ఫేక్ మెన్

0
3

[శ్రీ సిహెచ్. సి. ఎస్. శర్మ రచించిన ‘ఫేక్ మెన్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]శ్రా[/dropcap]వణమాసం. వర్షాకాలం.. వారంరోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు.

మాధవమూర్తి శ్యామల, రంగారావు శాంతి.. ఒకే వీధిలో ప్రక్కప్రక్క గృహస్థులు. పి.డిబి.యు.డి, ఆఫీసులో ఇరువురు మగవారికి ఉద్యోగాలు. నలుగురూ పరమ స్వార్థపరులు. ‘గంతకు తగిన బొంత..’ అనే సామెత వారికి పరిపూర్ణంగా వర్తిస్తుంది. మాధవరావు హెడ్ క్లర్క్, రంగారావు క్యాషియర్. ఇరువురు యాత్రికులు విశాఖపట్నం నుంచి తిరుపతి కాలినడకన వచ్చి తిరుగు ప్రయాణంలో వున్నారు. వారు చెప్పిన వారి పేర్లు కృష్ణారావు, అర్జునరావు. వయస్సు నలభై సంవత్సరాల ప్రాయం. మాధవ, రంగాల ఇళ్ళముందు నడుస్తున్నా ఆ ఇరువురు వాన హెచ్చు స్థాయికి పోగా, మాధవరావు ఇంటి వరండాలోకి వానలో తడుస్తూ పరుగెత్తారు. మాధవరావు సెల్ఫోన్ మ్రోగింది. చేసింది రంగారావు.

“మాధవమూర్తిగారు! నేను రేపు నా బావమరిది పెండ్లికి భార్యా, బాబుతో నెల్లూరికి వెళుతున్నాను. చెప్పానుగా. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. పెండ్లి అయ్యాక మీ మామగారింటికి వెళ్ళి వారిని చూచి అక్కడ నుండి ఫోన్ చేస్తాను” చెప్పాడు రంగారావు.

నెంబర్ చెప్పాడు మాధవమూర్తి. వారు వుండేది చీరాల. వరండాలో వున్న యాత్రికులలో ఒకడు ఆ నెంబర్ను నోట్ చేసుకొన్నాడు. వాన తగ్గగానే వారు వెళ్ళిపోయారు.

మరుదినం.. రంగారావు భార్య కుమారుడు శ్యామ్ నెల్లూరుకి వెళ్ళిపోయాడు..

ఆ రాత్రికి యాత్రికులు ఆ వీధిలో మరోసారి నడిచి, రంగారావు ఇంటికి తాళం వేసివున్న విషయాన్ని గమనించారు.

మరుసటి దినం వుదయం ఏడుగంటలకు మాధవమూర్తి సెల్ మ్రోగింది.

“హలో!..”

“..” సరిగా వినిపించలేదు.

“హల్లో!..” కాస్త హెచ్చుస్థాయిలో పలికాడు మాధవమూర్తి.

“ఆఁ!.. మీరు మాధవమూర్తి గారా!..”

“అవునండి.. మరి మీరు?”

“మేము మీ మామగారి ప్రక్కింటివాళ్ళం..”

“అలాగా!” ఆశ్చర్యంతో అడిగాడు మాధవమూర్తి.

“అవును”

“మా వాళ్ళంతా కులాసేనా సార్!”

“లేదు మీ మామగారికి హార్ట్ అటాక్.. హాస్పిటల్లో చేర్చారు. మీవారు నెంబరిచ్చి మీకు ఫోన్ చేయమంటే.. ఫోన్ చేసి విషయం చెప్పామండి.”

“ఓ.. ధన్యవాదాలండీ!”

“ఎవరండీ?..”

“శ్యామలా మీవూరిలో మీ ప్రక్కింటివారు. మామయ్యగారికి హార్ట్ అటాక్ అట. హాస్పిటల్లో వున్నారట!..” విచారంగా చెప్పాడు మాధవమూర్తి.

