు. మబ్బులు లేదా మేఘాలు భూమిపై వర్షాలకు మూలం. వాన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడ్డ మట్టి వాసన వత్తది. మనం నిలబడ్డ చోట వాన పడి భూమిలోకెల్లి మట్టి వాసన కమ్మగా వత్తది.

వాన పడితే భూముల కెల్లి వాసన ఎక్కడి నుంచి వత్తది అని మనకు అనిపించవచ్చు. వాన పడగానే ప్రకృతి పులకరించి తన్మయత్వంతో మట్టి వాసనలు గుబాలిస్తాయి అనడంలో సత్యం ఉంది. కాంక్రీట్ జంగల్ లాగానే కాంక్రీట్ అపార్ట్‌మెంట్‌లో నివసించే వాళ్లకు ఈ మట్టి మరియు ఈ మట్టి యొక్క పరిమళం వాళ్లకు తెలువదు. మట్టి వాసనలకు దూరంగా మనుషులు మనుగడ సాగిస్తున్న రోజులను చూస్తున్నాం, వింతగా అనిపిస్తుంది. రాబోయే తరానికి మట్టి వాసన గుబాలింపులు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది అనిపిస్తుంది. మట్టిని ప్రేమించే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని కళ్ళారా చూస్తున్నాం. నాగరికత పెరిగి మనిషి ఎక్కడకు పయనిస్తున్నాడు. ఇదంతా చూస్తే బాధ కలుగుతుంది.

‘ఇంటెనుక పెరట్ల

ఊర విశ్కెలు

మంట్లె బొర్రుతయి’

వాన వచ్చే ముందర ప్రకృతిలో భాగమైన పక్షులైన ఊరవిశ్కెలు కూడా తన్మయత్వంతో ఇంటెనుక పెరట్లో మంట్లె బొర్రుతుంటాయి. దీనిని వాన రాకడకు సంకేతంగా చెప్పవచ్చు. వర్షం వచ్చిన తర్వాత వాన నీళ్లల్లో ఊర పిచ్చుకలు స్నానం చేస్తాయి. ఇవాళ ఊర పిచ్చుకలు కూడా కనిపించడం లేదు. విపరీతంగా చెట్లను నరకడం, సెల్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్‌కు గురియై పక్షులు కూడా అంతరించిపోతున్నాయి. కరోనాకు ముందు ఊర పిచ్చుకలు మాయమైనవి అనిపించింది. కరోనా కాలంలో ఊర పిచ్చుకలు మళ్లీ మన ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించడం ఆనందాన్నికల్గించే విషయం. ఊర పిచ్చుకలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

‘మొగులు మీద

ఇసుర్రవుతులు తిర్గుతున్నట్టు

గుడగుడ మొదలయితది’

వాన వచ్చే ముందర మేఘాల తాకిడికి ఉరుముల గర్జన ఎట్లా ఉంటది అంటే ఇసుర్రవుతులు తిరుగుతున్నప్పుడు వచ్చే గుడ గుడ శబ్దాన్ని పోలి ఉంటుంది. ఆ చప్పుడు వాన రాకడను తెలియజేస్తుంది.

‘అడెనుక ఈన్నుంచి అందాక

‘మెరుపులు మెరుత్తయి’

వాన వచ్చే ముందర ఆకాశంలో ఇటునుంచి అటు మరియు అటు నుంచి ఇటు అన్ని దిక్కులా వేగంగా మెరుపులు మెరుస్తాయి. మేఘాల తాకిడికి మెరుపులు మెరువక ఏం చేస్తాయి? ఆకాశమంత ఉరుములు మెరుపులతో దద్దరిల్లిపోతుంది.

