భారత అక్షరాస్యతా బోర్డు రూపశిల్పి శ్రీమతి వెల్దీ హోన్సింగర్ ఫిషర్

8
2

[dropcap]సె[/dropcap]ప్టెంబర్ 18వ తేదీ వెల్దీ ఫిషర్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

వివిధ దేశాల నుండి మన భరతభూమికి వచ్చి సేవలు చేసి పునీతులయి, భరతమాతను పునీతులను చేసిన వారెందరో! కొంతమంది బాపూజీ కోరిక మీద మన దేశానికి వచ్చి వివిధ రంగాలలో సేవలను అందించారు. వీరిలో విద్యారంగంలో సంస్కరణలకు రూపుదిద్ది విస్తృత సేవలను అందించిన మహిళామూర్తి ఒకరున్నారు. ఈనాటికీ ఆమె చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్యారంగాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. ఆమే నిండు నూరేళ్ళు జీవించి, 101 ఏట మరణించే వరకు సేవలందించిన అమెరికన్ మహిళ శ్రీమతి వెల్దీ హోన్సింగర్ ఫిషర్.

ఈమె 1879 సెప్టెంబర్ 18 వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ లో నొ రోం ప్రాంతంలో జన్మించారు.

ఈమెకు నాట్యమంటే మక్కువ. ‘ఒపెరా’ నాట్యాన్ని నేర్చుకున్నారు. అయితే ఆమె శారీరక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యులు నాట్యాభ్యసనాన్ని ఆపమని సలహా ఇచ్చారు.

1900 సంవత్సరంలో సిరక్యూస్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకున్నారు. న్యూయార్క్ లోని హేవర్‌స్ట్రా లోని రోజ్‌బడ్ కాలేజీలో అధ్యాపకురాలిలా పనిచేశారు.

1924 సంవత్సరంలో బిషప్ ఫ్రెడరిక్ బోన్ ఫిషర్‌తో ఈమె వివాహం జరిగింది. గాంధీజీతోను ఇతర జాతీయ పోరాట నాయకులతోను పరిచయాలు పెరిగాయి. 1938లో భర్త మరణించారు. ఆయన జీవితచరిత్రను వ్రాశారు.

చైనాలో విద్యావ్యాప్తి కోసం కృషి చేశారు. 1906లో నాన్ చాంగ్ లోని ‘బాల్డ్విన్ మెమోరియల్ బాలికా పాఠశాల’లో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆనాటికి చైనా, భారత్ లతో సహా చాలా ఆసియా దేశాలలో విద్యకు సరయిన అవకాశాలుండేవి కావు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చాలా విధాలుగా వెనకబడి కునారిల్లుతూ ఉండేవి. చైనా కూడా అంతే! వెల్దీ ఆ దేశ ప్రజలకు “ఛాందస భావాలు విడనాడాలి, ఆధునిక పద్ధతులను అనుసరించాలి” అని చెప్పేవారు. అంతే కాదు “మారుతున్న కాలానికి అనుగుణంగా భావజాలాన్ని మార్చుకుంటూ ఎదగాలి” అని పిలుపునిచ్చారు. 1917వరకు చైనాలో పని చేశారు.

1940ల తరువాత మెక్సికో, పెరూ, బొలీవియా, బ్రెజిల్, ఇండియా మొదలయిన దేశాలలోని విద్యావ్యవహారాలను ఆకళింపు చేసుకున్నారు. అప్పటికే చైనా ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది. ఈ వివరాలను మహిళాభివృద్ధి, చైనాలోని పారిశ్రామిక సంఘాల గురించి తన పర్యటనలలో వివరించేవారు.

1920లో మన దేశాన్ని సందర్శించారు. ఇక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, మూఢనమ్మకాలు, దురాచారాలను, పేదరికాలని గురించి అవగాహన చేసుకున్నారు. అన్ని విపత్కర పరిస్థితులకు మూలం నిరక్షరాస్యత అనీ, ఉపాధినందించే విద్య లేకపోవడమనే విషయాలని అర్థం చేసుకున్నారు.