“ఏంటండీ మీరనేది?” ఆందోళన, ఆశ్చర్యంతో అడిగింది శ్యామల.

“అవును శ్యామలా! బట్టలు సర్దుకో. మనం వెంటనే బయలుదేరాలి. పాపం అక్కడ సుమతి అత్తయ్య ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో.. పద.. పద..”

“నాన్నా!.. తాతయ్యగారికి హార్ట్ అటాకా!..” అని అడిగింది సంధ్య.

“అవును తల్లీ. మనం ఇప్పుడు తాతయ్య గారి వూరికి వెళ్ళాలి. నీవూ ఓ రెండు మూడు జతల బట్టలు ఓ సంచిలో సర్దుకో.”

మామగారి ఇంటి ల్యాండ్‍లైన్‌కి ఫోన్ చేశాడు మాధవమూర్తి.. ఎంతకీ కలవలేదు.

“ఏమండీ!” అడిగింది దీనంగా శ్యామల.

“ఏమిటి?” మాధవరావు ప్రశ్న.

“ఏం భయం లేదుగా!”

“దైవం మీద భారం వేసి బయలుదేరు. అంతా ఆ పరమేశ్వరుడు చూచుకొంటాడు. మీ నాన్న.. మా మామగారు చాలామంచివారు. మీ అమ్మ.. మా అత్తయ్య చాలాచాలా మంచివారు. ఆ దైవం వారికి అన్యాయం చేయదు. త్వరగా కాని. గంటలో బస్సు వుంది. బయలుదేరుదాం. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా మీ వూరికి చేరుతాం. త్వరగా కానీ..” అన్నాడు మాధవరావు.

ముగ్గురూ హడావిడిగా ఇంట్లో ప్రవేశించి తలా మూడు జతలు బట్టలు సూట్‌కేస్‌లో సర్దుకొని ఇంటికి తాళం వేసి ఆటోలో బస్టాండుకు చేరారు.

విశాఖపట్నం టూ నెల్లూరు బస్సు, చీరాలకు పదిగంటలకు చేరింది. ముగ్గురూ బస్సు ఎక్కి నెల్లూరికి బయలుదేరారు.

వారు అనుకొన్నది ఒకటి, జరిగినది మరొకటి. స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే తమ మిత్రుడు ఇంజనీర్ ముకుందరావు కుటుంబంతో, తన కూతురు భార్యతో ఆ రోజు స్టీల్ ప్లాంట్‌ చూడాలన్నది మాధవమూర్తి గారి ఆ రోజు ప్లాన్.

మదినిండా కలవరంతో దైవాన్ని మనస్సున వేడుకొంటూ మాధవమూర్తి, శ్యామల, సంధ్య బస్సులో ప్రయాణం సాగించారు.

* * *

బస్సు ఒకటిన్నరకు నెల్లూరు బస్టాండులో ఆగింది. ముగ్గురూ దిగి ఆటోలో ఎక్కి విచార వదనాలతో.. ఏం వినవలసి వస్తుందో అనే భయంతో శ్యామల అమ్మగారింటికి బయలుదేరారు.

సంతపేటలోని వారి ఇంటికి అరగంటలో చేర్చాడు ఆటోవాలా. ముగ్గురూ దిగారు.

శ్యామల వేగంగా ఇంటివైపుకు పరుగెత్తింది. వెనకాలే సంధ్య ఆటో అతనికి డబ్బులు ఇచ్చి బ్రీఫ్‌కేస్‌తో మాధవమూర్తి ఇంటివైపుకు తిరిగాడు.

శ్యామల తండ్రిగారి పేరు సోమసుందరం. అమ్మ పేరు సత్యవతి. భోజనం చేసి ఏదో పరాచికాలతో ఇరువురూ వరండాలోకి రావడాన్ని చూచిన శ్యామల ఆశ్చర్యంతో ఆగిపోయింది.

“అమ్మా!.. అదుగో తాతయ్య!.. అమ్మమ్మా!..” సంధ్య ఆశ్చర్యంతో అంది.

