Site icon Sanchika

రాజ్యసభ తొలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి వైలెట్ ఆల్వా

[dropcap]స్వ[/dropcap]తంత్ర భారత రాజ్యసభ తొలి ఉపాధ్యక్షురాలు ఆమె. భర్త మీద బ్రిటీష్ ప్రభుత్వం మోపిన రాజద్రోహ నేరానికి వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో వాదించిన తొలి మహిళా న్యాయవాది, న్యాయవాది అయినప్పటికీ తొలి రోజుల్లో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసిన గొప్ప ఉపాధ్యాయురాలు, పత్రికాధిపతి, వివిధ సంస్థలతో అనుబంధం పెంచుకుని పనిచేసిన గొప్ప నాయకురాలు, రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా కీలక నిర్ణయాలను తీసుకుని నడిపించిన గంభీరమైన మహిళ ఆమె. తను చేపట్టిన సహాయ మంత్రిగా హోమ్ శాఖకు విశిష్ట సేవలను అందించిన ఈమే వైలెట్ ఆల్వా.

1908 ఏప్రిల్ 8వ తేదీన అహమ్మదాబాద్‌లో జన్మించారు. వీరిది క్రైస్తవ సాంప్రదాయక పొటెస్టంట్ కుటుంబం. ఈమె తండ్రి రెవరెండ్ లక్ష్మణ్ హరి ఇంగ్లండ్ చర్చిలో పని చేసిన తొలినాటి పాస్టర్‌లలో ఒకరుగా పేరు పొందారు. పదహారేళ్ళ వయస్సులో ఈమె తల్లిదండ్రులు మరణించారు.

అక్కలు ప్రేమతో బాధ్యతగా ఈమెను పెంచారు. బొంబాయి లోని క్లేర్ రోడ్ కాన్వెంట్‍లో మెట్రిక్యులేషన్ చదివారు, బొంబాయిలోనే సెయింట్ జేవియర్స్ కాలేజిలో చదివారు. ప్రభుత్వ లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాని తీసుకున్నారు.

సెయింట్ జేవియర్స్ ఇండియన్ వుమెన్స్ కాలేజిలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే దేశ సామాజిక, రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు.

స్వాతంత్ర్య పోరాట పంథాను అవగాహన చేసుకున్నారు, 1937లో జోకిమ్ ఆల్వాతో ఈమె వివాహం జరిగింది. ఇద్దరూ న్యాయవాద పట్టభద్రులు, కాబట్టి అధ్యాపకవృతికి రాజీనామా చేశారు. భర్తతో కలసి న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారామె.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. జైలుకి వెళ్ళడం విశేషం కాదు, నెలల వయసున్న పసిగుడ్డుతో జైలుకి వెళ్ళడం ఈమె స్వాతంత్ర్య పోరాట పటిమను తెలియజేస్తుంది. బ్రిటిష్ పోలీసులకు, సైన్యానికి పసిబిడ్డలు, వారి తల్లులపట్ల కూడా జాలి కలగదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

1943లో ‘ఫోరమ్’ అనే పత్రికను భర్త జోకిమ్ కలసి వైలెట్, ప్రారంభించి సంపాదకత్వం వహించారు. ఆ తరువాత వైలెట్ ఆల్వా ‘భారతీయ మహిళలు’ అనే పేరుతోను బేగం అనే పేరుతోను మహిళా పత్రికను నడిపారు.

ఈమె అనేక క్రిష్టియన్ సంస్థలతో సంబంధ బాంధవ్యాలను కొనసాగించారు, యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (YWCA) కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.

న్యాయవాదులకు, వ్యాపారస్థులకు మధ్య చాలా లావాదేవీలు, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే! 1940ల నాటికి భారతదేశం లోని మహిళలు కూడా వ్యాపార రంగంలో కాలు మోపారు, బొంబాయి ఆనాటికే పెద్ద వ్యాపార కేంద్రం కాబట్టి మహిళా వ్యాపారస్థుల పాత్ర గణనీయంగా ఉండేది, వీరికి సంబంధించిన ‘బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఉమెన్స్ అసోసియేషన్’ నిర్వహణా బాధ్యతలను వైలెట్ అత్యద్భుతంగా నిర్వహించారు.

‘ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ ఉమెన్ లాయర్స్’ సంస్థలో బాధ్యతలను నిర్వహించడం ద్వారా మహిళా న్యాయవాదులతో కలసి పనిచేసే అవకాశం ఈమెకు లభించింది. ఈ విధంగా బొంబాయి లోని ప్రముఖ న్యాయవాదులతో సంబంధాలు నెలకొన్నాయి. ఈమె అందరితో స్నేహంగా మెలిగేవారు.

