ఫ్యామిలీ

1
2

[dropcap]“లా[/dropcap]ప్‌టాప్ బాగ్ తీసుకొని, శ్రావ్య ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళుతోంది ప్రశాంత్?” లిఫ్ట్ ఎక్కుతున్న కోడల్ని కిచెన్ లోంచి చూసి కంగారుగా కొడుకును అడిగింది తల్లి సుభద్ర. “పుట్టింటికి” అన్నాడు ప్రశాంత్.

పేపర్ చదువుతున్న కొడుకు పక్కనే వచ్చి నిలబడింది సుభద్ర వివరంగా చెప్పు అన్నట్టు. “అమ్మా! ఆ బాత్రూంలో విడిచిన బట్టలు రెండు మూడు రోజులైనా తియ్యదు. మా బెడ్ రూమ్‌లో ఉన్నచిన్న సోఫానిండా బట్టలు గుట్టలుగా ఉంటాయి కూర్చోడానికి లేకుండా. ఆ మాటే అడిగితే అంతెత్తున పౌరుషం వచ్చింది.”

“నెమ్మదిగా చెప్పాల్సిందిరా!” నొచ్చుకుంటూ అందామె

“ఇంకా ఏం బుజ్జగించి చెప్పాలి? పెళ్లయ్యి సంవత్సరం అయింది. ఒక క్రమశిక్షణ లేదు. తల దువ్వుకుంటే దువ్వెనలో జుట్టు అలాగే పడేస్తుంది. పౌడర్ రాసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ అంతా పౌడరే. ఆ ఉద్యోగం ఒక్కటి చేస్తుంది తప్ప ఇంకే పనికీ శరీరం వంచదు. ఎప్పుడూ మొబైల్‌లో గేములూ, లాప్టాప్‌లో సినిమాలూనూ. చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. పాతికేళ్ళకీ మెచ్యూరిటీ లేదు.” కోపంగా అన్నాడు

“పోనీలేరా గారంగా పెరిగిన పిల్ల. నెమ్మదిగా నేర్చుకుంటుందిలే” విషయాన్ని తేలిక చేస్తూ అంది సుభద్ర.

“ఏం గారం? మన చెల్లాయ్ లతని గారంగా పెంచలేదా మనం? ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా చేసుకుంటుంది సంసారం. అది కూడా ఉద్యోగం చేస్తోంది కదా! ఈమె ఏదైనా పనిమీద బైటికెళ్లాలంటే కదలదు. హోటల్ కైతే రెడీ. షికార్లకి తిరగడానికి మాత్రం ఎల్లవేళలా తయారు. అన్నీ నువ్వు చేసి పెడుతుంటే చూస్తూ ఉంటుంది. వంటింట్లోకి వచ్చి సాయం కూడా చేయదు. అయినా ఒక్క మాటనకూడదు. నువ్వు కూడా ఏం పని చెప్పవు. తానే వస్తుందిలే సాయంత్రం దాకా తల్లితో కబుర్లు చెప్పి.” కొడుకు చిటపటలు చూసి ఏమీ మాట్లాడకుండా వంట గదిలోకి వెళ్ళిపోయింది సుభద్ర.

శ్రావ్య, ప్రశాంత్ ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. శ్రావ్య తల్లీ తండ్రీ కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. తండ్రి సుబ్బారావు సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఊరిలో ఉన్న కాస్త పొలమూ అమ్మి మిత్రుల సలహాతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాడాయన. ఆ సైట్ల విలువ బాగా పెరిగి కొన్ని అమ్మడం వల్ల అనాయాసంగా లక్షలు వచ్చాయి. ఇప్పటికీ ప్లాట్‌లు అమ్ముతూ, కొంటూ బిజీగా ఉంటాడాయన. వారి పెద్ద కూతురు అమెరికాలో ఇద్దరు పిల్లలతో సెటిల్ అయింది. ప్రశాంత్‌ని ఇల్లరికం తెచ్చుకోవాలి అని బాగానే ప్రయత్నించారు. ఒప్పుకోలేదు ప్రశాంత్. తరచుగా పుట్టిల్లు చిక్కడపల్లికీ, అత్తిల్లు మలక్ పేటకీ మధ్య తిరుగుతూ ఉంటుంది శ్రావ్య.

“ఫోన్ చెయ్యకుండా వచ్చావ్? కోపంగా ఉన్నావ్ నాన్నా” ఉదయమే వచ్చిన కూతుర్ని వాటేసుకుంటూ అంది భార్గవి.