వరండాలో అత్తామామలను చూచిన మాధవమూర్తి తన కళ్ళను తానే నమ్మలేక చేతిలోని బ్రీఫ్‌కేస్‌ను జారవిడిచాడు. చేతులను రబ్ చేసి కళ్ళకు అద్దుకొని కళ్ళు తెరిచి చూచాడు.

“రండి అల్లుడుగారూ రండి!..” చిరునవ్వుతో సోమసుందరం గారు అల్లుడు మాధవమూర్తిగారిని ఆహ్వానించాడు.

సత్యవతి వేగంగా కూతురుని సమీపిస్తూ “ఏమిటే అక్కడే ఆగిపోయావ్! ఏమిటి ఈ ఆకస్మిక రాక!” కూతురు చేయి పట్టుకొని అడిగింది సత్యవతి. షాక్‌లో వున్న శ్యామల వెంటనే జవాబు చెప్పలేకపోయింది. మెల్లగా వరండాలో ప్రవేశించింది. తండ్రి ముఖంలోకి తదేకంగా చూచింది. మనస్సులో వున్న కలవరం తాలూకు వేదన ఏడుపు రూపంలో వెలువడిరది.

“ఎందుకమ్మా ఏడుస్తున్నావ్” తల్లితండ్రి ఒక్కసారిగానే అడిగారు ఆందోళనతో.

వరండాలో ప్రవేశించిన మాధవమూర్తి.. తనకు వచ్చిన సెల్‌ఫోన్ కాల్ గురించి వారికి వివరించాడు.

సోమసుందరం, సత్యవతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

“ఎవరో మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్స్‌ను చేశారు” అన్నారు సోమసుందరం.

కథ తారుమారైనందున మాధవమూర్తి శ్యామలలకు ఎంతో ఆశ్చర్యం. తమని ఆ రీతిగా ఏప్రిల్ ఫస్టున ఫూల్స్ చేసింది ఎవరబ్బా అనే ప్రశ్న.. ఇరువురి మస్తిష్కాలను ఆక్రమించింది.

పెద్దవారు ఇరువురూ హాయిగా, ఆనందంగా వుండడాన్ని చూచి మనస్సులకు సంతోషం కలిగినా.. ఆ రీతిగా అబద్ధపు మెసేజ్‌ని చెప్పి తనను ఫూల్ చేసినది ఎవరనే ప్రశ్నకు మాధవమూర్తికి ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు.

ఆ ఆలోచనతోనే స్నానం.. భోజనం చేశారు. మాధవమూర్తి మస్తిష్కంలో తనను ఎవరు ఏ కారణంగా తప్పుడు ఫోన్ కాల్ చేసి నెల్లూరుకి పరుగెత్తించింది ఎవరా అనే ప్రశ్న వేధిస్తూ వుంది.

శ్యామల తల్లీతండ్రి “ఎవరో నీకు అతిముఖ్యమైన నీ స్నేహితుడు నిన్ను ఈ రీతిగా ఏప్రిల్ ఫూల్‌ని చేశాడు మాధవా అంతే.. అంతకన్నా వేరే ఏమీ ఉండదులే!..” అలా వారికి తోచిన మాటను ఆ పెద్దవారు చెప్పారు. కానీ మాధవమూర్తి మనస్సులోని అశాంతి అధికం అవుతూ వుందేకాని తగ్గలేదు.

“నాన్నా! వేకువనే నాలుగున్నరకు మేము వూరికి బయలుదేరుతాము. అమ్మా!.. నా మనస్సు స్థిమితంగా లేదు” తన నిర్ణయాన్ని తండ్రికి తల్లికి తెలియజేసింది శ్యామల.

ఆ భార్యాభర్తలు ఆ రాత్రి తండ్రిగారి ఇంట్లో కలత నిదురపోయి వేకువనే నాలుగు గంటలకు లేచి టాక్సీలో కూతురు సంధ్యతో చీరాలకు బయలుదేరారు.

