[dropcap]“ఎ[/dropcap]ప్పటి వలె కాదురా! ఎప్పటి వలె కాదు రా! నా స్వామి ఎప్పటి వలె కాదురా!” అని ఆలపిస్తూ తెలుగు చిత్ర గాయనిగా ప్రవేశించి “పూజలు సేయ పూలు తెచ్చాను, నీ గుడి వాకిట నిలిచాను, తీయరా తలుపులను రామా ఈయరా దర్శనము రామా” అని రాముని వేడుకుని
ఇంత గొప్పగా పాడి కూడా అమాయకురాలిలా “నేనా? పాడనా పాటా? మీరా అన్నదీ మాటా?” అని ఆశ్చర్యమొలికించి, “నువ్వడిగింది ఏనాడయినా లేదన్నానా? నువు రమ్మంటే ఎక్కడికయినా రానన్నానా? నీ ముద్దూ ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా హయ్య?” అని కవ్వించి, “ఈ రోజు మంచి రోజు, మరపురానిది మధురమైనదీ మంచితనం ఉదయించిన రోజు!” అని ఆలపిస్తూ మంచిరోజు కోసం చూసి “ఆనతినీయరా హరా! సన్నుతి సేయగా సమ్మతి నీయరా! దొరా! సన్నిధి చేరగా” అని హరుని వేడి ఆయన సన్నిధి కేగిన ఆ స్వరం తీయతేనియలొలికించే రీతి సరాగాల నాలపించిన వాణీజయరాంది.
ఆమె 1945 నవంబర్ 30 రాయవెల్లూరు లోని సంప్రదాయ శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించారు. తల్లి పద్మావతి గాయని, వైణికురాలు కూడా! తండ్రి దొరస్వామి, ఆమె సోదరీమణులు కూడా సంగీత ప్రియులు. సినిమా పాటలకు వీరింట్లో తావు లేదు.
చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజిలో చదివారు. అర్థశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. పరీక్షలు వ్రాసి మెరిట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. కొంతకాలం హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. సంగీత కుటుంబానికే చెందిన శ్రీ జయరాంగారితో ఈమె వివాహం జరిగింది. భర్త ఉద్యోగరీత్యా బొంబాయి చేరారు.
అక్కడే ఆమె జీవితంలో సంగీత సరస్వతిగా ఎదిగే అవకాశం లభించింది. భార్యకు సంగీతం పట్ల గల జిజ్ఞాసను, ఆమె ప్రతిభా పాటవాలను గమనించారు జయరాం. ఆమె గాననైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, ప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసులు ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద శిష్యురాలిగా చేర్పించారు.
చెన్నైలో చదువుతో సమాంతరంగా కర్నాటక సంగీతాన్ని కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి, ఆర్. బాల సుబ్రమణియన్, ఆర్. యస్. మణి మొదలయిన విద్వాంసుల వద్ద అభ్యసించిన అనుభవం ఉండనే ఉంది.
ఎనిమిదేళ్ళ వయసులోనే మద్రాసు ఆకాశవాణిలో పాటలు పాడారు, కవితలు చదివారు. బాలల నాటకాలు వేసారు. కర్నాటక సంగీతంలో కచేరీలు ఇచ్చారు. బొంబాయిలో తొలి హిందుస్థానీ సంప్రదాయిక కచేరీ ఇచ్చారు. ఈమె మరాఠీ ఆల్బమ్‌ని రికార్డ్ చేసిన వసంతదేశాయ్ ఈమె ప్రతిభను గుర్తించారు. దీనితో ఈమె జీవితం మలుపు తిరిగింది.
సినిమా పాటలు వినకూడదనే నిషేధాన్ని పాటించే కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఈమెకు సినిమా పాటలు అందులోను, జాతీయస్థాయిలో పేరు తీసుకొచ్చే హిందీ సినిమారంగంలో పాటలు పాడే అవకాశం రావడం అదృష్టం కాక మరేమిటి?
1970లో ‘గుడ్డి’ హిందీ సినిమా కోసం “బోలెరే పపి హరా, పపి హరా” అనే గీతాన్ని అద్భుతంగా ఆలపించారు. ఈ తొలిపాటే ఆమెకి అయిదు అవార్డులనందించింది. ప్రముఖ హిందీ సంగీత దర్శకులు ఈమెతో చాలా హిందీ చిత్రాలలో పాటలు పాడించారు. కాని కొన్ని అనివార్య పరిస్థితులలో మద్రాసు చేరారు.
