Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-10: ఎవరిగోల వాళ్ళదే…

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య మా చుట్టాలందరితోనూ శిఖరాగ్ర సమావేశం జరిగింది. విషయం కూడా అంత గొప్పదే మరి… గొప్ప కాక మరేంటీ… మా అక్క తోడికోడలి తమ్ముడి మరదలి తోడికోడలికి టీవీలో కనిపించే ఛాన్స్ వచ్చింది. తనకి తెలిసున్న వాళ్ళెవరో ఏదో చానల్లో ఉన్నారుట, అందుకని ఏదైనా కొత్తరకం వంట చేస్తావా, టీవీలో చూపిస్తాను అందిట. ఇంక చూస్కోండీ… అలా మా చుట్టానికి అదే గిరిజకి లెండి టివీలో కనిపించే ఛాన్స్ వచ్చిందని ఫోన్ల ద్వారానూ, వాట్సప్‌ల ద్వారానూ, మెసేజ్‌ల ద్వారానూ దాదాపు జనాభాలో సగం మందికి తెల్సిపోయింది.

“మా ఆయనొప్పుకోరు కానీ నేనెప్పుడో కనిపిద్దును టీవీలో… నీకెందుకే కాంతం అవన్నీ, అందరి కళ్ళూ నీమీదే, దిష్టి పెట్టేస్తారూ… అంటారు. అందుకనే నేనసలు ఆ మాటే ఎత్తలేదు..” విషయం తెలీగానే మా సూర్యకాంతం పిన్ని రియాక్షన్ అది.

“ఓయబ్బో, పెద్ద అందగత్తెనీ… ఆ అందం వాళ్ళాయనే మెచ్చుకోవాలి. ఈవిడ ఆ టివీలో ఎక్కడ డాన్సులాడేస్తుందోనని వాళ్ళాయన భయం. స్టేజీ విరిగిపోతే నామోషీకాదూ!” ఆ రియాక్షన్ మీద మాణిక్యమ్మక్కయ్య విసురులు.

“అయినా దేనికైనా పెట్టిపుట్టాలి. నా చేత్తో పోపేస్తే దాని ఘాటు పది ఊళ్ళదాకా వెడుతుంది. మీ బాబాయికి ఇవన్నీ నచ్చవు కానీ లేపోతేనా… రోజుకోటి చొప్పున ఓ వంద వంటకాలు ఎడంచేత్తో చేసి అవతల పడేద్దును…” సుందరంపిన్ని సన్నాయినొక్కులు.

“ఎంతదృష్టం, ఎంతదృష్టం… ఎంచక్కా కంచిపట్టు చీర కట్టుకుని, పెళ్ళికూతురిలాగా  మోచేతులదాకా గోరింటాకు పెట్టుకుని, లైట్లలో ధగధగా మెరిసేలా రాళ్ళగాజులు వేసుకుని, కొత్తరకం చోకర్ సెట్ మెడలో పెట్టుకుని, అయిదువేళ్ళలోనూ తొమ్మిది వేళ్ళకీ ఉంగరాలు పెట్టుకుని, విరబోసుకున్న జుట్టుకి క్లిప్‌తో ఇంతపొడుగు పూలమాల వేళ్ళాడేసుకుని, అలవాటులేని హైహీల్స్‌తో పడకుండా నడుచుకుంటూ వచ్చి, వంట చెయ్యడమంటే మాటలా… ఏ జన్మలోనో పుణ్యం చెసుకున్నవాళ్ళకే ఇలాంటి అదృష్టం…” ఎప్పుడూ తన దురదృష్టాన్ని తల్చుకుంటూ వాపోయే సత్యవతి గట్టిగానే నిట్టూర్చింది.

ఇంతమంది ఇన్నిరకాలుగా స్పందించినా శిఖరాగ్ర సమావేశానికి మటుకు ఒక్కరూ మానకుండా అందరూ హాజరయ్యేరు.

