[dropcap]ఎ[/dropcap]వరికోసమో నీవు
నీకోసమే నేను
గమ్యమెరుగని నీవు
నీవే గమ్యమైన నేను
నీవు వెదుకుతున్నావు
నేను నీ వెనుకే ఉన్నాను
మనసెరిగిన నిరాశ నీది
మనసిరిగినా….. ఆశ నాది
కలత చెందిన కన్నీరు నీది
కన్నీరు నిండిన కన్ను నాది
స్పందన లేని హృదయం నీది
హృదయం లేని స్పందన నాది
నీకు బ్రతుకు శాపం
అదే నా జీవితానికి లోపం
ఒకటే దారి ఇద్దరిదీ
ఒక్కటయ్యే దారేదీ?
నీవు పంతం వదలవు
నేను ప్రేమ నొదలను
ఆట ఆడిందెవరు?
ఆడి ఓడేదెవరు?
గెలుపోటముల కారణమెవరు?
ఎవరో తెలియని నీవు
నీవని తెలిసినా నిస్సహాయంగా నేను
ఆడి అలిసేది నీవు
ఓడి నిలిచేది నేను
అదిగదిగో ప్రియతమా!
మనిద్దరి ఆట చూసి
దేవుడు నవ్వుతున్నాడు