అంతేకాదు ‘అభిమానవంతులు’ చిత్రంలో ఈమె శాస్త్రీయ పద్ధతిలో ఆలపించిన “ఎప్పటివలె ఎప్పటివలె కాదురా నా స్వామి ఎప్పటివలె కాదురా!” నృత్యగీతాన్ని ప్రముఖ నర్తకీమణి శోభానాయుడి గారి పై చిత్రించడం కూడా ఒక గొప్ప విశేషమే.
ఆ తరువాత ఈమె తెలుగులో ప్రేమ, విరహ, అల్లరి, హాస్య, కవ్వింపు, తాత్విక, భక్తి గీతాలను వైవిధ్యభరితంగా తన తీయని స్వరం నుండి అలవోకగా పల్లవింపజేసి ప్రేక్షక శ్రోతలను అలరించి, తన గానామృతంతో మురిపించారు. ఈమె భక్తిపూరిత స్వరంతో ఆలపించిన వాగ్గేయ కారుల సంకీర్తనలు శ్రోతలను భక్తితో తన్మయులను చేస్తాయి.
ఆ స్వర సంపదను అవలోకిస్తే..!
పి. సుశీల గారితో కలసి ఈమె ఆలపించిన ‘ప్రేమలేఖలు’ సినిమాలోని “ఈ రోజు మంచిరోజు మరుపురానిది-మధురమైనదీ – మంచితనం ఉదయించిన రోజు – ప్రేమసుమం వికసించిన రోజు-” స్నేహం, ప్రేమల గురించిన ఈ పాటని చాలా సాత్వికంగా ఆలపించారు. ఈ పాట శ్రోతల హృదయాలను సున్నితంగా స్పర్శిస్తూ హాయిని గొలుపుతుంది.
‘అక్బర్-సలీం-అనార్కలి’ సినిమా కోసం వీరిరువురే ఆలపించిన “యవ్వనం, యవ్వనం వెల ఎరిగిన దొరవుంటే – యవ్వనం అందించుకోనా యవ్వనం అందించుకోనా?-” ప్రత్యేకత సంతరించుకుని కవ్వింతలతో గిలిగింతలు పెడుతుంది.
ఈమెకి ఆలపించిన కవ్వింపు గీతాలు ప్రేక్షకశ్రోతలను ఉత్సాహంతో ఉరకలేయిస్తాయి. బహుముఖప్రజ్ఞాశీలి శ్రీమతి భానుమతీ రామకృష్ణ గారితో కలసి రాగాలాపన చేసే అదృష్టం కూడా అమె లభించింది. మంగమ్మగారి మనవడు సినిమా కోసం ఆ విదుషీమణితో కలసి ఈమె
“శ్రీ సూర్యనారాయణా! మేలుకో! మేలుకో!- మా చిలకమ్మ ఉబలాటమూ చూసిపో! – తెల్లవారక ముందే ఇల్లంతా పరుగుల్లు – ఏమి వయ్యారమో? ఎంత విడ్డూరమో?” అన్న భానుమతి గారి ఆలాపనకు దీటుగా “చిట్టి మనవడి రాక చెవిలోన పడగానె – ఏమి జాగారమో? ఎంత సంబరమో? ఎంత సంబరమో? ముసి ముసి చీకట్లో ముసలమ్మా రాగాలూ-” అంటూ తీసిన రాగాలు, పోటా పోటీగా కొనసాగి అలనాటి సంప్రదాయ కుటుంబాల ఆప్యాయతానురాగాలను, కవ్వింపు సరదాలను గుర్తు చేస్తాయి. వాణీ జయరాంగారి సినీగీతాలలో దీనిది ఒక ప్రత్యేక చరిత్రే!