* * *

పన్నెండుగంటలకు టాక్సీ చీరాలలోని మాధవమూర్తిగారి ఇంటిముందు ఆగింది. ముగ్గురూ టాక్సీ దిగారు. మాధవమూర్తి దిగి టాక్సీవాలాకు డబ్బులు ఇచ్చారు. శ్యామల, సంధ్యలు ఇంటి ద్వారాన్ని సమీపించారు. శ్యామల హ్యాండ్ బ్యాగ్ నుండి ఇంటి తాళం చేతికి తీసుకొంది. బుర్రను తాకింది. తాళాన్ని ఎవరో వూడదీశారు.

అదిరిపోయింది శ్యామల.

“ఏమండీ! తాళంబుర్రను ఎవరో వూడదీశారండి. ఇంట్లో దొంగలు పడ్డట్టున్నారు” ఆవేశంగా అరిచింది శ్యామల.

మాధవమూర్తి తాళపుబుర్రను తన చేతిలోని తీసుకొన్నాడు. తలుపును తెరిచాడు. ఆశ్చర్యపోయాడు.

ఆత్రంగా ముగ్గురూ ఇంట్లో ప్రవేశించారు. బీరువాను సమీపించారు. అది ఓపెన్ చేయబడి వుంది.

వారు దానిలో బంగారు, వెండి ఆభరణాలు, ఖరీదైన చీరలు, ఇతర విలువైన సామాగ్రి వుంచి తాళం వేసి బయలుదేరారు.

“శ్యామలా!.. దొంగలు ముందరి తలుపు తీసి ఇంట్లో ప్రవేశించి బెడ్‌రూమ్ లోని బీరువాను తెరిచి అందులోని వస్తువులను అన్నింటినీ బీరువాపైన వున్న ఖాళీ బ్రీఫ్ కేస్‌లో సర్దుకొని.. పడకమంచంపై కూర్చొని మందు తాగి సిగరెట్స్ కాల్చి, ఖాళీ విస్కీ బాటిల్‌ని ప్లాస్టిక్ గ్లాసులని.. సిగరెట్ పాకెట్‌ని అక్కడ వదలి.. జాలీగా పని ముగించుకొని గడచిన రాత్రి వెళ్ళిపోయారు. నాకు నిన్న ఉదయం ఫోన్ చేసింది వారే. మనలను వూరికి పంపి.. మనం ఇంట్లోలేని సమయంలో.. ఇంట్లో జొరబడి విలువైన అన్ని వస్తువులూ తీసికొని పోయారు” దీనంగా చెప్పాడు మాధవమూర్తి.

“అవునండీ! పాతిక లక్షలకు పైమాట!” కన్నీటితో విచారంగా అంది శ్యామల.

“అమ్మా!.. నాన్నా!.. డబ్బు, నగలు అన్నీపోయాయా!..” బీరువాలోని అన్ని అరలను చూచి దీనంగా అడిగింది సంధ్య.

“అవునమ్మా!.. అన్నీపోయాయి..” విచారంగా చెప్పింది శ్యామల.

వారి పక్కింటివారు వారికన్నా రెండురోజుల ముందు భార్య శాంతి, భర్త రంగారావు, కొడుకు శ్యామ్ నెల్లూరులో వివాహం అయిన తరువాత తిరుపతి వెళ్ళి తిరిగి అప్పుడే తిరిగి చీరాల ఇంటికి చేరారు.

వారి గృహం తలుపు, మాధవమూర్తి ఇంటితలుపులాగానే తెరిచి లోని సామాగ్రిని తస్కరించి తలుపుమూసి బుర్ర తగిలించి వెళ్ళిపోయారు దొంగలు.

ఆ తలుపును చూచి రంగారావు.. శాంతి బిగ్గరగా “మా ఇంట్లో దొంగలు పడ్డారు.. మా ఇంట్లో దొంగలు పడ్డారు” అని తారాస్థాయిలో అరిచాడు రంగారావు.

