Site icon Sanchika

ఈవిలుమ్ డెత్తునుమ్

[శ్రీ వేదాల గీతాచార్య రచించిన ‘ఈవిలుమ్ డెత్తునుమ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రో[/dropcap]డ్డు నిర్మానుష్యంగా ఉన్నా, వీధి దీపాలు ఫోకస్ లైట్ల మాదిరి దిట్టంగా పడుతున్నాయి. అన్ని దారులూ రోమ్‌కే దారితీస్తాయి అన్న విధంగా ఈ రోడ్డు ఆ ఇంటికే దారి తీసేలా ఉంది.

ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఊహుం ఊహుం ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఆఁహ్ వాఁహ్ ఊహుం ఊహుం..

ఊపిరి ఎగదీత దిగదీత. మధ్యలో రొప్పు.

ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్

ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్

ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్

ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్ ట్లఖ్

రిథమిగ్గా కల్లోలపుటడుగు చప్పుళ్ళు.

ఇటు రోడ్డు మీద ఇటువైపు నుంచీ అటువైపు వెళ్ళే ఉద్దేశంతో మంద్రంగా క్రిచుం అని శబ్దంతో పాకబోయిన భయంకర విష సర్పమొకటి ఆ అడుగు చప్పుళ్ళకు హడలి పక్కనే ఉన్న పొదలోకి దూరబోయింది. తప్పు చేసిన పసి పిల్లవాడు మంచం మీద బోర్లాపడి తల మీద దిండు పెట్టుకుని దాక్కునే ప్రయత్నం చేసినట్లుగా. సగం వరకే పట్టి మిగిలిన భాగం బైటకే ఉండిపోయింది.

ఇంటి ఎదురుగా నల్లటి దీపపు స్తంభాలు. వాటిలో వెలుగుతున్న లైట్లు, చెట్ల సాయంతో, వెలుగునీడల ఆటలాడుతున్నాయి. పరుగులాంటి నడకను సూచిస్తున్న ఆ అడుగులు ఇంటికి దగ్గరగా వస్తున్నాయి. ఇంటి ముందుకు వచ్చి ఆగాడు.

ఊహుం ఊహుం. ఊహుం ఊహుం. ఊహుం ఊహుం. ఊహుం ఊహుం.

రొప్పు తగ్గటానికి నిమిషం పైన పట్టింది. తెల్ల అడిడాస్ టీషర్ట్, బ్లాక్ కలర్ అడిడాస్ షార్ట్ వేసుకున్నాడు. అతని చేతిలోని Machete ను ఒక్కసారి చూసుకున్నాడు. కళ్ళు ఆగ్రహంతో ఎర్రగా ఉన్నాయి.

నల్లటి ఇనుప గేట్. లోపల పెద్ద పెద్ద చెట్లు. గడ్డి, అడ్డగోలుగా పెరిగిన మొక్కలు. ఎడం చేతితో గేట్‌ను నెట్టాడు. కుడి చేతితో machete ను కొద్దిగా గాలిలో ఎగురవేస్తూ పట్టుకుంటున్నాడు. వేగంగా అడుగులు వేస్తూ ఇంటి వైపు వెళ్తున్నాడు. ఇంతలో పెద్ద గాలి. ఉరుము ఒకటి నేను కూడా ఉన్నాను అని అటెండెన్స్ వేయించుకుంది. ముందే ఒక మెరుపు. శబ్ద వేగానికన్నా కాంతి వేగం హెచ్చు కదా. చెట్లు గాలికి భీభత్సంగా ఊగుతున్నాయి. నడిచాడు. తలుపు నెట్టాడు. ఇంతలో కరంట్ పోయింది. అర్ధచంద్రుని వెలుతురు మాత్రమే మిగిలిందక్కడ.

తలుపు తెరుచుకుంది. ర్యాయ్య్య్య్! అని అరుస్తూ లోపలకు దూసుకుపోబోయాడు.

“నీకోసమే ఎదురు చూస్తున్నా!” మాటలు వినిపించాయి.

తన చేతిలోని machete తో ఎదుట ఉన్న మనిషి మెడ మీద దెబ్బ వేయటానికి సమాయత్తమయ్యాడు.