ఈమె ప్రేమగీతాలలో కొన్ని సాత్వికంగా మానసికోల్లాసాన్ని కలిగిస్తే, మరికొన్ని ఉత్సాహంగా ఉరకలేయిస్తాయి. “నీలిమేఘమ జాలి చూపుమా ఒక నిముషమాగుమా! ఈ రాతిరి నా రాజుతో నన్ను కలిపి వెళ్ళుమా” (అమ్మాయిల శపథం); “నీలగిరి చల్లన నీ వడి వెచ్చన నీ మది కోవెల అన్నది కోయిల – నీ జత నేనుంటే బ్రతుకే ఊయల నీలాల మబ్బులలో తేలి తేలి పోదామ – ఇదే ఇదేలే జీవితం – జీవితంలో వసంతం” (జీవితంలో వసంతం) పాటలు మబ్బులలో తేలిపోయే రీతి హాయి గొలుపుతాయి.
“నేనా పాడనా పాటా?–ఉడకని అన్నానికి మీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా!” అని పాడారు ‘గుప్పెడు మనసు’ సినిమా కోసం. నిజజీవితంలో ప్రతి ఇల్లాలికీ ఎదురయ్యే సమస్యగా కనిపించని సమస్యని జోడించి, సరదాలొలికిస్తూ హస్యరసస్ఫోరకంగా, సప్తస్వరాల సమ్మిళితంగా కూర్చిన యుగళ సంసారగీతం ఈమె స్వరం నుండి వెలువరించిన గీతాలలో ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది.
‘అందమైన అనుభవం’ సినిమా కోసం బాలుగారితో కలిసి “నువ్వే నువ్వమ్మ- నువ్వే నువ్వయ్య నవ్వుల రవ్వయ్య – నీ సరి ఎవరయ్య- ఒక మేఘం క్షణ క్షణమూ ఒక రూపం – ఒక శిల్పం – ఆ సరిగమలు – ఆ మధురిమలు – మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు” అంటూ ఆలపించి మనసొకటైన ప్రేమికుల సరాగాల్ని మృదు మధురంగా వెలువరించి, ఆ పాటకే వన్నె చిన్నెలు చేకూర్చి శ్రోతలను అలరించారు.
‘గుప్పెడు మనసు’ లోనే “కన్నెవలపు కన్నెల పిలుపు ఎదురు చూస్తున్నవి – ఉన్న క్షణాలు కొన్ని యుగాలై జాగు చేస్తున్నవి -తడబడు నడకలతో” పాటలో పదాలను తన స్వరంలో వంపు సొంపులు తిప్పుతూ, వేగంగా వెలయించిన తీరు అద్వితీయం.
“కురిసేను విరిజల్లులే! ఒకటయ్యేను విరితూపులే! అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకీవె శ్రీకారమే కావె” (ఘర్షణ) సుతిమెత్తగా, “నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా – ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే” (వయసు పిలిచింది) వెల్లువలా ఉప్పొంగిస్తూ వెలువడిన గీతాలు కుర్రకారు చేత గెంతులేయిస్తాయి.
‘సీతాకోక చిలక’లో “మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా! పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా! ఓ చుక్కా నవ్వవే! వేగుల చుక్కా నవ్వవే! – ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే!” పాటలోను; “నువు పట్టుచీరకడితే ఓ పుత్తడి బొమ్మా! ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగుజన్మా– ఓ పుత్తడిబొమ్మా” పాటలోను కవి కలం సృజించిన పద బంధాలకు, సంగీతకారుని స్వరరచనకు ఈమె కొత్త సొబగులను చేకూర్చి, అలవోకగా ఆలపించి ఈ పాటలను అజరామరం చేసింది.
“అటు కాలనాగు – ఇటు వేటకాడు – ఎటూదారి లేని ఒక చిన్ని లేడి – ఒక చిన్ని లేడి – చిన్నది కనుక మనసు పడింది- దారి తప్పి అది తల్లడిలింది” అంటూ ‘యవ్వనం కాటేసింది’ సినిమాలో మోసపోయిన నాయిక గురించిన వ్యథని, “విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని – ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల, విరహబాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ” అంటూ ‘మరోచరిత్ర’ సినిమాలో విరహ వేదనను బాధాతప్త స్వరంతో వెలువరిచారామె.
‘స్వాతికిరణం’లో “జాలిగా జాబిలమ్మ రేయి రేయంత — రెప్ప వెయ్యనే లేదు – ఎందుచేత ఎందుచేత – నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా-” అనే ఓదార్పు గీతాన్ని కరుణరసాత్మకంగా, విన్నవారికి బాధ కలిగే రీతిని ఆలపించారు.
