[box type=’note’ fontsize=’16’] “వొక్కో కథా ఆ పాత్ర చెబుతున్నప్పుడు మనం వొక్కో అంచనా వేసుకుంటాము, వొక్కో వూహ చేసుకుంటాము. అంతలోనే సంభాషణలలో దొర్లే మరో కథాత్మక సంభాషణలు మన ఆలోచనలు తారుమారు చేస్తాయి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఎవరు?’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]అ[/dropcap]ప్పట్లో ఎవరు హాల్లో చాన్నాళ్ళే ఆడినా నాకు చూడటం వీలు పడలేదు. అంతకు ముందు అమితాభ్ నటించిన “బదలా” చూసినప్పటికీ తెలుగులో కూడా చూడాలని అనుకున్నా. వొక కారణం అడివి శేష్. అతని మొదటి చిత్రం “కర్మ” చూశాను. అది నచ్చకపోయినా కథనం బాగుందని అనిపించింది. ఆ తర్వాత “క్షణం”, “గూఢచారి” చిత్రాలు చూశాను. తన బలాలూ బలహీనతలూ తెలుసనుకుంటాను. రొమాన్స్ లో మెప్పించలేడు కానీ సస్పెన్స్ సినెమాలు బాగానే చేస్తాడు. నటనలో సగ భాగం సంభాషణా చాతుర్యం. ఇందులో అతను తనే చెప్పినట్లైతే బాగా నటించాడు అని వొప్పుకోవచ్చు. ఇక అభివ్యక్తీ, వ్యక్తీకరణలు పర్లేదు. అమితాభ్ సినెమా చూసిన తర్వాత తెలుగు సినెమా చూస్తారా, చూసినా నచ్చుతుందా అన్న సంశయం నాకైతే లేదు. రెంటినీ పోల్చే ప్రయత్నం చెయ్యకుండానే చూడాలని అనుకున్నా, అలానే చూశా. వొక మంచి చిత్రమే, అమేజాన్ ప్రైం లో వుంది, చూడని వాళ్ళు చూడండి.
వొక స్పానిష్ చిత్రం Contratiempo చాలా చిత్రాలకు మాతృక. బదలా, ఎవరు చిత్రాలతో సహా. నేను మూలాన్ని ఇంకా చూడాల్సే వుంది. అయితే హిందీ తెలుగు చిత్రాలు చూసిన అనుభవం తో దర్శకులిద్దరూ చక్కగా మన వాతావరణానికి తగ్గట్టుగా రూపాంతరం చేశారని చెప్పక తప్పదు.
వెంకట్ రాంజి దీనికి దర్శకుడు. మొదటి చిత్రమే అయినా అతని ప్రతిభ ప్రశంసనీయంగా వుంది. వొక స్పానిష్ కథను తెలుగు వాతావరణానికీ, జీవితానికీ చాలా చక్కగా రూపాంతరం చేశాడు, అబ్బూరి రవి సాయంతో. ఇక అబ్బూరి రవి సంభాషణలు చాలా చక్కగా వున్నాయి, పాత్రలు చక్కగా పలికారు కూడా. ఈ విషయంలో చాలా తృప్తిగా అనిపించింది. పచ్చిపులుసు వంశీ చాయాగ్రహణం ఎక్కువ భాగం రాత్రిలో వుండే పల్చటి వెలుతురులో, గదిలో ఫొకుస్ లైట్లలో పాత్రల ముఖ కవళికలు పట్టుకోవడంలో, కదలికలలో అన్నిటా కథను, దాని మూడ్ నూ అనుసరించి వుంది. చాలా మెచ్చుకోతగట్టుగా వుంది. పాకాల శ్రీచరణ్ నేపథ్య సంగీతం కూడా మనల్ని సినెమాకు కట్టిపడెయ్యడంలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఇక రెజినా కసాండ్రా చిత్రం చూడటం నాకు ఇది మొదటిసారి. నేను తెలుగు చిత్రాలు చూడటం తక్కువ కాబట్టి. ఒప్పుకోవాల్సిందే, ఆమె అందంగానూ వుంది, ఆమె అభినయం కూడా అందంగా వుంది. ఇప్పుడు నేనీ మాట అంటే మీరు నవ్వుతారేమో, నవ్వుకోండి; నా తెలుగు చిత్రాల జ్ఞానం అంతే!
బదలా చూసాము అనుకుంటున్న వారికి వొక మాట అదనంగా చెప్పాలి. బదలా కి ఎవరు కీ మధ్య చాలా తేడాలున్నాయి. దేని ఫ్లేవర్ దానిదే. ఇది స్పానిష్ చిత్రానికి రూపాంతరం కాకపోతే ఆ క్రెడిట్ అంతా మనం కొట్టెయ్యమా?! అయినా మన వెన్ను మనం తట్టుకోవాల్సిన సందర్భమే.