Site icon Sanchika

ఫైసలా

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ఫైసలా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]క్కడ మొక్కల్ని చూసి
పచ్చదనమే పరవశించి పోతుంది

విరబూసిన పూలను చూసి
అందమే పులకరించిపోతుంది

కొమ్మల కింది నీడ కాలుగాలిన పిల్లిలా
అటూ ఇటూ తిరుగుతుంది

పూలపై వాలిన సీతాకోక చిలుకలు
సరిగమలు పలుకుతాయి

చిన్న కొలనులోని తాబేలు
వందనాలు చెబుతుంది

ఉడుతల ఉరుకులు
పిచ్చుకల అరుపులూ
సంగీత కచేరీలా వుంది

రెండస్తులు ఎక్కాక
నేల మీది తోటలోని పారవశ్యం
మిద్దెమీదా విస్తరించింది

కుండీల్లోని మొక్కలు
పందిరిపై అల్లుకున్న తీగలు
అక్వెరియం లోని చేపలూ
అందాన్నీ ఆహ్లాదాన్నీ
రెండు చేతులా ఖుషీ ఖుషీగా
మా ముందు పరిచాయి

ఇదంతా తోటలోని భూమి గొప్పదనమా
కుండీల్లోని మట్టి మహిమా
ఇందిరా నేనూ గుస గుసగా అనుమానపడ్డాం

కాదు కాదు
గొప్పదనము మహిమ అంతా
మొక్కలు నాటిన చేతి వేళ్లది
నీళ్ళు పోసిన చేతులదీ అని
‘ఫైసలా’ చేసుకున్నాం

(ఆత్మీయులు విష్ణువందన, రామకృష్ణ గార్లకి ప్రేమతో..)

Exit mobile version