‘అదు వర్దాక కుమ్ముల వెట్టినట్టు

తాయి మాయి అయిన

పానాలు తాయికి వత్తయి’

ఎండాకాలంలో బాగా వేడిగా కుంపట్లో కూర్చున్నట్టు భగ భగ మండుతున్నట్టుగా ఉంటది. కుమ్ము అంటే నిప్పు లేని మంట అని అర్థమవుతుంది. ఎండకు పోయి వచ్చినప్పుడు ఇంట్లో కూడా కుమ్ముల పెట్టినట్టు బాగా ఉడుకుతుంది. వశమైత లేదు. గాలి వత్త లేదు. మీద గాలిపంక వేడిగాలి వస్తది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా పనిచేయవు. తాయి మాయి అంటే కింది మీద అయితది. ఏది మనసున పట్టదు అని అర్థం అవుతుంది. వాన రాకడ తోనే పానాలు తేరుకున్నాయి అని తెలియజెప్పిన తీరు చక్కగా ఉంది.

‘దునియ మొత్తం సల్ల వడ్తది’

దునియా అంటే ఇక్కడ ప్రపంచం అని అర్థమవుతుంది. ఒక్క చినుకు పడితేనే ప్రపంచంలోని పుడమి అంతా పులకరించి పోతుంది. వాతావరణం సల్లవడి తేలిక అయితది. దునియా మొత్తం సల్లబడజేసే శక్తి ఒక్క వానకే ఉంది అని అర్థమవుతుంది.

‘కొట్టంల ఉన్న ఎడ్లు

‘లేశి లేశి రంకె లేత్తయి’

పల్లెలో పశువులు నివసించడానికి గృహం ఏర్పాటు చేస్తారు. పశువుల గృహాన్ని కొట్టం అంటారు. కొట్టంలో ఎడ్లను కట్టేస్తారు. వాన రాకడ తెలియగానే కొట్టంల ఉన్న ఎడ్లు లేశి లేశి రంకె  లేత్తయి. వాన రాకడ తెలిసి మూగజీవాలైన ఎడ్లు కూడా ఆనందంతో తోక ఊపుకుంటు ఎగురుతయి, గెంతుతయి, గంతులేస్తయి. పశువులైన ఎడ్లు, గట్ల ఎగురుతయా? సంబరపడతాయా? రంకె లేస్తయా? అని సందేహాలు ముసురు కొనవచ్చు. ఎలాంటి సందేహాలు అవసరం లేదు. రైతు జీవితంలో భాగమైన ఆ ఎడ్లు కూడా ఆనందంతో రంకెలు వేస్తాయి అనే నిజాన్ని వెల్లడించడం చక్కగా ఉంది.

‘నాగలికి గుర్రమెక్కినంత

సంబురమయితది’

నాగలి అనేది ఒక ముఖ్యమైన వ్యవసాయ పరికరం. వ్యవసాయదారులు దీనిని ఉపయోగించి భూమిని దున్ని పంటలు పండిస్తారు. నాగలిని మడక, హాలం అనే పేర్లతో పిలుస్తారు. రైతు జీవితంలో మమేకమైన నాగలికి వాన రాకడ తెలిసి గుర్రమెక్కినట్లు సంబురమయితది. మనుషులమైన మనకు గుర్రమెక్కి స్వారీ చేస్తే సరదాగా ఉంటుంది. చైతన్యం లేని కర్రతో తయారు చేయబడిన నాగలికి గుర్ర మెక్కినంత సంబురమయితది అంటే ఆశ్చర్యంగా తోచవచ్చు. నిజానికి వాన రాకడ తోనే రైతు వ్యవసాయ పనులు ప్రారంభిస్తాడు. వ్యవసాయదారునితో మమేకమైన నాగలి కూడా గుర్రమెక్కినంత సంతోషంగా ఉంటది అనే భావన అద్భుతంగా ఉంది.

‘మెల్లగ మీది కెల్లి కిందికి

వాన మొదలయితది’

మేఘాల నుండి మబ్బుల నుండి మెల్లెగా మీది కెల్లి కిందికి వాన మొదలయితది. వాన మొదలయితనే సమస్త జనాలకు పశు పక్ష్యాదులకు సమస్త ప్రాణి కోటికి పండుగ అని చెప్పవచ్చు.