కథానాయిక గిరిజ అందరిముందూ పెట్టిన మొట్టమొదటి సందేహం “ఏం వంట చెయ్యాలీ” అన్నది. సాంప్రదాయ వంటలు ఇప్పటికే చాలామంది చేసేసేరు. ఆరోగ్యానికి సంబంధించినవీ, డయిట్ చేసేవాళ్ళు తినాల్సినవీ కూడా చెప్పడం అయిపోయింది. నేనేమో ఇంకేం వంటలున్నాయా అని అతి తీవ్రంగా అలోచిస్తుంటే వందన విషయం మార్చేసి, “ఒసే, గిరిజా, నువ్వు నా బ్యూటీ పార్లర్‌కే రావే.. ఎంచక్కా నీ మొహవే కాకుండా నీ చేతులకి కూడా బాగా కోటింగ్ ఇచ్చేస్తాను. వంట చేసేటప్పుడు చేతులు  బాగా చూపిస్తారుకదా! మెరిసిపోయేలా చేస్తాను..” అంటూ తన బిజినెస్ ప్రమోట్ చేసేసుకుంది.

ఇది చూసిన నిర్మల “అవునే, నిజం బంగారం వీడియోలో అస్సలు మెరవదు. నా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ కొత్త వెరైటీలు వచ్చేయి. నీకోసం పక్కకి పెట్టి ఉంచేను. మోచేతుల్దాకా వుండే గాజుల సెట్ నిన్ననే కొత్తగా వచ్చింది. దాంతో పాటు అయిదువేళ్ళకీ ఉంగరాలతో ఉండే గొలుసులు కూడా వచ్చేయి. ఎంతో అవదులే. నువ్వు పనికట్టుకు రానక్కర్లేదు కూడానూ,  మీ ఇంటికి తెచ్చిచ్చేస్తాను.” అంటూ తన బిజినెస్ మాత్రం తక్కువా అన్నట్టు మాట్లాడింది.

“ఇదిగో గిరిజా, ఒక్క షో కోసం ఇప్పుడు కొత్త చీర ఏం కొంటావు కానీ, నా దగ్గర మొన్న మా తమ్ముడి పెళ్ళిలో కట్టుకున్న డిజైనర్ శారీ ఉంది. అది కట్టుకో.. అందులో కుందన్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో…” రాజ్యం అక్కయ్య విలువైన సలహా ఇచ్చింది.

అవును కదా అనుకునేంతలోనే పద్మం వదిన “ఔనౌను, శారీకి డబ్బులు తగలెయ్యొద్దు… రాజ్యం చెప్పింది బాగుంది. అంతేకాదు, దానికి తగ్గ మంచి డిజైనర్ బ్లౌజ్ నా బొటెక్‌లో నీకోసం స్పెషల్‌గా కుట్టిస్తాను. నీ దగ్గర అందర్లాగా తీసుకుంటానా ఏంటీ… తక్కువ చేసే ఇస్తాలే…” అని  ఉదారంగా ముందుకొచ్చింది.

“ఇంతకీ అది వంట చెయ్యడానికి వెడుతోందా లేకపొతే చీరలు చూపించుకుందుకు వెడుతోందర్రా… మీ మాయదారి మెరుపులు బంగారంగానూ, ముందు అది ఏం చేస్తుందో దాన్నిశుచిగా, శుభ్రంగా చెయ్యమనండి” ఓ మూలనుంచి మా మామ్మ సణుక్కుంటోంది.

ఇంతలో ఇంకో మూలనించి సరోజ కెవ్వుమంటూ అరిచింది. అందరం హడిలిపోయి అటు చూసేం. “గిరిజొదినా, నువ్వు ఏ రకం చేస్తావో చెప్పు, దానికి తగ్గ అయిడియాలు నేనిస్తాను. అంటే సాంప్రదాయ వంట చేసేవనుకో… తొమ్మిదిగజాల చీర కచ్చాపోసి ఎలా కట్టుకోవాలో చెప్తాను. ఏ రాష్ట్రంది చేస్తుంటే ఆ రాష్ట్రం చీరకట్టుతో బాగుంటుంది. హెయిర్ స్టయిల్ కూడా దానికి తగ్గట్టుండాలి. మా ఫ్రెండ్ ఉందిలే స్పెషలిస్ట్. తనని పిలుస్తాను. వెస్టర్న్ చేస్తానంటావా.. దానికి సరిపడా డ్రెస్ కూడా ఉంది నా దగ్గర…” కాస్తాగి ఆయాసం తీర్చుకుంది సరోజ.