15 డిశెంబర్ 1947లో మళ్ళీ భారతదేశ పర్యటనలో గాంధీ మహాత్ముని సందర్శించారు. ఆయన గ్రామీణ భారత పరిస్థితులను గురించి, విద్యావ్యవస్థ గురించి వివరించారు. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసేటందుకు దోహదపడే కృషి చేయమన్నారు. ఆమె కూడా తన ఆలోచనలు, విధివిధానాలను ఆయనకు వివరించి దిశానిర్దేశం చేయమని కోరారు. బాపూజీ ‘గ్రామీణ భారతంలో భారతీయ సంస్కృతీ పరిమళాలు వెదజల్లుతున్నాయని, అక్కడి ప్రజలకు సేవలనందించి విద్యావంతులుగా, సంస్కారవంతులుగా మార్చు దిశగా ప్రయత్నించమ’ని కోరారు. గ్రామాల మూలాలను గుర్తించమని, వాటి విలువలను కాపాడమని కోరారు.

ఆమె మెక్సికో, పెరూ, బొలీవియా, చైనా, మాల్దీవులు, ఫిలిప్పైన్స్ వంటి దేశాలను పర్యటించారు. ఆయా దేశాల విద్యావిధానాలను అవగాహన చేసుకున్నారు. భారత ప్రజలకు ఎటువంటి విద్యనందించాలో ఒక నిర్ణయానికి వచ్చారు. గాంధీజీ బేసిక్ విద్యా పద్దతులను, గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యా సంస్కరణలకు అనుగుణంగా నిర్వహించబడుతున్న ‘శాంతినికేతన్’ విద్యాపద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకున్నారు.

ఈలోగా 1948 జనవరి 30 వ తేదీన బాపూజీ హత్య జరిగింది. ప్రపంచం యావత్తు విస్తుపోయింది. ఈమె కూడా క్రుంగిపోయారు. ఆమె బాపూజీ కలలు నెరవేర్చాలని ఆలోచించారు.

1952లో ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ చేరుకున్నారు. అక్కడ పేరు పొందిన ‘నైనీ వ్యవసాయ క్షేత్రం’లోని కార్మికులకు వయోజన విద్యను నేర్పించే ప్రయత్నం ప్రారంభించారు. 1956లో కార్యక్షేత్రాన్ని లక్నోకి మార్చారు. అక్కడ ‘అక్షరాస్యతా భవనం’ (సాక్షరతా భవన్)ను స్థాపించారు. ఆనాటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ కే.ఎమ్.మున్షీ ఈ విషయంలో ఈమెకు సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఇక్కడ వయోజన విద్యా కార్యక్రమాలను ప్రారంభించారు. వీటికి వృత్తి విద్యాకోర్సులను సమ్మిళితం చేశారు. 25 మంది విద్యార్థులకు ఒకేసారి బోధించేటందుకు ఉపయోగపడే బోధనోపకరణముల కిట్‌ను తయారు చేశారు.

తరువాత బిజ్‌నౌర్, నీవాన్ గ్రామాలలో సుమారుగా 125 ఎకరాల భూమిని తీసుకుని రెండు వ్యవసాయ క్షేత్రాలను స్థాపించారు. ఇక్కడి యువకులకు చదువుతో పాటు ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం, పశుసంరక్షణలో నూతన విధానాలను అనుసరించడంలో శిక్షణను ఇచ్చారు.

లక్నోలోని ‘భారతదేశ అక్షరాస్యతా బోర్డు’ ఆధ్వర్యంలో పేరుపొందిన విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రతినిధులు ఇక్కడ శిక్షణను పొందడం విశేషం.

ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఫిలిఫ్ఫైన్స్, సోమాలియా, ఫిజి, శ్రీలంక మొదలయిన దేశాల నుండి ప్రతినిధులు వచ్చి ఇక్కడ శిక్షణ పొందడం అభినందనీయం.