‘అయిటి మూనుతది’

తొలకరి ప్రారంభంలో చిరుజల్లులు మొదలైతయి అని చెప్పవచ్చు. ఋతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి జల్లు అంటారు. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే మట్టి వాసన ఎంతో పరిమళభరితంగా ఉంటుంది. మరి ఆ సువాసన ఎందుకు వస్తుంది. అందులో పలు కారణాలు దాగి ఉన్నాయి. అందులో కెమిస్ట్రీ దాగి ఉంది. ఆ సువాసన విడుదలలో బ్యాక్టీరియా, మొక్కలతోపాటు ఉరుములు మెరుపుల పాత్ర కూడా ఉంటుంది. మట్టిలోని బ్యాక్టీరియా బాగా ఎండిపోయిన నేలలు తొలకరి వానలకు తడిసినప్పుడు జియోస్మిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఆ రసాయనం వల్లనే సువాసన వెలువడుతుంది. వాతావరణం మరి పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత చిరుజల్లులు పడితే కూడా ఆ మొక్కల నుంచి సువాసన వెలువడుతుంది. ఉరుములతో కూడిన వానల వల్ల కూడా అలాంటి వాసన వెలువడుతుంది. ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఎత్తున మెరుపులు వస్తాయి. పిడుగులు పడుతుంటాయి. అప్పుడు ఓజోన్ వాయువు వల్ల వాసన స్పష్టంగా వస్తుంది.

‘అవ్వ తోడు

శినుకు వడుడు ఆలిసెం

భూమిల కెల్లి

బువ్వ వాసన వత్తది’

అవ్వ తోడు అని ప్రమాణం చేసి చెప్తున్నాడు. చినుకు పడితే ప్రకృతి పులకరిస్తుంది. రైతు భూమిని పొతం చేసి పంటలు పండిస్తాడు. మట్టిలో కెల్లి పంట వాసన వత్తది. బువ్వ వాసన వత్తది అనే భావనను వెల్లడించిన తీరు అద్భుతంగా ఉంది. కవి నలిమెల భాస్కర్‌ను అభినందిస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

రచన: నరేంద్ర సందినేని


డాక్టర్ నలిమెల భాస్కర్ గారి ‘వాన వాసన’ కవితని ఇక్కడ చదవవచ్చు.

వాన వాసన
~
ఇగ తెప్పలన్ని
ఒగ దాన్ని పట్టక ఒగటి
నీల్లు తాగెతందుకు
సముద్రాలల్లకు ఉర్కుతయి
మొగులు మెత్త వడుతది
మెల్లెగ మబ్బుల వడుతది
మైసమ్మ మూలకు
మొగులు కొండోలె అయితది
గాలి యిసిరిసిరి కొడుతది
వాన శేర్లు దిగుతయి
దూరంకెల్లి వాన వాసన
కమ్మగ వత్తది
ఇంటెనుక పెరట్ల
ఊర విశ్కేలు
మంట్లె బొర్రుతయి
మొగులు మీద
ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు
గుడ గుడ మొదలయితది
అడెనుక ఈన్నుంచి అందాక
మెరుపులు మెరుత్తయి
అదువర్డాక కుమ్ముల వెట్టినట్టు
తాయి మాయి అయిన
పానాలు తాయికి వత్తయి
దునియ మొత్తం సల్ల వడ్తది
కొట్టంలో ఉన్న ఎడ్లు
లేశి లేశి రంకె లేత్తయి
నాగలికి గుర్రమెక్కినంత
సంబురమయితది
మెల్లెగా మీదికెల్లి కిందికి
వాన మొదలయితది
అయిటి మూనుతది
అవ్వ తోడు
శినుకు వడుడు ఆలిసెం
భూమిలో కెల్లి
బువ్వ వాసన వత్తది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here