ఆ అరుపులు విని మాధవమూర్తి, శ్యామల, సంధ్య బయటికి వచ్చారు. “మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు రంగారావు గారూ!” విచారంగా చెప్పాడు మాధవమూర్తి.

ఆడవారు ఇరువురూ రంగారావు ఇంట్లోకి ప్రవేశించారు. వారి ఇంట్లో కూడా మాధవమూర్తి ఇంట్లోలాగే దొంగతనం జరిగింది. వారి ఇంటినష్టం దాదాపు నలభైలక్షలు.

“నేను నగలను బ్యాంకులో పెడదామూ అంటే నా మాటను విన్నావా? ఇప్పుడు చూడు ఏమయిందో.. మొత్తం జవురుకొని పోయారు. దొంగ చచ్చినోళ్ళు. ఆఁ.. మాధవమూర్తిగారూ!.. మీరు ఏం చేయాలనుకొంటున్నారు?.. దీనంగా అడిగాడు రంగారావు.

“పదండీ అలా అడుగుతారు?.. ఇరువురూ వెళ్ళి పోలీస్ స్టేషనులో కంప్లయింట్ ఇచ్చిరండి. వెంటనే బయలుదేరండి. ఆలస్యం అమృతం విషం” అంది రంగారావు భార్య శాంతి.

శ్యామ్ వయస్సు పది సంవత్సరాలు. సంధ్య స్కూల్లోనే చదువుతున్నాడు. ఫిఫ్త్ క్లాస్. సంధ్యను సమీపించాడు.

“సంధ్యా! మీ ఇంట్లోనూ దొంగలు పడ్డారా?”

“ఆఁ అవును శ్యామ్! మీ ఇంట్లోనూ పడ్డారుగా!”

“ఆ.. అవును..” శ్యామ్ జవాబు.

“రంగారావుగారూ! రండి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కంప్లయింట్ ఇచ్చి వద్దాము” పిలిచాడు మాధవమూర్తి.

“ఆ.. సరే!.. పదండి. ఈ ఆడవారి వలన మనకు శాంతి కంటే అశాంతి అధికం సార్! వారు మన మాటలను వినరు. అంతా మన ఖర్మ.” చెప్పాడు రంగారావు.

“రంగారావుగారూ! ఆవేశపడకండి. ఇలా జరగాలని వుండింది. జరిగింది. నాకు నిన్న ఉదయం ఫోన్ చేసి మా మామగారు హాస్పిటల్లో వున్నట్లు నాకు చెప్పారు. నేను వెంటనే నిన్న తొమ్మిదిగంటలకు నెల్లూరు బయలుదేరాను. రాత్రి వారు నా కొంపను దోచుకొన్నారు. పదండి. ముందు కంప్లయింట్ ఇచ్చివద్దాం” విచారంగా చెప్పాడు మాధవమూర్తి.

“జాగ్రత్తండి!” అంది శ్యామల.

“ఇంకా ఏం జాగ్రత్తండి. తిరుణాల తీరిపోయిందిగా!” విరక్తిగా అన్నాడు రంగారావు.

ఇంట్లోని బులెట్ బండిను బయటికి తీశాడు మాధవమూర్తి. ఇరువురూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళారు.

* * *

సర్కిల్ ఇన్‍స్పెక్టర్’ సీతారాం. మాధవమూర్తి రంగారావుల విషాధ గాథలను విన్నాడు. కంప్లయింట్స్ వ్రాయించి తీసికొన్నాడు.

“మాధవమూర్తిగారూ! మీకు ఫోన్ చేసిన వ్యక్తి మీకు తెలుసా?”

“తెలీదు సార్!”

“అయితే! అతనికి మీ నెంబర్ ఎలా తెలుసు? అంటే ఆ వ్యక్తికి మీ ఫోన్ నెంబర్ తెలుసన్నమాట. అవునంటారా!.. కాదంటారా!..”

“మీ మాట ప్రకారం ఆ వ్యక్తి ఎవరో కాని నా నెంబర్ తెలిసి వుండాలి సార్..”