ఇంతలో.. ఎదురు నుంచి ఒక చెయ్యి దూసుకుని వచ్చింది. ఒక బళ్ళెం లాంటిది. ఇవతల వ్యక్తి బొడ్లో నుంచీ దూసుకుపోయింది. నోట్లో నుంచీ రక్తం ముందుకు పడింది. ఆ బళ్ళెం పట్టుకున్న చెయ్యి తాలూకు మనిషి కుడి కాలు పోటు తిన్న మనిషిని బలంగా తన్నింది. బళ్ళెపు చేయి బలంగా వెనక్కు లాగబడింది.

క్షణంలో వందో వంతులో ఆ మనిషి ద్వారంలోంచీ ఎగిరాడు. రక్తం నలుదిక్కులా ఎగిసి పడింది. చంపటానికి వచ్చినవాడు చస్తున్నందుకు ఆశ్చర్యంతో కూడిన భయపు expression ఒకటి తన మొహాన ఉంచాడు. వాడలా బయటకు గాలిలో రాగానే జోరున వర్షం మొదలైంది. వాడి రక్తం వానలో కలిసిపోతుండగా..

***

తెర మీద ఆ వ్యక్తి ఫ్రీజ్ అయ్యాడు. టైటిల్ పడింది.

ఈవిలుమ్ డెత్తునుమ్
పార్ట్ 3
యువార్ ఆల్రెడీ డెత్తుడు బంగారం (టేగ్ లైన్)

సినిమా థియేటర్ అరుపులు వీలలతో మోగిపోయింది. ఒక హారర్ సినిమాకు ఈ తరహా రెస్పాన్స్ రావటం ఆశ్చర్యమే! అది సాధించాడు దర్శకుడు Cనిమా Cను.

‘ఈవిలుమ్ డెత్తుననుమ్’ చాలా లో-బజట్‌లో తన సోదరుడు Bర్యానీ Cను తో కలిసి తీశాడు. గోరీ హారర్, అడుగడుక్కీ ఒళ్ళు గగుర్పొడిచే కథనాలతో మెప్పించటంతో లో-బజట్ వల్ల వచ్చే లో-క్వాలిటీ ఔట్పుట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కుర్రాళ్ళు ఎగబడి చూశారు. కుర్రగత్తెలు వారి బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి చూసి భయపడ్డారు. ఆ సినిమా హీరో Yస్ Vన్నర్ ప్రపంచ ప్రఖ్యాత హారర్ స్టార్ అయ్యాడు. అతని అసలు పేరు ఎవరికీ తెలీదు. సినిమాలో పాత్ర పేరే తన పేరుగా మారిపోయింది. హీరోయిన్ Gయోనా Jన్ Scream Queen గా మారిపోయింది. రాత్రికి రాత్రే పది సినిమాలు సైన్ చేసింది.

Cనిమా Cను, Bర్యానీ Cను ల రెండో సినిమాను పెద్ద స్టూడియో ఫండ్ చేసింది. అదొక రోడ్ మూవీ. దీన్ని హిట్ చేస్తే మూడో సినిమాగా ఈవిలుమ్ డెత్తునుమ్ సీక్వెల్‌కు మంచి బజట్‌తో పాటూ Altar Star Kన్ Oవెన్ ను తీసుకు వస్తామన్నారు.

కానీ ఆ స్టూడియో కంట్రోల్‌లో తీసిన రోడ్ మూవీ దెబ్బతిన్నది. Cను సోదరుల నుంచీ మరో ఈవిలుమ్ డెత్తునుమ్ ఆశించారు ప్రేక్షకులు. కానీ ఇది కామెడీ ఎడ్వెంచర్. దాంతో ఆ సినిమా కాస్తా బకెట్ తన్నేసింది.

దాంతో స్టూడియో మరో అవకాశం ఇవ్వలేదు. ఇక చేసేది లేక ఈవిలుమ్ డెత్తునుమ్‌కు వచ్చిన లాభాలు, ఈ సినిమాకు ఇచ్చిన కొద్దిపాటి రెమ్యునరేషన్ ఉపయోగించి ఈవిలుమ్ డెత్తునుమ్ 2 కు నడుం బిగించారు.