“ఏంటి ఫోన్ చేసేది? బట్టలు మడత పెట్టలేదని క్లాస్ తీసుకున్నాడాయన పొద్దున్నే. అన్నిటికీ క్లాస్‌లే. వాళ్లంతా డిసిప్లిన్‌లో ఉంటారట నాకు లేదట. టీచర్‌లా పాఠాలు చెబుతూ ఉంటాడు నాకు”

“ఎప్పుడూ మా అమ్మే మడత పెట్టేది. నాకు బట్టలు మడత పెట్టే అలవాటు లేదని చెప్పాల్సింది. తాను మడత పెట్టొచ్చుకదా? అరిగిపోతాడా? తనతో సమానంగా సంపాదిస్తున్న దానివి. ఇలా చిన్న చిన్న వాటికి సతాయిస్తాడా?” అంది భార్గవి.

“మీ మావగారు ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసాడు. పిల్లల్ని పొదుపుగా పెంచుకున్నారు. మేం అలా కాదు మీ ఇద్దర్నీ దర్జాగా, గారంగా పెంచుకున్నాం. మీ అత్తగారేమో బోలెడంత అమాయకంగా చూస్తూ ఉంటుంది. మీ మావగారేమో పేపర్ చదువుకుంటూ టీవీ చూసుకుంటూ నిమ్మళంగా కూర్చుంటాడు. కొడుకు పెట్టే టార్చర్ వాళ్ళకి కనబడదు. నా కనుమానం తల్లి చెబుతుంటుందేమో ఇలాంటివన్నీ!” అంటూ కూతురికి టిఫిన్ ప్లేటులో పెట్టి పక్కనే కూర్చుంది.

శ్రావ్య ఏమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ మీదున్న బ్రేక్‌ఫాస్ట్ తింటూ కూర్చుంది.

“అసలు వేరే కాపురం పెట్టుకోవే. ఇంటెడు సామాను కొంటాను. వంటమనిషిని కూడా పెడతాను. ప్రశాంత్‌కి నచ్చచెప్పుకోవే అంటే వినవు” కూతురికి మంచి నీళ్లిస్తూ అంది.

“అక్కడ బానే ఉందిలే. కాఫీ నుండి రాత్రి పాల వరకూ ఆవిడే అందిస్తుంది.”

“అందించక ఏం చేస్తుందావిడ? నువ్వేమైనా ఉద్యోగం సద్యోగం లేని పిల్లవా? వంటింట్లో చేరి వంటలు చెయ్యడానికి? లక్ష రూపాయల పైన సంపాదిస్తున్న పిల్లవి.”

“మా ఆడపడుచు కూడా ఉద్యోగం చేస్తోందిలే వే!”

“ఆ చేసిందిలే మహా! ఏదో ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా ఓ పాతిక వేలు సంపాదిస్తోంది. అంతేగా. అందుకే వినయంగా ఉంటుంది. నీకేం ఖర్మ !” అని కొట్టిపారేసింది భార్గవి.

“సొంత కాపురం తలనెప్పులు నాకెందుకే. అదంతా నా వల్ల కాదు. ఆవిడన్నీ చూసుకుంటే హాయిగా ఉంది నాకు. ఈ ప్రశాంత్‌దే తలనొప్పి. నన్నేదో మార్చెయ్యాలని చూస్తాడెప్పుడూ. తానన్నీ శుభ్రంగా టైంకి చేసుకుంటాడు. అది తనకిష్టం. అలా నేనూ ఉండాలంటే ఎలా అమ్మా? సర్లే. నేను కాసేపు పడుకుంటాను” అంటూ టిఫిన్ ముగించి మధ్యాన్నం పన్నెండు వరకూ పడకేసి సాయంత్రం వరకూ ఉండి తిరిగి వెళ్ళిపోయింది శ్రావ్య.

సుభద్రకి కళ్ళు నీళ్లు కారుతున్నాయని ఒక రోజు భర్త కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పరీక్ష చేయిస్తే అర్జెంటుగా కాటరాక్టు ఆపరేషన్ చేయాలన్నారు. వెంటనే ప్రశాంత్ డాక్టర్‌తో మాట్లాడి ఆపరేషన్ చేయించాడు. అదే రోజు ఇంటికి తీసుకుని వచ్చేసారు. గంట గంటకీ కంట్లో డ్రాప్స్ వెయ్యాలనీ, ఒక పది రోజులు వంటగదిలోకి వెళ్ళద్దనీ చెప్పాడు డాక్టరు.

