[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా నదీతీరాలలో తమ నడకలో భాగంగా ఇథియోపియా లోని బ్లూ నైల్ నదీతీరాన సాగించిన తమ పర్యటన అనుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
[dropcap]ఇ[/dropcap]థియోపియా గురించి ఎప్పుడో చిన్నప్పుడు ఆఫ్రికన్ దేశమని చదివిన గుర్తు. ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటిస్తున్నప్పుడు, ఇతర ఆఫ్రికన్ దేశాలు చూసినప్పుడు ఇథియోపియా చూసే అవకాశం కలిగింది. ఇథియోపియాకి వెళ్దామని ఉగాండా నుండి బయలుదేరాము.
“ఎలా ఉంటుంది ఇక్కడ?” అని అడిగితే, “ఎందుకు వచ్చారు?” అని అడిగారు. ‘చూడడానికి’ అన్నాము. “చావడానికి వచ్చారా? వెంటనే వెళ్ళిపొండి” అన్నారు. ఆశ్చర్యపోవడం మా వంతయింది. “ఎందుకు?” అని అడిగితే, “ఇక్కడ అందరూ దొంగలే. ఎప్పుడు దోచుకుంటారో, ఎప్పుడు చంపేస్తారో తెలియదు” అన్నారు. “అయ్యబాబోయ్, అవునా!” అని ఇద్దరం అన్నాం ఆయనతో ఆశ్చర్యంగా. ఒక వారం రోజుల కొరకు చూడడానికి వచ్చామని చెప్పాను. “సరే, పర్వాలేదు. హోటల్‌లోనే వుండి తిరిగి వెళ్లండి” అని అన్నారు. అయన రాజస్థాన్ నుండి వచ్చారు.
మేము బయట ఒక టాక్సీ కొరకు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఏజన్సీలో మాట్లాడుకుందామని ఆఫీస్ వరకు వెళ్ళాము. అక్కడ ఒక స్త్రీ “మీరు వెళ్ళడానికి నేను ఎరేంజ్ చేస్తాను” అని చెప్పి మమ్మల్ని అరగంట ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోబెట్టింది. ఆమె అరేంజ్‌మెంట్ చేయడానికి పక్కకి వెళితే ఇంకొకతను వచ్చి ‘ఆమె మోసకత్తె జాగ్రత్త’ అని చెప్పాడు. ఎయిర్‌పోర్ట్‌లోనే అందరూ ఇలా ఉంటుంటే… చావడానికి వెళ్తున్నామా? అని కాసేపు అనిపించింది. అరగంట తర్వాత ఆవిడ వచ్చి మా సామాను గబగబా లాక్కెళ్ళింది. మావారు “నువ్వెందుకు ఆ అమ్మాయికి ఇచ్చావు?” అని అడిగారు. నేను “నా పర్స్ తీసుకుని వేసుకునే లోపే ఆవిడ లాక్కెళ్ళింది” అన్నాను. పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకి వెళ్ళేసరికి ఆవిడ టాక్సీ డ్రైవర్‌తో కమీషన్ మాట్లాడుకుంది. మమ్మల్ని ఆ టాక్సీలోకి ఎక్కించింది. నాకు హోటల్‌కి వెళ్ళేంతవరకు భయం భయంగానే వుంది. డ్రైవర్ తీసుకేళ్ళే రోడ్ సరైనదో కాదో తెలియదు. మేం భయంతోనూ, ఆందోళనతోనూ ఉంటే డ్రైవర్ మమ్మల్ని మా హోటల్ దగ్గర క్షేమంగా దించాడు. ఒక వంద, రెండు వందల రూపాయలు ఎక్కువ తీసుకుని ఉండచ్చు. ఇది అక్కడ మోసమని వాళ్లు చెప్పినట్టు గ్రహించాను.