మొదటి సినిమా ఫ్లూక్ హిట్ అని విమర్శకులు, సినీరంగ ప్రముఖులు కొట్టి పడేయటంతో మిగిలిన నటులు కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఇక లాభం లేదని కొత్త వాళ్ళతో తీద్దామని డిసైడ్ అయినప్పుడు Yస్ Vన్నర్ నేను చేస్తానంటూ ముందుకు వచ్చాడు. Cను సోదరుల రెండో సినిమా చాలా సినిమా కష్టాలు ఎదుర్కుని విడుదల అయ్యి (అడుగడుగునా స్టూడియో interference) ఫ్లాప్ అయ్యేలోగా Yస్ Vన్నర్ మరో రెండు హిట్లు కొట్టాడు.

The Sexiest Scream Queen గా పేరు పొందిన Gయోనా Jన్ లాభాల్లో వాటా ఇస్తే చేస్తానని ముందుకు వచ్చింది. అప్పటికే మొదటి సినిమా చూసి Cను సోదరులకు అభిమానులు తయారయ్యారు. వారికి ఈ సీక్వెల్ వార్త జోష్ ఇచ్చింది. దానికి తోడు fan favourite couple Yస్ Vన్నర్, Gయోనా Jన్ కూడా తోడు కావటంతో ప్రాజక్టుకు క్రేజ్ వచ్చింది.

ఉన్న రిసోర్సులను బాగా వాడుకున్న Cను సోదరులు ఈసారి grotesque horror డోసు మరింత పెంచారు. దానికి తోడు ఈ సినిమా ఎడిట్ చేస్తూ Aడిటర్ Bమ్ ఆ భయానక దృశ్యాలకు ఝడుసుకుని మధ్యలోనే చనిపోయాడని వచ్చిన వార్తలు ఆ సినిమాకు క్రేజ్‌ను పెంచాయి. ఈ నొటోరిటీని వాడుకుని బాగా ప్రచారం చేయటంతో ఈవిలుమ్ డెత్తునుమ్ మరింత పెద్ద హిట్ అయింది. Cను సోదరులు అంతర్జాతీయంగా బాగా పేరు పొందారు.

సినిమా చరిత్రలో ఇంత భయానకమైన సినిమా రాలేదని, ప్రత్యేకించి క్లైమాక్సు ముందు హీరోయిన్‌ను దుష్టశక్తి నగ్నంగా చేసి ఒక్కొక్క శరీరభాగాన్నీ పీకి మరీ చంపే సీన్, కంట్రోల్ తప్పిందని హీరో చేయి కోసేసుకుంటే అది అతని మీద ఎటాక్ చేసే సన్నివేశం (Cut off hand attacks the hero).. ఈ సన్నివేశాలు న భూతో నభవిష్యత్ అని ప్రేక్షకులు ఆకాశానికెత్తేశారు. సినిమా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా వందలాదిమంది గుండెపోటుతో మరణించారన్న వార్తలు మరింత ప్రచారాన్ని తెచ్చాయి. విమర్శకుల విమర్శలు పరామర్శలు కూడా దక్కని అనాథ శవాల్లా గాల్లో కలిసిపోయాయి.

సినిమా వివిధ దేశాల్లో నిషేధానికి గురైంది. దాంతో వీడియో టేపులు దొంగచాటుగా పంచుకుని మరీ చూశారు. ఆ తర్వాత Cను సోదరులు వెనుతిరిగి చూసింది లేదు. మరో నాలుగు (అందులో రెండు హారర్) సినిమాలు కూడా హిట్ అయ్యాయి. కానీ వారి అభిమానులే కాదు, ఈవిలుమ్ డెత్తునుమ్ సినిమాలలో నటించిన Gయోనా Jన్, Yస్ Vన్నర్ లు కూడా మూడవ భాగం కోసం అడుగుతున్నారు. దాంతో Cను సోదరులు కథ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. ఏడాది బ్రేక్ తరువాత మా తర్వాతి సినిమా అని ప్రకటించి మాయమయ్యారు జనజీవన స్రవంతి నుంచీ.