న్యాయవాదిగా ఈమె ప్రస్థానం అత్యున్నత స్థాయిలో కొనసాగింది. 1944వ సంవత్సరంలో బొంబాయి హైకోర్టులో భర్త జోకిమ్ మీద మోపిన దేశద్రోహనేరం కేసును వాదించి, ఆ పని చేసిన తొలి మహిళా న్యాయవాదిగా పేరు పొందారు. 1947లో బొంబాయిలో గౌరవ మేజిస్ట్రేట్‌గా విధులను నిర్వర్తించారు. 1948 నుండి 1954 వరకు ఆరేళ్ళపాటు జువైనల్ కోర్టు అధ్యక్షురాలిగా సేవలను అందించారు.

1946-47లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షురాలు ఈమె. తర్వాత రాజకీయ రంగంలో ఈమె ప్రస్థానం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగింది. ఆ రోజులలో ఈ మేధావుల సభ ఎక్కువ మంది మేధావుల నిలయంగా నిలిచింది (ప్రస్తుతం ఎగువసభ సభ్యులు ఏవిధంగా ఎంపిక చేయబడుతున్నారో జగమెరిగిన సత్యం).

1952లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సభ్యురాలి హోదాలో ఆమె అనేక విషయాలలో ప్రభుత్వానికి సూచనలు, హెచ్చరికలు చేసి తనేమిటో నిరూపించుకున్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పించాలని చెప్పేవారు.

వివిధ రంగాలలో జరిగే పరిశోధనలు ఆర్థికవ్యవస్థను అభివృద్ధి పథంలో పయనించేటందుకు దోహదం చేసాయని నొక్కి వక్కాణించేవారు.

నావికారంగాభివృద్ధి విదేశీ వ్యాపారానికి పునాది కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంలో నిర్మాణాత్మక బాధ్యతలను నిర్వహించాలని చెప్పేవారు.

ఈ సందర్భంలోనే విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన విషయాలపట్ల జాగరూకత అవసరమని సూచించేవారు.

మాతృభాషకు ప్రాముఖ్యత ఉండాలని ఈమె అభిలాష. బ్రిటీష్ కాలం నాటి ఉమ్మడి రాష్ట్రాలను విభజించి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలియజేశారు.

1957లో ద్వితీయ సార్వత్రిక ఎన్నికలలో గెలిచి హోమ్ శాఖకి సహాయమంత్రి హోదాలో దేశానికి సేవలను అందించారు. తను నమ్మిన ఆశయాలను, సిద్ధాంతాల ను అమలు చేసేటందుకు ప్రయత్నం చేశారు.

1962లో రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా చరిత్రను సృష్టించారు. పైకి సౌమ్యంగా కన్పించినా, ధృఢంగా, నిర్భయంగా నిర్ణయాలను తీసుకునేవారు. సమావేశాను హుందాగా నడిపించారు.

1969లో రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధి వైలెట్ ఆల్వాకు ఉపరాష్ట్రపతి ఎంపికకు మద్దతునివ్వలేదు. ఈమె రాజీనామా కారణం ఇదే!

రాజీనామా చేసిన తర్వాత ఐదు రోజులకు న్యూఢిల్లీలో 1969 నవంబర్ 20 వ తేదిన ‘సెరెబ్రల్ హెమరేజ్’తో మరణించారు. రాజ్యసభ అధ్యక్షలు గోపాల్ స్వరూప్ పాఠక్, ఆనాటి జనసంఘ్ నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎరాసెజియన్, ఎ.కె. గోపాలన్ మొదలయిన నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్రని, రాజ్యసభ సభ్యురాలిగా, ఉపాధ్యక్షురాలిగా; హోమ్ శాఖ సహాయమంత్రిణిగా ఆమె దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధి మహిళల కోసం కృషి చేసిన కృషిని, జాతీయ సమైక్యత కోసం ఆమె నిర్వహించిన పాత్రని గుర్తు చేసుకున్నారు. గొప్ప అంకిత భావంతో కృషి చేసిన మహిళారత్నమని శ్లాఘించారు.

ఈమె భర్త జోకిమ్ ఆల్వా కూడా న్యాయవాది, పత్రికాధిపతి, స్వాతంత్ర పోరాట యోధుడు, పార్లమెంటు సభ్యులు. భార్యభర్తలు పార్లమెంటు సభ్యులయిన తొలి జంట వీరిదే! ఇది దేశపార్లమెంటరీ చరిత్రలో ఒక రికార్డు.

వైలెట్ ఆల్వా, ఆమె భర్త జోకిమ్ ఆల్వాలు భారతదేశ పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభలో సభ్యులయిన తొలి జంట. ఆమె ఉపాధ్యక్షురాలిగా, భర్త సభ్యుడిగా సభలో పాల్గొన్నారు.

వీరిద్దరు ప్రత్యేకతను గుర్తించిన భారత తపాలాశాఖ 2008 నవంబర్ 20వ తేదీ 5 రూపాయల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది. స్టాంపులో వీరిద్దరి చిత్రాలతో పాటు వెనుక పార్లమెంటు భవనం కనపడడం విశేషం.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఈ వ్యాసం.

***

Image Courtesy: Internet

Exit mobile version