కూతురు లత కూడా వచ్చి ఆ రోజు చూసి వెళ్ళింది. మర్నాడు శ్రావ్య ప్రశాంత్ సాయంతో వంట పని చేసింది. కంటిలో చుక్కలు వేసే పని ప్రశాంత్, శ్రావ్య ఇద్దరూ చేస్తున్నారు. ముందు రోజు మధ్యాహ్నం ఫోన్ చేసిన తల్లితో చెప్పింది శ్రావ్య. “నేను ఓ పది రోజుల వరకూ మా అత్తను చూడాలి. తర్వాత వస్తాన్లే” అని. ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసింది భార్గవి, “అమ్మమ్మకి బొత్తిగా బాలేదంటమ్మా. నిన్నూ నన్నూ కలవరిస్తోందంటమ్మా. రెడీగా ఉండవే కార్ తీసుకుని వస్తాను, ఇప్పుడే విజయవాడ వెళదాం” అంటూ. “అమ్మా! అత్తయ్యకి ఆపరేషన్ అయింది నిన్ననే. పది రోజులు విశ్రాంతి తీసుకోవాలామె. ఇప్పుడు వదిలేసి వస్తే ఏం బాగుంటుంది?”

“అదో పెద్ద ఆపరేషన్ కాదులే. ఫోన్ అల్లుడిగారికివ్వు” అంది భార్గవి. అల్లుడితో “బాబూ! ఎనభై ఏళ్ల మా అమ్మకి సీరియస్‌గా ఉందట బాబూ! మనవరాలిని అడుగుతోందట. చూసి వచ్చేస్తాం” అంది. ఈ సంగతి ప్రశాంత్ తల్లికి చెప్పాడు. “వెళ్లనీలే! లతని అడుగుదాం ఇక్కడ ఉండమని” అంది సుభద్ర.

గంటలో వచ్చి కూతుర్ని తీసుకుని బయలుదేరింది భార్గవి. రాత్రి ఏడుకల్లా విజయవాడ చేరారు. మనవరాలిని చూసి ఆనందపడింది కొడుకింట్లో ఉన్న శ్రావ్య అమ్మమ్మ. “సీరియస్‌గా లేదుకదే అమ్మమ్మ?” అడిగింది శ్రావ్య ఆశ్చర్యపోతూ. “నిన్ను తీసుకొచ్చి మా అమ్మ దగ్గర ఓ వారం రోజులు గడపాలని నా కోరిక తల్లీ” అంది భార్గవి.

తర్వాతి నెలలో శ్రావ్య తల్లి తండ్రులు అమెరికా ప్రయాణం అయ్యారు పెద్ద కూతురి దగ్గరికి, ఓ మూడు నెలల కోసం. వియ్యపురాలికి మరీ మరీ అప్పగింతలు పెట్టింది భార్గవి. “జాగ్రత్త వదినా! పెళ్లయ్యాక పిల్లని వదిలి ఇదే వెళ్లడం. బాధగా ఉంది” అంటూ. “వదినా! మీ అమ్మాయి మా అమ్మాయి కాదా? అంతలా చెప్పాలా? రోజూ ఫోన్ చేసుకోండి” అంది సుభద్ర ఆమెకు ధైర్యం చెబుతూ.

తల్లి వెళ్ళాక నెల రోజులకి శ్రావ్యకి జ్వరం వచ్చింది. డాక్టర్‌కి చూపించాడు ప్రశాంత్. నాలుగు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఆఖరికి పరీక్షల్లో ఆమెకు డెంగీ జ్వరం అని తేలింది. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చెయ్యమన్నాడు డాక్టర్. ప్లేటిలెట్స్ కౌంట్ ఇరవై వేలకి పడిపోయింది. సుభద్ర, ప్రశాంత్, చెల్లి లత ముగ్గురూ హాస్పిటల్‌కీ ఇంటికీ తిరుగుతూ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. లత భర్త పిల్లల్ని చూసుకున్నాడు. భార్గవి తల్లడిల్లి పోయింది. వియ్యపురాలికి ప్రతి రోజూ రెండు పూటలా అమెరికా నుంచి ఫోన్ చేసింది. నెమ్మదిగా ప్లేటిలెట్స్ కౌంట్ నార్మల్‌కి వచ్చింది. వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది శ్రావ్య. పూర్తిగా తగ్గడానికి మరో పదిహేను రోజులు పట్టింది.