రెండవ రోజు ఖచ్చితంగా హోటల్ నుంచి మాత్రమే తీసుకోవాలని అనుకున్నాము. రిస్క్ తీసుకోకుండా వుండాలని అనుకున్నాం. రిసెప్షన్‌కి వెళ్ళి లోకల్ బస్ వుందా? లేక చిన్న చిన్న మినీ బస్ లాంటివి ఉంటాయా? అని అడిగితే ఏవీ వుండవు, కొన్ని వున్నా చాలా రష్‌గా ఉంటాయి, దొంగెలెక్కువ అని చెప్పారు. పదే పదే ప్రతీ చోట ఇదే మాట వింటుంటే మరింత జాగ్రత్త తీసుకోవాలని అన్పించింది.
రెండవ రోజు సాయంత్రం ఒక హోటల్‌లో ఇథియోపియన్ భోజనం తిందామని, అక్కడి ప్రజల డాన్సులు చూడడానికి వెళ్ళాము. తెల్లటి దుస్తులు ధరించిన డాన్సర్లు – అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారో, అక్కడి పొలాలలో పాటలు ఎలా పాడుకుంటారో, వారు తినే ఆహారం ఎలా చేస్తారో – అన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అవన్నీ చూసి సాయంత్రం ఆరున్నర నుండి తొమ్మిది వరకు వారి డాన్సు, మా భోజనం అన్నీ ఆస్వాదించాము. 2000 Habesha Cultural Restaurantకి వెళ్ళాము. వారి భోజనంలో భాగంగా మాకు చేతులు కడుక్కోవడానికి ఒక పాత్రలో గోరువెచ్చటి నీళ్ళు… వెండి రంగులో ఉన్న (వెండి పాత్ర) రాజులు కడుగుకొనే విధంగా నగిషీతో వున్న పాత్రతో చేతి మీద నీళ్ళు పోస్తే, మేము చేతులు కడుక్కుని భోజనానికి ఉపక్రమించాము. సబ్జా రోటీ అనుకుంటా, రోటీ, ఇంకా చికెన్ ఆర్డర్ చేశాను. మా వారు మటన్ ఆర్డర్ చేశారు. అది బాగా ఫ్రై చేసి ఉప్పుతో తయారు చేసిన వంట. నేను తీసుకువెళ్ళిన కారంపొడి చల్లుకొని ఆ రోజుకి భోజనం కానిచ్చాం. వాళ్ళ వంట మా వారికి నచ్చింది.
రాత్రి తొమ్మిది కాగానే మేము నడుచుకుంటూ రూమ్‌కి వెళ్ళాము. ఏ బాదరబందీ లేదు.
ఇది ఆర్థోడాక్స్ చర్చ్ అనీ, Entoto Maryam Church అని పిలవబడుతుంది. ఇది ఒక హిల్-టాప్ చర్చ్. Entoto అనే ఎత్తైన పర్వతం మీద ఈ చర్చ్ ఉంది. సముద్ర మట్టానికి 3200 మీటర్లు ఎత్తులో ఉంది. ఇక్కడికి మేం వెళ్ళేసరికి వారు ప్రార్థన చేసే పొజీషన్స్‌లో వున్నారు.