***

Aసు Tన్మన్ బ్లాక్బస్టర్ స్టోర్‌లో మేనేజర్. సినిమాలు బాగా చూస్తాడు. అందరి లాగే హైస్కూల్ చదువు కాగానే ఇంటి బైటకు వచ్చి పని చూసుకున్నాడు. తన తెలివితేటలతో, నలుగురినీ ఆకట్టుకునే పర్సనాలిటీతో జనాలను మెప్పించటం, తద్వారా అవకాశాలను అందిపుచ్చుకుని బాగనే సంపాదించుకున్నాడు. ఇంతలో బ్లాక్బస్టర్‌లో ఔట్లెట్‌లో చేరాడు. చాలా త్వరగా సేల్స్ చేయటంతో క్రమంగా మేనేజర్ స్థాయికి ఎదిగాడు. హార్మోన్లను శాటిస్ఫై చేస్తూ దాదాపు నలుగురు galfriends ను మార్చాడు.

ఒకరోజు Bబీ Cసిలీ అని మాంఛి voluptuous గా ఉన్న ఒక బ్లాండ్ షాప్‌కు వచ్చింది. ఆ అమ్మాయికి ఈవిలుమ్ డెత్తునుమ్ రెండవ భాగం వీడియో కావాలి. అది స్టోర్ లోనే కాదు, నగరంలో ఉన్న మిగిలిన బ్రాంచిలలో కూడా లేదని సమాచారం అందింది.

Bబీ Cసిలీ కంటికి నదురుగా ఉండటం, గత నాలుగు మాసాలుగా ఉపవాసం ఉండటంతో కాస్త ఇంప్రెస్ చేయాలని తన పర్సనల్ కాపీని ఆమెకు ఇచ్చాడు Aసు Tన్మన్. ఆ అమ్మాయి అడ్రస్ తీసుకున్నాడు. మర్నాడు సాయంత్రం ఒక వర్షం కురిసిన సమయంలో అతని కార్ ఆ పిల్ల ఇంటికి దగ్గరలోనే ఆగిపోయించబడింది. దాంతో అక్కడ తన కోసం ఒక కాపీ రికార్డు చేసి తీసుకునేందుకు ఇంటికి వెళ్ళాడు.

తదనంతర పరిణామాల్లో ఇద్దరికీ వివాహం కూడా జరిగింది.

Then starts trouble.

ఇద్దరూ Cను సోదరుల వీరాభిమానులు. ఈవిలుమ్ డెత్తునుమ్ రెండు సినిమాలే కాదు, వీరి మిగిలిన సినిమాలు కూడా చాలాసార్లు చూశారు.

ఒక్క ఆ ఫెయిలయిన రోడ్ మూవీ తప్ప మిగిలిన అన్ని సినిమాలనూ Cను సోదరులు అవి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసినవని పబ్లిసిటీ చేసుకునేవారు. దాంతో ఆ కథలు నిజమే అని నమ్మే జనంలో మన Aసు, Bబీ కూడా ఉన్నారు. వీరు వీరి హనీమూన్‌ను ఈవిలుమ్ డెత్తునుమ్ మాదిరి ఒక dilapidated house in a jungle లో చేసుకుందామని అనుకున్నారు. ఎన్నో ప్లాన్లు వేసి, రిసెర్చి చేసి ఈవిలుమ్ డెత్తునుమ్ మొదటి భగం తీసిన చోటే తమ వివాహ బంధాన్ని పరిపూర్ణం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు Aసు, Bబీ.