“మీరు ఎక్కడైనా రీసెంట్‌గా మీ ఫోన్ నెంబర్‌ని కొంచెం బిగ్గరగా ఎవరికైనా చెప్పారా! ప్రశాంతంగా ఆలోచించండి. నేను నా మిత్రులు మీ ఇళ్ళకు వస్తాము. ఫోటోస్ తీసుకొంటాము. మా దగ్గర వుండే చేతి ముద్రలతో కంపేర్ చేస్తాము. ఒక్కోసారి ఈజీ అవుతుంటాయి. ఆపైన మనిషిని వెదకి పట్టుకుంటాం. మీ మీ నగలు తాలూకు ఫోటోస్ వుంటే తీసిపెట్టండి. మేము వచ్చినప్పుడు మాకు ఇవ్వండి. ఇక మీరు వెళ్ళండి. మేము ఒక గంటలో వస్తాము. మీరు బీరువాలోని ఏ వస్తువులను తాకకండి.” చెప్పాడు సర్కిల్ ఇన్‍స్పెక్టర్’ శాంతారాం.

మాధవమూర్తి.. రంగారావులు ఎంతో ప్రాధేయపూర్వకంగా తమ నగలు డబ్బు తిరిగి తమకు చేరేలా చేయవలసిందిగా శాంతారామ్‌ని కోరారు. నమస్కరించి ఇండ్లకు చేరారు. అర్ధాంగులకు విషయం చెప్పారు.

* * *

సర్కిల్ ఇన్‍స్పెక్టర్’ శాంతారామ్, కానిస్టేబుల్ రాజయోగి ఇరువురు పోలీసులు మరుదినం మాధవమూర్తి రంగారావు ఇండ్లకు వచ్చారు.

ముందు మాధవరావుగారి చేత.. తరువాత రంగారావుగారి చేత జరిగిన దొంగతనంను గురించి మరోసారి ఆ వివరాలను ఇరువురి ద్వారా విన్నారు.

మహాతల్లులు శ్యామల.. శాంతి కనీసం ఒక్కగ్లాసు కాఫీని కూడా ఆ పోలీసువారికి ఇవ్వలేదు.

శాంతారామ్, హెడ్ కానిస్టేబుల్ రాజయోగి పోలీసులు జీప్ ఎక్కారు. రాజయోగి జీప్‌ను స్టార్ట్ చేశాడు.

“సార్!..” రాజయోగి పిలుపు.

“వాట్ రాజయోగి!”

“ఇద్దరు అమ్మలూ బంగారు తల్లుల్లా వున్నారు. అరగంటపైగా వారికి మేలు చేయాలని కూర్చొని అన్ని విషయాలూ తమరు తెలుసుకొన్నారు. కనీసం ఒక్క గ్లాస్ కాఫీ ఒకటి ఇవ్వాలనే ఆలోచన ఆ ఆడవారికి గాని, ఆ ఇరువురు మగవారికి గాని కలగలేదంటే వారిని గురించి మనం ఏం అనుకోవాలి సార్!” వ్యంగ్యంగా నవ్వాడు రాజయోగి.

“యోగీ!”

“సార్!”

“ఇది కలికాలం. స్వార్థం, సంకర జీవితాలు. కొంతమంది అలాగే వుంటారయ్యా!” నవ్వాడు సర్కిల్ ఇన్‍స్పెక్టర్’ శాంతారామ్.

వారివద్ద వున్న దొంగల ఫోటోలను పరీక్షించారు. అనుమానం కలిగిన వారిని పిలిచి విచారించాడు శాంతారామ్. కానీ ఫలితం శూన్యం. మాధవరావు స్కూటర్‌పై రంగారావుతో కలిసి రోజు మార్చి రోజు స్టేషన్‌కు తిరుగుతున్నాడు.

శ్యామల శాంతి వారిరువురినీ, వారు సాయంత్రం ఇంటికి రాగానే “విషయం ఏమైనా తెలిసిందా! పోలీస్ స్టేషన్కు వెళ్ళారా!..” నిలదీసి అడిగేవారు.