ఈ రాణి గారు ఇక్కడ ఉన్న వేడి నీటి బుగ్గలలో (hot springs) స్నానం చేసి, అక్కడే తమ ఇంటిని కట్టుకున్నారు. మేము ఆ ఇంటికి వెళ్ళాము. చాలా పురాతనమైన రాజ సౌధము. మట్టి సున్నంతో కట్టిన గోడలు చాలా ఎత్తులో కట్టారు. ఆ ప్రాసాదం నుండి కిందకి చూస్తే మొత్తం అడీస్ అబాబా కనిపిస్తుంది. చాలా అందమైన స్థలంలో వీరు తమ జీవితాన్ని గడిపారు. Menelik imperial palace గా పిలుస్తారు దీన్ని. చాలా అందమైన ప్రాంతం. తర్వాత లోయలో నీళ్ళు సరిగా లేక వీరు క్రింది ప్రాంతంలో కూడా వారి స్థావరాన్ని ఏర్పరుచుకున్నారు. ఇక్కడ నుండి క్రిందకి దిగుతూ ఉంటే యూకలిప్టస్ చెట్లు కొన్ని వేలు కనబడ్డాయి. ఒక 40 ఏళ్ళ ఆడమనిషి పెద్ద పెద్ద చెట్ల కొమ్మల్ని నరికి సుమారుగా వంద కేజీల కంటే ఎక్కువైన బరువుని తలపై పెట్టుకుని కిందకి దిగుతోంది. ఆ మోపు విలువెంత అని ఆమెని ఆపి అడిగాను. 50 Pence అని చెప్పింది. రోజుకి రెండు మోపుల ధర మాత్రమే సంపాదిస్తుంది. అంటే సుమారు 50 రూపాయలు. చాలా బీద దేశం ఈ ఇథియోపియా. అన్ని కట్టెలు కొట్టి అమ్మితే వచ్చే డబ్బు అంత తక్కువని తెలిసి మనసు కలచివేసింది.
అక్కడి నుండి మేము సంతకి వెళ్ళాము. వందల మంది ఆ తెల్లటి డ్రెస్సులలో ఉన్నారు. అన్ని కూరగయలు, వస్తువులు, బట్టలు… దొరుకుతున్నాయి. కానీ మావారు అక్కడ ఆపలేదు. అక్కడి నుండి మ్యూజియంకు వెళాం. ఇందులో Lucy skeleton – లూసి అస్థిపంజరం వున్నది. ఇది 3.2 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అస్థిపంజరం, అత్యంత పురాతనమైన అస్థిపంజరం. ఎవల్యూషన్ థీరీకి సంబంధించి ఈ అస్థిపంజరమే మొట్టమొదటి అస్థిపంజరం అని Johanson అనే అతను కనుగొన్నాడు. వీరి చరిత్ర ప్రకారం అందరూ దక్షిణాప్రికా సంతతివారేనని ఋజువు చేశారు. 12 ఏళ్ళ వయస్సులో లూసి చనిపోయిందని చెప్తున్నారు.
ఎంతో ఆశ్చర్యంగా ఇది చూసి నేను చాలా అదృష్టవంతురాలిని అనుకున్నాను. 3.2 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఈ ‘లూసి’ అస్థిపంజరాన్ని చూడడానికి వేలమంది వస్తున్నారు. ఆ మ్యూజియంలోనే ఐదు గంటలు గడిపాము.
ఇక్కడ నైలు నది Lake Tana లో ఉద్భవిస్తుంది. Lake Tana విస్తీర్ణం 3,200 చదరపు కిలోమీటర్లు (1,200 చదరపు మైళ్ళు). ఇక్కడ నీరు నీలి రంగులో ఉండడం వల్ల నదిని బ్లూ నైల్ అని అంటారు. నదీ తీరంలో నడిచాము. అక్కడి నుంచి మేము bahir dar waterfalls కి వెళ్ళాము. అయితే జలపాతం దగ్గరి వరకూ మాత్రం వెళ్ళలేకపోయాం.
అక్కడ Hamar ఆదిమజాతి వారు నివసిస్తున్నారు. వీరి నివాసాలు Omo valleyలో ఉన్నాయి. ఈ ఓమో లోయలో 45000 మంది ఆదిమజాతి వారు ఉంటున్నారు. ఓమో లోయలో నివసిస్తున్న తెగల వారి ఫొటోలు తీసుకున్నాను.
తర్వాత ఆ పెళ్ళికి రమ్మని ఆహ్వానించారు. కాని వారి భోజనం తినడానికి టైమ్ లేదు. మావారు అప్పటికే గేట్ దగ్గర నిలబడి వున్నారు. అందువల్ల వారి ఆతిథ్యాన్ని స్వీకరించలేకపోయాను.