అక్కడ ఎంత ట్రయ్ చేసినా ఒక్క ఈవిల్ స్పిరిట్ కూడా తగలలేదు. గుర్రపు స్వారీ సమయంలో ఈవిల్ ఫోర్సులు వస్తాయని సినిమాల్లో చూపటం వల్ల.. దానికోసం ఎన్నిరకాలుగా తమ స్వారీలో ప్రయోగాలు చేసినా, ఒక్క భయానక సంఘటనగా జరుగలేదు. సర్వైవింగ్ హీరోలుగా తమకు బాగా పబ్లిసిటీ వస్తే దీనివల్ల వచ్చే క్రేజును సొమ్ము చేసుకుంటూ పుస్తకం రాసి ఇంకాస్త పాప్యులర్ అవ్వాలని, దానివల్ల చాలా సంపాదన వస్తుందని అనుకున్నారు. ఆ రకంగా వీరి expectations దెబ్బతిన్నాయి. దాదాపు దేశం మొత్తం దుష్టశక్తులున్నాయని పేరు పొందిన చోట్లల్లా తిరిగారు.

ఈ తిరుగుళ్ళలో ఒక్క దుష్టశక్తి కనపడకపోగా ఉద్యోగం సరిగ్గా చేయటం లేదని పీకి అవతల పడేశారు. ఇంతలో వారి దేశం ఇంకో దేశంతో యుద్ధం మొదలు పెట్టటంతో దేశం కాస్త సంక్షోభంలో పడింది. ఉద్యోగం దొరకటం తేలిక కాదు. ఈ సందట్లో సడేమియా లాగా Bబీ Cసిలీ అతన్ని వదిలేసి పోయింది.

శాస్త్రాన్ని అనుసరించి మన Aసు డిప్రషన్లో పడ్డాడు. సంప్రదాయబద్ధంగా ఆల్కహాల్ అబ్యూజింగ్ కూడా మొదలైంది.

అదే సమయంలో మన Cను సోదరులు మాయమయ్యారు. సినిమాకు సంబంధించిన ఆ న్యూస్ చూసిన Aసు తన గతాన్నంతా గుర్తుచేసుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఊరి చివరకు వెళ్ళిపోయాడు. ఊళ్ళ మధ్యలో ఉన్న ఫ్రీవే మీద ఒక బార్ కనిపించింది. దాంట్లో దూరాడు. చిత్తుగా తాగటం మొదలుపెట్టాడు.

అక్కడ జరిగింది ఒక ఘోరం!

Cనిమా Cను అక్కడ ఇద్దరు అమ్మాయిలతో కనబడ్డాడు. వాళ్ళ తాగేది తక్కువైనా సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. Cనిమా Cను చాలా ఉల్లాసంగా ఉన్నట్లున్నాడు. అది చూసి Aసుకు మండిపోయింది.

ఒక ఆరుగురు స్నేహితులు ఒకరోజు ఒక సరదా పిక్నిక్‌కు వెళతారు. ఒక అడవిలో వీరు ఆగాల్సి వస్తుంది. దాంతో వెతుకుతుంటే ఒక పాడు పడిన కాటేజ్ కనబడుతుంది. దాంట్లో ఆ రాత్రికి సెటిలవుదామని చేరతారు. ఆ రాత్రి వారికి కాళరాత్రే అవుతుంది. ప్రళయభీభత్సంగా దుష్టశక్తులు వారితో ఆడుకుంటాయి. చివరకు హీరో హీరోయిన్ మాత్రమే మిగిలి ఎలాగోలా తప్పించుకుంటారు. ఈమాత్రం premise ను గోరీ వైలెన్స్, ఆసక్తికరమైన మలుపులు, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు, visual flair తో సినిమాగా మల్చి హిట్టు కొట్టారు Cను సోదరులు.

అలా తాము కూడా ఆ దుష్టశక్తుల బారిన పడితే, తప్పించుకుంటే వచ్చే పబ్లిసిటీ తమకు lifetime settlement ఇస్తుందని ఆశపడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు Aసు.

అక్కడ సినిమా ఎనౌన్స్ చేసి ఇక్కడ బార్‌లో కూర్చుని అమ్మాయిలతో కాలక్షేపం చేస్తూ ఉల్లాసంగా కనిపించిన Cనిమా Cను ని చూడటంతో Aసు మనసు కంట్రోల్ తప్పింది. అతనికి తన కార్ లో machete ఉందని గుర్తొచ్చింది. తూలుకుంటూనే అయినా నిదానంగా వెళ్ళి ఆ machete ను పట్టుకొచ్చి, Cనిమా Cను ముందుకు వచ్చాడు. ఆ అమ్మాయిలు ఇతని వైపు కంగారుగా చూశారు. Cనిమా Cను ఆశ్చర్యంగా అతని వైపు నవ్వుతూ కళ్ళెగరేశాడు.

