[dropcap]పె[/dropcap]ళ్లివారిల్లు రక్తసంబంధీకులతో, బంధువులతో, స్నేహితులతో, శ్రేయోభిలాషులతో, పిల్లల కేరింతలతో, పెద్దల పలకరింపులతో, పెద్ద పండగ వాతావరణంతో కళకళ లాడుతోంది. వివిధ ప్రాంతాలనుండి ఇంకా బంధువులు దిగుతూనే వున్నారు. దగ్గరలో వున్న రెండు రైల్వే స్టేషన్లకీ, బస్సు స్టాండ్‌కూ, మూడు కార్లు అదే పనిగా తిరుగుతున్నాయి. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పెళ్లింటి వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా రవాణా సౌకర్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. వచ్చేవాళ్ళు వస్తుంటే, స్నానాలు చేసేవాళ్ళు కొందరు, టిఫిన్లకు సిద్ధపడేవాళ్లు కొందరు, తయారుకావడానికి అద్దం ముందు క్యూలు కట్టేవాళ్ళు మరికొందరు, ఇలా అక్కడ సందడి.. సందడిగా వుంది.
ఇంటి పెద్దలు అతిథులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ వారి అవసరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రయాణం సంగతులు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. రాకపోకలకు సిద్ధం చేసిన వాహనాలు సకాలంలో అందుబాటులోనికి వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి కొందరు పెద్దలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే వున్నారు.
ఆ ఇంట్లో పెళ్లి ఆదర్శ వివాహం. అది కూడా రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ పెళ్లి. అమెరికాలో వుంటున్న పెళ్ళికొడుకు అనవసర ఆడంబరాలు వద్దని, పెళ్లి చాలా సింపుల్‌గా, రిజిస్టర్ ఆఫీసులో జరగాలని కండీషన్ పెట్టాడు. పరిస్థితిని బట్టి అతగాడు ఒక పట్టాన పట్టినపట్టు విడవడని తెలిసాక, పెళ్లికూతురు తరపు వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. అతికష్టంమీద పెళ్ళికొడుకుని ఒప్పించడంతో పెళ్ళైన తర్వాత ఇంటిదగ్గరే అతి సాధారణ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇరుపక్షాల నుంచి యాభయి మందికి మించి అతిథులు (బంధువులు) ఉండకూడదనే ఒక ఒప్పందాన్ని ఇరుపక్షాలూ సంతోషంగా అంగీకరించాయి. దానికి అనుగుణంగానే ఆహ్వానాలూ వెళ్లాయి.
పెళ్లి రోజు రానే వచ్చింది. అతి సమీప బంధువు జిల్లా అధికారి కాబట్టి, ఆయన సహకారంతో, రిజిస్టార్ ఆఫీసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అతితక్కువ మంది బంధువుల సమక్షంలో పెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా జరిగిపోయింది.
ఇక ముందు జరగబోయే కథ, పెళ్ళికొడుకు – పెళ్లికూతురుకు గాని వారి తల్లిదండ్రులకు గాని సంబంధించింది కాదు. పెళ్ళికొడుకు మేనమామ, కుటుంబానికి సంబందించినది. పిలిచిన ఆహ్వానితులు మాదిరిగానే, ‘వాళ్ళూ’, రిసెప్షన్ సమయానికి పెళ్లింటికి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ ఎలాంటి వేడుకలకు ఆ ఇంటికి వచ్చినా, పెళ్ళికొడుకు మేనత్త ఏదో సమస్య సృష్టిస్తుంది. అందుకే ఆమె అంటే.. ఇంట్లో అందరూ అప్రమత్తంగా వుంటారు, ఎప్పుడు ఎలాంటి సమస్య సృష్టిస్తుందో అని.
రిసెప్షన్ పెళ్లింటి మిద్దె మీద జరుగుతోంది. అందరి మాదిరిగానే పెళ్ళికొడుకు మేనమామ చిన్నయ్య కుటుంబం కూడా పైకి వెళ్ళింది. చిన్నయ్య తన మొబైల్ ఇంటి హాల్‌లో ఛార్జింగ్‌కి పెట్టి రిసెప్షన్ స్థలం మిద్దె మీదికి వెళ్ళాడు.
కొందరు పెద్దల ఆశీర్వచనాలు ముగిసిన తర్వాత నూతన వధూవరులను పెళ్ళికి వచ్చిన బంధువర్గం నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించిన తర్వాత చక్కని విందు ప్రారంభమై అందరూ ఆనందంగా గడిపారు. పెళ్ళికొడుకు మేనమామ చిన్నయ్య, మేనత్త సావిత్రి కూడా సంతోషంగా అందరితో కలిసి గడిపారు. కొందరు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే, మరికొందరు వెళ్లిపోగా మిగతావాళ్ళు అక్కడే రిసెప్షన్ వేదిక దగ్గర సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
‘అంతా ఆనందంగా జరిగిపోయింది’ అనుకుంటున్న సమయంలో, క్రిందికి వెళ్లిన చిన్నయ్య దిగాలు ముఖంతో ముఖం వేళ్ళాడేసుకుని పైకి వచ్చాడు. అప్పుడు అందరి దృష్టి అతడి వైపు మళ్లింది. విషయం తెలిసి అతనివైపు అందరూ సానుభూతిగా చూడడం మొదలు పెట్టారు. విషయం ఏమిటంటే ఛార్జింగ్‌కు పెట్టిన అతని మొబైల్ మాయమై, ఛార్జర్ మాత్రం వేళ్ళాడుతూ కనిపించింది. విషయం తెలిసి భార్య అనరాని మాటలతో దెప్పి పొడిచింది. తల్లి ఎప్పటి మాదిరిగానే “వీడి బ్రతుకు ఎప్పుడూ ఇంతే..” అని అక్షింతలు వేసింది.
అప్పటివరకూ వున్న అతని లోని సంతోషం కాస్తా ఆవిరి అయిపొయింది. తన దురదృష్టానికి తనని తానే మనసులో తిట్టుకున్నాడు. అతనికొచ్చే కొద్దీ జీతం నుండి ఇప్పట్లో మళ్ళీ మొబైల్ కొనుక్కునే అవకాశం లేదు. ‘మళ్ళీ మొబైల్ ఎలా సంపాదించాలా?’ అన్న దిగులు మొదలైంది.
***
సావిత్రి, చిన్నయ్య స్వగృహానికి వచ్చేసారు. పుట్టింటి నుండి పిలుపు రావడంతో మరునాడు పిల్లల్ని, భర్తను వదలి, పాలకొల్లు బయలుదేరింది సావిత్రి. చిన్నయ్య కాలకృత్యాలు తీర్చుకుని, స్నానపానాదులు ముగించుకుని పిల్లలు వడ్డించిన ఉప్మా తిని, ప్రయాణం కోసం బట్టలు సర్దిన సూట్ కేస్ తెరిచి తన ఇస్త్రీ చొక్కా ఒకటి తీసుకున్నాడు. చొక్కా మడత విప్పగానే, క్రింద ఏదో పడిన శబ్దం చిన్నయ్యకు వినిపించింది. వెంటనే అతని దృష్టి నేలమీదకు మళ్లింది. ఆశ్చర్యంగా, ఊహించని విధంగా, అది పోగొట్టుకున్నాననుకున్న అతని ‘మొబైల్!’. ఆత్రంగా దానిని చేతిలోకి తీసుకున్నాడు చిన్నయ్య.
మొబైల్ దొరికిందన్న సంతోషానికి బదులు, కోపంతో అతని ముఖం ఎర్రబడింది!!