[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఈ[/dropcap] మధ్య ఎక్కడ చూసినా వ్యక్తిత్వ వికాస శిక్షణలే. మన వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకుందుకు అసలందులో ఏమి చెపుతారోననే కుతూహలం కలిగింది నాకు. అందుకే ఆ శిక్షణకి వెడుతున్న మా పక్క ఫ్లాట్ అమ్మాయిని “అక్కడేం చెపుతారూ!” అనడిగేను. అలా అడిగినందుకు నన్నో వింత జంతువుని చూసినట్టు చూసిందా అమ్మాయి. మళ్ళీ అంతలోనే అమాయకంగా పెట్టిన నా మొహాన్ని చూసి, “మనల్ని మనం విజయం వైపు ఎలా నడిపించుకోవాలో చెప్తారాంటీ..” అంది.
“అంటే..” అన్నాను అర్థం కాక. ఎందుకంటే ప్రస్తుతం నేను విజయం సాధించాల్సిన యుధ్ధాలేవీ లేవు మరి..
“అంటే, మన మైండ్‌ని మనం ప్రిపేర్ చేసుకోవడం. అంటే చేసే పని కష్టంగా అనుకోకుండా ఇష్టంగా చేసుకోవడం.. అంటే చదువుకోవడమన్నది కష్టం అనుకుంటే మనం బాగా చదవలేం. అదే ఇష్టంగా అనుకుని చదివితే మనసుపెట్టి చదవగలం.. అలాగన్న మాట..”
నేను మళ్ళీ “అంటే..” అని అడగకుండా చక్కగా వివరంగా చెప్పిందా అమ్మాయి. కానీ నా సందేహం మటుకు తీరలేదు.
“మరలాగయితే… మనకి కాకరకాయకూర తింటూంటే చేదుగా వుండి, తినడానికి కష్టంగా వుంటుంది కదా, అదే కూర ఇష్టంగా తింటే తియ్యగా వుంటుందా!”
నేనా ప్రశ్న అడగగానే ఆ అమ్మాయి “నాకు కాలేజికి టైమయిపోయిందాంటీ..” అంటూ వెళ్ళిపోయింది.
కానీ నా సందేహం మటుకు తీరలేదు. ఏదైనా మనకి కష్టంగా వుంటే దాన్ని ఇష్టం చేసుకోవడమెలా అన్నదాని మీద నాకు నేనే ఉదాహరణలిచ్చుకుంటూ తీవ్రంగా ఆలోచించేసేను.
నాకు కష్టమైనవి యేమున్నాయా అనుకుంటుంటే వెంఠనే గుర్తొచ్చేసింది.. నాకు పనిగండం వున్న సంగతి. నాకీ పనిగండం వల్ల ఏ పని చెయ్యాలన్నా పదిసార్లు ఆలోచిస్తాను. ఇది నన్ను చాలా కష్టాల్లో పెట్టేస్తోంది.
పావుకిలో కూర తరిగితే వేళ్ళు నెప్పి పెట్టేసినట్టూ, స్టౌవ్ మీదున్న కూరని రెండుసార్లు కలిపితే చెయ్యి లాగేస్తున్నట్టూ, ఏదైనా ఎండపెట్టడానికి మెట్లెక్కి డాబా మీదకెడితే మోకాళ్ళనెప్పి వచ్చేసినట్టూ ఫీలైపోతుంటాను.
“ఈ పని చేస్తే నాకు చెయ్యినెప్పి రాదుకదా, అక్కడదాకా నడిస్తే కాలునెప్పి రాదుకదా అసలే పనిగండమాయె, ఎంత కష్టం” అనుకుంటూ వుంటాను.
ఇప్పుడీ అమ్మాయి మాట విన్నాక అలా కష్టం అనుకున్నప్పుడల్లా దానిని ఇష్టం అనుకుంటే ఆ పని బాగా అయిపోతుందికదా అనిపించింది.
హమ్మయ్య.. నా వ్యక్తిత్వం వికసించడానికి ఒక మార్గం దొరికింది. మర్నాటినుంచే దానిని అమలులో పెడదామని నిర్ణయించుకున్నాను.
నా నిర్ణయానికి సహకరిస్తున్నట్టు మర్నాడు పొద్దున్నే పనమ్మాయి రాలేదు. ఇది నాకు పరీక్షలాంటిదే. ఇదివరకు ఎప్పుడైనా పనమ్మాయి రాకపోతే అసలే పనిగండం వుందనే భయంతో ఆ పక్కవాళ్లకీ, ఈ పక్కవాళ్లకీ ఫోన్లు చేసి, ఆ పూటకి వాళ్ళ మనిషిని పంపించమని బతిమాలేదాన్ని. ఆ ఒక్కపూటకీ దానికి బోల్డు డబ్బిచ్చేదాన్ని. కానీ, ఇప్పుడు నేను వ్యక్తిత్వ వికాస శిక్షణలో వున్నాను కదా! అందుకే ఎవరికీ ఫోన్లు చెయ్యలేదు. మనింట్లో పని మనం చేసుకోవడంలో ఎంత ఆనందముందీ అనుకుంటూ ఇష్టంగా పని చేసేసుకోవడం మొదలెట్టేను.
“ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా” అనుకుంటూ నడుం వంచి వీధిగుమ్మం దగ్గర తుడిచి, చుక్కలముగ్గు వేసేను. ఎంత బాగుందీ ముగ్గూ, ఆ పనమ్మాయి ఏంటో రెండుగీతలు గీసి పడేస్తుంది, నేనివాళ ఎంచక్కా చుక్కలముగ్గు వేసుకున్నాను. ఇంటి ముందు ఎంత కళగా వుందో అని నన్ను నేను మెచ్చేసుకున్నాను. లేవబోతుంటే నడుం దగ్గర కలుక్కుమంది. “అమ్మో..” అనబోయి ఆపుకున్నాను. ఇష్టంగా చేస్తున్నానుకదా.. అందుకని గుండెలోని బరువుని గొంతులోకి మింగేసి ఇంట్లోకొచ్చేను.
సింక్ నిండా గిన్నెలు మా సంగతేమిటన్నట్లున్నాయి. “హూ.. మీరో లెక్కా నా ఇష్టం ముందు..” అనుకుంటూ వాటి పని పట్టేను. ఎంచక్క, గిన్నెలన్నీ తళతళా మెరిసిపోతున్నాయి.. అదేంటో ఆ పనమ్మాయి తోమినప్పుడు ఎప్పుడూ గిన్నెలు ఇలా మెరవలేదు అనుకుని మురిసిపోయేను. అంతే. అవన్నీ బోర్లించేటప్పటికి నా చేతులు మండడం మొదలెట్టేయి. హారి దేవుడా అనుకుంటూ గబగబా ఆ చేతులకింత కొబ్బరినూని పట్టించేసుకుని కూర్చున్నాను. ఇదేంటీ, ఇష్టంగా చేసుకుంటుంటే కూడా ఇంత కష్టంగా వుందీ అనుకుంటుంటేనే కడుపులో ఆత్మారాముడు గోలపెట్టడం మొదలెట్టేడు.
ఏ పని తప్పినా సాపాటు తప్పదుకదా అనుకుంటూ పొద్దుట్నించీ పడ్ద ఇష్టమైన కష్టాన్ని మరీ మరీ గుర్తు చేసుకుని బాధపడిపోయేను. అబ్బే, ఇలా బాధపడితే నా వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎప్పటికి పూర్తయేనూ అనుకుంటూ, కూరలు తరగడం మొదలెట్టేను. అయినా నా మనసు ఇది కష్టమనే చెపుతోంది. ఏం చెయ్యాలీ అని ఆలోచిస్తే ఉదయం ముగ్గేస్తున్నప్పుడు పాట పాడుతూ పని చేస్తే కష్టంగా లేదనిపించి, అలాగే పాడుకుంటూ కూరలు తరగడం మొదలెట్టేను.
“రాగాలా సరాగాలా హాసాలా విలాసాల సాగే సంసారం..హాఆఆయ్ సుఖజీవన సారం..”
పాటలోనూ, పనిలోనూ పూర్తిగా లీనమైపోయేను. నాకు తెలీకుండానే శృతి హెచ్చింది. ఒకటి తరవాత ఒకటిగా సంసారానికి సంబంధించిన పాటలన్నీ నా నోట ఊటబావిలోంచి నీళ్ళు ఊరుతున్నట్టు వచ్చేస్తున్నాయి.
“సంసారం మహా సాగరం, ఈదాలీ యేకమై ఇద్దరం…” నుంచి ఆఖరికి..
“నిన్నే పెళ్ళాడతా.. రాముడూఊఊఊ భీముడూఊఊఊ రాముని మించిన రాముడూఊఊఊ..
అగ్గిరాముడూఊఊ, పిడుగురాముడూఊఊ, టైగర్ రాముడూఊఊ, శభాష్ రాముడూఊఊ” దాకా వెళ్ళిపోయింది నా పాటల సందడి. ఎక్కడెక్కడి పాటలో గుర్తు చేసుకుని మరీ పాడేసుకుంటూ కూరలు తరిగేస్తున్న నేను ఏదో అనుమానం వచ్చి తల పైకెత్తేటప్పటికి వాళ్ల రూముల్లో చదువుకుంటున్న పిల్లలిద్దరూ నా యెదురుగా నిల్చుని నన్ను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. ఒక్కసారి ఈ లోకంలో కొచ్చేను. తరిగిన కూరలవైపు చూసేను. అయ్యబాబోయ్.. ఇన్ని కూరలు తరిగేసేనా అనుకోగానే నా చేతులూ, వేళ్ళూ నెప్పులు మొదలయ్యేయి. మళ్ళీ పనిగండం గుర్తొచ్చేసింది.
నేనేదో తెలీని జబ్బుతో బాధపడుతున్నాననుకున్న మా పిల్లలిద్దరూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి, ఫాన్ వేసి మంచినీళ్ళిచ్చేరు. ఇంక ఈ పూటకి వంటింటివైపు తొంగిచూడద్దంటూ బైట నుంచి భోజనం ఆర్డర్ చేసేసేరు.
పనీపాటా లేకుండా తీరుబడిగా కూర్చున్న నాకు ఇంతకీ నా వ్యక్తిత్వం వికసించిందా లేదా అని అనుమానమొచ్చింది. పక్క ఫ్లాట్ అమ్మాయి కాలేజీకి వెళ్ళే టైమే కదా అడుగుదామని అటువైపు చూసేసరికి, నన్ను చూడగానే ఆ పిల్ల లిఫ్ట్ కోసం కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ మెట్లు దిగేస్తోంది.
హూ.. ఇంతకీ నా వ్యక్తిత్వం వికసించిందో లేదో ఎవరు చెప్తారో!