మాధవరావు, రంగారావు తలలు విచారంగా వేలాడవేసేవారు. నెలరోజులు సాగిపోయాయి.

మాధవరావు మనస్సు మధన..

వారి నానమ్మ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

“రేయ్!.. మాధవా!.. జీవితంలో నీతి నిజాయితీ ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. అక్రమ సంపాదన ఒకనాడు పరులపాలే. మనిషి నిప్పులా స్వచ్ఛంగా బ్రతకాలి. ఈ జీవితం ఆ దైవ ప్రసారం. మన జీవిత విధానం మీ పిల్లలకు సాటి సమాజ సభ్యులకు ఆదర్శం కావాలిరా!..” ఎంతో ప్రీతిగా మాధవరావుకు చెప్పేది ఆ వృద్ధమాత.

ఆ నానమ్మ మాటలు.. జ్ఞప్తికి వచ్చి మాధవరావు కళ్ళు కన్నీటిని కార్చాయి. లంచాలు తీసికోకూడదని నిర్ణయించుకొన్నారు. ఆ మరుసటిదినం సాయంత్రం ఆఫీస్నుండి రంగారావుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. సర్కిల్ ఇన్‍స్పెక్టర్ శాంతారామ్‌ను కలిశాడు.

వారిని చూచి చిరునవ్వుతో “ఏమండీ!.. ఆ దొంగతనం చేసింది ఈ ప్రాంతంవారు కాదు. ఎవరో ఏ ప్రాంతం వారో ‘ఫేక్ మెన్’. మిమ్మల్ని గమనించి మీ ఇళ్ళను దోచుకొన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ నో రిజల్ట్!..” చిరునవ్వుతో చెప్పాడు శాంతారామ్.

శాంతారామ్ వాడిన ఫేక్ మెన్.. పదం మాధవరావు చెవుల్లో మారుమ్రోగింది.

వారే కాదు. నేను ఈ రంగారావు కూడా ‘ఫేక్ మెన్’ అనుకొన్నాడు. శాంతారామ్‌కు నమస్కరించి ఇరువురు మిత్రులూ స్టేషన్ బయటికి వచ్చారు.

“చూడండి రంగారావుగారూ!.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి స్కూటర్ టైర్లు అరిగిపోయాయి. మనం ఇరువురం ఇంతకాలం బ్రతికింది ఫేక్ మెన్ లానే. ఇక ఆ జీవితానికి స్వస్తిచెప్పి కంట్రాక్టర్లను పీడిరచకుండా, వేధించకుండా నీతి నిజాయితీగా మనకు గవర్నమెంటు ఇచ్చే జీతంతో సంతృప్తి పడదాం. మన ఆడవారి తత్వాలను మార్చుదాం. ఒక్కమాట ఈరోజు వున్నవాడు, రేపు వుంటాడో, పైకి పోతాడో మనకు తెలియదు. బ్రతికిన నాలుగు రోజులూ మంచిగా బ్రతుకుదాం. ఏమంటారు!..” అనునయంగా చెప్పాడు మాధవరావు.

రంగారావు కళ్ళు చెమ్మగిల్లాయి.

“సార్!” అన్నాడు. అంతకుముందు పేరుపెట్టి పిలిచేవాడు.

ఆ పిలుపు మాధవరావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

“ఏమన్నారు?..”

“సార్.. ‘సార్..’ అన్నాను. మీరు నాకంటే పొజీషన్లోనూ, వయస్సులోనూ పెద్దవారు. మీ మాటలు వినడం.. మిమ్మల్ని గౌరవించడం, మనిషిగా నా ధర్మం. మీరు నా కళ్ళు తెరిపించారు” కన్నీటితో చేతులు జోడించాడు రంగారావు.

మాధవరావు నవ్వుతూ “యూ ఆర్ మై బ్రదర్!.. పద” ఇరువురూ స్కూటర్ స్టాండ్ వైపుకు నడిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here