Aసు తన బలాన్నంతా ఉపయోగించి Cనిమా Cను తల మీద ఒక్క వేటు వేశాడు. అతను దీన్ని anticipate చేసినట్లున్నాడు, వెనక్కి పడి, దొర్లి లేచి నిలబడ్డాడు. అప్పటికే బార్ లో కల్లోలం. Aసు వైపు WTF అంటూ చూశాడు. ఒకటి రెండు సంప్రదాయక పాశ్చాత్య బూతులు వాడాడు. ఈలోగా Aసు చేతిలోని machete Cనిమా Cను ఉదరంలో దిగటం, flat belly కారణంగా అది అవతల పు నుంచీ బైటకు కనబడటం జరిగాయి. పిశాచబలం ఉపయోగిస్తూ Aసు machete ను బలంగా కిందకు లాగాడు. అది దిగిన చోటు నుంచీ పెల్విస్ దాకా పూర్తిగా తెగిపోయింది. నోట్లోంచీ రక్తం spurts spurts గా పడుతోంది. కళ్ళు వెళ్ళకొచ్చాయి. మరో వేటుతో తల తెగగొట్టేశాడు. అది వెళ్ళి దూరంగా కూర్చుని ముద్దుముచ్చట్లలో మునిగిన జంటలో అమ్మాయి ఒళ్ళో పడింది.

ఆ machete ను అడ్డంపెట్టుకుని తప్పించుకున్నాడు Aసు.

***

Aసు చేతిలోని machete ఎగిరి వెళ్ళి దూరంగా ఉన్న చెట్టు మీద పడింది. దాని వేగానికి అక్కడ ఉన్న ఒక పక్షి రెండు భాగాలుగా కింద పడింది.

Bర్యానీ Cను.

అప్పటికి రెండు వారాలైంది Cనిమా Cను హత్య జరిగి. దానికి ప్రతీకారం చేసాడు Bర్యానీ Cను. Aసు శరీరం వానలో నేలమీద పడింది. Bర్యానీ Cను వైపు వేలు చూపిస్తూ ఏదో చెప్పబోయాడు బెదిరింపుగా. ముందుకు నడిచి తన చేతిలోని బళ్ళాన్ని Aసు Tన్మన్ గొంతులో దింపాడు Bర్యానీ Cను. రక్తం ఫౌన్టెన్‌లా ఎగజిమ్మింది.

“యువార్ ఆల్రెడీ డెత్తుడు బంగారం!!” అన్నాడు.

చేతులు వెనక్కి లాగుతూ వెనక్కు విరుచుకున్నట్లు వంగి Bర్యానీ Cను ఆకాశంలోకి చూస్తూ పెద్దగా అరిచాడు. ఆ అరుపు ఉరుము శబ్దంలో కలిసిపోయింది. ఫౌన్టెన్‌లా ఎగజిమ్ముతున్న రక్తం అంతకు ముందు వచ్చిన మెరుపు వెలుతురులో మెరిసింది. Bర్యానీ Cను కుప్పకూలిపోయాడు.

ఏడాదిన్నర తరువాత తన తమ్ముడికి ట్రిబ్యూట్ అంటూ ఈవిలుమ్ డెత్తునుమ్ పార్టు 3 తీశాడు. ఇదే సంఘటనను ఆధారం చేసుకుని. దాని టేగ్ లైన్ ‘యువార్ ఆల్రెడీ డెత్తుడు బంగారం’.

సినిమా తీస్తుండగానే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. Cనిమా Cను అర్ధంతర మరణం, తమ జీవితాన్ని, తమ్ముడి మరణాన్ని ఆధారం చేసుకుని ఈ సినిమా కథ Bర్యానీ Cను అల్లటం సంచలనం సృష్టించాయి. ప్రీవ్యూల నుంచే ఈ సినిమా బాగా పాజిటివ్ బజ్ సంపాదించింది.

