Site icon Sanchika

ఎటూ అర్థం కాని చూపు

[box type=’note’ fontsize=’16’] “ఏ లోతుల్లోంచి ఉబికి వచ్చిన ఉద్వేగభరితాలో ఎవరికి తెలుసు? ఒక్కో సముద్రాన్నీ ఈది ఈది ఒడ్డున పడ్డాక మళ్ళీ మొదలు…” అంతరంగంలోని ఉద్వేగాలను వివరిస్తున్నారు “ఎటూ అర్థం కాని  చూపు” అనే కవితలో స్వాతీ శ్రీపాద. [/box]

[dropcap]ఉ[/dropcap]న్నట్టుండి సహారా ఎడారిని మించిన
మేఘపు తునక ఒకటి గుండెల మీద ఒక ఆల్బట్రాస్ లా
వాలినప్పుడు
ఉనికీ ఊహా అయోమయం అన్నీ
ఒక మరుపు బ్లాక్‌హోల్ లోకి జారి చటుక్కున
అదృశ్యం వెనక నైరూప్య మయినప్పుడు
ఏమీ కానితనం చేతులు ముడుచుకు
వేళ్ళు నలుపుకు అసహనం రగిలి౦చినపుడు
మాటలు దొరకని క్షణాలు బొట్లుబొట్లుగా చిక్కని
చీకటి గోళాలై విస్తరిస్తూ
కాలం ఆగి ఒక నిశ్శబ్ద పవన౦ సుడిగాలి
వెంటేసుకు పోతుంది…

2.
కాస్సేపు కనుమరుగైన తలపుకే
కళవెళపడుతూ కలవరపడుతూ
రాలిన మొగ్గలు గానే నేలజారే నీటి సముద్రాలు
ఎవరికి తెలుసు ఏ లోతుల్లోంచి ఉబికి వచ్చిన
ఉద్వేగభరితాలో
ఒక్కో సముద్రాన్నీ ఈది ఈది ఒడ్డున పడ్డాక
మళ్ళీ మొదలు …

౩.
గిర్రుగిర్రున తిరిగే రంగుల రాట్నం లో
ఎవరెప్పుడు కిందో ఎవరుపైనో
ఎవరు అహంకారం ఉన్మత్త మదపుటేనుగు పైనో
ఎవరు సమతల సుషుప్త నదీ ఉపరితలమో
దిగినప్పుడు కదా తెలిసేది
చేరిపేసుకు౦టే మలిగిపోయేది కాదుకదా
మనసు వెనకాల కుప్పలు కుప్పలుగా రాలిన నుసి

4.
ఒక్కటి మాత్రం నిజం
గొప్ప గొప్ప సంస్కృతి ఆనవాళ్ళు ఇప్పుడున్నవి
శిధిలాల గుప్పిట్లో
అహం సంస్కృతీ ఆనవాళ్ళకు
రేపు ఎక్కడ?

స్వాతీ శ్రీపాద

Exit mobile version