“అవునవును. ఈ మధ్య వెస్టర్న్ డిషెస్ ఎక్కువ లైక్ చేస్తున్నారందరూ. పాస్తాలూ, పిజ్జాలూ, మఫిన్సూ, సబ్‌వే సాండ్విచ్‌లూ లాంటివి చెయ్యి.. నీక్కావాలంటే అమెరికాలోనూ, జర్మనీలోనూ, ఇటలీలోనూ ఉన్న మనవాళ్ల దగ్గర్నించి రెసిపీలు తెప్పిస్తాను…” అసలు ఇండియాలోవన్నీ చెత్తే, బైటవన్నీ గొప్పవే, తన చుట్టాలందరూ అందుకే బైట దేశాల్లో ఉన్నారూ అని చెప్పుకునే వనజ ముందుకొచ్చింది.

“మళ్ళీ వెస్టర్న్ అన్నావంటే నేనొప్పుకోను గిరిజా… ఏం మన దేశమేవైనా గొడ్డోయిందా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లోనే గొప్ప గొప్ప వంటలున్నాయి. అసలు ఇంత వైవిధ్యం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా! ఏవైనా సరే, నువ్వు మన వంటల్లోనే ఏదోకటి చెయ్యాల్సిందే…” గట్టిగా వార్నింగిచ్చేసింది దేశాన్ని ప్రేమించే నీరజక్కయ్య.

పాపం గిరిజ. ఎవర్నీ కాదనలేదు, అలాగని అందర్నీ ఒప్పుకోనూలేదు. మొత్తానికి కిందామీదా పడి, ఎలాగైతేనేం గిరిజ షో చేసింది. ఆ షో టెలికాస్ట్ అయిన వెంటనే అందరి రియాక్షనూ ఇదిగో ఇలా ఉంది.

“ఉట్టినే బొమ్మలాగా నిలబడి వంట చేసింది. ఒక్క స్టెప్పైనా వెయ్యకపోతే చూడ్డానికి ఇంటరెస్టేం వుంటుందీ..!”..సూర్యకాంతం పిన్ని.

“అయినా అది పెట్టిన పోపులో ఘాటే లేదూ!” సుందరం పిన్ని.

“అదెప్పుడూ అదృష్టవంతురాలే… హూ… దేనికైనా పెట్టిపుట్టాలి…” సత్యవతమ్మ.

“గిరిజ మొహం, చేతులూ ఎంత మృదువుగా కనిపిస్తున్నాయో చూసేరా! నేనే చేసాను మా బ్యూటీపార్లర్‌లో…” వందన.

“గిరిజ పిండి కలుపుతుంటే ఆ చేతివేళ్ళ ఉంగరాలు ఎంత బాగా మెరిసాయో… నాషాప్ లోనే కొందికదా!” నిర్మల.

“ఆ చీర చూడండి ఎంత మెరిసిపోతోందో… మా తమ్ముడి అత్తారు పెట్టిందే…” రాజ్యం అక్కయ్య.

“ఆ బ్లౌజ్ డిజైన్ బాహుబలిలో తమన్నా వేసుకున్నలాంటిది. నేనే డిజైన్ చేసేను…” పద్మం వదిన.

“వెస్టర్న్ డిష్ ఏదైనా చేస్తే బాగుండును. ఎంచక్కా ఆ డ్రెస్సులూ, డిషెసూ ఎంత బాగుంటాయో…” సరోజ, వనజ.

“మన దేశం పరువు నిలబెట్టింది…” నీరజక్కయ్య.

అందరి కామెంట్లూ ఫాలో అవుతున్న నాకు ఏం కామెంటాలో తెలీలేదు. మీరైనా కాస్త చెప్పండీ, ప్లీజ్.

Exit mobile version