ఈసారి హరర్ కన్నా ఎమోషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేశాడు Bర్యానీ Cను. తన తమ్ముడు లేని లోటును జనాలు బాగా ఫీల్ అయ్యేలా చేయటంలో బాగా సక్సెస్ అయ్యాడు. దాంతో అర్ధ బిలియన్ బుక్కులు సంపాదించిన తొలి R-rated film గా ఈవిలుమ్ డెత్తునుమ్: యువార్ ఆల్రెడీ డెత్తుడు బంగారం నిలిచింది. దీన్ని సెలబ్రేట్ చేస్తూ తన తమ్ముడి నివాళి కార్యక్రమంగా ఒక ప్రోగ్రామ్‌ను 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఎనౌన్స్ చేశాడు.

ఇదొకవైపు అయితే అటు ఈ Cను సోదరుల ఇండిపెండెంట్ సక్సెస్ ను తట్టుకోలేని స్టూడియోలు Cనిమా Cను చావలేదని, ఈ సినిమా పబ్లిసిటీ కోసం అతను దాగి ఉన్నాడని ఒక రూమర్ వదిలారు. మరొక వర్గం వారు అసలు Bర్యానీ Cను యే తన తమ్ముడు Cనిమా Cను ను చంపాడని, ఆ సానుభూతి ద్వారా బాగా సంపాదించవచ్చని అలా plan చేశాడని conspiracy theories మొదలుపెట్టారు.

***

70 ఎమ్ఎమ్ థియేటర్‌లో షో మొదలైంది. సినిమా చూసేందుకు వచ్చినవారితో హాల్ కిక్కిరిసిపోయింది. సీట్లు ఖాళీ లేక చాలామంది నిలుచున్నారు కూడా. ఇదంతా లైవ్ వెళుతోంది టీవీలో.

Bర్యానీ Cను పాత్ర పోషించిన Yస్ Vన్నర్ మొదట కాసేపు మాట్లాడి అందరిని black armband ధరించమని కోరాడు. Cనిమా Cను కోసం రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత షో మొదలైంది. Aసు అలా గాల్లో ఎగురుతుండగా సినిమా టైటిల్ పడింది. ఎప్పటిలాగానే థియేటర్ అంతా కోలాహలం. విజిల్స్, హూటింగ్స్, చప్పట్లు, కేరింతలు.

సినిమా టైటిల్స్ అయ్యాక కథ flashback లోకి వెళుతుంది. Cను సోదరుల బాల్యం.

కానీ కోలాహలం ఆగలేదు. ఒక్కసారిగా Aసు లాగా బలైన వాళ్ళంతా జాంబీల మాదిరి మారి Bర్యానీ Cను మీద పడ్డారు. చెప్పుకునేందుకు ఒక్క ముక్క కూడా దొరకనంతగా తరిగేశారు. తిరగబడిన Yస్ Vన్నర్, ఇతర సెలబ్రిటీలు, వారి బౌన్సర్లు..

ఆ రాత్రి జరిగిన mass massacre ని ప్రపంచం వీక్షించింది. ఒక్కరంటే ఒక్కరు కూడా బైట పడలేదు 70 ఎమ్ఎమ్ థియేటర్ నుంచీ. లైవ్ తీస్తున్న వారు కూడా. ఆ థియేటర్ నుంచీ నిజమైన రక్తం బైటకు ప్రవహించింది. అదొక కాల్వ మాదిరి పారింది. ఈ సంఘటనకు The Great 70mm Theater Massacre అని చరిత్ర పేరు పెట్టింది.

A mass massacre the world has never witnessed (unless during the time of a war). Fact is stranger than fiction!

ఈ Mass Massacre ని ఆధారం చేసుకుని చాలా సినిమాలు, పుస్తకాలు వచ్చాయి. కానీ, వాటిని రాసిన వారు, తీసిన వారు గట్టిగా ఏడాది కూడా survive కాలేదు. అందరూ..

ఈవిలుమ్ డెత్తునుమ్ బారిన పడ్డారు.

Exit mobile version