కొన్ని సార్లు ఈమె “స్వర భాస్వరం” నుండి హెచ్చరింపు గీతాలు వెలువడ్డాయి. “అలాంటి లాంటమ్మిని కానూ! ఆంధ్రా పిల్లయ్యా! – ఛల్ పూవుల రంగి పేలా వంటే మర ఫిరంగి – దూరంగా నిలబడి చూడు దోషం లేదయ్యా! – చూపుల్లో దోషం వుంటే పట్టేస్తానయ్యా! – తిట్లయినా తియ్యగ వుండే తెలుగే మాదయ్యా! – నేనింకా ఆంధ్రానై వున్నాను” అని ‘47 రోజులు’ సినిమాలో అల్లరి కుర్రాళ్ళను హెచ్చరిస్తూ పాడిన పాట ఈమె స్వరం నుండి వెలువడిన నాటిలో అత్యంత భిన్నమయినది.
ఇవన్నీ ఒక ఎత్తయితే కె. విశ్వనాథ్ గారి శాస్త్రీయ సంగీత, నృత్య ప్రధాన చిత్రాలలోని పాటలు ఒక ఎత్తు. ఇవి ఆమె స్వరం నుండి అలవోకగా ఆలపించబడి, విశ్వవ్యాప్తంగా ప్రేక్షకశ్రోతలను అలరించాయి. వీటితో పాటు ఇతర దర్శకుల చిత్రాల లోని భక్తి గీతాలను కూడా తలుచుకుంటేనే ఆమె గానామృతాన్ని అధికశాతం ఆస్వాదించిన అనుభూతికి లోనవుతాం.
“పూజలు సేయ పూలు తెచ్చాను – నీ గుడి వాకిటే నిలిచానూ – తీయరా తలుపులనూ రామా!” శ్రీరాముని వేడుకుంటూ ‘పూజ’ సినిమా కోసం ఆలపించిన ఈ పాట హిందుస్థానీ సంప్రదాయ పద్ధతిలో స్వర రచన చేసారు. ఈ గీతాన్ని అనితరసాధ్యంగా ఆలపించారామె.
“నువు వస్తావని బృందావని ఆశగా పిలిచేనయ్య కృష్ణయ్యా! వేణువు విందామని నీతో వుందామని ఓ గిరిధర మురహర రాధా మనోహరా!” ‘మల్లెపూవు’ సినిమా కోసం ఆలపించిన ఈ గీతం శ్రోతల మనసులలో కూడా కన్నయ్య కోసం ఆశగా ఎదురుచూసే భావాన్ని కలిగిస్తుంది.
“శంకరాభరణం” చిత్రంలోని “మానస సంచరరే! బ్రహ్మణి మానస సంచరరే! – పరమహంసముఖచంద్ర చకోరే!” “బ్రోచే వారెవరురా? – నిను వినా రఘువరా! నను బ్రోచే వారెవరురా – ఓ చతురానానాది వందిత నీకు పరాకేలనయ్య” అని దేవుని స్తుతిస్తూనే పరాకులో ఉన్నవనే నిందాస్తుతిని వేడుకోలుగా తన స్వరం నుండి అలవోకగా భక్తి రసస్పోరకంగా ఆలపించి అలరించారు.
“స్వర్ణకమలం” సినిమా కోసం “అందెల రవమిది పదములదా – అంబరమంటిన హృదయముదా – అమృత గానమిది పెదవులదా – అమితానందపు ఎద సడిదా” అని ఎన్నో ప్రశ్నల పరంపరతో కొనసాగి – శివతాండవ వర్ణనతో ఖగోళాలు పదకింకిణులై -ఏది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా!” అని అద్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా పాట తొలి చరణంలో అలతి అలతి తేలిక పదాలతో మొదలయి – చివరికి కఠిన పదబంధాలకు నెలవైన ఈ పాటను వాణి జయరాం మాత్రమే పాడగలరనిపించారు.
“పెళ్ళి పుస్తకం” సినిమా కోసం జగనానందకారకా – జయజానకీ ప్రాణనాయకా – త్యాగరాజకృతిని; శ్రుతిలయలు సినిమా కోసం, “ఇన్ని రాశుల యునికి – కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి – ప్రేమ వేంకట పతి గలిసె ప్రియ మిథునరాశి” అన్నమాచార్య కీర్తనని ఆలపించారు.
