Site icon Sanchika

ఫేస్‌బుక్

[box type=’note’ fontsize=’16’] “నాకు ఫేస్‌బుక్ ఒక ప్యాషన్. నాకు చాలా మంది స్నేహితులున్నారు. నా ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే. రోజూ చాలా మందితో చాటింగ్ చేస్తుంటాను” అనే వ్యక్తికొచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఏమయిందో శంకరప్రసాద్ ఈ కథలో చెబుతున్నారు. [/box]

[dropcap]రో[/dropcap]జూ లాగే యథాలాపంగా వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. నేను ఫేస్‌బుక్ ఎక్కువగా చూస్తుంటాను. ముందు మెయిల్స్ ఏమొచ్చాయో చూడాలని జీమెయిల్ ఓపెన్ చేశాను. సుబ్బారావు నుండి ఈమెయిల్ వచ్చింది. ఈ సుబ్బారావొకడు, ఈ మధ్య మెయిల్స్ మరీ ఎక్కువ పెడుతున్నాడు. అయినా ఈ సుబ్బారావుతో నాకేం పని… వాళ్ళావిడతో కదా నా పని…… మెయిల్ ఓపెన్ చేశాను. ఎప్పటిలాగే నాకు థ్యాంక్స్ చెబుతూ పంపిన మెయిల్ అది.

నాకు ఫేస్‌బుక్ ఒక ప్యాషన్. నాకు చాలా మంది స్నేహితులున్నారు. నా ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే. రోజూ చాలా మందితో చాటింగ్ చేస్తుంటాను. ఒక రోజు నాకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరో విమల ఫ్రమ్ అమలాపురం. ఆడవాళ్ళ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ చూడగానే, అది కూడా ఎవరో తెలియని వ్యక్తి, నాకు కొంచెం ఇబ్బందనిపించింది. ఇగ్నోర్ చేసేసాను. కానీ ఆ విమలగారు మాత్రం వదలిపెట్డడం లేదు. నాకు రోజు మెసేజులు ఇస్తూనే ఉంది, రిక్వెస్ట్ యాస్సెప్ట్ చెయ్యమని.

నా సంస్కారం నన్ను వెన్ను తట్టింది,  జస్ట్ ఫ్రెండ్ రిక్వెస్టే కదా, ఫ్రెండ్‌గా యాస్సెప్ట్ చేస్తే తప్పేముంది. ఆవిడ అంతగా ప్రాధేయపడుతుంటే, ఇగ్నోర్ చెయ్యటం తప్పనిపించింది. విమలగారి ఫ్రెండ్ రిక్వెస్ట్, యాస్సెప్ట్ చేసాను. ఆ తరువాత ఆవిడ పూర్తి వివరాలు తెలిసాయి.

సుబ్బారావు, విమల దంపతులు. సుబ్బారావు అమలాపురంలో స్టేట్ బ్యాంకులో ఉద్యోగి. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారింట్లో ఉన్నారు. ఆడపిల్లల పెళ్ళిల్లకు ముందు, వాళ్ళ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఎప్పుడూ హడావిడిగా సందడిగా ఉండేది. అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయిన తరువాత, ఏదో కోల్పోయిన భావంలో ఉండిపోయారు. ఒంటరితనం చుట్డుముట్టింది. భర్త పొద్దున్న బ్యాంకుకి వెళిపోతే మళ్ళా ఏ సాయంత్రమో, రాత్రో ఇంటికి వస్తాడు. విమల గారికి పిల్లలు లేని ఇల్లు బోసిపోయినట్లగా ఉంది. ఏకాంతం, ఒంటరితనం, భావంతో ఆవిడ కుంగిపోయింది.

పూర్వం రోజుల్లో అయితే, తీరిక వేళల్లో ఆడవాళ్ళంతా ఏ వీధి అరుగు మీదో కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు. ఎదురింటి, వెంకమ్మ దగ్గరనుండి, పక్క వీథి పాపారావు వరకు సంగతులు మట్లాడుకుంటూ కాలం గడిపేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి గోల వారిది. ఇతరుల గురించి పట్టించుకునే రోజులు పోయాయి.

ఈ తుంటరి ఒంటరితనం , సున్నితమైన స్త్రీ హృదయంపై చాలా ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్‌కి లోనవ్వడం, సైకిక్‌గా మారడం జరుగుతోంది. భార్య పరిస్థితిని చూసిన సుబ్బారావు ఆమెకు ఫేస్‌బుక్ వాడటం నేర్పించాడు. అలాగైనా ఆమె ఒంటరితనం మరిచిపోతుందని. ఈ ప్రక్రియలోనే విమలగారు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం జరిగింది.

నేను ఆవిడని ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చిన తరువాత, విమలగారి ఆనందం వర్ణనాతీతం. రోజూ నాతో చాటింగ్ చేస్తూ ఉంటుంది.

“ప్రసాద్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా” అని విమల గారి పలకరింపు,

“నన్ను గారు అని పిలవొద్దు విమలక్కా, తమ్ముడూ అని పిలువ్”..  నా సమాధానం.

ఒకరోజు సుబ్బారావు నుండి మెయిల్ వచ్చింది. నాతో చాటింగ్ చేస్తున్నప్పటినుండి, విమలగారిలో చాలా మార్పు వచ్చిందట. ఒంటరితనం మరిచిపోయి, మునుపటి లాగే హుషారుగా ఉంటుందట. నాకు థ్యాంక్స్ చెబుతూ, సుబ్బారావు పంపిన మెయిల్ అది.

రోజూలాగే విమలగారితో చాటింగ్ చేస్తున్నాను

“విమలక్కా ఎలా ఉన్నావ్, ఈ రోజు ఏం కూర చేసావ్… నాకు వంకాయ పచ్చడంటే చాలా ఇష్టం తెలుసా.‌. బావగారు బాగున్నారా..”

ఇలా కుశల ప్రశ్నలతో రోజూ, నా అక్క కాని అక్క విమలక్కని సంతోషపెడుతున్నాను.

ఆడపిల్లలు ఇంటినుండి వెళ్ళిపోయి, ఒంటరితనంతో బాధ పడుతున్న ఒక  మహిళని ఈ విధంగా సాయం చేయగలుగుతున్నాననే తృప్తి నాకు చాలు.

అప్పుడప్పుడు, సుబ్బారావు బావ నుండి మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, థ్యాంక్స్ చెబుతూ…

Exit mobile version