భార్గవి అమెరికా నుంచి వస్తూనే భర్త చేత కూతురికి ఫోన్ చేయించింది. “నిన్ను వెంటనే చూడాలంటోందమ్మా మీ అమ్మ. ఇప్పుడే వచ్చెయ్యకూడదూ మనింటికి?” అన్నాడు శ్రావ్య తండ్రి. “మీరే రండి. మేమంతా మీ కోసం ఎదురు చూస్తున్నాం” అంది శ్రావ్య. “అలాగేనమ్మా నాక్కొంచెం ప్లాట్ ఓనర్స్ మీటింగ్ ఉంది. అమ్మవస్తుంది. నేను రేపు కలుస్తానమ్మా ఏమీ అనుకోకు.”

“అలాగే డాడీ!” అంది శ్రావ్య. మరోగంటలో వచ్చింది తల్లి.

భార్గవి వస్తూనే సోఫాలో కూర్చున్న కూతురి పక్కన కూర్చుంది వళ్లంతా తడుముతూ, కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అడిగింది. “ఎలా ఉందిరా కన్నా?” అంది ఆర్తిగా.

“బానే ఉన్నానమ్మా. జ్వరం తగ్గి నెలయ్యింది కదా!” అంది శ్రావ్య తల్లి భుజంపై తలవాలుస్తూ.

సుభద్ర మంచినీళ్ళిచ్చి “బావున్నారా వదినా? మీ పెద్దమ్మాయి అల్లుడూ, పిల్లలూ అంతా బాగేనా?” అంటూ అడిగింది.

“అందరూ బావున్నారు వదినా!” అనేసి సుభద్ర వంటింట్లోకి వెళ్ళగానే ‘నీ గదిలోకి పద’ అన్నట్టు సైగ చేసింది కూతురికి.

“ఇక్కడే కూర్చుని మాట్లాడు.” అంది శ్రావ్య. భార్గవికి అవమానంగా అనిపించి కూతురి వైపు ఆశ్చర్యంగా చూసింది.

“చెప్పు అక్కా, బావా, పిల్లలూ ఎలా ఉన్నారు?” అన్న కూతురి ప్రశ్నకు తలూపింది బానే ఉన్నారన్నట్టు. ఇంతలో సుభద్ర స్వీట్, హాట్ తీసుకొచ్చింది. మౌనంగా తిన్న భార్గవి వియ్యపురాలిచ్చిన టీ కూడా తాగేసి మరికొంత సేపు కూర్చుంది.

కూతురు ముక్తసరిగా మాట్లాడడం తట్టుకోలేని భార్గవి మెల్లగా “మనింటికి ఎప్పుడొస్తావ్?” అనడిగింది కూతుర్ని.

“వస్తాన్లే వచ్చే ఆదివారం” అన్న జవాబుకి రోషం వచ్చి “సరే వదినా! మళ్ళీ వస్తాను” అంటూ బయలుదేరింది భార్గవి.

అత్తా కోడలు ఆమెకి వీడ్కోలు చెప్పారు.

భార్గవి కోపంతో మర్నాడు కూతురికి ఫోన్ చెయ్యలేదు. ఆ మర్నాడు శ్రావ్య టెర్రస్ పైకి వచ్చి తల్లికి ఫోన్ చేసింది.

“ఇప్పుడు గుర్తొచ్చానా?”అంది భార్గవి. “చెప్పు. చెప్పు.ఎలా ఉన్నావమ్మా? ప్రయాణం బడలిక తీరిందా?”

“రాగానే ఆత్రపడి వస్తే బెట్టుగా మాట్లాడి పంపేసావ్. నాకు నీ మీద కోపంగా ఉంది శ్రావ్యా.”

“నాక్కూడా నీ మీద కోపం ఉందిలే అమ్మా!”

“నేనేం చేశాను?” ఆశ్చర్యంగా అందామె

“ఇన్నాళ్లూ నా భర్త కుటుంబానికి నేను దగ్గరవకుండా చేశావ్. అడుగడుగునా వాళ్ళని చెడ్డ చేస్తూ చెప్పేదానివి”

“ఓహో! అయితే వాళ్ళు చాలా మంచివాళ్ళంటావా?” వెటకారంగా అంది భార్గవి.