1980లో శంకరాభరణం విడుదలయిన ఏడాదే హిందీ సినిమా ‘మీరా’లో అన్ని పాటలనూ (భజన్) పండిట్ రవిశంకర్ దర్శకత్వంలో పాడారు.
ఈ విధంగా ఉత్తర భారతదేశ హిందుస్థానీ సంప్రదాయాన్ని దక్షిణ భారతదేశ కర్నాటక శాస్త్రీయ సంప్రదాయాన్ని, ఒడిసిపట్టి వివిధ భాషలలో వైవిధ్య భరిత గీతాలను ఆలపించి సంగీత ప్రేమికులకు కానుకగా అందించారు.
“తూరుపులోన తెల తెలవారె, బంగరు వెలుగు నింగిని చేరే తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేల స్వామి” (పూజ); “తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ! – ఇల గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ! – నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం-” (స్వాతికిరణం) స్వర్ణారుణ కాంతులీనే సమయాన భువి అందచందాలను వెలయించే ఈ గీతాలు ఈమె స్వరం అంతే అందంగా శ్రోతలకు పరిమళాల్ని ఆస్వాదించేందుకు ఆహ్వానిస్తుంది.
సుతిమెత్తని ఈమె స్వరం బాలల గాత్ర సౌలభ్యానికి తగినట్లుగా ఉంటుంది. అందువల్లనే శంకరాభరాణం, స్వాతికిరణం, సీతామాలక్ష్మి మొదలయిన చిత్రాలలో బాలనటీనటుల కోసం ఈమె చేతే పాడించారు.
ఈమె తమిళచిత్రం అపూర్వ రాగంగళ్, తెలుగులో శంకరాభరణం, స్వాతికిరణం చిత్రాలకు ఉత్తమగాయనిగా జాతీయ అవార్డులు లభించాయి. ఇంకా కలైమామణి, ఫిలిం వరల్డ్ సినీహెరాల్డ్, త్యాగరాజ భాగవతార్, రేడియోమిర్చి జీవనసాఫల్య పురస్కారాలు, తొలిపాటకే తాన్‌సేన్ అవార్డు మొదలయినవి ఆమెను వరించాయి.
“ఏ పాట నేపాడనూ బ్రతుకే పాటయిన పసివాడను” (సీతామాలక్ష్మి) అని ఆమె పాడుకుని “దొరకునా ఇటు వంటి సేవా! – ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణానాదాలు – నడలూ ఎదలోని సడులే మృదంగ నాదాలు” (శంకరాభరణం) ఆలపించి; “ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది – ఎన్నటికీ మాయని మమత నాది-నీది” (పూజ) అని ఆలపించి శ్రోతలకూ ఆమె పాటలకూ ఎన్నెన్నో జన్మల బంధం అని ఋజువు చేసుకున్నారు.
దేశంలోని పలుభాషలు, వివిధ సంగీత సంప్రదాయాలు, భజన్లు, గీతగోవిందం, టుమ్రీలు, కర్నాటక శాస్త్రీయ, హిందుస్థానీ గీతాలు – సినిమాలలోనే కాదు ప్రైవేటు ఆల్బమ్‌ల కోసం కూడా ఆలపించి అందరి మన్ననలు పొందిన ఆమె గొప్పమనిషి కూడా. తన కోసం పాటలు సృజించిన కవులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు అందరికీ ధన్యవాదాలు చెప్పేవారు ఇంటర్వ్యూలలో.
కఠినమైన సంగీత రచనలు ఆమెని వరించి, స్వరంలో పల్లవించి, ప్రేక్షక శ్రోతల మదిని దోచాయి. అంతటి గొప్పమనిషిని ఫిబ్రవరి 4 వ తేదీన (ఆమె పెళ్ళిరోజు నాడే) మరణం భయంకరంగా కబళించడం – కనీసం ఆమె ముఖం మనం చూడలేక పోవడం బాధాకరం..
నిజమే! ‘విధి చేయు వింతలన్ని మతి లేని చేతలే’నని ‘పద్మభూషణ్’ వరించిన తరుణంలోనే ఆమెను ఈ లోకానికి దూరం చేసి నిరూపించుకుందా విధి.
***
Image Courtesy: Internet