అమెరికా నుండి ప్రముఖ తోలుబొమ్మలాట నిపుణులు బిల్, కోరాబైర్డ్‌లు ఈ సంస్థలో ‘ఎడ్యుకేషనల్ పప్పెట్రీ డిపార్ట్మెంట్’ను ఏర్పాటు చేశారు. ఈ తోలుబొమ్మలాటల ద్వారా వివిధ అంశాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ శిక్షకులను పిలిపించి ఈ తోలుబొమ్మల విభాగంలో శిక్షణను ఇస్తున్నారు.

సుమారు 20 సంవత్సరాల పాటు ఈ సంస్థకు విస్తృత సేవలను అందించారీమె. ఈ సమయంలో నాటి రాష్ట్రపతి స్వర్గీయ రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి శ్రీ గోపాల్ పాఠక్, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీలతో పాటు అనేకమంది అధికారులు, అనధికారులు ఈ సంస్థను సందర్శించి అభినందించారు.

1973లో భారత ప్రభుత్వానికి ఈ సంస్థను అప్పగించి అమెరికాకు వెళ్ళారు వెల్దీ. 1978లో భారత ప్రభుత్వం తన ఆధ్వర్యంలో ‘వయోజన విద్య’ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ స్థాయిలో శిక్షణను ఇచ్చేందుకు ‘అడల్ట్ ఎడ్యుకేషన్ ఫర్ రిసోర్స్ సెంటర్’ను స్థాపించింది. ఈ విధంగా వెల్దీ ఫిషర్ స్థాపించిన అక్షరాస్యతా ఉద్యమం ద్వారా భారత ప్రభుత్వం కార్యకలాపాలను విస్తృతం చేసింది.

‘వెల్దీ ఫిషర్ చిల్డ్రన్స్ అకాడమీ’ ఈనాటికీ నడుస్తుంది. ఈనాటి విద్యాసంస్కరణలు సర్వ శిక్ష అభియాన్ (SSA), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA), మిగిలిన అనేక సంస్కరణలు ఆమె రూపొందించిన సంస్థకు అనుబంధంగా రూపొందించిన కార్యక్రమాలే!

ఆమె ఇంకా ‘మెథడిస్ట్ ఉమన్స్ ఫారిన్ మిషనరీ’, ‘యంగ్ వుమెన్ క్రిస్టియన్ అసోసియేషన్’లలో పని చేశారు. మెథడిస్ట్ మిషన్ మ్యాగజైన్ ‘వరల్డ్ నైబర్’ని నిర్వహించారు.

1951లో ప్రపంచ విద్య, 1955లో ప్రపంచ అక్షరాస్యత సంస్థలను సన్నిహితులతో కలిసి ఏర్పాటు చేశారు. ఇవి లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థలు. రెండు సంవత్సరాల పాటు అధ్యక్ష హోదాలో తన సలహాలతో ఈ సంస్థలను నడిపారు.

ఈమె కృషికి కొన్ని పురస్కారాలు లభించాయి. 1964లో ఆసియా నోబెల్ బహుమతి అయిన రామన్ మెగసెసే అక్షరాస్యతా అవార్డు, 1978లో యునెస్కో అక్షరాస్యతా అవార్డు, 1978లో జవహర్ నెహ్రూ అక్షరాస్యతా అవార్డులను ఈమె పొందారు.

నూరేళ్ళ వయస్సులో 1980లో భారత ప్రభుత్వ అతిథిగా మన దేశ పర్యటన చేశారు. తరువాత అమెరికా వెళ్ళిన కొన్ని నెలలలోనే 101వ ఏట అమెరికాలోని కనెక్టికట్లో 1980 డిసెంబర్ 16వ తేదీన మరణించారు.

1980 మార్చి 18వ తేదీన ఈమె జ్ఞాపకార్థం 30 పైసల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు ఎడమవైపు పై భాగంలో వెల్దీ ఫిషర్ చిత్రం దీర్ఘవృత్తాకారపు చట్రంలో కనిపిస్తుంది. దిగువ భాగాన సాక్షరతా భవన్ కనిపిస్తుంది.

సెప్టెంబర్ 18 వ తేదీన వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here