“అవును. నేను జ్వరంతో ఉన్నప్పుడు మావగారితో సహా ప్రశాంత్, అత్తయ్య, లత ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా మా అత్త ఎంతో సేవ చేసింది. ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా పక్కనే ఉంది. నా సెలైన్ బాటిల్ వైపు చూస్తూ అయిపోగానే నర్స్‌ని పిలుస్తూ తెల్లవార్లూ నిద్ర పోయేది కాదు. ఆ జ్వరం బాధలో ఆమెపై విసుక్కున్నాను, కోప్పడ్డాను. ఆఖరికి ఒకరోజు “మీరు సరిగ్గా చూడడం లేదు. మా అమ్మ అయితే నన్నెంతో బాగాచూసేది” అనేశాను. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదామె. ఓపిగ్గా నా చిరాకు, అసహనం భరించింది. తగ్గిపోతుందమ్మా. నీరసంతో అలా అనిపిస్తోంది నీకు! అంతే” అంది.

మా ఆడపడుచు లత, పిల్లల్ని భర్తకు అప్పగించి లీవ్ పెట్టి, ఇంట్లో వంట చేస్తూ, హాస్పిటల్‌కి ఇంటికీ తిరుగుతూ పగలు నాతో ఉండేది. కుటుంబం అంటే అది. ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంటిల్లిపాది చుట్టూ ఉంటారు అంతే తప్ప అహంకారాలు ఏమీ ఉండవు. నువ్వు నాకు మాత్రమే తల్లివి. మా అత్త తన పిల్లలతో పాటు నన్ను కూడా కన్నతల్లిలా ప్రేమించింది. తల్లి తనం అంటే అదీ.”

“ఓ పది రోజులు జ్వరంలో మీ అత్త సేవ చేసిందని పాతికేళ్ళు పెంచిన తల్లి చెడ్డదైపోయింది నీకు” ఉక్రోషంగా అంది భార్గవి.

“నీ బిడ్డపై ప్రేమతో ఇతరులను చెడ్డ చేయడం నీకలవాటు. మా అత్తకు కాదు. అందరినీ గౌరవించడం నేర్చుకో.”

కూతురి కోపం తగ్గించాలన్నట్టుగా “నీకోసం అమెరికాని నుంచి ఎన్నో తెచ్చాను తెలుసా?” నిష్ఠూరంగా అందామె.

“వస్తువుల్నికాదు. మనుషుల్ని ప్రేమించు. వారిలో మంచితనాన్ని గుర్తించు. ఇకనైనా ఎదుటివారిని చెడ్డ మనసుతో చూడడం మానేసేయ్యి. ఇదే చెబుతున్నాను” అదే కోపంతో అంది శ్రావ్య.

భార్గవికి ఏం జవాబు చెప్పాలో తోచక మౌనంగా ఉండిపోయింది.

“ఉద్యోగాలు చేసే ఈనాటి ఆడపిల్లలు అత్తవారింట్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారనీ, బాధ్యతతో, మానవత్వంతో ప్రవర్తించడం లేదనీ అక్కడా, ఇక్కడా ప్రసంగాల్లో వింటున్నాను. అందుకు కారణం నీలాంటి కొందరు తల్లులని ఇప్పుడు నాకర్ధం అయింది. మీ కాలంలో మీకు చేతకాని చదువు. మా ఆడపిల్లలం కష్టపడి చదివి, పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకుని సంపాదిస్తుంటే అది చూసి నీలాంటి తల్లులు గర్వపడిపోయి అది మాకు నేర్పిస్తున్నారు. మంచిచెడ్డలు చెప్పట్లేదు. కూతుళ్లని నెత్తిమీద కూర్చోబెట్టుకుని వాళ్లని మహారాణుల్లా చూస్తూ, అధికంగా గౌరవిస్తూ వారికి వండి పెడుతూ, అన్నాలు తినిపిస్తూ, మంచినీళ్లు అందిస్తున్నారు. కూతుళ్లు తెలిసీతెలియక అన్నదానికల్లా తలూపుతూ చెలికత్తెల్లా ప్రవర్తిస్తున్నారు తల్లులు. మీ వల్లే మేం తలబిరుసుగా తయారవుతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. అమ్మా వింటున్నావా? ”

“సర్లే ఎప్పుడొస్తావ్?” అడిగింది భార్గవి కొంచెం కినుకగా, కూతురు అన్నమాటల గురించి ఆలోచిస్తూనే.

“నేనొక్కదాన్నీ కాదు. మా ఫామిలీ, మా ఆడపడుచు ఫామిలీ అందరం కలిసి లంచ్‌కి వస్తాం వచ్చేఆదివారం. మీ అమ్మ వంటలు అదిరిపోయాయి అనాలందరూ. చూసుకో మరి ఎంత బాగా చేస్తావో?” అంటూ ఫోన్ పెట్టేసి టెర్రస్ దిగి తమ ఫ్లాట్ లోకి వెళ్ళిపోయింది శ్రావ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here