Site icon Sanchika

ఎవడు వాడు

[box type=’note’ fontsize=’16’] “నీకేమీ కాడు అసలేమీ ఇవ్వడు, ఉన్నాడో లేడో నీ మనసుని అడిగి చూడు” అని చెప్పి, “అడుగడుగునా వాడు అణువణునా వాడు” అంటున్నారు సి.వి.ఎస్. సందీప్ ఈ కవితలో. [/box]

ఎవడువాడెవడువాడెవడువాడు
అని అడుగువారెవరికీ తెలియరాడు
ఇందుగలడందులేడనుకున్న వాడు
ఎందెందు వెదకినా జాడలేడు

తండ్రికాడే వాడు బ్రతకటం నేర్పడు
ఓడిపోయేవేళ నీ వెన్నుతట్టడు

తల్లిలా ఏనాడు నీ కడుపు నింపడు
తల్లడిల్లే వేళ తోడుగా నిలవడు

అనుజుడైనా కాడు నీకండ నిలవడు
ఆత్మీయుడు కాడు ఓదార్పునీయడు

నీకేమీ కాడు అసలేమీ ఇవ్వడు
ఉన్నాడో లేడో నీ మనసుని అడిగి చూడు

ఎవడువాడెవడువాడెవడువాడు
ఈ ప్రశ్నలన్నీ అడిగేది ఎవడు
ఎందెందు వెదకినా కానరాడు
ఓసారి నీలోనూ వెతికి చూడు

బ్రతుకునిచ్చింది ఎవడు బ్రతకనిచ్చింది ఎవడు
పడిపోయినా  నిను లేపి నడిపింది ఎవడు

దారి చూపింది ఎవడు ధైర్యమిచ్చింది ఎవడు
కడదాక నీ వెనుక నిలిచేది ఎవడు

అడుగడుగునా వాడు అణువణునా వాడు
అన్నిటా అంతటా ఉన్నాడు వాడు
పిలిచినా పలకడు వెతికినా దొరకడు
ఈశ్వరుడు శంకరుడు భైరవుడు శివుడు

Exit mobile version